Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 41


                                                       చన్నీళ్లు

    "రేవతమ్మా! మాడమ్ గారు పిలుస్తున్నారు!" అటెండరు వచ్చి చెప్పాగానే రేవతి కాబిన్ వైపు చూసింది. మేనేజర్ తనవంకే చూస్తోంది. ఆవిడ ఎందుకు పిలిచిందో రేవతికి అర్ధమై, వాడిన మొహంతో అటు నడిచింది.
    "ఏమిటండీ, రేవతి గారూ, రోజూ ఇలా ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పుడు టైమెంతయింది/ పదకొండు! ఎప్పుడో ఏదో ఒకపూట అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, మూడు రోజుల నుంచి గంటా గంటన్నర ఆలస్యంగా వస్తున్నారు. ఏదన్నా అంటే అందంటారు. మీరిలా చేస్తే నేను ఆఫీసులో డిసిప్లెన్ ఎలా మెయిన్ టైన్ చేయాలో చెప్పండి! మీలాటి సీనియర్లు కూడా ఇంత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే నేనేం యాక్షన్ తీసుకోవాలో మీరే చెప్పండి!' చాలా కరుకుగా అంది సునీత.
    రేవతి తల దించుకుంది. అవమానంతో "సారీ మేడమ్! మా పాపకి మూడు రోజుల నుంచి ఒకటే జ్వరం! నన్ను వదలకుండా ఒకటే ఏడుస్తోంది. క్రెష్ లో దింపివస్తుంటే మెడ కావలించుకుని ఏడుస్తూ వదలడం లేదు. అక్కడ నిద్రపుచ్చి వచ్చేసరికి బస్సు మిస్సయింది. అక్కడికీ గబగబా ఆటోలో వచ్చాను!' సంజాయిషీ ఇచ్చింది.
    "మీ ప్రాబ్లమ్స్ మీ కుంటాయి కాదనను. కానీ నీ జీతం తీసుకుని ఉద్యోగం చేస్తున్నప్పుడు టైముకి రావాలి కదా!" అంతగా అయితే సెలవు పెట్టండి!"
    "కాజువల్ లీవు అంతా అయిపొయింది....!" గొణిగింది రేవతి.
    "ఎర్న్డడ్ లీవు తీసుకోండి కావలిస్తే. అంతే కానీ మీరిలా చేస్తే మిగతావారిని నేను ఎలా అదుపులో పెట్టగలను? నా పొజిషన్ ఆలోచించండి!"
    రేవతి నిస్సహాయంగా చూసి తల ఆడించి వెనుదిరిగింది.'
    "ఆ.... ఆ చిట్ ఫండ్ చెక్కులు ఈ నెలవి ఇప్పటి దాకా ఎస్. బి. లో జమ అవలేదని చాలామంది అడుగుతున్నారు. ఏమైంది ఆ విషయం."
    "ఈసారి ఆ లాట్ అంతా మిస్ ప్లేస్ అయ్యాయి. మళ్ళీ కొత్త చెక్కులు ఇష్యూ చేయమని రాశాం!"
    "మరోసారి రిమైండ్ చెయ్యండి! అప్పుడే ఇవాళ నాలుగు ఫోన్లు వచ్చాయి!" గంభీరంగా అని, ఫైలుముందుకి లాక్కుంది మేనేజర్.
    "ఏమంటోంది మిస్ సునీతగారూ....?" వాడిపోయిన మొహంతో సీటులోకి వచ్చి కూర్చున్న రేవతిని సానుభూతిగా చూసి అడిగింది పక్క సీటు వసుమతి.
    "ఏమంటుంది ? ఆలస్యంగా వచ్చినందుకు అక్షింతలు వేసింది!" శుష్కహాసం చేస్తూ అంది రేవతి. "ఏం చెయ్యను, వసుమతీ! పాపకి అసలు ఒంట్లో బాగాలేదు. గుక్కపెట్టి నీరసంతో ఒకటే ఏడుస్తోంది. కాస్త జ్ఞానం తెలుస్తోంది కదా! క్రెష్ కి తీసుకెళ్లగానే మెడ కావలించుకుని వదలకుండా ఏడుస్తోంది. సెలవు పెడదామంటే అయిపొయింది!" రుద్దమైన కంఠంతో అంది.
    ఆమె కళ్ళు తడి అయ్యాయి. జ్వరంతో ఉన్న పదినెలల కూతురిని, ఏడుస్తున్న కూతురుని నిర్దయగా వదిలి రావాల్సి వచ్చినందుకు తల్లిగా ఆమె మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డని నిస్సహాయంగా వదలిరావడం బాధ ఒకవైపు , తనకంటే ఐదేళ్ళు జూనియర్ అయిన అమ్మాయి మేనేజర్ సీట్లో కూర్చుంటే ఆమె ముందు దోషిలా తలదించుకుని సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడం ఇంకా బాధగా ఉంది రేవతికి.
    "మన బాధలు ఆవిడ కేలా తెలుస్తాయి? చక్కగా అమ్మా, నాన్నా దగ్గరుండి ఇల్లు, సంసారం నడిపిస్తుంటే చిలకలా సింగారించుకుని మడత నలగని చీరల్లో వచ్చి, ఆఫీసరు ఫోజులు పెడుతోంది. పెళ్ళి, పిల్లలు , సంసార బాధ్యతలు ఉంటే మన పాట్లు తెలిసేవి!' కసిగా అంది వసుమతి.
    'ఆవిడ్ని ఎందుకూ అనుకోవడం. ఉద్యోగం చేస్తున్నప్పుడు టైముకి రావాలని ఎవరన్నా అంటారు. మన బాధలు మనవి. ఇంతకీ ఇదంతా నా ఖర్మ! నా కళ్ళ ముందు జాయిన్ అయిన అమ్మాయి ఆఫీసరుగా కూర్చుంటే ఆవిడ ముందు నిలబడాల్సి వచ్చినందుకు నా కెంత బాధగా , అవమానంగా ఉందో - మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుంది పరిస్థితి! ఏమిటో ఈ ఉద్యోగాలు చేసి మనం సాధిస్తున్నది ఏముందో కానీ, పసిపిల్లలని - జబ్బుగా ఉన్న పాపని నిర్దయగా వదలి ....' ఆమె గొంతు పట్టుకుని ఇక మాట్లాడలేక లేడ్జరు ముందుకు లాక్కుని చెక్కుల ఎంట్రీ పని చూడసాగింది.

