కొత్తగా వచ్చిన ఆఫీసర్ కి రేషన్ కార్డ్ ఇప్పించడం - లేదా మార్పించడం, అది వచ్చేలోగా కంట్రోల్ ధరకి పాస్ లు తెప్పించడం వంటివి చేసేవాడు. ఇంట్లో పురుళ్లూ, పుణ్యాలూ, పెళ్ళిళ్లూ, తద్దినాలూ వంటివి వస్తే సర్వమూ తానేయై మెలిగేవాడు. ఎవరికైనా యూరిన్ టెస్ట్ చేయివలసి వస్తే ఆ సీసాని కూడా శ్రీరాముని పాదుకలులాగా తానే మోసుకువెళ్లేవాడు. లాండ్రీకి బట్టలు తీసుకువెళ్లడం, తీసుకురావడం సరేసరి!
ఇలా ఇదీ అనకుండా, ఉచ్చ - నీచ వివక్షత లేకుండా సర్వకార్యాలూ ఏకధాటిగా అత్యంత సమర్దవంతంగా నిర్వర్తిస్తూ... అందరు ఆఫీసర్ ల గుండెల్లోనూ గూడుకట్టుకుని పదిలమైన, పటిష్టమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే... ఈ ఘనకార్యాలూ, 'జఘన' కార్యాలూ సాధించడానికి అతను ఎన్నో అబద్దాలు ఆఢవలసి వచ్చేది. ఎన్నెన్నో కట్టుకథలు చెప్పవలసివచ్చేది. తాను ఎలా, ఎటువంటి అబద్దాలను ఆడి, ఆ ఘనకార్యాలను సాధించిందీ సాటి ఉద్యోగుల ముందు అభినయ పూర్వకంగా, సగర్వంగా చెప్తుండేవాడు. చివరికి పరిస్థితి ఎంతగా ముదిరిందంటే.... రాళ్లలో బియ్యం ఏరినట్లు - రజాక్ చెప్పే మాటల్లో నిజాలు ఏవో, అబద్దాలు ఏవో వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది.
అతని ఘనకార్యాలను విన్న ఒక వక్రకవి ఒకసారి" నువ్వు అబ్దుల్ రజాక్ వి కావు. అబద్దాల రజాక్ వి!" అని నిందాస్తుతి చేశాడు. అంతే... అప్పటినుంచటీ 'అబద్దాల రజాక్' అన్నపేరు స్థిరపడిపోయింది. అందరూ బాహాటంగా అతన్ని అలాగే పిలవసాగారు. అందుకు అతనికి కోపం వచ్చేది కాదుకదా... దానిని కాంప్లిమెంట్ గా తీసుకుని, మురిసిపోయేవాడు.
తాను అనుకున్న విధంగా రజాక్ ను మలచగలిగినందుకు మనసులోనే మురిసిపోయాడు భద్రంగారు.
ఒకరోజున ఆయన రజాక్ ని పిలిచి, "హైదరాబాద్ నుంచి రేపు 9:30 కి ఛైర్మన్ గారు వస్తున్నారు ఇన్స్ పెక్షన్ కి. మనందరం అరగంటముందే స్టేషన్ లో వుండాలి. స్టాఫ్ కారు వుండికాబట్టి నువ్వు ఆ విషయం చూడనక్కరలేదు." అన్నారు.
"అలాగే సార్.. .నేనుంటాగా - మీరు కొంచెం ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేదు" అన్నాడు రజాక్ తన సహజధోరణిలో.
"అదికాదయ్యా ప్రాబ్లం...! ఆయన్ని మనవాళ్ళెవరూ చూడలేదు. ఫస్టుక్లాసులో వస్తున్నాడని తెలుసు కాని, కోచ్ నంబర్ తెలీదు. ఆయన్ని గుర్తుపట్టడం ఎలాగో అర్దంకావడం లేదు" అన్నారు భద్రంగారు.
"దీనికంత వర్రీ అవడం ఎందుకు సార్? ఆయన పంజాబ్ వాడు. పేరు కపూర్. పంజాబీ వాళ్లు సహజంగా ఒడ్డూ,పొడుగ్గా ఆరడుగులు వుంటారు. పేరులో సింగ్ లేదు కాబట్టి సిక్కుల గడ్డం, తలపాగా వుండవు. కంపార్ట్ మెంట్ల నుంచి దిగుతున్న భారీ విగ్రహాల మీద ఓ కన్నేసి వుంచితే తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. పైగా... రిజర్వ్ డ్ ఛార్ట్ లో ఆయన పేరు, బెర్త్ నంబరూ వుంటాయి కూడాను!" అన్నాడు రజాక్.
"రజాక్... నీది డిటెక్టివ్ బుర్రయ్యా - కర్మకాలి ఇక్కడ గుమాస్తా అయ్యావుకాని! అదికాదు ప్రాబ్లం.... మనం ప్రయాణీకుల లిస్టు చూసుకుంటూ నంబర్ వెతుక్కునే లోపల ఆయన దిగిపోతేనూ! అదే నా దిగులు" అన్నాడు భద్రంగారు.
"చెప్పాను కదా సార్.... భారీ పర్సనాలిటీలను చూసుకుంటే సరిపోతుందని! అయినా.... నేనున్నాను కదాసార్ - నాకు వదిలేయండి" అన్నాడు రజాక్ భరోసాతో.
మర్నాడు అందరూ స్టేషన్ కి వెళ్లారు.
ఫస్టుక్లాస్ బోగీలు రెండు వున్నాయి. రైలు ఆగీ ఆగగానే రజాక్, భద్రంగారు చెరో ఫస్ట్ క్లాస్ బోగీ దగ్గరికి వెళ్లి ఛైర్మన్ గారి పేరు వెతకసాగారు. వెతుకుతూనే ఓ కన్ను దిగుతున్న భారీకాయాల మీద వేసివుంచారు. పేరు కంటపడడం కష్టం అయింది. ఎందుకంటే... అక్షరాలన్నీ బాగా చెరిగిపోయాయి.
ఎలాగైతేనేం... పేరు పట్టుకునేసరికి ప్రయాణీకులందరూ దిగి వెళ్లిపోసాగారు. భారీవిగ్రహాలను నిశితంగా పరికిస్తూ, మధ్యమధ్య గడ్డంలేని శాల్తీలను "ఎక్స్ క్యూజ్ మీ.... ఆర్ యూ మిస్టర్ కపూర్?" అని పలకరిస్తూ... , వాళ్లు కాదని చెప్పేసరికి ఆందోళన పడసాగారు - భద్రంగారు, రజాక్.
ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులు అందరూ దిగి వెళ్లిపోయారు.
చివరికి పిట్టలాంటి ఒక పొట్టి, పొట్ట మనిషి పంజరంలోంచి బయటకు వస్తున్నట్లుగా డోర్ లోంచి దిగసాగాడు, సామాను ఈడుస్తూ.
ఎందుకైనా మంచిదని రజాక్ ఆయన దగ్గరికి వెళ్లి - "ఎక్స్ క్యూజ్ మీ సార్... ఆర్ యూ...." అంటూ అడగబోయాడు.
"యస్! ఐయామ్ మిస్టర్ కపూర్!" అంది ఆ శాల్తీ - ఎలక మీసాలవంటి మీసాల పరకల క్రింద నుంచి నవ్వుతూ.
'ఈయన కపూరా! ఈయనకి ఓపిక పూరా!' అనిపించింది రజాక్ కి.
"సార్....!" అని గట్టిగా అరిచాడు రజాక్.
ఆందోళనగా వెతుకుతున్న భద్రంగారు వెనక్కి పరుగెత్తుకు వచ్చారు.
"సార్.. వీరే ఛైర్మన్ గారు!" అని చెప్పి, "సార్...... వీరు మిస్టర్ భద్రం - ఆఫీస్ సూపరింటెండెంట్. ఐయామ్ అబ్దుల్ రజాక్!" అని స్వ, పర పరిచయం చేశాడు రజాక్.
"ఐ థాట్ కుట్ ఇట్ బి సర్?!" అన్నారు భద్రంగారు, రజాక్ ఒకేసారి.
వారిద్దరూ ఛైర్మన్ గారిని తీసుకుని బయటకు వచ్చారు.
ఆఫీసర్ ని రిసీవ్ చేసుకోగానే మెళ్ళో దండ వేయడం రివాజు. కపూర్ గారికి మెళ్ళో దండ వేయలేదన్న విషయం భద్రంగారికి గుర్తుకు వచ్చింది. దానిని తెమ్మని ఆఫీసులో సోమయ్యకి చెప్పాడు. వెనకాలే వస్తున్న సోమయ్యని "దండ ఏదీ?" అని అడిగారు.
"నేను రామయ్యకి చెప్పాను సార్!" అంటూ, "రామయ్యా... దండ ఏదీ?" అని అడిగాడు సోమయ్య. వాళ్ళూ స్టేషన్ కి వచ్చారు.
"ఆ.... తెచ్చాను. అరే... ఆఫీసులో మరిచిపోయాను" అని నాలుక కరచుకొని కంగారుగా ముఖం పెట్టాడు రామయ్య.
భద్రంగారి గుండెల్లో పిడుగు పడింది.
"రజాక్ ...ఇప్పుడెలా? ఏం చేయడం...?" అన్నాడు దిగులుగా.
కపూర్ గారికి తెలుగు రాదు కనుక, వారు ధైర్యంగా తెలుగులోనే దిగులు పడ్తున్నారు.
రజాక్ ఏమీ మాట్లాడకుండా ఒకసారి స్టేషన్ బయటకి చూశాడు. కొంచెం దూరంలో పది పన్నెండు కార్లు పార్క్ చేసి వున్నాయి. వాటిలో ఒకటి సరికొత్త కారు. ఆరోజే నగరవీధిలో 'ఆరంగేట్రం' చేయించారు కాబోలు... దానిముందు హుక్ కి ఒక దండ వ్రేలాడుతూ వుంది.
