రజాక్ బుర్ర చురుకుగా పనిచేసింది.
"సార్.. .మీరు ఛైర్మన్ గారితో మాట్లాడుతుండండి" అంటూ ఛంగున అటు లంఘించాడు. మరునిమిషంలో ఆ దండ తీసుకువచ్చి భద్రంగారి చేతిలో భద్రంగా వుంచాడు.
భద్రంగారు హాయిగా ఊపిరి తీసుకున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా రజాక్ వంక ఒకసారి చూసి ఆ దండని కపూర్ గారి మెడలో వేశారు. అందరూ చప్పట్లు కొట్టారు.
"వై ఆల్ దీస్ ఫార్మాలిటీస్...!?" అంటూనే మెడవంచి దండ వేయించుకుని, ఆ తర్వాత దానిని తీసి ప్రక్కనున్న రజాక్ చేతికి ఇచ్చారు.
కపూర్ గారిని కారులో ఎక్కించి తాను వెంట వుండి గెస్ట్ హౌస్ కి బయలుదేరారు భద్రంగారు. కారు అటుపోగానే రజాక్ తిరిగి వడివడిగా వెళ్లి ఆ దండను ఆ కారుకి వేసేశాడు.
రజాక్ చూపిన చాతుర్యానికి ముగ్దుడైపోయారు భద్రంగారు.
ఆఫీసుకి వెళ్లాక పరువు నిలిపినందుకు బాహాటంగా కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత "రజాక్..... ఇంకొక్క పని చేయాలయ్యా!" అన్నారు.
"చెప్పండి సార్.. నేనున్నానుగా!"అన్నాడు రజాక్ తన్మయత్వంతో.
"కపూర్ గారు సముద్రం ఎప్పుడూ చూడలేదట. అందులోనూ ఈవేళ పౌర్ణమి. సాయంత్రం బీచ్ కి వెళ్లి కొంతసేపు గడిపి, ఆ తర్వాత వెన్నెట్లో సముద్రాన్ని చూసి ఆనందించాలనుకుంటున్నారు" అన్నారు భద్రంగారు.
"అలాగే చేద్దాం సార్! ఇందులో సమస్య ఏముంది?"
"అదికాదు ... సాయంత్రం ఏ ఐదింటికో అక్కడికి వెళ్లాలి కదా! ఆయన వాలకం చూస్తే రాత్రి ఏ పదింటివరకో అక్కడ వుండాలని అనుకుంటున్నట్లుంది. మరి, ఆయన్ని అంతసేపు ఎక్కడ వుంచడం? భోజనం ఎలా ఏర్పాటు చేయడం? అక్కడేమీ హోటళ్లు కూడా లేవే?!" అన్నారు తల పట్టుకుని భద్రంగారు.
"ఓ పని చేద్దాం సార్... బీచ్ ఒడ్డున రాజా ప్రసాదరాయ బహద్దూర్ వారి బంగళా వుంది. అందులో ఏర్పాటు చేద్దాం" అన్నాడు రజాక్.
"కాని, రాజావారు అక్కడ వుండరుగా... వేరే ఊళ్లో వుంటారు. బంగళా ఎప్పుడూ తాళం వేసే వుంటుంది. ఎవర్ని అడగడం?"
"అవన్నీ నిజమే! కాని, సార్.... మరేం పర్వాలేదు. ఆ బంగళాకి వాచ్ మన్ వుంటాడు. వాడు నాకు తెలిసినవాడే. వాడి చేతిలో ఓ పదో, పరకో పెట్తే సంతోషంగా తలుపులు తీస్తాడు. ఓ పనిచేద్దాం. .. ఎలాగూ ఛైర్మన్ గారు వెళ్లేలోగా పార్టీ ఇస్తాం కదా - ఊరిలో మన డిపార్టుమెంట్ లో ఆఫీసర్ రాంక్ వాళ్లు ఓ పదిహేనుమంది దాకా వున్నారు. అందరూ కలిసి ఆయనకు డిన్నర్ ఏర్పాటుచేస్తే సరి!" హాట్ డ్రింక్స్ , గానా బజానా కూడా ఏర్పాటు చేస్తే ఆయన ఖుష్ అయిపోతాడు."
"అంతా బాగానే వుంది కాని, ఇంత వ్యవధిలో ఇది సాధ్యం అవుతుందా?"
"మీకెందుకు సార్.. నేను వెంటనే వెళ్లి వాచ్ మన్ తో మాట్లాడివస్తాను. ఆ వెంటనే మీరు అందరికీ ఫోన్ ల మీద చెప్పండి. ట్రాన్స్ పోర్టేషన్, డిన్నర్ వగైరాల ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను."
"ఏమో నాయనా.... అంతా నీదే భారం!" అన్నారు భద్రంగారు.
రజాక్ వెంటనే వెళ్లి ఆ బంగళా వాచ్ మన్ తో మాట్లాడాడు. వాడు ముందు ఒప్పుకోలేదు.
"మా దొరకి ఒక జర్మన్ దొరసాని వున్న విషయం మీకు తెలుసుగా సార్... ఆయనకి ఎప్పుడు బుద్ది పుడితే అప్పుడు చెప్పాపెట్టకుండా ఆయమ్మని వెంటేసుకుని కారు మీద వచ్చేస్తాడు. ఆయన ఏరోజు వచ్చినా రావచ్చు. ఎంత రాత్రయినా రావచ్చు. ఈరోజు వచ్చాడంటే నా తోలు ఒలిచేస్తాడు" అని గోలపెట్టాడు.