                                                  ***

    "ఏం అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా?" సాయంత్రం నుంచి ముభావంగా వాడిపోయిన మొహంతో ఉన్న రేవతిని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర అడిగాడు శివరాం.
    "ఒంట్లో ఏం రోగం?" విసురుగా అంది రేవతి.
    "ఏమిటలా రుసరుస లాడుతున్నావు? ఏం జరిగింది ?"
    "ఏం జరుగుతుంది. నా కిందవాళ్ళు నా పై కుర్చీలో కూర్చుంటే వాళ్ళ ముందు తల దించుకుని, నిల్చుని సంజాయిషీలు ఇచ్చుకునే దశ పట్టింది మీ వల్ల!" తీక్షణంగా చూస్తూ అంది.
    "బాగుంది, మధ్య నామీద ఎగురుతావేం? నీ ఆఫీసులో కోపాలు నామీద చూపిస్తావేం?' శివరాం కూడా కాస్త కోపంగానే అన్నాడు.
    "మీ వల్ల కాదూ? రెండుసార్లు ప్రమోషన్ చాన్సులు వదులుకున్నదీ! "పిల్లలతో ఒంటరిగా ఉండలేవు! రెండు కాపురాలు, ఖర్చులు అంటూ నన్ను ఊదరగొట్టే ప్రమోషన్ లు వదులుకునే వరకు ఊరుకున్నారా!" ఉక్రోషంగా అంది.
    "బాగుంది, నీకు కష్టం అవుతుందని, ఇంకో ఊరు వెళ్ళి ఒంటరిగా ఉండడానికి అవస్థ పడతావని అన్నాను. అదేదో నేరంలా నెపం నామీద తోస్తావెం?" శివరాం గొంతు పెంచాడు.
    "ఇప్పుడు వెళ్ళు కావాలంటే ! వెళ్తే ఒంటరిగా ఉండే ఇబ్బందులు ఏమిటో అప్పుడు తెలుస్తాయి నా మీద పడనక్కర లేదు! మహారాజులా వెళ్ళు ఈసారి!' వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు.
    రేవతి చురచుర చూసింది.
    "వెళ్తా! తప్పక వెళ్తా! ఈసారి చాన్సు చచ్చినా వదులుకోను!" రేవతి కంచాలు పట్టుకుని విసురుగా లేచి వెళ్ళిపోయింది.
    

                                                    ***

    ఆరునెలల తర్వాత వచ్చిన ట్రాన్సఫర్ ఆర్డర్ కాగితం చేతిలో పట్టుకుని మిన్ను విరిగి మీద పడ్డట్టు దిగాలు పడిపోయింది రేవతి. తుని బ్రాంచి మేనేజర్ గా ప్రమోషన్ ఆర్డరు. ఈసారి ప్రమోషన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ట్రాన్సఫర్ తప్పదని హేడ్డాఫీసు నుంచి తాఖీదు. ఎక్కడ హైదరాబాదు ఎక్కడ తుని! పన్నెండు గంటల ప్రయాణం, వీకెండ్ కి వచ్చిపోయే దూరం  కాదు. చుట్టుపక్కల అయితే శని ఆదివారాలు తనో , శివరామో వచ్చిపోయే వీలుండేది. ఇది ఎదురుచూసిన విషయమే అయినా, ఈసారి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నా, తీరా చేతికి  ఆర్డరు రాగానేదిగాలుపదిపోయింది రేవతి.
    "ఏం చేస్తావు మరి? వెళ్ళక తప్పదు కదా! ఓరెండు మూడేళ్ళు కష్టపడాలి . మరి ప్రమోషన్ కావాలంటే అందరికీ హైదరాబాద్ కావాలంటే కుదరదు కదా!' వసుమతి అంది బెంగగా చూస్తున్న రేవతితో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS