మార్వాడీ అలంకరణలోనే వున్నాయా ఇంటి గదులు. డైనింగు రూముకీ, డ్రాయింగ్ రూమ్ కీ మధ్య తెర వుంది. అతడు ముందు ఆఫీసు గది వెతకటం మొదలుపెట్టాడు. అన్నీ సైన్సు పుస్తకాలూ, జర్నల్సూ వున్నాయి. డ్రాయరు తాళాలు గోడకి తగిలించి వున్నాయి. వాటి సాయంతో డ్రాయరుతీసి వెతికేడు. నాలుగైదు ఫైల్స్ దొరికాయి.
గోడలకు గానీ, తివాసీ క్రిందగానీ రహస్యపు అరలు ఏవైనా వున్నాయేమో అని తడిమి చూసేడు. అలాంటిదేమీ కనబడలేదు.
అతడు ఫీజు రూమ్ లోంచి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. మార్వాడీల ఇల్లు అది. గది గోడలకి రకరకాల ఫోటోలు వంశంలో అందరివీ తగిలించటం అలవాటు. ఆ ఫోటో వరుసల మధ్యలో ఒక దంపతుల ఫోటో వుంది. ఇరవై సంవత్సరాల క్రితందయినా అందులో పోలికల్ని అతడి చురుకయిన కళ్ళు వెంటనే పసిగట్టినయ్. అతడు అచేతనుడయ్యాడు. తన కళ్ళనే నమ్మలేనట్టుగా అలా వుండిపోయాడు.
అందులో వున్నది ఎస్. కె. నాయుడు.
అతను ఒక్కగెంతులో దాని దగ్గిరకి వెళ్ళి దాన్నీ, దాని పక్క గ్రూపు ఫోటోనీ పరిశీలించి చూసేడు. చంపాలాల్ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళ గ్రూప్ ఫోటో అది. నాయుడు భార్య, చంపాలాల్ అక్క అని నిశ్చయమై పోయింది.
ఎస్.కె. నాయుడు ఎవరో మార్వాడీల అమ్మాయిని చేసుకున్నాడని తెలుసు కానీ, అది చంపాలాల్ అక్కయ్యనే అని తెలీదు. ఇంకెవరికయినా తెలిస్తే తెలుసేమోగానీ, కనీసం తన సర్కిల్ లో తెలీదు.
ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతడికి కొంత సమయం పట్టింది. ఈ విషవృక్షపు వేళ్ళు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్థం కావటానికి ఆలస్యమైంది.
ఆ ఆలోచనలో అతడు బయట అలికిడి గమనించలేదు.
"ఎవరది?" అని వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు.
తను వెతకటానికి ఇంట్లోకి వస్తూ లోపల తలుపు గడియ వేసుకున్నాడు. బయట తాళం లేదు. కానీ వచ్చినవాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలుసా చంపాలాల్ ఊర్లో లేడని? వాళ్ళకి అనుమానం వస్తుందా? అతడు తలుపు దగ్గిరకి వెళ్ళి సందుల్లోంచి చూసేడు. అటువైపు చుట్టతో నిలబడి వున్నాడు.
ఆ నిలువెత్తు విగ్రహం నాయుడిది.
కో-ఇన్సిడెన్స్ గురించి ఆలోచించేంత టైమ్ లేదు. ఒక్క గెంతులో వెనుక గదిలోకి వచ్చాడు.
బయట అతడికి అనుమానం వచ్చినట్టుంది. తలుపు దబదబా బాదుతున్నాడు. శేఖరానికి ఏం చెయ్యాలో తోచలేదు. వెనుక వరండాలోకి వచ్చాడు. అక్కడ బాల్కనీకి నాలుగు అడుగుల ఎత్తున గోడ వుంది.
అతడు మూడో అంతస్తులో వున్నాడు.
గోడపక్కనుంచి నీళ్ళ గొట్టం వుంది. కానీ అది బాల్కనీకి ఎనిమిది అడుగుల దూరంలో ఉంది.
శేఖరం చూపు బాత్ రూము పక్కనున్న వెదురుకర్ర మీద పడింది. దాని ఆధారంతో నీళ్ళ గొట్టం చేరుకోగలిగితే, అక్కణ్నించి నెమ్మదిగా క్రిందికి పాకవచ్చు, ఎవరూ చూడకపోతే అదృష్టమే.
అతడు దాన్ని తీసుకుని బాల్కనీవైపు వస్తుంటే- బయట తలుపు గడియ వూడిపోయిన శబ్దమయింది. నాయుడు లోపలికి వస్తున్నాడు. లోపల ఎవరో వున్నట్టు అతడు పసికట్టినట్టున్నాడు.
శేఖరం బాల్కనీ గోడమీద నుంచి నీళ్ళ గొట్టానికి కర్ర ఆన్చి దాన్ని పట్టుకుని, క్రిందికి దిగే సమయానికి నాయుడు అక్కడికి చేరుకున్నాడు. శేఖరం గాలిలో వుండే తలపైకెత్తి చూసేడు. అదే సమయానికి నాయుడు క్రిందికి చూసేడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.
