చంచల్రావు చాలా తెలివైనవాడు. అందుకే వాడంటే నాకిష్టం.
అంతేరా... అంతే" అన్నాను వాడి జుట్టు పీకీ మెడకొరికేస్తూ.
"ఇలాంటివన్నీ ఆ అమ్మాయి దగ్గర చెయ్యాలి, నా దగ్గర కాదు" వెనక్కు జరిగి మెడ రుద్దుకుంటూ ఉన్నాడు.
"అందుకే నీ దగ్గరికి వచ్చాను... ఆ అమ్మాయి నన్ను ప్రేమించేలా చూడాలి చెంచిగా" అన్నాను జాలిగా.
చంచల్రావుక్షణం సేపు ఆలోచించాడు.
"ఆ అమ్మాయికి తమ్ముళ్ళుగానీ చెల్లెళ్ళు గానీ ఉన్నారా?"
"ఓ నాలుగు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, మరో చారల బనీను అన్నయ్య ఉన్నాడు.
నువ్వు చారలబనీనువాడి జోలికిపోకు. ఆ తమ్ముడిని మచ్చికచేసుకో... నాలుగు సంవత్సరాల వయసు కాబట్టి ఈజీగా మచ్చిక చేసుకోవచ్చు. వాడికి చాక్లెట్లు, బిస్కెట్లులాంటి చిరుతిళ్ళు పెట్టు... వాడిద్వారా ఆ అమ్మాయితో పరిచయం పెంచుకోముందు. ఆ అబ్బాయిద్వారా ఆ అమ్మాయికి వారపత్రికలూ నవల్లూ పంపిస్తావ్. తరువాత లవ్ లెటర్లన్న మాట"
నేను సంతోషం పట్టలేక చంచల్రావుని గట్టిగా కౌగిలించుకున్నాను.
* * *
ఆదివారం పదిగంటలైంది.
తలుపు తట్టిన శబ్దమయింది. లేచి తలుపు తీశాను. ఎదురుగా బుజ్జిపండు ఉన్నాడు. బుజ్జిపండు అంటే మా ఎదురింటి అందమైన అమ్మాయి సుందరి తమ్ముడు. వాడిని చూడగానే నాకు నీరసం వచ్చేసింది. పోయిన ఆదివారం వాడిని మచ్చిక చేసు కున్నాను. అప్పటినుండి నా నవనాడులూ కృంగనారంభించాయి. తప్పదు మరి ప్రేమకోసం అన్నీ భరించాలి.
"ఏవోయ్ తలుపుకి అడ్డుగా నిల్చున్నావ్? కాస్త నన్ను లోపలికి రానియ్" అన్నాడు నన్ను తోసుకుని లోపలికి వెళ్తూ.
వాడిని ఎత్తి వీథిలోకి విసిరెయ్యాలని అనిపించింది నాకు. ఈ రోజు ఎంత చంపుకు తింటాడో నన్ను.
"మరేమో మా అక్క ఈ నవల్లు చదివేసింది. వేరే నవల్లు తెచ్చి ఇమ్మంది"అన్నాడు నా మంచం ఎక్కి చేతిలోని నవలలు నేలమీదికి విసిరేస్తూ.
` 
నేను నవలలు వంగి ఏరుకుని అలమారులో పెట్టి హిహిహి అని నవ్వు తెప్పించుకుని నవ్వాను. కోపగించుకుంటే ఎక్కడ అలిగి వెళ్ళిపోతాడోనని.
"ఏంటా వెధవ నవ్వు... లైబ్
రరీ కెళ్ళి నవల్లు తీసుకురా అన్నాడు బుజ్జిపండు కోపంగా.
నోరు నొక్కుతా వెధవా అనుకున్నా మనసులో.
"రేపు తెప్పిస్తాలే బుజ్జిపండూ..... ఇప్పుడు బయటచూడు ఎంత ఎండగా ఉందో?"
"అదంతా తెలీదు. నాకు ఇప్పుడే కావాలి" అన్నాడు మొండిగా. "లేకపోతే నువ్వు ఇవ్వను పోమ్మన్నావని మా అక్కతో చెప్పేస్తా"
"అమ్మమ్మా... అంతపని చెయ్యకు ఇప్పుడే తెచ్చిస్తానుండు"
వాడిని ఇంట్లో వదిలి అప్పటికప్పుడు లైబ్రరీకి వెళ్ళి జీవనవలయంలో ఆశల నిలయం", ప్రేమ బంధాలూ - పన్నీరు గంధాలూ", కన్నీటి కడలిలో జీవితపు పడవ" నవలలు తీసుకుని చెమటలు కక్కుతూ యింటికి వచ్చాను.
"మా అక్కకైతే పుస్తకాలు తెచ్చావు మరి నాకేమీ తేలేదేం?" అన్నాడు మొహం ముడుచుకుని.
"అర్రె!!" నాలుక కరచుకున్నాను. "మర్చిపోయానురా బుజ్జిపండు" అన్నాను.
"వా..."
వాడి ఏడుపుకి భూకంపం వచ్చినట్లు ఇల్లంతా కంపించి పోసాగింది. ఒక చోట గోడ బీట కూడా ఇచ్చింది.
నేను కంగారుగా చెప్పుల్లో కాళ్ళు దూర్చి "ఓరేయ్ పండూ... ఏడుపు ఆపరా ఇప్పుడే వెళ్తున్నాను" అని బయటికి పరుగెత్తాను.
నా గదికి సెంటర్ దాదాపు రెండు పర్లాంగుల దూరం ఉంటుంది.రానూ పోనూ అరమైలు! ఆ ఎండలో పడి చాక్లెట్లు, బిస్కేట్లూ కొనుక్కుని వచ్చాను. వారం రోజుల నుండీ వాడు నన్ను ఇలాగే చంపుతున్నాడు.

బుజ్జిపండుకు చాక్లెట్లు ఇచ్చి టైం చూశాను. పదకొండు గంటలు కావొస్తుంది. కడుపులో ఆకలి దంచేస్తుంది.
