Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 3


    కంప్యూటర్ బ్రెయిన్ గా పేరుగాంచిన గాంధీ కూడా ఆమె వేగానికి ఆశ్చర్యపోయాడు. పండా అభినందిస్తున్నట్టు నవ్వాడు. మిగతావాళ్లు కూడా ఈ లోపులో తమ సమాధాన పత్రాల్ని అందించారు. గాంధీ వాటిని తీసుకుని పక్కన  పెట్టుకున్నాడు. సమాధానాల మీద అతడికి ఉత్సాహం లేదు. అవలంబించిన విధానం పట్లే అతడి ఇంటరెస్టు అని తెలుస్తూంది.

    ఆ తరువాత మళ్ళీ ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. రకరకాల ప్రశ్నలు.........

    తనతో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఇద్దరు తనకి సరిఅయిన ఉజ్జీలుగా  గ్రహించింది అనూష. వాళ్లకున్న అనుభవం కూడా తక్కువైనదేమీ కాదు. కేవలం రికమెండేషన్ క్యాండెట్ అనుకున్న ఒకడు మాత్రం  కాస్త వెనుకబడ్డాడు. నిజానికి మిగతా ఇద్దరూ తనకన్నా ఎక్కువ విద్యావంతులు. స్టాక్ ఎక్సేంజి అనుభవం వున్నవాళ్ళు.

    ఇంతలో గాంధీ ఆఖరి ప్రశ్న అడిగాడు. "ఫ్రెండ్స్. చిన్న ప్రశ్న. నిజంగా చాలా చిన్నది. హైద్రాబాద్ నుంచి హెలికాప్టర్ మీద ఉత్తర దిశగా రెండు వేల కిలోమీటర్లు ప్రయాణంచేసి, కుడివైపుకి తిరిగి, రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, దక్షిణం వైపుకి మరో రెండువేల కిలోమీటర్లు వచ్చి, అక్కణ్ణుంచి మళ్ళీ కుడివైపుకి రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించి క్రిందికి దిగితే, ఎక్కడ దిగుతాం?"

    "బయల్దేరిన చోటుకే-" ముగ్గురిలో ఒకడు చప్పున అన్నాడు. గాంధీ అంతకు ముందు అడుగుతున్నప్పుడు ప్రశ్న పూర్తికాకుండానే అనూష సమాధానం అందించటం గుర్తొచ్చి, ఈసారి తను అలా చేసి వుంటాడు.

    అనూష తలెత్తి గాంధీ మొహంలోకి చూసింది. అతడి మొహంలో ఏ భావమూలేదు. ఆ జవాబు సరిఅయినదో కాదో చెప్పలేదు అతడు. మిగతా ఇద్దరూ కూడా దీర్ఘాలోచనలో వున్నారు.

    ముగ్గురి పరిస్థితీ ఇరుకున పడ్డట్టు అయింది.

    మొదటివాడు చెప్పింది నిజంగా సరిఅయిన సమాధానం అయితే, గాంధీ అన్నట్టు ఇది నిజంగా  చిన్న ప్రశ్నే అయితే, కేవలం తాము ఫూల్స్ అవటం కోసమే  ఆ ప్రశ్న ఉద్దేశింపబడినది అయివుంటుంది.

    స్టాక్ హొం లాంటి పెద్ద సంస్థ - తన జనరల్ మానేజర్ ఒక చిన్న విషయం కోసం ఇంత సమయం వృధా చేసుకోవటం ఇష్టపడదు. అలా అని, తప్పు నిర్ణయం తీసుకోవటం అసలు సహించదు.

   
                                              హెలీకాప్టర్ ఎక్కడ దిగుతుంది?


    టేబిల్ మీదవున్న ప్యాడ్ మీద పిచ్చిగా వృత్తాలు గీస్తూ ఆమె తీవ్రంగా ఆలోచిస్తూవుంది.

    పక్కనున్న ముగ్గురిలో ఒకరు, అంతకు ముందు అభిప్రాయంతో ఏకీభావిస్తున్నట్లు, "హైద్రాబాద్ లోనే" అన్నారు. ఇక జవాబు చెప్పవలసింది ఇద్దరు.

    సమయం గడిచిపోతూ వుంది. క్షణాలుముందుకు గడిచే కొద్దీ తాము ఓటమికి దగ్గిరవుతున్నట్టు మిగతా ఇద్దరికీ తెలుసు. ఏదో ఒక సమాధానం చెప్పాలి.

    ఇద్దరిలో ఒకరన్నారు- "హెలికాప్టర్ గాలిలో వున్నప్పుడు క్రింద భూమి తిరగటాన్ని లెక్కలోకి తీసుకోవాలా? పెట్రోలు సమస్య వుందా".

    గాంధీ నవ్వి- "ఎలా తీసుకుంటారు? వాతావరణం కూడా భూమితోపాటే తిరుగుతూ వుంటుంది కదా" అన్నాడు. "పెట్రోలు సమస్య లేదు".

    "అయితే హైద్రాబాద్" మూడో అభ్యర్థి కూడా  నిర్ణయానికి వచ్చేసాడు.

    ఇక మిగిలింది అనూష ఒక్కతే.

    అయిదు జతల కళ్ళు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయని ఆమెకి తెలుసు. ఆమె కూడా చెప్పేస్తే ఇంటర్వ్యూ పూర్తయిపోతుంది. ఒక సిల్లీ ప్రశ్నకోసం ఇంత సేపు సమయాన్ని తీసుకున్నందుకు కొన్ని మార్కులు పోవచ్చు..... కానీ.....

    నిజంగా సిల్లీ ప్రశ్నేనా ఇది.....?

    ఆమె ఇంకా పిచ్చిగా వృత్తాలు గీస్తూనే వుంది.

    మరో రెండు సెకన్లు గడిచాయి!

    తను గీసిన బొమ్మ వైపు చూసుకుంటే ఆమె మెదడులో చటుక్కున ఒక మెరుపు మెరిసింది.

    అంతే, క్షణాల్లో ఆమె మెదడు మిషనుకన్నా వేగంగా లెక్కలు కట్టింది. తరువాత ఆమె తలెత్తి చిరునవ్వుతో.....

    ".....మీరు చెప్పినట్టు ఒక హెలికాప్టరు హైదరాబాద్ నుంచి చతురస్రాకార్మలో రెండువేల కిలోమీటర్లు ప్రయాణిస్తే తిరిగి హైదరాబాద్ చేరుకోదు" అంది.

    "మరెక్కడికి చేరుకుంటుంది మిస్?"

    "భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో దిగుతుంది"

    మిగతా అభ్యర్థులు ఆమె వంక పిచ్చిదాన్నిగా చూశారు. చివరికి పండా కూడా ఆమె చెప్పిన జవాబుకి ఆశ్చర్యపడ్డట్టు కనిపించాడు. ఏమీ మార్పులేనిది ఒక గాంధీలోనే.

    "మీకీ సమాధానం ఎలా వచ్చిందో చెప్పగలరా మిస్ అనూషా" అని అడిగాడు.

    "ష్యూర్" అంది అనూష. ఆ తరువాత ఆమె చెప్పడం ప్రారంభించింది


 


    "హైదరాబాద్ దాదాపు 78వ రేఖాంశం మీద వుంది. అదే రేఖాంశం మీద పైకి రెండు వేల కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్తే దాదాపు కాశ్మీర్ సరిహద్దుల్లోకి వెళతాం. అక్కణ్ణుంచి భూగోళం మీద అడ్డంగా  అంతే దూరం  ప్రయాణం చేస్తే చైనాలో దాదాపు 100వ రేఖాంశం మీదకి వెళతాం. అదే  రేఖాంశం మీద క్రిందికి దిగితే థాయ్ లాండ్ ప్రాంతాల్లో దిగుతాం. లెక్కలో మెలిక ఇక్కడే వుంది. ఉత్తర ధృవం నుంచి క్రిందికి దిగేకొద్దీ రేఖాంశాలమధ్య దూరం పెరుగుతుంది. ఎంత దూరం పెరుగుతుందీ లెక్క  కట్టాలంటే చిన్నతరహా కంప్యూటర్ అవసరం" అంది, 'కంప్యూటర్' అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. గాంధీ చిరునవ్వుని కనపడకుండా ఆపటానికి విఫల ప్రయత్నం చేశాడు. ఆమె చెప్పడం కొనసాగించింది.