నాయుడు బాల్కనీ గోడమీదకు వంగి, సన్ షేడ్ ని ఆనుకుని వున్న కర్రని కాస్త కదిలించాడు.
దాంతోపాటూ శేఖరమూ గాలిలో వూగేడు.
నీళ్ళగొట్టం ఇంకా ఆరడుగుల దూరంలో వుంది. బాతులూ, తాబేలు కథలో లాగా అతడు మధ్యలో కర్రని పట్టుకుని అటు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. నీళ్ళ గొట్టపు సందుల్లో ఇరికించిన కర్ర ఏ క్షణమైనా బయటకు జారిపోయేలా వుంది. ఈ లోపులో నాయుడు కర్రని మళ్ళీ కదిలించాడు. శేఖరం వళ్ళు జలదరించింది. అక్కణ్నుంచి జారితే....
ఆ ఆలోచన భయంకరంగా తోచింది. మరికొద్దిగా నీళ్ళ గొట్టంవైపు వెళ్ళబోయాడు. నాయుడు వంగి కర్రని తన వైపుకి లాక్కున్నాడు. ఒక క్షణం ఆలస్యమయితే కర్రతోసహా తను నేలమీదకు పడిపోతానని శేఖరం గ్రహించాడు. ఇక నీళ్ళ గొట్టాన్ని చేరటానికి టైము లేదు. తప్పనిసరిగా నాయుడు వున్నవైపే రావల్సి వచ్చింది. కర్రని పట్టుకుని కాస్త ఇటుగా వచ్చేసరికి నాయుడు దాన్ని పూర్తిగా లాగెయ్యటమూ- శేఖరం దాన్ని వదిలేసి సన్-షేడ్ ని పట్టుకోవటమూ రెప్పపాటులో జరిగిపోయాయి. కర్ర క్రిందికి జారి ఎక్కడో అఘాతంలో పడిన చప్పుడు వినిపించింది.
సన్ షేడ్ ని పట్టుకుని శేఖరం గాలిలో వేలాడసాగేడు. మూడో అంతస్తు అది. నాయుడు తనకి చెయ్యి అందిస్తాడేమో అని తలపైకెత్తి చూసేడు. బాల్కనీలో వున్న నాయుడు అటువంటి ప్రయత్నమేదీ చెయ్యకుండా "చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు దొంగతనానికి రాలేదు. ఎందుకొచ్చావ్? చెప్పు" అని అడిగాడు. శేఖరం మట్లాడలేదు.
నాయుడు అక్కణ్నించి కదిలి లోపలికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరుసీసా తీసుకుని వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని తాపీగా తాగటం మొదలుపెట్టాడు.
నవ్వుతూ ప్రాణాలుతీసే హంతకుల్నీ, రక్తపాతం జరుగుతూ వుంటే ఆనందించే వాళ్ళనీ చూసేడు గానీ ఇంత శాడిస్టుని ఎక్కడా చూడలేదు. అతడికి అసలు నాయుడు ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు.
ఒకవిపు విసిరేసినట్టున్న ప్లాట్ అది. అవతలి ప్రక్క అంతా బహిర్ ప్రదేశం. ఎవడూ చూడటానికి కూడా అవకాశం లేదు. సన్- షేడ్ పైకి రావటానికి బలం సరిపోవటం లేదు. కానీ ఎంతసేపలా?
చేతులమీద శరీరపు బరువు ఆన్చి, గాలిలో నిలబడి వుండడం క్షణక్షణానికి కష్టం అవుతూంది. చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. పాము కప్పని మింగుతూంటే దూరం నుంచి చూసేవాడిలా బాల్కనీలో కూర్చుని నాయుడు చిత్రంగా చూస్తూ బీరు తాగుతున్నాడు- చాలా కామ్ గా.
అంతలో చేతులమీద ఏదో పాకినట్టయి తలెత్తి చూసేడు. చేతులు పైన వుండటం వల్ల ఏం పాకుతున్నదో తెలియలేదు. అతడి వెన్ను ఒక్కసారిగా జలదరించింది. అంతలో ఏదో కుట్టినట్టు చురుక్కుమంది.
చేతులు వదిలేసాడు.
దాంతో గాలి విపరీతమైన వేగంతో రివ్వున చెవుల్లోకి కొడ్తూవుండగా అతడు భూమివైపు జారిపోయాడు.
మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ విశాలమైన ఆవరణలో విసిరేసినట్టున్న ఇళ్ళ వెనుక పనికిరాని చెత్తనంతా పారవేసే ఆ ప్రదేశంలో ప్రహరీకి కాస్త ఇవతల చిన్న సిమెంట్ కుండీపక్కన, చరిత్రలో ఏ ప్రాముఖ్యత లేకుండా కొన్ని వందల సంవత్సరాలనుంచీ పడివున్న ఒక రాయికి అకస్మాత్తుగా విశిష్టత లభించింది. దాంతోపాటూ అ కుండీకి కూడా. ఆ రెండూ అక్కడ లేకపోతే ఏమై వుండేదో తెలీదుగానీ, ముందు ఆ కుండీ అంచు అతని గెడ్డానికి కొట్టుకుంది.
