'ఇది బాగుంది. పండగకి అల్లుడడగడం , అత్తవారివ్వడం అదో ముచ్చట. ఇవాళ కొత్తగా నేనే అడిగానా? నీవే ముందే ఏదో ఊహించేశావు. నీకు మొగుడి మీద కంటే అమ్మ నాన్నల మీదే ప్రేమ ఎక్కువ. పెళ్ళయ్యాక ఎవరన్నా మొగుడ్ని సపోర్ట్ చేస్తారు నిజంగా ప్రేముంటే నా మీద....' బుంగమూతి పెట్టి అలక నటిస్తున్న అతని మూతి మీద ఒక టేయ్యలన్న కసిని బలవంతాన అపుకుంది. భార్య మోహంలో అప్రసన్నత గుర్తించి యింకా విషయం అంతటితో ఆపి నాల్గురోజుల విరహం తర్వాత ఆరాటంతో నందిని దగ్గిరకు లాక్కున్నాడు. అతని కౌగిలి లోంచి గింజుకుని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలా అనుచుకుందో ఆమెకే తెలియదు.
***
ఆరోజు రవీంద్ర సంతోషంగా వున్నాడు. 'అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది. డిల్లీ నుంచి అన్నయ్య, వదిన వస్తున్నారు. ఉగాది పండుగకి మీరిద్దరూ కూడా రండి అంతా కలసి సరదాగా నాలుగు రోజులు గడపొచ్చు అని తండ్రి ఫోను చేసి చెప్పాడు.
రెండేళ్ళ తరువాత వస్తున్న అక్కయ్యని, ఏడాది తరువాత అన్నయ్యని చూడొచ్చు. అందరూ కల్సి కొన్నాళ్ళు సరదాగా గడపచ్చు. తన పెళ్ళి అయ్యాక మళ్ళీ యింటికి వెళ్ళనే లేదు యీ మూడు నాలుగు నెలల్లో, అక్కయ్య అయితే నందినిని చూడనే లేదు. వెళ్ళాలి తప్పక వెళ్ళాలి. రవీంద్ర చాలా సంబరంగా ఆఫీసు నించి అటెళ్ళి టిక్కట్లు కూడా బుక్ చేసేసాడు. ఇంటికొస్తూనే సంబరంగా 'మనం ఉగాదికి మా యింటికి వేడ్తున్నాం. మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు. వారం రోజులు శెలవు పెట్టేశాను' అన్నాడు.
నందిని మాట్లాడలేదు. మొహంలో ఏ భావం లేకుండా కాఫీ తెచ్చి యిచ్చింది 'ఏమిటి విన్నావా చెప్పింది.'
'విన్నాను, అలాగే వెళ్ళొచ్చు దానికేం?" కాని....
'ఏమిటి మొహం అలా పెట్టావు . మా ఇంటికి రావడానికి నీకిష్టం లేనట్టుంది అనుమానంగా చూశాడు.
"పెళ్ళి చేసుకున్నాక అత్తారింటికి వెళ్లక తప్పుతుందా/ కాని, అది కాదు నేననేది మరి కొత్త కోడలికి మీ వాళ్ళెం యిస్తారుట చెప్పారా? ఏమండీ, నాకు ఓ రవ్వల వుంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి. తెల్లడైమెండ్ మధ్యన యిటు అటు కెంపులతో ఓ ఉంగరం చూశా. అప్పటినించి అదేలాగైనా చేయించుకోవాలని ముచ్చటగా వుంది. అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్ళకి " గోముగా అంది.
రవీంద్ర తెల్లపోయి చూశాడు. "నీకు ఉంగరం మా వాళ్ళెందుకు కొంటారు. మధ్యన వాళ్ళు ఎందుకు యిస్తారు? పెట్టె నగలు ఏవో పెళ్ళిలో పెడతారంతే."
"ఏం, పండగ కి కొత్త కోడలు వస్తుంటే ఏదో బహుమతి యివ్వద్డా?' 'ఆ ఏదో వాళ్ళిష్టం వచ్చింది యిచ్చేస్తారేమో, నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా మీకు చెబుతున్నాను. మీరు వాళ్ళకి ఫోను చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని."
రవీంద్ర యింకా తెల్లపోతూ "కోడలకి ఎవరూ బహుమతిలివ్వరూ. యింటి కెడితే వాళ్ళకి తోచింది యివ్వచ్చు, లేకపోవచ్చు . పెట్టినా ఓ కొత్త చీరయిస్తారేమో యిలా రవ్వల ఉంగరం చేయించరు. పండుగలకి అల్లుళ్ళకి, కూతుళ్ళకి పెడతారు గాని కోడలికెవరూ యివ్వరు" మొహం ఎర్రపరుచుకుని అన్నాడు.
