Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 39

     నృసింహస్వామి దేవాలయం పూజారికి మాత్రం ఇది కంటగింపుగా ఉంటోంది. మొదటి నుండి ఆయనకి వెంగమాంబ చేష్టలు నచ్చలేదు. చిన్నారి వెంగమాంబ నృత్యం చేసిన సందర్భంలో జరిగిన పరాభవం అయిష్టాన్ని, కోపాన్ని పెంచింది. పుష్పగిరి పీఠాధిపతులు, మహారాజుగారు వెంగమాంబని గౌరవించటం వల్ల, తనకి లోలోపల ఉన్న భయంవల్ల ఏమీ అనలేడు. పోనీ అని సహించలేడు. కక్కలేక, మింగలేక ఉన్న స్థితి. ఇప్పుడు అసహనం మరీ పెరిగిపోయింది. విధవరాలు సుమంగళిలాగా గుడిలో పూజలలో పాల్గొనటం సంప్రదాయ విరుద్ధమని వళ్ళు మండిపోతూ ఉండేది. పైగా నాలుగు మాటలు పుక్కిటి పురాణంగా నేర్చిన ఒక ఆడది వేదాలు చదివిన తనని నిర్లక్ష్యం చేస్తోందనే అహంభావం నుండి జనించిన ఆత్మన్యూనతా భావం మనసుని తొలిచేయటం మొదలుపెట్టి అందుకే గుడికి వచ్చిన భక్తులతో, ముఖ్యంగా కొత్తవారితో వెంకమాంబని గురించి పిచ్చిది, వేర్రిది, ఉన్మాది అంటూ చెప్పేవాడు.
    ఆ రోజు ఆంజనేయస్వామి విగ్రహం ఎదుట కూర్చుని ధ్యానంలో మునిగిన వెంగమాంబ సమాధి స్థితికి చేరుకుంది. బాహ్యస్పృహ లేదు. కాలం ఆగిపోయింది. శరీర ధర్మాలు స్థంబించాయి. గుడి మూసే వేళ అయింది. పూజారి యథాప్రకారం గర్భగుడి తలుపులు, మంటపం తలూపుతూ అన్నీ క్రమంగా వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. గుడి కట్టేసిన కొద్దిసేపటికి ఇంటికి చేరుకునే వెంగమాంబ ఇంటికి రాకపోవటంతో తల్లితండ్రులు కంగారుపడ్డారు. ఎవరినీ అడగకుండానే ఊరంతా వెదికాడు కృష్ణయార్యుడు. గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ తిరిగి చూశాడు. గుడి ఆవరణ అంతా వెదికాడు. గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ తిరిగి చూశాడు. గుడి ఆవరణ అంతా వెదికాడు. చెట్టు పుట్టలూ తోటా కొలనూ వెదికాడు. ఆవేదనతో ఆ రాత్రి గడిచింది.
    తెల్లవారిన తర్వాత మళ్ళీ అదే ప్రకారం గుడినీ, ఊరినీ రెండుమూడు మార్లు గాలించాడు. గుడిలోపలికి కూడా వచ్చాడు. గర్భాలయంలో కూడా చూశాడు. చెప్పకపోయినా అందరికీ అర్థం అయ్యింది. అందరికన్నా ముఖ్యంగా పూజారికి. ఎందుకంటే, వెంగమాంబ మీద ఆయనకి వైరభక్తికదా! కనపడలేదన్న మాటకన్నా ఊహాగానాలు కార్చిచ్చులాగా వ్యాపించాయి.
    "వెంగమాంబ ఎవరితోనో లేచిపోయిందట!
    "ఎవరో తలకుమాసిన వాడితోట!"
    "పాపం! ఏంచేస్తుంది? వయసటువంటిది"
    "పైగా వాంఛలు తీరకే కదా జుట్టు బొట్టు తియ్యనంది!"
    బిడ్డ కనపడటం లేదన్న బాధతో పాటు వదంతుల సెగకి తల్లితండ్రులు కమిలి, కుమిలి పోయారు. సమాధిలో ఉన్న వెంగమాంబకి, వేదనలో ఉన్న తల్లితండ్రులకి మూడు అహోరాత్రాలు అన్నపానాలు లేవు.
    నాంచారమ్మ తప్ప ఓదార్పుగా ఒక్కమాట పలికినవారు లేరు. దెప్పి పొడవని వాళ్ళు మంచివాళ్ళు. నాలుగోరోజు ఉదయం నాంచారమ్మ బలవంతంచేసి ఇద్దరిచేత కాస్త మజ్జిగ అన్నం తినిపించింది. బంగారు తల్లి ఎక్కడికీ వెళ్ళదు, ఇక్కడే ఉండి ఉంటుందనీ, అభోజనం ఉండటం అశుభం అనీ, చల్లని వార్త వినాలంటే కడుపు చల్లబడాలని, కడుపునిండగానే కమ్మని మాట వింటారని రకరకాలుగా చెప్పి ఒప్పించింది. పెద్దలమాట చద్దిమూట. వృథాకాదు.
    గుడి మొత్తం శుభ్రంచేసి వారం రోజులైంది. మూలలంతా బూజు తీసి కడగాలని ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నవైపు వెళ్ళిన పూజారికి అక్కడ ధ్యానముద్రలో ఉన్న వెంగమాంబ కనిపించింది. ఇంత మారుమూల కూర్చుని ఏం చేస్తోంది? అని అనుమానం కలిగింది.
    "ఎవరి కంటా పడకుండా చేస్తోంది అంటే తప్పక చెడుపని అయి ఉంటుంది. తప్పక అది వయసుకి సంబందించిందే అయి ఉండాలి. పారిపోయికాక గుడిలో దాక్కుని అక్రమ వ్యవహారాలూ సాగిస్తోందన్నమాట. ఇది బయటపెట్టి గుట్టురట్టు చేస్తే వెంగమాంబ పీడ ఇంక ఉండదు. గుడికి తనే మకుటంలేని మహారాజు". పూజారి ఆలోచనలీ ధోరణిలో సాగాయి. "ఆత్మవత్ సర్వభూతాని కదా!"
    తక్షణం ఆలోచన అమలుచేశాడు. లెమ్మని గట్టిగా గద్దించాడు. సమాధిస్థితిలో ఉన్న వెంగమాంబలో చలనం లేదు. తప్పించుకోటానికి నటిస్తోంది అనుకున్నాడు. తనమాట లెక్కచేయటం లేదని కోపంతో రెచ్చిపోయాడు. తానేం చేస్తున్నాడో అనే స్పృహ లేకుండా, విచక్షణా జ్ఞానం లేనివాడై పద్మాసనంలో సమాధినిష్ఠయై ఉన్న వెంగమాంబ జుట్టు రెండు పిడికిళ్లలో బిగించి మూటని లాగినట్టు లాక్కురావడం మొదలుపెట్టాడు. పద్మాసనంలో కదలకుండా ఉన్న వెంగమాంబని ఈడ్చుకుని వస్తుంటే శిల్పాన్ని లాక్కు వస్తున్నట్టుంది. అందరూ చూడటానికి ఆవరణలోకి లాక్కునివచ్చే సమయానికి జుట్టు లాగటంవల్ల నెప్పి కలిగి, సమాధిభంగం అయి కళ్ళు తెరిచి చూచింది. సమాధి భంగం కలిగిందన్న కోపంతో ఉన్న కంటిచూపు తనమీద పడగానే అర్చకుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఆ కళ్ళు ప్రళయకాలపు అగ్నిగోళాలు లాగా, చూపులు అగ్ని జ్వాలలులాగా, ఆమె ముఖం అగ్ని జ్వాలలు అనే జూలుతో పరివేష్టించబడిన సింహం ముఖంలాగా కనిపించి, భయంతో వణికిపోయి నిలుచున్నవాడు నిలుచున్నట్టే నేలమీద కూలిపోయి స్పృహ కోల్పోయాడు.
    సమాధి భంగం అయినా, ఇంకా పూర్తిగా బాహ్య స్పృహ లేని వెంగమాంబ మరబొమ్మ లాగా, మంత్రముగ్ధలాగా, స్వప్నావిష్టురాలిలాగా పుష్కరిణి వైపు నడక సాగించింది. పూజారి ఈడ్చినపుడు జుట్టు ముడివీడి పొడవైన ఆమె కేశపాశం రెండుపాయలుగా రెండు భుజాలపైనుండి వేలాడుతుంటే ఇడ పింగళల నడుమ తటిల్లేఖలాగా తళుక్కుమనే సుషుమ్నలాగా అనిపించింది. కదులుతున్న కుండలిని లాగా, ఆదిశక్తి అపరావతారంలాగా కనిపించింది సాధకులకు, వేత్తలకు. ఏమీ ఎరుగని పామరులకు సైతం తాము పూజించే దేవతామూర్తిలాగా తోచింది. ఎప్పుడూ చూచే వారికి కూడా ఈనాటి వెంగమాంబ దివ్య తేజోవలయితరూపం ఆశ్చర్యం కలిగించింది.
    ఆఘమేఘాలమీద, అంచెలంచెలుగా వెంగమాంబ తిరిగి వచ్చిందన్న వార్త గ్రామమంతా పాకిపోయింది ఆమె పుష్కరిణికి చేరటానికన్నా ముందే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడినుండి వచ్చి ఉంటుంది? ఈ మూడు రోజులు అన్న పానీయాలు, కాలకృత్యాలు ఎలా జరిగాయి? జరిగాయా? లేవా? అనే సందేహాలకి ఎవరికి తోచిన సమాధానాలు వారే చెప్పుకుని సంతృప్తి పడిపోతున్నారు.
    వెంగమాంబ పుష్కరిణిలో రెండు మునకలు వేసిందో లేదో కొంతమంది భక్తులు, బ్రాహ్మణులు పరుగు పరుగునవచ్చి,
    "తల్లీ! వెంగమాంబా ! రక్షించు!"
    "అపరాధం క్షమించు తల్లీ!"
    "అమ్మా! పూజారిని బ్రతికించు" అంటూ గోడుగోడున గోలపెట్టటం మొదలుపెట్టారు.
    "ఆకతాయి పూజారి నిన్ను ఏదో అనే ఉంటాడు. వాడు తుంటరి. తులువ. నీ కోపానికి ఎరఅయి, మూర్ఛపోయి ఉన్నాయి. అతడిని బ్రతికించు తల్లీ!"
    "నీ జోలికి వెళ్లవద్దని చెపుతూనే ఉన్నాం. ఏం చేశాడో? చదువుకున్న మూర్ఖుడిని మన్నించి కాపాడు."
    "ఇప్పటికే బుద్ధి వచ్చి ఉంటుంది. లేకపోయినా మేము బుద్ధి చెపుతాం. పిల్లలుగలవాడు". మూడోమునకవేసి లేచి, వెంగమాంబ వారినందరినీ మాటాడవద్దని సైగచేసి కళ్ళు మూసుకుని నీళ్ళు చేతిలోకి తీసుకుని మంత్రించి, ఉత్తరంవైపుకి ఆ మంత్ర జలాన్ని చిలకరించింది. మీరు వెళ్ళండి అన్నట్టు సైగచేసింది. వారందరూ గుడివైపు నడుస్తూ ఉండగా, ఆవలిస్తూ నిద్రలేచినట్లుగా లేచి ఆశ్చర్యంతో వెంగమాంబ సంగతి అందరికీ చెపుదామని బయలుదేరిన పూజారి ఎదురయ్యాడు. పరస్పరం సంభాషణల్లో విషయం మొత్తం స్పష్టమయ్యింది.
    వెంగమాంబ గొప్ప శక్తిమంతురాలనీ, ఆమె విషయంలో మరెప్పుడూ ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని అందరూ కూడగట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చారు.
    ఆలయపూజారి, కృష్ణమాచార్యుడు వెంగమాంబని గురువుగా భావించి ఆమె నుండి ఉపదేశం పొంది శిష్యుడుగా మారిపోయాడు.
    పుష్కరిణిలో స్నానం చేస్తున్నప్పుడు, పూజారిని బతికించటానికి కనులు మూయగానే జరిగినదంతా దృగ్గోచరమైంది వెంగమాంబకి. "జుట్టు పట్టుకోటమంటే సహస్రారకమల స్థానాన్ని చెదరగొట్టినట్టు. అంటే ఇక్కడ ఇకమీదట తన సాధన, రచన రెండు, సాగవన్న సూచన కాదుకదా! అయినా తన మిత్రుడు మార్గనిర్దేశనం చేస్తాడు. మూడురోజులు ఇంటికి వెళ్లకపోతే అమ్మా నాన్నలెంత కలత చెంది ఉంటారో? ఈ మూర్ఖులింకెంత బాధ పెట్టి ఉంటారో? ముందు ఇంటికి వెళ్ళి, వాళ్ళను సేదదీర్చాలి అనుకుంది."
    తడిబట్టలతో ఇంటికి చేరిన వెంగమాంబను చూడగానే తల్లితండ్రులిద్దరికీ ఆనందం, దుఃఖం, కోపం ముప్పిరిగొన్నాయి. మందలింపులు, సముదాయింపులు, ఓదార్పులు అయినాక, మరెప్పుడూ గుడిలో అంత తీవ్రంగా ధ్యానంలో మునగనని బాస చేశాక ముగ్గురూ సద్దుకున్నారు.
    చాలాకాలం తర్వాత తన సఖుడు మెరుపులాగా దర్శనం ఇచ్చి మాయమయ్యాడు.
                                  * * *
    వెంగమాంబ రచనా వ్యాసంగం యోగసాధనతో సరిసమానంగా సాగుతూనే ఉంది. తనకి ధ్యానంలో కలిగిన అనుభవాలు, పూజచేస్తున్నప్పుడు కలుగుతున్న అనుభూతులు, జపం చేస్తున్నప్పుడు అయిన దర్శనాలు, నిత్యనైమిత్తిక క్రియలు నిర్వర్తిస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు తోచిన ఊహలు, ప్రతిస్పందనలూ, అన్నీ ఛందోబద్ధంగా అక్షర నిబద్ధమైపోతున్నాయి. ఆ భావాలు ప్రకటించటంలో సౌందర్యం, వ్యాకరణం, ఛందస్సులో దోషాలు ఉన్నాయా? అని పట్టించుకునే తీరిక, ఊహకూడా లేవు. కొన్ని లిఖిత రూపం ధరిస్తున్నాయి. కొన్నింటికా అదృష్టం పట్టలేదు. పూజకి పూలుకోస్తున్నప్పుడు, బావినుండి నీళ్ళు తోడుతున్నప్పుడు, చందనం అరగదీస్తున్నప్పుడు కలిగిన ఆనందోద్వేగం పద్యంగానో, పాటగానో నోటివెంట వస్తే విని ఆనందించే వాళ్ళేకాని గుర్తుపెట్టుకుని తాటాకుల మీద వ్రాసేవాళ్ళులేరు. అయితే, వింటున్నవాళ్ళు "రానురాను వెంగమాంబ పద్యాలలో పస పెరుగుతోంది" అంటున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS