"ఇది మా మామ తెలివిరా ఫూల్. ప్లాన్ ఆయనది. దాన్ని ఆచరణలో మనం పెట్టాం! లేకపోతే నేను కన్నేసిన అనూష ఆఫ్ట్రాల్ గాడైన ఆ పరుశురాంని ప్రేమించడమా? దానిముందు వాడు నన్ను కొట్టడమా?" "అందుకే చెప్తున్నాను వాడు బతికి బట్టకట్టలేడు. కట్టనివ్వను" అన్నాడు రణధీర్ కటువుగా.
గోవిందు పగలబడి నవ్వాడు.
"ప్రేమికుల బంధాన్ని తెంపేశావుగా! అనూష ఖచ్చితంగా వాడ్ని ఛీ కొట్టేస్తుంది."
రణధీర్ వెకిలిగా నవ్వాడు.
"మామ పోలీసు స్టేషన్ కి ఫోన్ చేస్తాడు. లేకపోతే ఇన్ స్పెక్టర్ని ఇంటికి పిలిపింటి చెప్తాడు. పరుశురాం గాడి శవం రేపీపాటికి రైలు కట్టపైన పడుంటుంది. ఆ శవం మీదనుంచి రైలు వెళుతుంది. తునాతునకలై పోయిన వాడి శరీరాన్ని వాడి ఆత్మ చూసి ఆత్మహత్య చేసుకున్నాడనుకొంటారు."
రణధీర్ గ్లాసులో విస్కీని ఎత్తి ఒకేసారి తాగేశాడు.
పాండు ఆ మాటలకి గుడ్లు తేలేశాడు.
"బాప్ రే! మనిషిని లేపేయడమే!" గుండెపైన చేయి వేసుకున్నాడు పాండు.
"హి ఈజ్ డిసర్వుడ్ ఫర్ దిస్ అవార్డ్. లేకపోతే పాత పేక ముక్కలతో ఆడుకునే బేవార్స్ నా కొడుకు నా అనూషతో తిరగడమా! ఇప్పుడు వాడి మొహం చూసే నాధుడే లేడురా పాండూ!"
"ఇంకా మొహం చూసే పనేం వుందిరా శాల్తీనే లేపేస్తున్నప్పుడు" గోవిందు ఇకిలించాడు.
రణధీర్ మరో పెగ్ విస్కీని గ్లాసులో వేసుకుని ఫ్లాస్క్ లోంచి అయిస్ ముక్కలు వేశాడు.
"సోడా పొయ్యనా!" అడిగాడు ప్రభు.
"అవసరం లేదు. ఆ పరుశురాం గాడి రక్తాన్ని కలుపుకొని తాగుతాను. చెప్పుల దండ నా మెడలో పడిన తర్వాత వాడిని క్షమించే ప్రసక్తే లేదు.
చీమని చిటికిన వేలితో నలిపనట్లు నలిపేస్తాను" సిగరెట్ వెలిగించాడు.
"పరుశురాం గాడ్ని సెపరేట్ చేసినంత మాత్రం చేత అనూష నీకెలా దక్కుతుంది?" అడిగాడు రెడ్డి.
"దక్కాలి, అది రూలు!" అన్నాడు రణధీర్.
"అంటే?"
"నేను ఎమ్మల్యేగారి మేనల్లుడ్ని. రాజు తల్చుకుంటే దెబ్బలకి కొరవా? అంతే!" అన్నాడు హేళనగా రణధీర్.
"కావి ఈలోగా మన రాక్షసకాండ అనూషకి తెలిసి నిన్ను ఛీ కొడితే?" అడిగాడు పాండు.
"ఎలా తెలుస్తుంది? తెలీదు!" అన్నాడు గట్టి నమ్మకంతో.
"సరస్వతి చెబితే?" అడిగాడు గొట్టాం సాయిలు.
"చెప్పదు"
"అంత నమ్మకం పనికిరాదు గురువా! మొన్న నీకు భయపడి మనం ఆడించినట్లు ఆడింది. రేపు పరుశురాం గాడు బయటకు వచ్చి బెదిరిస్తే...."
"నా ప్లాన్ ప్రకారం వాడి శవమే పోలీస్ స్టేషన్నించి బయటికి వస్తుంది. ఒకవేళ సరస్వతి ఈ విషయాన్ని బయట పెడితే తప్పదు దానికి పడకసీను."
"ఎంత అదృష్టవంతుడివో.... ఇంత మందితో శోభనం!" ఈల వేశాడు గోవిందు.
వాళ్ళ మాటల్ని వింటున్న పరుశురాం రుద్రుడైపోయాడు.
రణధీర్ కుట్ర వెనుక ఎంత భయంకర నిజం దాగి ఉందో తెలుసుకున్న పరుశురాం తనని తాను సంభాళించుకోలేకపోయాడు. అంతే! అతనా క్షణంలో పరిసరాలని సైతం మరిచిపోయాడు. తనేం చేస్తున్నదీ గ్రహించే విచక్షణా జ్ఞానాన్ని పక్కకి నెట్టివేశాడు.
సింహంలా గర్జిస్తూ తలుపుపైన కాలితో ఒకే ఒక్క తన్ను తన్నాడు.
తలుపు విరిగి కిందపడింది. జరిగిందేమిటో అర్ధంగాక ఉలిక్కిపడి చూశారు రణధీర్ బృందం.
గుమ్మానికి అడ్డంగా సింహంలా నిలబడివున్న పరుశురాంని చూసి నిర్ఘాంతపోయాడు రణధీర్.
"నువ్వా!" తేరుకుంటూ అడిగాడు. పరుశురాం గుమ్మానికి రెండువైపులా చేతులు చాచి నిలబడి అన్నాడు.
"నీ కుటిల రాజకీయానికి తెర వేయడానికి, నిన్ను యమపురికి పంపడానికి వచ్చిన పరుశురాముడ్నిరా! దమ్ముంటే, చేతనైతే ఇక్కడ్నించి తప్పించుకుని బయటికి పారిపోండి. వదిలేస్తాను. లేదా యముడి దర్శనార్ధం పోవడానికి సిద్ధపడండి" అన్నాడు.
గోవిందు పెద్దగా ఏడుస్తూ--
"పరుశురాం.... ఇందులో నాకు ఏమీ సంబంధం లేదు. మందు పోస్తుంటే తాగుతున్నాను. ఎలాగూ వచ్చావు. కంపెనీ కోసం రెండు పెగ్గులు తీసుకో! నన్ను విడిచిపెట్టెయ్!" అని ముందుకి వచ్చాడు.
"పో బయటికి" అన్నాడు పరుశురాం. దొరికిన అవకాశానికి మురిసిపోతూ బయటికి పరుగెత్తి....
"ఒరేయ్ మీరుకూడా నాలాగే వచ్చేయండి. పరుశురాముడిది అసలే జాలిగుండె" అని అరిచాడు గోవిందు.
రణధీర్ పక్కకి ఒచ్చి నించున్నారు పాండు, రెడ్డి, గొట్టాం సాయిలు, ప్రభు.
"ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకింకా బుద్ధి వచ్చినట్టు లేదు. పోలీసు స్టేషన్నించి పారిపోయి వచ్చావా?" అడిగాడు రణధీర్.
"లేదురా! చట్టరీత్యానే బయటికి వచ్చాను. ధర్మబద్ధంగానే నిన్ను శిక్షించబోతున్నాను. మీ బాబుల్ని, తాతల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి." అని అంటూనే సుడిగాలిలా పైకి లేచి ఒక మిస్సైల్ ఢీ కొన్నట్టు రణధీర్ ఛాతీపైన కాళ్ళతో తన్నాడు.