"ఆ భయం నీకేమీ అక్కరలేదు. మీ దొరతో ఇంతకుముందే చెప్పాను. ఆయన ఈరోజు వస్తానని చెప్పలేదు. ఆయన వచ్చినా ఏమీ అనడు. నేను ఆయనకి బాగా తెలుసు" అని నాలుగు అబద్దాలు ఆడేసి ఓ ఇరవై రూపాయల నోటును వాడి చేతిలో పెట్టాడు రజాక్.
డబ్బు చూడగానే వాచ్ మెన్ మెత్తబడ్డాడు." నాకు భయంవేస్తోంది దొరా!" అంటూనే తీసుకున్నాడు.
"ఎంతసేపు వుంటాం.... సాయంత్రం ఐదింటికి వస్తాం. తెల్లవారుఝాము ఐదు కాకుండానే వెళ్లిపోతాం. ఈమాత్రం దానికి భయం ఎందుకు?" ఇది కూడా వుంచు"అంటూ మరో పది రూపాయలు చేతిలో కుక్కాడు.
ఇంకేమీ మాట్లాడలేదు వాచ్ మన్.
"సాయంత్రం మీరు వచ్చేసరికి బంగ్లా అంతా ఊడ్చి శుభ్రంచేసి వుంచుతా దొరా!"అన్నాడు.
రజాక్ ఆఘమేఘాల మీద వెళ్లి తన వీరవిజయగాధ అభినయపూర్వకంగా భద్రంగారికి వినిపించాడు.
"శహభాష్...!" అంటూ ఆయన రజాక్ భుజాన్ని తట్తూ..... "నువ్వు సాక్షాత్తూ హనుమంతుడివోయ్!" అన్నారు.
రజాక్ ఉబ్బిపోయాడు. హనుమంతుడిలాగా ఒక మోకాలు మడిచి కూర్చోలేదు కాని, కళ్లలో మాత్రం ఆ తన్మయత్వాన్ని గుప్పించాడు.
భద్రంగారు ముందుగా ఛైర్మన్ గారికి బీచ్ బంగళాలో రాత్రి డిన్నర్ వగైరాల ప్రోగ్రాం ఏర్పాటు చేసిన విషయం తెలిపి ఆయన సరేనన్నాక, ఆఫీసర్లు అందరికీ చెప్పారు.
బయటపనులు చూడడానికి రజాక్ వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఐదింటికి కపూర్ గారు, డైరెక్టర్ గారు, భద్రంగారు స్టాఫ్ కార్లోనూ, వారి వెనుక ఓ పదిహేనుమంది ఇతర ఆఫీసర్లు, నలుగురు గుమాస్తాలూ, ఇద్దరు పూన్య్ లూ రజాక్ ఆధ్వర్యంలో ఒక మెటాడోర్ వ్యాన్ లోనూ బీచ్ బంగ్లా దగ్గరికి చేరుకున్నారు. వెంట తెచ్చిన సామాన్లని లోపలపెట్టారు.
దేవకన్యలు భూలోక విహారానికి బయలుదేరినట్లు పరివారం వెంటరాగా కపూర్ గారు బీచ్ విహారానికి బయలుదేరారు. భూదేవీ, శ్రీదేవిలాగా అటూ ఇటూ డైరెక్టర్ గారూ, భద్రంగారూ నడుస్తూండగా... పంజాబీ జోక్ లు పేలుస్తూ తెల్లని ఇసుక మీద మెల్లగా నడవసాగారు కపూర్ గారు.
డ్రైవర్లని, తెల్లవార ఐదింటికి రమ్మని చెప్పి పంపించేసి తానుకూడా వచ్చి రామబంటులాగా వారి వెనక నడవసాగాడు రజాక్. మిగిలినవారు సేఫ్ డిస్టెన్స్ లో వారికి మరికొంచెం వెనక నడవసాగారు.
సూర్యాస్తమయ సమయం. ఎర్రని సూర్యబింబం పశ్చిమాన సరుగుతోటల వెనక కనుమరుగవుతోంది. పున్నమిచంద్రుడు పూర్తి బంబంతో తూర్పున సముద్రం నుంచి పైకి వస్తున్నాడు. సముద్రజలాలు కదులుతూ. .. ఆ వెన్నెలకాంతికి కరిగించిన వెండిలాగా మిలమిల మెరుస్తున్నాయి. పూర్ కపూర్.... జన్మలో ఎప్పుడూ సముద్రాన్ని చూసి ఎరుగడేమో - ఆ మనోజ్ఞ దృశ్యాన్ని తనివితీరా చూసి ఆనందిస్తున్నాడు.
రాత్రి ఎనిమిది గంటలవరకు బీచ్ విహారం చేస్తూ వెన్నెల వైభవాన్ని చూశాక అందరూ బంగళాకి తిరిగివచ్చారు.
అప్పటికే క్యాటరర్స్ వచ్చి రెడీగా వున్నారు. అతిథులు రాగానే వారు డిన్నర్ ఏర్పాట్లు చకచకా చేయసాగారు. అందరూ ఒక ప్రక్కన కుర్చీలలో కూర్చున్నారు. ఎదురుగా మెత్తని బాలీసుల మీద గాయకబృందం కూర్చుని గానాబజానా మొదలుపెట్టింది. తనకు జరుగుతున్న రాచమర్యాదలను చూస్తూ, అనుభవిస్తూ మురిసిపోతున్నారు కపూర్ గారు.
