Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 40

    ఇదంతా ఏమహత్తర కార్యానికి అభ్యాసమో!
    అందరికన్న ఎక్కువ సంతోషిస్తున్నది మాత్రం సుబ్బన్న దీక్షితులు. తన శిష్యురాలు, తన సూచనమేరకి ఇంత ఎదుగుతున్నందుకు. కవిత్వం చెప్పాలి, కావ్యాలల్లాలి. కవిగా గొప్ప పేరు తెచ్చుకోవాలి అన్న తన కోరిక తన శిష్యురాలి మూలంగా తీరుతున్నందుకు. తాను నేర్పింది అతి తక్కువైనా తనని గురువుగా భావించి, కనిపించి నప్పుడల్లా, "అయ్యగారూ!" అంటూ నమస్కరిస్తే పొంగిపోతూ ఉంటాడు. వెంగమాంబ పద్యాలని అందరికీ వినిపించి అది తన కవిత్వమే అన్నంతగా ఆనందపడిపోతూ ఉంటాడు.
    వెంగమాంబ నృసింహాలయానికి రాకపోకలు చేస్తూ ఉన్నప్పుడు కొంటె మాటలతో మనసును బాధపెట్టటమే కాదు, తుంటరులైన కొందరు రాళ్ళు రువ్వటం మొదలైన పనులు కూడా చేసేవారు.
    ఆరోజు వెంగమాంబ నృసింహాలయంలో గ్రంథరచన చేస్తూ తన్మయత్వంతో తాను రాస్తున్న పద్యాలను రాగయుక్తంగా చదవటం మొదలు పెట్టింది. పైకి ప్రకటించలేకపోయినా, లోలోపల వెంగమాంబ అంటే అభిమానం, గౌరవం, భక్తి ఉన్నవాళ్ళసంఖ్య తక్కువేమీ కాదు. గుంపుగా వ్యతిరేకతను ప్రదర్శించటంలో మౌనంగా పాల్గొన్నా, వ్యక్తిగతంగా అభిమానులైన వాళ్ళు చాలామంది. కమ్మని కంఠాన్ని మధురమైన గానాన్ని, చవులూరే కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వింటేకదా వెక్కిరించటానికి వీలు అని దుర్బుద్ధితో వినేవాళ్ళూ ఉన్నారు. మొత్తానికి కారణం ఏమయినా అందరూ శ్రద్ధగా ఆ పద్యాలని విన్నారు.
    "వినుము మహానుభావ! మదివేడుక తోడుత విన్నవించెదన్
    మొనసెడు స్వాతి వానలకు ముత్యపుఁ జిప్పలవెట్టులుండున
    ట్లనిశము భక్తియుక్తి నినునాత్మ విభుండవు నీవటంచు నీ
    కును నెదురేను చూత్రుదరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

    "మానక నేను పిల్చినను మక్కువ లేక పరాకు సేసితో
    వీనులసోఁక లేక తగ విశ్వము పాలనసేయఁ బోతివో
    పూని మహా వినోదమున భోగము మీఱఁగ జెంచుభామతోఁ
    గోనల నుండిరావొ దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!"
    మధుర భావం చిప్పిల్లే భక్తిశృంగార రసభరితమైన ఈ పద్యాలని గొంతెత్తి పాడుతున్నప్పుడు ఈ లోకంలో లేదు. బృందావీధులలో కృష్ణునికి వెదుకుతున్న గోపికలలో తానొకతి అయిపోయింది. తాను రాధగా మారిపోయింది. పరమాత్మలో లయంకావాలనే తపనతో అన్వేషిస్తున్న జీవాత్మ అయిపోయింది. అన్ని జీవరాసుల వేదనకీ, సాధనకి తాను ప్రతీక అయింది.
    తన నాయకుడు ఇంకా కానరాలేదనే వేదన విరహరూపం దాల్చి గొంతులో ఆర్ద్రతగా బయల్పడింది. నిర్మల మనస్కులైన వారందరి మనస్సులూ మెత్తబడి మధురమైన వేదనని అనుభూతి చెందారు. ఆనందాన్నిచ్చే బాధ ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది. కన్నులు చెమ్మగిల్లుతున్నాయి. అందరూ గోపికలై వ్రజనాథుని తమ అంతరంగంలో వెతుకుతున్నారు.
    భావోద్వేగం ఎక్కువై వెంగమాంబలో సాత్త్విక భావాలు కలిగి రచన చేయలేక గంటం పక్కకి పెట్టి కన్నులు మూసుకుని కూర్చుండిపోయింది. కొద్ది సేపటికి ఒక్కొక్కరికి ఒళ్ళు తెలియటం మొదలయ్యింది. ఎవరికి తోచిన మాట వాళ్ళన్నారు.
    "ఈ వెంగమాంబ తల్లి తాను రాధ అయి మనందరినీ రాధలని చేసింది"
    "గోదాదేవి భక్తి కూడ ఇటువంటి దేనేమో!"
    "అపర మీరాబాయి సుమా! ఆ తల్లి కృష్ణుని ప్రాణ నాయకుడంటే, ఈ తల్లి తన తరిగొండనారసింహుడే తన ప్రాణ నాయకుడంటోంది."
    "అవును సుమా! మీరాదేవి తెలుగునేల మీద అవతరించిందేమో అనిపిస్తోంది."
    ఈ వ్యాఖ్యలేవీ వెంగమాంబ తన్మయత్వాన్ని భంగం చేయలేకపోయాయి. గుడికట్టేసే వరకు సమాధిస్థితిలో ఉండిపోయింది. పూజారి హెచ్చరికతో స్వప్నావిష్టురాలిలాగా లేచి గృహోన్ముఖురాలైంది.
    అవకాశంకోసం ఎదురుచూస్తున్న కొంటెమూక వెంటపడ్డారు. అది వాళ్ళకి అలవాటే. వాళ్ళకి సోమయాజి ప్రోద్బలం ఉంది. మాటలతూటాలని, రాళ్ళని రప్పలని సమానంగా రువ్వగలరు. పుల్లవిరుపు మాటలు, పుల్లలు సమానంగా వదలగల సవ్యసాచులు. పైశాచికానంద ప్రవీణులు.
    "శృంగార పాఠాలు ఎక్కడ నేర్చిందంటావు?"
    "దీనికీ ఒక గురువు కావద్దూ!"
    "ఉన్నాడేమో!"
    "ఉండే ఉంటాడు"
    "దేవుడు, భక్తి అనే పేరు పెట్టి ఎంత శృంగారం, సరసం ఒలికిస్తోందో!"
    "పేరే దేవుడిది. అసలెవరో ఉండే ఉంటారు."
    "మనం కూడా ప్రయత్నిస్తే పోలా?" అంటూ ఒక అష్టావక్రుడు చేతిలో ఉన్న చిన్నరాయి వెంగమాంబమీద విసిరాడు. అది వెంగమాంబ చీర కుచ్చెళ్ళకి తగిలి జారి నేలమీద పడింది.
    "అట్లాకాదురా!" అంటూ ఇంకొక నెలతక్కువవాడు నేలమీద ఉన్న పెద్ద ఇటిక రాయిముక్కని తీసి గట్టిగా విసిరాడు అసభ్యమైన పదజాలం ఉపయోగిస్తూ. ఆ రాయి వెళ్ళివెంగమాంబ తలవెనకభాగంలో తగిలింది. వెంగమాంబ నెప్పితో తల పట్టుకుని,
    "శ్రీనివాసా!" అంటూ ముందుకి సాగింది.
    పక్కనున్న సందులోంచి ఒక ఆజానుబాహుడు రావటం చూచి అమ్దరో పిక్కబలం చూపించారు.
    "అమ్మా! నేను వచ్చేదాకా గుడిదగ్గరే ఉండమన్నానుకదా" అంటూ చేతిలో ఉన్న బాణాకర్ర నేలకి ఆనించాడు ఆ వచ్చిన ఆజానుబాహుడు.
    "ఇపుడు నడవండమ్మా!" అన్నాడు.
    అప్పటికి పూర్తిగా బాహ్యస్పృహ కలిగింది వెంగమాంబకి.
    "మురాషావలీ! నీకెందుకు నాయనా ఈ బాధ్యత?"
    "ణా బెహన్ ఇజ్జత్ కాపాడటం నా బాధ్యత. వాళ్ళట్లా మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊరుకుంటావ్? శాపం ఇచ్చెయ్యచ్చుగా!"
    "మనకెందుకు ఆ పాపం? ఎవరి పాపాన వాళ్ళు పోతారు."
    "నువ్వు వాళ్ళని వదిలేస్తావు గనక నేను బుద్ధి చెపుతాను."
    "అంతా నా స్వామి, నరసింహుడే చూసుకుంటాడు."
    "ఆ సామే నన్ను పంపించాడమ్మా!"
    "వాదనలో నిన్నెవరూ గెలవలేరు. అసాధ్యుడివి. ధర్మశాస్త్రాలని, ఆధ్యాత్మిక సిద్ధాంతాలని ఆపోసన పట్టినట్టు మాట్లాడతావు. ఏం చదివావు? నీ గురువెవరు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS