"ధరని నిర్ణయించటం కోసం, ప్రభుత్వం మొత్తం మందులన్నింటినీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఒక మందు తాలూకు ఉత్పత్తికయిన ఖర్చు (కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్) ప్రతీ కంపెనీ డ్రగ్ ప్రైస్ కంట్రోలర్ కి పంపాలి. దాన్ని బట్టి మర్కెట్ లో ఆ మందు ఎంతకి అమ్మాలో నిర్ణయింపబడుతుంది. అయితే అసలు కీలకం అంతా అక్కడే వుంది".
"ఏమిటి?"
"కొన్ని మందులకి అడ్వర్ టైజ్ మెంట్ అక్కర్లేదు. తలనొప్పి మాత్రకి విపరీతమైన అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వాలి. అందుకని దీన్ని కాటగిరీ-3లో పెట్టింది ప్రభుత్వం".
"ఈ కేటగిరీలు ఏమిటో చెప్పలేదు మీరు".
"వస్తున్నా. ఇది చెప్పటానికి ముందు 'మార్క్ అప్' అంటే ఏమిటో చెప్పాలి. ఉత్పత్తి ఖర్చు (కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్)కి, అమ్మకం ధర (ప్రైస్)కి మధ్య తేడాని 'మార్క్ అప్' అంటారు. ఇందులోనే కంపెనీ తన లాభాలూ, అమ్మకం ఖర్చులూ, అడ్వర్ టైజ్ మెంట్ ఖర్చులూ సరిపెట్టుకోవాలి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మార్క్ అప్ నిర్ణయించింది ప్రభుత్వం. అంతకన్నా ఎక్కువ ధరకి అమ్మటానికి వీల్లేదు.
కేటగిరీ 1 : 10 శాతం
కేటగిరీ 2 : 55 శాతం
కేటగిరీ 3 : 100 శాతం
కేటగిరీ 4 : ఎంత ధరకయినా అమ్ముకోవచ్చు.
ఇదీ గవర్నమెంటు పాలసీ! ఉదాహరణకి ఒక తలనొప్పి మాత్ర తయారుచేయటానికి రూపాయి ఖర్చయిందనుకో- అది కేటగిరీ-3లోకి వస్తుంది. కాబట్టి- ఇంకో రూపాయి మార్క్ అప్ (వందశాతం) వేసుకొని రెండ్రూపాయలకి బజార్లో అమ్ముకోవచ్చు. అంతకన్నా- ఎక్కువకి అమ్మటానికి వీల్లేదు. అదే కేటగిరీ-2 తాలూకు మందు అయిందనుకో, 1-55 పైసలకన్నా ఎక్కువ అమ్మటానికి వీల్లేదు. మందుల ధరని కంట్రోల్ లో వుంచటం కోసం ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో చేసిన విధానం ఇది".
శేఖరం నవ్వేడు. "నేనేగానీ మందుల కంపెనీ పెట్టవలసివస్తే కేవలం కేటగిరీ-4 మందుల్నే ఉత్పత్తి చేస్తాను" అన్నాడు.
"కేటగిరీ-4లో లావు తగ్గటానికి, ఎత్తు పెరగటానికీ ఉపయోగపడే మాత్రలూ, టానిక్కులూ వస్తాయి. డబ్బులున్న వాళ్ళ ఫ్యాషన్స్ కోసం ఉపయోగపడేవి కాబట్టి వీటి ధర గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి మందుల కంపెనీ తన వస్తువుల్లో కనీసం కొన్నింటినయినా ఈ కేటగిరీ-4లోకి వెళ్ళేలా చూసుకుంటుంది. కేవలం కేటగిరీ-1లో మందుల్ని మాత్రమే తయారుచేసే కంపెనీలన్నీ దేశంలో దాదాపు మూతబడిపోవటమో, డైవర్సిఫై కావటమో జరిగింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇప్పుడు చెపుతున్నాను విను శేఖరం. కొన్ని సంవత్సరాల క్రితం అతి రహస్యంగా జరిగిపోయిందిది. కొన్ని లక్షల రూపాయలు నీళ్ళలా వెదజల్లబడ్డాయి. ఇందులో హెల్తు మినిస్ట్రీ, బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్, కాస్ట్ అండ్ ప్రైస్ (ఐ.బి.సి.పి.), డ్రగ్ కంట్రోలరు ఆఫీసువాళ్ళూ మిళితమయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ వాళ్ళ చేతులు తడి ఆరని విధంగా తడపబడ్డాయి. మూడో కంటికి తెలియకుండా కేన్స్- క్యూర్ మందు కేటగిరీ-4లో పెట్టబడింది".
యధాలాపంగా వింటూన్న శేఖరం ఆ చివరి మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి, "ఏమిటీ?" అని అరిచాడు. ఆ షాక్ కి అతడి గొంతు కీచుమంది. "అవును శేఖరం అత్యంత మేధావులు దాని రిపోర్టు తయారుచేసేరు. కేన్సర్ కేవలం డబ్బున్న వాళ్ళకి వచ్చే రోగం అని అందులో వాదించబడింది. కాన్స్- క్యూర్ కేవలం బాధని ఉపశమించేలా మందు మాత్రమే అని, అది వ్యాధి నిరోధక మందు కాదనీ రిపోర్టులో వ్రాయబడింది. ఒక 'లగ్జరీ' మందుగా దాన్ని కేటగిరీ-4లో పెట్టారు. ఆ తరువాత దాన్ని గురించే అందరూ మర్చిపోయారు. కానీ కాలం గడిచేకొద్దీ కేన్సరు పేరు చెప్పేసరికి కేన్స్- క్యూర్ అనివార్యం అయిపోయింది. ప్రతి డాక్టరూ దాన్నే ఉపయోగించటం మొదలుపెట్టాడు. ఫైల్ రికార్డుల్లో ఒకలాగా, నిత్య జీవితంలో ఒకలాగా అది చెలామణి అవుతూంది.
"దీన్ని - దీన్ని ఎలాగయినా ఆపుచెయ్యాలి".
భార్గవ పేలవంగా నవ్వేడు. "కష్టం శేఖరం. పలుకుబడితో చాలా లోతుగా పాతుకుపోయి వున్నవాళ్ళు వాళ్ళు! కేవలం సల్ఫా-2 గురించి మాట్లాడినందుకే ఉద్యోగం పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు చూసేవు కదా...."
"ప్రతివాడూ 'మనకెందుకులే' అనుకోవటంవల్లే దేశం యిలా తగలబడుతూంది. ప్రాక్టికాలిటీని నమ్మేవాణ్ని నేను. ఎలాగయినా కాన్స్- క్యూర్ తాలూకు ప్రోజక్టు రిపోర్టు సంపాదిస్తాను. బేసిక్ డ్రగ్ అయిన సల్ఫా-2 బూటకం బయటపెడ్తాను. అప్పటికీ ప్రజలీ మోసం గ్రహించకపోతే ఇక అది వాళ్ళ ఖర్మ" ఆవేశంగా అన్నాడు శేఖరం.
"కాన్స్-క్యూర్ విషయం నువ్వు చూడు, సల్ఫా-2 విషయం నేను చూస్తాను" అన్నాడు భార్గవ.
"మీరా?"
"అవును. ఈ రోజే సామ్సన్ ఫ్యాక్టరీకి వెళ్ళి కాస్త సల్ఫా-2ని సంగ్రహిస్తాను. మన లాబ్ లోనే పరీక్షిస్తాను. అసలదేమిటో?"
"ఈ రాత్రే చంపాలాల్ ఇంటికి వెళతాన్నేను. మన ఇన్ స్టిట్యూట్ లో ఆ రిపోర్టు దొరక్కపోవచ్చు. అందులోనూ యిన్ని లొసుగులున్న రిపోర్టు అంటే మనవాళ్ళు సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటారు. అదీగాక మనకి కావల్సింది అసలు రిపోర్టు. అది చంపాలాల్ ఇంట్లోనే దొరుకుతుందని ఎందుకో నా కనిపిస్తూంది".
"చంపాలాల్ ఊళ్ళో లేడనుకుంటాను".
"అవును. అందుకే ఈ సాయంత్రం అయితేనే మంచిది".
"ఇంటికి వెళ్ళటం రిస్కేమో ఆలోచించు శేఖరం".
శేఖరం కుర్చీలోంచి లేస్తూ నవ్వేడు, "ఎక్కడ థ్రిల్ వుండునో అక్కడ అన్నాబత్తుల సోమశేఖరం వుండును" అన్నాడు. భార్గవ కూడా లేచాడు. ఇద్దరూ ఇన్ స్టిట్యూట్ వైపు నడుస్తూ ఆ చెట్టుక్రిందకు వచ్చేసరికి మళ్ళీ అదే డేగ పెద్ద చప్పుడుతో రెక్కలు కొట్టుకుంది.
"ఇదిక్కడ పిల్లల్ని పెట్టినట్టుంది గురూగారూ. దీని క్రిందికి వచ్చిన ప్రతివాది తలమీదా కొడ్తూందట" అన్నాడు శేఖరం. భార్గవ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు "అన్నట్టూ నిశాచరుడు అంటే రాత్రిళ్ళు తిరిగేవాడు. అంతేకాని కళ్ళు లేనివాడు కాదు" అన్నాడు.
* * *
సాయంత్రం మూడున్నరకి శేఖరం చంపాలాల్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. మోహన్ లాల్ ఇన్ స్టిట్యూట్ కాంపౌండ్ లోనే ఒకవైపుగా క్వార్టర్సు వున్నాయి. ప్లాట్ సిస్టమ్స్ లో కొన్ని ఇళ్ళున్నాయి. చంపాలాల్ ది మూడో అంతస్తులో వున్న ప్లాటు.
ఆ ఇళ్ళ టోపోగ్రఫీ తెలిసిన వాడవటంచేత, శేఖరానికి పెద్ద కష్టం కాలేదు. ప్లాట్ ఎదురింటి తలుపు వేసి వుంది. గుమ్మం దగ్గిర నిలబడి రెండు నిమిషాలు ప్రయత్నిస్తే తాళం వూడివచ్చింది. చంపాలాల్ నాల్గయిదు రోజుల వరకూ రాడని తెలుసు, కాబట్టి ధైర్యంగా లోపలికి ప్రవేశించాడు. తలుపు దగ్గిరగా వేసి తన పని ప్రారంభించాడు.