    "హైదారాబాద్ వున్నది 17వ అక్షాంశంలో ......ఆ అక్షాంశం మీద బాంకాక్ ప్రాంతాల నుంచి హైదారాబాద్ కి దూరం దాదాపు 2200 కిలోమీటర్లు! అంటే, వెనక్కి వస్తున్నా హెలికాప్టరు హైదారాబాద్ కి రెండు వందల కిలోమీటర్ల దూరంలోనే దిగిపోతుందన్నమాట. అక్కడ వుంది భద్రాచలం, ఖమ్మం మధ్య ప్రాంతం. అందుకే భద్రాచలం అని చెప్పాను. అఫ్ కోర్స్- ఆ వూళ్ళో హెలీపాడ్ వున్నట్లయితే...."

    ఆ గదిలో సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. దాన్ని భంగపరుస్తూ గాంధీ "ఓ.కే. ఫ్రెండ్స్, మీ రిజల్ట్సు తరువాత తెలియబరుస్తాం" అన్నాడు లేస్తూ.

    అందరూ అతడితోపాటే లేచారు. ఆమెకూడా బయటకు వచ్చింది. లిప్ట్ దగ్గర గాంధీని అడిగింది - "లక్ష్మీ ఎలా వుంది?"

    "షీ ఈజ్ ఫైన్"

    లిప్ట్ లో ప్రవేశించబోతూవుంటే చైర్మన్ మళ్ళీ ఆమెని పిలుస్తున్నారని కబురొచ్చింది. ఆమె బయటే ఆగిపోయింది. గాంధీ "గుడ్ బై" అని, లిప్ట్ క్రిందికి దిగబోతూవుంటే వినపడీ వినబడనట్టు "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు. అతడు చెప్పదల్చుకున్నది అర్థమై ఆమె పెదవుల మీద చిరునవ్వు కదలాడింది.

    కానీ అది ఎక్కువ సేపు నిలబడలేదు. పి.ఎస్. పండా కాస్త దిగులుగా నిలబడ్డాడు. లోపలికి వచ్చిన అనూషని చూస్తూ "కూర్చో" అన్నాడు. తమ ఇంటర్వ్యూలో ఎన్నిక కాబడ్డాననీ అందుకే తనని ఏకవచనంలో సంబోధిస్తున్నాడని అర్థమైంది. ఆ చనువు అతడికి అధికారం వల్ల వచ్చింది కాదు. వయసూ, తెలివితేటలవల్ల వచ్చింది.

    "చిన్న ఇబ్బంది వచ్చింది....." ఆమె కూర్చున్నాక అన్నాడు పండా! "మీ నలుగురిలో మన్ మోహన్  వెనుక చాలా పలుకుబడి వుంది. మోహన్ తెలుసుగా. మీ నలుగురిలో అందరికన్నా వీక్ ....." అతడు ఆగి అన్నాడు.

    "స్టాక్ హొం జనరల్ మానేజర్ పదవి అంటే సామాన్యమైనది కాదు. ఒక మామూలు అభ్యర్థిని ఈ పదవికి ఎంపిక చేయలేం. తెలివితేటలు, పలుకుబడీ రెండూ వుండాలి. మొదటివి నీకున్నాయి. రెండోది అతడికి వుంది. మీ కెవరికీ తెలియని విషయం ఏమిటంటే అందంగా, హుందాగా కనబడే ఈ స్టాక్ హొం ఏక్షణంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగావుంది. ఎక్కడో ఏదో జరుగుతుంది. దాన్ని నేను పట్టుకోగాలను. కానీ నాకో బలమైన చెయ్యి సహాయానికి కావాలి. నా ఓటు నీకే కానీ..... అతడికి చాలా పలుకుబడివుంది. కావలసిన పనులు నిమిషాలమీద చేయించుకోగలడు".

