మంగమాంబ కాస్సేపు ఆలోచించి, "వెంగమాంబ" అందాం. అందులో ఆ ఏడుకొండల వెంకన్నా ఉన్నాడు, జగదంబ అయిన అలవేలు మంగమ్మ ఉంది అంది.
"ఇంకేం! చక్కని పేరు" అన్నాడు కృష్ణయ్య, భార్యను మెచ్చుకోలుగా చూస్తూ.
పాప ఒళ్ళు చేసింది. ఇప్పుడిప్పుడే తల్లిని గుర్తు పడుతోంది. ఉయ్యాలలో పడుకున్న పాప మధ్య మధ్య ఉలికిపడి లేస్తోంది. పెంకులెగిరిపోయేలా ఏడుపు ప్రారంభిస్తోంది. లేచీలేవగానే ఆకలితో ఆవురావురుమంటోంది. మంగమాంబకుకు ఇంటిపని ఒక ఎత్తు, పాప పని ఒక ఎత్తుగా ఉంటోంది. కృష్ణయ్యకీ పాప పని బాగానే చెబుతోంది. తన పూజా పునస్కారాలనూ, బయటి వ్యాపకాలనూ తగ్గించుకోవలసి వస్తోంది. ఆ ఇల్లే వ్రేపల్లె, ఆ దంపతులు యశోదానందులు అయిపోయారు.
అప్పుడే పాలిచ్చి మంగమాంబ పాపను గుడ్డఊయలలో వేసి ఊపుతోంది పాప రెప్పలు వేస్తే కదా! అటూ ఇటూ కదులుతూనే ఉంది. ఊళ్ళోకి వెళ్ళిన భర్త ఆకలితో ఆవురావురుమంటూ వస్తారే, ఇంతవరకూ పొయ్యి మీద ఎసరు కూడా పెట్టలేదే అనుకుని సతమతమవుతూ మంగమాంబ బిడ్డను జోకొట్టడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
మా యింటి ఇలవేల్పు
అలివేలు మంగా
మా యింటి మహలక్ష్మి
ఇల వెంగమాంబా ..................... || జో,జో||
చిన్నారి వెంకమ్మ వరాన పుట్టె
కన్నారి నా తల్లి గారాల పట్టీ ................... || జో ,జో||
నిదురపో నా తల్లి, నిదురపోవమ్మా
ఏడుకొండల స్వామి
ఊయలూపేనూ ............................... || జో, జో||
అలివేలు మంగమ్మ
అలరించె నిన్నూ
నిదురపో నా తల్లి, నిదురపోవమ్మా ...................... || జో,జో||
అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కృష్ణయ్య ఈ జోలపాట విని చకితుడయ్యాడు. మంగమాంబ పాడగా తను వినడం ఇదే మొదటిసారి. పాప పుడుతూనే పాటని వెంటబెట్టుకురాలేదు కదా అనుకున్నాడు.
భర్త రాకను గమనించిన మంగమాంబ సిగ్గుతో ముడుచుకుపోయింది. "మంగా, ఈ జోలపాట ఎప్పుడు నేర్చుకున్నావు?" అని అడిగాడు కృష్ణయ్య.
"నేర్చుకోవడమా, నా మొహమా? ఇదెంతసేపటికీ పడుకోకపోయేసరికి ఏంచేయాలో తోచలేదు. ఇలా అనుకుని అలాపాడేశాను" అంది మంగమాంబ. కృష్ణయ్యకు ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది. "పాప గానంతోపాటు సాహిత్యాన్ని వెంటబెట్టుకుని వచ్చిందన్న మాట!" అనుకున్నాడు. పాప ఎంతో గొప్పదవుతుందని ఆ క్షణంలోనే అతని మనసుకు తోచింది.
కాలం గడుస్తోంది. కానీ ఆ దంపతులకు కాలం గడుస్తున్న ధ్యాసే లేదు. ప్రపంచమంతా వాళ్ళకు వెంగమాంబే అయిపోయింది. పాప నవ్వితే వాళ్ళ మనసుల్లో వెన్నెల కాస్తుంది. పాప గుక్కపెడితే వాళ్ళ గుండెలు దడదడలాడిపోతాయి. పాపకు కాస్త పొట్ట వెచ్చగా ఉంటే వైద్యులు వచ్చి చూసేవరకూ వాళ్ళకు కాలూ చేతులూ ఆడవు.
వాళ్ళ జీవితంలో మూడేళ్ళు మూడు క్షణాల్లో గడిచిపోయాయి. వెంగమాంబ ఇప్పుడు మూడేళ్ళదయింది. పాప ప్రపంచం క్రమంగా విస్తరిస్తోంది. బుడిబుడి అడుగులతో ఇల్లంతా కలయతిరుగుతుంది. ముద్దులొలికే మాటలతో ఇదేమిటి, అదేమిటి అని అడుగుతోంది. ఆ కళ్ళనిండా అంతులేని విస్మయమే. పాపకిప్పుడు చిన్నచిన్న నేస్తాలు తయారయ్యారు. పాప కోసం పనిగట్టుకుని ఇంటికొచ్చి ఎత్తుకుని ఆడించే ఆరిందలూ ఎక్కువయ్యారు. కృష్ణయ్య ఇంటినిండా ఇప్పుడు సందడే. గుజ్జనగుళ్ళు, బొమ్మల పెళ్ళిళ్ళు అంటూ రోజుకో ఆట. ఈ ఆతల కోసం చెగోడీలు, పాలకాయలు, లడ్లు వగైరా తినుబండారాలను చేసి ఇచ్చే కొత్త పని మంగమాంబ మీద పడింది. తనకంటే పెద్దపిల్లల మధ్య పాప కాలి అందెలు ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తుండగా సంబరంగా తిరుగుతుంటే చూడడానికి మంగమాంబకూ, ఇరుగుపొరుగు అమ్మలక్కలకీ రెండు కళ్ళూ చాలడం లేదు.
ఓ రోజు పిల్లలందరూ కలసి ఒక కొత్త ఆట కనిపెట్టారు. ఒకమ్మాయికి వెంకటేశ్వరస్వామికున్నట్టు నామాలు పెట్టి "నువ్వు వెంకటేశ్వరస్వామివి. వెంటేశ్వర స్వామిలా అభయహస్త పెట్టి నిలబడాలి, కదలకూడదు, నవ్వకూడదు" అన్నారు. ఆ పిల్ల అలాగే ఉంది. కానీ కదలకుండా, నవ్వకుండా ఉండలేకపోయింది. పెద్ద పిల్లలు గద్దించేసరికి నవ్వు ఆపుకుంది. మిగిలిన వాళ్ళందరూ కాస్సేపు భక్తుల్లా మారిపోయారు.
అంతలో వాళ్ళల్లో అందరికంటే పెద్దపిల్లకు "మరి అలివేలు మంగమ్మ స్వామి పక్కన ఉండాలి కదా" అనిపించింది. వాళ్ళమధ్య నవ్వుతూ కేరింతలు కొడుతూ అందెలు ఘల్లు ఘల్లున మోగిస్తూ తిరుగుతున్న చిన్న వెంగమాంబ మీద ఆ పిల్ల దృష్టి పడింది.
"దీనిని అలివేలు మంగమ్మకు చేద్దామర్రా" అంది ఉత్సాహంగా. మిగిలిన వాళ్ళు కూడా ఉత్సాహంగా "సరే సరే" అన్నారు. ఒకరు తిలకం దిద్దారు. ఇంకొకరు జుట్టును పక్కకు ముడిలాగా చుట్టారు. అది ఊడిపోతుంటే మళ్ళీ మళ్ళీ కట్టారు. తులసిమాలలు చుట్టారు. కాళ్ళకు పారాణి పెట్టారు. మెడలో పూసల దండలు వేశారు.
"ఎంత బాగుందో! నిజంగా అలివేలు మంగమ్మలానే ఉంది కదూ!" అంది పెద్దపిల్ల మురిపెంగా చూస్తూ.
బుగ్గున చెయ్యేసుకుని వీళ్ళ ఆట చూస్తున్న మంగమాంబ ఆ మాటే మనసులో అనుకుంది.
మరికొన్నేళ్ళు గడిచిపోయాయి. వెంగమాంబ ప్రపంచం ఇప్పుడు మరింత విస్తరించింది. ఇంట్లో ఉన్నంతసేపూ తల్లి వెంటే తిరుగుతూ తల్లి చేసే పనులన్నీ తనూ చేయడానికి ప్రయత్నిస్తుంది. తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. భక్తితో నమస్కరిస్తుంది. తండ్రి పూజకు పూలుకోసి తీసుకువెడుతుంది. పూజా సామాగ్రిని సిద్ధం చేస్తుంది. తండ్రిలాగే పూజామందిరం ముందు కూర్చుని శ్రీనివాసుని దివ్యమంగళరూపాన్ని రెప్పవాల్చకుండా అదేపనిగా చూస్తూ ఉండిపోతుంది. ఆ స్వామి గురించి అమ్మ చెప్పిన కథలను నెమరువేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో వెంగమాంబ కాలాన్నీ, పరిసరాలనూ కూడా మరిచిపోతుంది. కృష్ణయ్య దంపతులకు ఆ దృశ్యం ఆనంద సంభ్రమాలతో ఏవో తమకే తెలియని భయాలు రేకెత్తిస్తూ ఉంటుంది. "భగవంతుని ముందు కూర్చుంటే పాప పూర్తిగా పరిసరాలను మరిచిపోతోందే! ఈ భక్తి పాప జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పుతుందో!" అనిపించేది.
సాయంత్రం కాగానే గుడికి వెళ్ళడం వెంగమాంబ నిత్యకృత్యం. ఆరునూరైనా అది తప్పదానికి వీలులేదు. సాయంత్రమైతే చాలు స్వామి తనను పిలిచినట్లు ఎక్కడున్నా సరే గుడికి పరుగుతీస్తుంది. స్వామి ఎదుట నిలబడితే చాలు స్తబ్ధుగా అయిపోతుంది. అప్పుడు ఎవరెంత తట్టి పిలిచినా పలకదు. ఇంట్లో పూసే పువ్వులే కాకుండా స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్ళి పూలు సేకరించి గుడికి పట్టుకువెళ్ళి ఏవో పాటలు పాడుకుంటూ, తనే మాలలల్లి స్వామికి అలంకరించడానికి పూజారికిస్తుంది. పూలుదండగుచ్చడంలో, రకరకాల రీతుల్లో మాలలల్లడంలో వెంగమాంబకు సాటివచ్చేవారు ఆ ఊళ్ళోనే లేరు. ఇంత చిన్నవయసులో అంత నేర్పు అబ్బడం ఎలా సాధ్యమైందను కుంటూ అందరూ విస్తుపోయేవారు. చీకటి పడుతుందే సమయానికి గుడి ఎంతో కోలాహలంగా ఉంటుంది. అందరి మధ్య ఉన్న వెంగమాంబ తనలోకంలో తనే ఉంటుంది. తనతో పాటు తన స్వామి! ఆడపిల్లలందరూ వెంబమాంబ చుట్టూ మూగిపోతారు. అడిగి అడిగి పాడించుకుంటారు. విన్నకొద్దీ వినాలనిపించే పాట. ఆ గొంతులో మాటలకందని ఒక మాధుర్యం. ఏదో తన్మయత్వంతో కూడిన తీయదనం. అది భక్తిపారవశ్యమని పోల్చుకోగల వయస్సు వాళ్ళకు లేదు. వింటున్నంతసేపూ మాటలు, తలపులు ఉడిగిపోయే పాట అది.
ఓ సారి ఒక వాగ్గేయకారుడు ఆ ఊళ్ళో ఉన్న తన బంధువు ఇంటికి వచ్చాడు. సాయంత్రం స్వామి దర్శనం చేసుకుందామని గుడికి వెళ్ళాడు. ఓ చోట ఆడపిల్లలందరూ మూగిఉన్నారు. మధ్యలో వెంగమాంబ కూర్చుని పాడుతోంది. అంతమంది పిల్లలు ఉన్నా అక్కడ మలయమారుతం మోసుకొచ్చే మల్లెపూల పరిమళం లాంటి పాటలు తప్ప ఎక్కడా కొంచెమైనా సవ్వడి లేదు. ఆ వాగ్గేయకారునికి ఆ పాట, ఆ గొంతులోని మాధుర్యం విపరీతంగా ఆకర్షించాయి. అలాగే వింటూ ఉండిపోయాడు. గానాన్ని మించి సాహిత్యం, సాహిత్యాన్ని మించి గానం ఉన్నాయి. అతనికి ఎందరో కవులు రచించిన ఎన్నో పాటలు తెలుసు. పాట వినగానే అదెవరిదో ఇట్టే పోల్చుకోగలడు. కానీ ఆశ్చర్యం! ఈ అమ్మాయి పాడే పాటలు కొత్తగా ఉన్నాయి. ఇంత గొప్ప రచనలు ఇంతవరకూ తన చెవిన పడకపోవడం విచిత్రమేననుకున్నాడు.
వెంగమాంబ పాట ఆగిన తర్వాత ఆ పిల్లను సమీపించాడు. "అమ్మాయి! చాలా బాగా పాదావు తల్లీ! నీ పేరేమిటి, నిన్ను కన్న ధన్యులెవరమ్మా" అనడిగాడు, వెంగమాంబ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ. వెంబమాంబ సిగ్గుపడి తలవంచుకుని తనపేరు, తన తండ్రిపేరు చెప్పింది.
"తల్లీ! నువ్వు సంగీతం సాధన చెయ్యి. నీ మధురమైన గాత్రానికి, నీలోని భక్తి మరింత మాధుర్యాన్ని మప్పింది. నాకో సందేహమమ్మా! నువ్వు పాడిన ఈ పాటలు ఎవరు రచించారు? ఇవి నీకెవరు నేర్పారు? ఆ పుణ్యాత్ముల పేరు చెప్పు తల్లీ విని ధన్యుడినవుతాను" అన్నాడు.