"ఏం పాపం, కానుకలు పుచ్చుకోడానికి అల్లుడికేనా ఏమిటి హక్కు? మీరు మా ఇంటికి కొత్త అల్లుడై'నట్లు , నేనా యింటికి కొత్త కోడలిని, నాకు ఏదన్నా బహుమతి తీసుకోవాలని వుండకూడదా'
రవీంద్రకి ఏదో అర్ధమైనట్లనిపించి 'అంటే ఓహో - అదా నీ ఉద్దేశం. మీ వాళ్ళని పండుగకి టి.వి. అడిగానని నా మీదక్ దెబ్బ కొట్టాలనుకుంటున్నావా! అసలు చూస్తున్నాను అప్పటి నించి నీ ఏడుపు. అల్లుడుకివ్వడం ఆచారం గాని, కోడలి కొచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో. చాలా తెలివిగా మాట్లాడుతున్నాని అనుకోకు'
'అచారాలకే ముంది మన యిష్ట ప్రకారం మార్చుకోవచ్చు. యిది వరకంటే ఆడపిల్లలకి అస్తులిచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటి కొచ్చినప్పుడు పండుగుల పేరుతొ అచ్చట్లు, ముచ్చట్లు చేసేవారు. కొడుకులు, కోడళ్ళు అంతా అక్కడే కల్సి వుండేవారు. ఆస్తులు పంచుకునేది కొడుకులు కనక బయట నించి వచ్చే కూతుళ్ళకి, అల్లుళ్ళకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవారు. యిప్పుడు కొడుకులు, కోడళ్ళు కూడా కూతుర్లు అల్లుళ్ళ మాదిరే అపుడపుడు వచ్చి పోయేవారే, కూతుళ్ళకి ఆస్తులు యిస్తున్నారు కనుక పెట్టుపోతల విషయంలో కోడలికి , కూతురికి ఎందుకు తేడాలు చూపాలి? పండుగలకి అల్లుడికి కూతురికిచ్చినట్టే కొడుకు కోడలికి యివ్వాలంటాను' నందిని వాదించింది.
"చాలా గొప్ప లాపాయింటు తీశావు. తెలివైనదానివిలే. అట్టే పిచ్చి మాటలు మాట్లాడకు. వాళ్ళంతట వాళ్లిస్తే ఏదో తీసుకోడం వేరు. యిలా కోడలికి ఫలానాది కావాలని అడగడం ఎక్కడా లేదు. ఎవరన్నా వింటే నవ్విపోతారు ' కటువుగా అన్నాడు రవీంద్ర.
'నవ్వనీండి , ఐడోంట్ కేర్ - మీ అల్లుళ్ళు, అత్తగారిని డిమాండ్ చేయడం సబబు అయితే మా కోడళ్ళూ అత్తవారి నించి బహుమతులు ఆశిస్తే తప్పేలా అవుతుంది?
రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది. ఏం చెయ్యాలో, ఏం అనాలో అర్ధం కాక పళ్ళు కొరికాడు. 'ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి?" మా యింటికి రానంటావా?' పళ్ళు బిగించి అడిగాడు.
"రానన్నానా - నాకు ఓ ఉంగరం కావాలని చెప్పమన్నాను అంతే' నిర్లక్ష్యంగా అంది.
'అడగడానికి నీకు సిగ్గు లేదేమో, చెప్పడానికి నాకు సిగ్గు ఇలా అంటే నా మొహాన ఉమ్మేస్తారు . నా భార్య యిలా అందంటే నాకే చిన్నతనం."
'అంత చిన్నతనం అయితే వద్దులెండి, మీరెళ్ళిరండి మీ యింటికి."
'అంటే బహుమతి యిస్తేగాని రావా అత్తవారింటికీ. తమరు వచ్చినప్పుడల్లా ఏదో యివ్వాలా మావాళ్ళూ?"
'అస్తమానం కాకపోయినా పండుగలప్పుడు అల్లుళ్ళతో సమంగా కోడళ్ళకీ యివ్వాలంటాను" రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు.
'రాకు....నీవసలు మా ఇంటికి రావక్కరలేదు" అని వెళ్ళిపోయాడు కోపంగా. నందిని నవ్వుకుంది.
అన్నాడే కాని మీ ఆవిడ రాలేదేం అంటే ఏం చెప్పాలి. పెళ్ళయ్యాక అసలు మళ్ళీ వెళ్ళలేదు. యిప్పడు అక్క, అన్న వస్తున్నా తనేల్లి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం? అసలు కారణం చెపితే తననే తిడతారు. అలోచించి అలోచించి ఫోను చేసి తానొక్కడే వస్తున్నట్లు నందినికి కాస్త ఆరోగ్యం సరిగా లేనట్లు చెప్పాడు. 'యింకా నాలుగు రోజులుందిగా , అప్పటికి జ్వరం తగ్గుతుందిలే, మామూలు జ్వరమేగా , అక్కయ్య నీ పెళ్ళికి కూడా రాలేదు. నందినిని చూడాలని మరీ మరీ అనుకుంటుంది. తప్పకుండా యిద్దరూ రండి' అన్నాడు తండ్రి.
యింకేం చెయ్యాలి. ఈ మొండిది పంతం మానేట్టులేదు. పరువు నిలవాలంటే యిప్పుడు సరేననేసి తీసుకెళ్ళాలి. లేకపోతె అక్కడ అందరితో సర్దిచెప్పలేక చావాలి అనుకున్నాడు. ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరు నీ పంతం నెగ్గించుకున్నావులే అమ్మతో చెప్పాను. నీ కోడలికి డైమెండ్ రింగ్ యిస్తే కాని రాదుటమ్మా' అని హాస్యంగా అన్నాను. అమ్మ పాపం దానికేంరా ఉంగరానికేగా ఏ భాగ్యం అంది. నీ కోరిక తీరుతుందిగా యింక బయలుదేరు" అని అబద్దం చెప్పేశాడు.
***