    .....పండా చెప్పదల్చుకున్నది అర్థమైంది. ఆ అభ్యర్థిని పనిలోకి తీసుకుంటే ఈ సంస్థ 'కొన్నిపనులు' సులభంగా నెరవేరతాయి. తనకి కూడా అంత పలుకుబడి వుందని నిరూపించుకోవాలి. స్టాక్ హొంలో అత్యున్నతమైన పదవి అంటే ఇలాటి 'పలుకుబడి' చాలా అవసరం.

    "ఎవరు సర్ ఈ అభ్యర్థిని రికమండ్ చేసింది?"

    "టొబాకో కింగ్ రామసుబ్బారావు- మన్ మోహన్ అతడి బావమరిది-"

    ఆమె గుండె ఒక క్షణం కుంచించుకుపోయినట్టు అయింది. భారతదేశపు పొగాకు వ్యాపారన్నంతా చిటికెన వేలుమీద  ఆడించే రామసుబ్బారావు అతడి  వెనుక వున్నాడు. అతడినీ తను ఎదుర్కొనవలసింది.

    "ఇంకో గంటలోగా ఈ ఇంటర్వ్యూ ఫలితం ఆయనకి చెపుతానని చెప్పాను" అన్నాడు పండా. అనూషకి అతడి మాటల్లో అంతరార్థం బోధపడింది. తను బయటకి వెళ్ళి తీరిగ్గా ఆ రామసుబ్బారావు మీద వత్తిడి తీసుకు వస్తానంటే లాభం లేదు. ఇక్కడే ఏదో చెయ్యాలి. ఇది కూడా  తనకి ఒకరకం పరీక్షే! స్టాక్ హొం జనరల్  మానేజర్ కుర్చీలో కూర్చునే అన్నీ పనులూ చేయగలిగివుండాలి! అన్నీ  క్షణాల మీద చేయాలి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలుండాలి. సమస్యని వెంటనే పరిష్కరించాలి.

    ఆమె ముందుకు వంగి "నేనొకసారి మీ ఫోను ఉపయోగించుకోవచ్చా-" అని అడిగింది.

    "పక్క గదిలో వుంది" అన్నాడు ఆన్టీ-ఛాంబర్ చూపిస్తూ. ఆమె ఆ చిన్న గదిలోకి వెళ్ళి ఫోన్ అందుకుంది. సరిగ్గా నిముషం తరువాత ఆమె ఢీల్లీ II  సర్కిల్ డి.సి.పి. ఇంటికి ఫోన్ లో ట్రంక్ కాల్ మాట్లాడుతూంది.

    "అన్నయ్య వున్నాడా?"

    "లేడు మాడమ్".

    "అక్కర్లేదు. నేను నీ కోసమే ఫోన్ చేశాను"

    ఆ బెంగాలీ వంటవాడు హరిసేన్ కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది.

    "ఎందుకు మాడమ్?" అని అడిగాడు.

    "నువ్వు చాలా బాగా నాటకాలు ఆడేవాడివని అన్నయ్య చెపుతూ వుంటాడు".

    వాడు తబ్బిబై "అవును మాడమ్! హిందీలో....." అన్నాడు.

    "చిన్న నాటకం ఆడాలి-" అంటూ చేయవలసింది చెప్పింది. ఆమె చెప్పినదంతా విని ఆ వంటవాడు కంగారుపడ్డాడు. కానీ ఎలాగో వప్పించింది. ఆ తరువాత ఆ లైన్ కట్ చేసి, రామసుబ్బారావుకి ఫోన్ చేసింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS