12
జయకృష్ణ చేయి ఆశరా ఇవ్వగా ఆ చేతిని అందుకున్నదామె. తాను చూసిన దృశ్యాలు తాలుకూ నీడలు ఇంకా మనోపటలం మీద కదులాడు తున్నట్లే ఉన్నాయి.
ముఖం ఇంకా ఉజ్వలంగానే ఉన్నది. ఆ దృశ్యాలు చూసినప్పటి విభ్రాంతి ఇంకా కనులలో కన్పిస్తూనే ఉంది. ఆ ప్రభావం నించి తానింకా పూర్తిగా బయటపడకుండానే పైకి ఎక్కి వచ్చిందామే.
చెంచు లచ్చిమి కనిపించని మరో లోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన ఆత్మీయులను కౌగలించుకున్నట్లుగా జ్యోతికి కౌగలించుకుంది.
"అక్కా! ఇంతసేపూ సమాధి గుడి లోపలి సమాధిలో పడుకుని ఏమి చేశావు? ముఖం అలా తంగేడు పూవులా ఎర్రనాయిందేమిటి? నీకేమి జరగలేదు కదా!" అని అడిగింది. జ్యోతిని ఆపాదమస్తకమూ పరిశీలనగా చూసింది.
ఏమీ లేదన్నట్లుగా జ్యోతీ చిరునవ్వు నవ్వింది. "సోదరీ ! నాకేదయినా ప్రమాదం జరిగినా నీవు బాదపడవలసినది ఏమున్నది? నేను నీకు ఏమవుతానని?" అన్నదామె.
ఆ మాటకు చెంచు లచ్చిమి కన్నీరు పెట్టుకుంది. తలలో తురుము కున్న కపిలవర్ణం, కృష్ణ వర్ణం కలిసిన గోరువంక ఈకలు కదులాడేలాగా తల అడ్డంగా త్రిప్పింది.
'అక్కా! అలా అనకు. సోదరీ అని పిలిచావు. సాహోదరివే అనుకున్నాను. ఆ తొలినాడు నిన్ను చూచిన రాత్రి నావల్లనే నీవు బందీని అయినావు. బాధపడ్డావు. అందుకు మాటలతో క్షమాపణ చెప్పుతుంటే చాలుతుందా? అక్కా! ఎప్పుడయినా స్త్రీ లోకానికి ఆదర్శ మూర్తివయిన నిన్ను నేను ప్రేమిస్తాను, నీకోసం ప్రాణాలయినా యిస్తాను.
"ఇంకా నేను నీకేమవుతానని అడగటంలో అర్ధం లేదక్కా! బంధుత్వాలు కొలవలేని మైత్రి మనమధ్య ఉండకూడదా?" అని అడిగింది లచ్చిమి. జ్యోతి నేత్రాలు సజలమయినాయి. స్వచ్చమయిన మనసు అమెది. నిర్మలమయిన ఆలోచనలు. అన్ని అంతరాలను అధిగమించి, అవాంతరాలకు అందక నిలిచే సౌజన్య పూరితమయిన స్నేహమూర్తి ఆమె.
ఉన్నతమయిన మానవత తాలుకూ స్పందనలు కలిగిన స్త్రీ మూర్తి లచ్చిమి అని గ్రహించింది జ్యోతి. సంస్కారమనేది ధనం, విద్య, పుట్టుక వీటన్నిటికీ అతీతమయినది అనిపించింది.
ఆదిమ జనులు రాళ్ళన్నింటినీ ఒక గుట్టగా పోశారు. రాతి శకలాలు జ్యోతి కాళ్ళకు గాయం చెయ్యకుండా ఆ పరిసరాలను శుభ్రంగా ఊడ్చేశారు.
సమాధి గుడి పై కప్పుగా ఉన్న రాతి పలకను పగులగొట్టడంలో వారంతా అధికమయిన శ్రమ చేసి ఉండటం నించి స్వేదం ధారలుగా కారుతోంది. నల్లని శరీరాలు స్వేదంతో తడియటం నించి పశ్చిమానికి వాలుతున్న సూర్యకిరణాలు సోకి నిగనిగ లాడుతున్నాయి.
ఆ పరిసరాలన్నీ చిన్న చిన్న పొదలతో, పెద్ద పెద్ద వృక్షాలతో చాలా సంకీర్ణంగా కన్పిస్తున్నాయి.
అటువంటి చోట ఆహార సంపాదన సులభం. తేనే పట్టులు దొరుకుతాయి. కుందేళ్ళు దొరుకుతాయి. కుణుజుపిట్టలయినా పడకొట్టవచ్చు. ఊచబియ్యం దొరుకుతాయి. బొద్దాకు కావలసినంత పొడవున అల్లుకు పోయిన తీగలకు బ=వ్రేలాడుతోంది.
అడవిలో అన్న పానాలకు కొదువ ఏముంది?!
లచ్చిమి వెంట రాగ వారంతా కడుపు నింపుకుందుకు బయలుదేరారు.
జ్యోతి ప్రధమంలో రాను పరుండిన చెట్టు నీడకు తిరిగి వచ్చింది. జయకృష్ణ ఆమెను అనుసరించాడు. అంతకు కొద్ది సేపటి క్రితమే ఆమె చాలా విహ్వలంగా కన్పించింది.
రాకాసిగుడి పరిధి చాలా పరిమితమయినదే అయినా లోపల కన్పించలేదు. కంఠం చిరిగిపోయేలా ఎలుగెత్తి పిలిచినా పలుకలేదు. రాతిపలక పగిలిపోయాక లోపలకు చూస్తె ఆమె సమాధిలో పడుకుని వుంది. క్రేనియంకు తల ఆన్చుకుని ఏదో వింటున్న దానిలా అన్పించింది.
అలా చేయటం ఆమె కెందుకు భయమనిపించలేదో, అసలామే మన్హస్థితి ఏమిటో గ్రహించాలని ప్రయత్నం ప్రారంభించాడు జయకృష్ణ. ముందుగా ఆమెకు రిలీఫ్ ఇవ్వాలి.
చుట్టూ పక్కల ఎండిన చిదుకులు ఏరి తెచ్చి నిప్పు రగిలించాడు. టీ కేటిల్ నిప్పుల మీద పెట్టి కాక్ లో నీరు దానిలోకి నింపాడు. ఇంత పాలపొడి , టీ ఆకు చూర్ణమూ దానికి కలిపి బాగా మరగించాడు. అయిదు నిమిషాలకు లోపుగానే టీ తయారయిపోయింది.
అంతసేపూ చెట్టూ మొదలుకు అనుకుని చేరగిలబడి కూర్చుని కళ్ళు మూసుకుంది జ్యోతి. నుదురు మీద చేయి అన్చుకుని ఆలోచనా ముద్రలో అలాగే వుండిపోయింది.
ఆమె పరధ్యాసలో మరొక లోకంలో వున్న మనిషిలా అన్పించింది. ముందా పరధ్యాస వదిలిస్తే కాని-- ఆమె నించి సమాచారం రాబట్టేందుకు వీలు కాదని భావించాడు జయకృష్ణ.
"నీ వెంట రావటంతో నాకు వంట చెయ్యటం కూడా వచ్చింది" అన్నాడు.
ఆ మాటకు కళ్ళు విప్పి చూసింది జ్యోతి. ముఖం కలతపడినట్లుగా అయిపొయింది. లేచి అతని దగ్గరగా వచ్చిందామే.
"జయకృష్ణా! నీకు శ్రమ యిస్తున్నందుకు నన్ను మన్నించు ప్రొఫెసర్ శ్రద్దాదేవి నీ గురించి చెప్పినప్పుడే చాలా తెలుసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను. ఇటువంటి పనులు నీవెందుకు చేయాలి?" అంటూ కేటిల్ లోని టీ కప్పులోకి ఒంపి అతనికి అందించిందామె.
"నీవు చాలా పరధ్యానంగా కన్పిస్తున్నావు. ఆలోచనల్లో పడితే ఆకలి గురించి కూడా మర్చిపోతావనుకుంటాను" అన్నాడతడు టీ కప్పు అందుకుని.
జ్యోతి అదొకలా నవ్వింది.
"మరుపు అనేది అపారమయిన జ్ఞాన సంపద కలిగిన శ్రద్దాదేవి లాంటి వారికి ఒక వరంలా ఆవుతుందేమో కాని మనలాంటి వారికి అదొక శాస్త్రమే! కృష్ణా! మనసుని స్వాధీనంలో వుంచుకోవాలని నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాను. కాని రానురాను అది అసాధ్యమవుతోంది ." అన్నదామె దిగులుగా.
జయకృష్ణ కొంటెగా చూచాడు.
"నాలాంటి హీరోలు ఎదురుగా వున్నప్పుడు ఆడపిల్లలకు మనసు స్వాధీనంలో వుండదు. అది సహజమే!" అన్నాడు పెదవుల మాటున నవ్వు వెలుగుని దాచుకుంటూ.
జ్యోతి చివ్వున తలఎత్తి అతని వంక చూచింది. అతని ముఖంలో పవిత్రత, విశ్వాసపాత్రత కన్పించాయి. బలహీనమయిన ఉద్విగ్నితలకు లొంగిపోయినాడని అనిపించలేదు.
ఆమెకు కూడా నవ్వు వచ్చింది. అతడెందుకో కావాలని కల్పించుకుని ఆ మాట అన్నాడని గ్రహించిందామె.
ఈ ఆలోచన వచ్చాక పెదవులపై చిరునవ్వే కాకా కళ్ళలోకి వెలుగు కూడా వచ్చింది. " కోతలు కొయ్యకు" నీకు ఉద్యోగం వుంటే వుండవచ్చు. నీవు హీరోవి అయితే కావచ్చు. నీకు నొక్కుల జుట్టు , అందమయిన కళ్ళూ, చిక్కని చెక్కిళ్ళూ , ఆరడుగుల పర్సనాలిటీ వుంటే వుండవచ్చు. అంతమాత్రం చేత నిన్ను చూడగానే ఆడపిల్లలు అందరూ మనసు పారేసుకుంటా రనుకోవటం నీ భ్రమ.
