Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 40


    పండగ వచ్చింది . రెండు మూడేళ్ళ తరువాత వచ్చిన కూతురికి, అల్లుడుకి కానుకలు ముట్టాయి. అల్లుడికి డైమండు రింగు, కూతురికి ఒక జత బాంగారురాజులు , మనవారాలికి జూకాలు, పట్టుచీర, పట్టు పరికిణి , అల్లుడికి సూటు అందించారు. కోడళ్ళఇద్దరికీ చీరలు పెట్టారు. చీర పుచ్చుకుని నందిని రవీంద్ర కేసి ఉంగరం ఏది యివ్వలేదే అన్నట్టు చూసింది. రవీంద్ర చూపులు తప్పించాడు. నందిని చివాలున లేచి గదిలోకి వెళ్ళిపోయింది.
    భార్య ఎక్కడ ఏం అనేస్తుందోనని భయంతో నచ్చజెప్పడానికి గదిలోకి వెళ్ళాడు. నందిని మూతి ముడుచుకుని 'ఉంగరం గురించి మీరు చెప్పలేదా. మీ వాళ్ళివ్వలేదా?" సూటిగా అడిగింది.
    అడిగిన తీరుకి ఒళ్ళు మండినా గట్టిగా అంటే బయటికి వినిపిస్తుందన్న భయంతో బాగుండదని , మా వాళ్ళెం అనుకుంటారోనని, నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు. ఉంగరానికేం నీ పుట్టినరోజుకి నేను కొంటానులే' అన్నాడు బుజ్జగించే ధోరణిలో.
    'మీరు చేయించాలంటే మిమ్మల్నే అడిగేదాన్ని. వాళ్ళతో చెప్పానని అబద్దం ఎందుకు చెప్పాలి. ఈ చీర తీసికెళ్ళి వాళ్ళకిచ్చేయండి. ఈపాటి బోడి చీర నేను కొనుక్కోగలను' చీర విసిరికొట్టింది.
    రవీంద్ర కోపం నషాళానికి అంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకువయిపోతానని, భార్యని ఆమాత్రం కంట్రోల్లో పెట్టుకోలేనా అంటారని కోపం నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో 'నందినీ ప్లీజ్ యిప్పుడు ఏం గొడవ చేయకు. చెప్తున్నాను ఏదన్నా అన్నావో చూడు'
    'వాళ్ళతో చెప్పానని మీరెండుకు అబద్దం చెప్పాలి? మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని ఎప్పుడో పెళ్ళయిన కూతురికీ అన్నీ ఇచ్చారు. కొత్త కోడలికి ముష్టి చీర పడేస్తారా?'
    'ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ' అరవకు. నా పరువు తీయకు' నమస్కారం పెట్టాడు. నందిని మింగేసేట్టు చూసింది. రవీంద్ర ఆ చూపు తప్పించుకుని గదిలోంచి ఆ మధ్యాహ్న భోజనానికి నందిని వెళ్ళలేదు. గదిలోనే కూర్చుంది. రవీంద్ర తోడికోడలు పిల్చి వెళ్ళారు. ఆకలి లేదు రానని తెగేసి చెప్పింది . రవీంద్ర మొహం మాడిపోయింది.
    'ఏమిటి ఏమయింది , పండుగపూట ఆకలి లేదని భోజనం మానేయడం ఏమిటి? ఏం జరిగింది' గంబీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి.
    నిస్సహాయంగా చూశాడు రవీంద్ర. 'రవీ, మీ ఆవిడ్ని ఏమన్నా అన్నావా?' తల్లి అరాతీసింది. తల అడ్డంగా తిప్పాడు.
    'ఉండమ్మా నే వెళ్లి పిల్చుకోస్తాను'[ ఆడపడచు గదిలోకి వెళ్ళింది.
    ఓ పావుగంటయినా యిద్దరూ గదిలోంచి వూడిపడకపోవడంతో అన్నం వడ్డించి అన్నీ చల్లారి పోతున్నాయంటూ తోడికోడలు మళ్ళీ పిలవడానికి వెళ్ళింది.
    సునీత నవ్వుతూ గదిలోంచి వచ్చి "మీ కోడలు అలక పాన్పు వేసిందమ్మా అల్లుళ్ళుకెనా ఏమిటి అలక పాన్పు ఎక్కేది మోడర్న్ రోజులు కదా, మీ కొత్తకోడలు అలక పాన్పు ఎక్కింది. డైమెండ్ రింగ్ కావాలిట. అదిస్తే వచ్చి భోజనం చేస్తుందిట' అందరూ తెల్లపోయారు.
    రవీంద్ర మొహంలో నెత్తురు చుక్కలేదు. 'డైమెండ్ రింగ్ ఏమిటి, అలక పాన్పేమిటి ?' అత్తగారు నివ్వెరపోతూ అంది.
    'పండుగలకి కొత్త అల్లుడికి బహుమతులు యిస్తారు. నేను కొత్త కోడలిని మా వాళ్ళు కొత్త అల్లుడికి టి.వి యిచ్చారు. నాకు ఉంగరం కావాలన్నాను తప్పా. అల్లుళ్ళకేనా అడిగే హక్కు, కోడలికి వుండకూడదా అంటుందమ్మా నీ కోడలు. డైమండ్ రింగ్ చేయించివ్వాలి నువ్వు.'
    రవీంద్ర నోరు పెగల్చుకుని 'మా ఆవిడకి వాళ్ళ వాళ్ళని పండుగకి టి.వి కావాలని అడిగానని కోపం . నా మీద కోపం యిలా తీర్చుకుంది' తలవంచుకు జరిగింది చెప్పాడు.
    'రవీ, నీవు కూడా చదువుకుని మంచి ఉద్యోగంలో వుండీ యింకా ఇలా అత్తవారు యిదివ్వాలి, అదివ్వాలి అనుకోడం ఏమిటి? పోనీ వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగినా పరవాలేదు . వాళ్ళున్న పరిస్థితిలో అలా పదివేలు పెట్టి ఎక్కడ కొనివ్వగలరు?' అక్కగారు రవీంద్రని మెత్తగా చివాట్లు పెట్టసాగింది.
    'అంతేకాదు వదినా ఇటు భర్త కోరికలు, అటు తల్లిదండ్రుల అశక్తత మధ్య ఓ భోజనానికి రాకపోతే అందరికి తెల్సిపోయి అయన ఎంత అవమానపడ్డారు. నేను అలా అడిగిందగ్గిరనించి అయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు? ఆయనకి యీ విషయం యెంత యిబ్బందిగా వుంటుందో అర్ధం కావాలని యిదంతా చేశాను. ఈరోజుల్లో యింకా అత్తవారిని యిది కావాలి , అది కావాలని పీడించడం ఏమిటి? వుంటే వాళ్ళే సంతోషంగా యిస్తారు. అంతేకాని తల తాకట్టు పెట్టయినా అల్లుడికివ్వాలన్న ఆచారాలు యీ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం? అది ఆయనకి చెప్పినా అర్ధం చేసుకోలేదు. అందుకే ఇదంతా చెయ్యాల్సివచ్చింది. క్షమించండి మీ అందరి పండుగ మూడ్ పాడుచేసినందుకు' నందిని తలదించుకుని అంది.
    సునీత, వెంకట్ చప్పట్లు కొట్టి 'వెల్ సేడ్' అంటూ మెచ్చుకున్నారు.
    'మా బాగా బుద్ది చెప్పావమ్మా చెల్లెలా మా బావ మరిదికి. అమ్మ బాబోయ్ నాకీ ఉంగరం వద్దండీ మామగారూ , మా చెల్లాయ్ మాటలు విన్నాక సిగ్గేస్తుంది పుచ్చుకున్నందుకు, అన్నాడు వెంకట్ నవ్వుతూ. అని బావమరిది భుజం చరిచాడు . రవీంద్ర కూడా స్పోర్టివ్ గా తీసుకుని రెండు చెవులు పట్టుకుని 'బుద్ది వచ్చింది బాబోయ్, మీ వాళ్ళ టి.వి. వాళ్ళకిచ్చేస్తాను' అన్నాడు నవ్వి.
    'టి.వి వాపసు యివ్వక్కరలేదు. నెలనెలా ఇన్ స్టాల్ మెంట్ కట్టుకోండి, అదే మీకు శిక్ష' నందినీ నవ్వింది.
    ఈలోగా అత్తగారు లోపలికెళ్ళి ఓ ఐదువేలు తెచ్చి కోడలు చేతిలో పెట్టి 'కొత్త కోడలికి అలకపాన్పు బహుమతి , నీకు నచ్చిన ఉంగరం నీవే కొనుక్కో' అంది.
    నందిని గాభరాగా 'నిజంగా ఉంగరం కోసం యిదంతా చేశాననుకుంటున్నారా. ఛా....ఛా.... యీ డబ్బిచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్.'
    'లేదమ్మా , మొదటిసారి మా ఇంటికి వచ్చావు. పండుగనాడు యిచ్చింది వద్దనకు. నీవన్నమాట నిజమే. అల్లుడెంతో , కోడలూ అంతే అనుకోవాలి. ఈరోజుల్లో అందావిడ.
    'దయచేసి నన్నిలా యిబ్బంది పెట్టకండి యిప్పుడీ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళదగ్గిర టి.వి పుచ్చుకున్న ఆయనకి నాకు ఏం తేడా వుండదు' నందిని చాలా బాధ పడ్తూ అంది.
    'తనకక్కర్లేకపొతే నాకివ్వమ్మా' రవీంద్ర హాస్యంగా అన్నాడు.
    'అదిగో యిలా యీ బుద్దే . తేరగా వచ్చేసరికి ఆశపడడం ....అదే వద్దన్నది . మీరే చూశారుగా యీయన బుద్ది'. నందిని నవ్వి అంది. అందరూ నవ్వారు.
        
                                                                                                                ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS