Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 39

    ఇద్దరూ రోడ్డు మీదకు వచ్చారు. జనసంచారం పల్చబడటం వల్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొంతదూరం వెళ్ళి కిళ్ళీ షాపులో రెండు సిగరెట్లు కొని ఒకటి శివరావుకి ఇచ్చాడు రామకృష్ణ. సిగరెట్లు ముట్టించుకుని ఓ షాపు అరుగుపై కూర్చున్నారు.
    "ఏ పని మీద బొంబాయి వెళ్ళావ్?" రామకృష్ణ అడిగాడు.
    శివరావు కలవరపాటు కప్పిపుచ్చుకుంటూ రామకృష్ణవైపు చూశాడు. బొంబాయి వెళ్ళివచ్చి రెండు నెలలు అయింది. ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ఎందుకు అడిగాడు బోధపడలేదు.
    "ఆఫీసు పనిమీద....." చెప్పాడు.
    "నాతో కూడా అబద్దం చెబుతున్నావా?"
    "అబద్దం చెప్పడం దేనికి?" ఆశ్చర్యంగా అన్నాడు.
    నిట్టూర్చి చెప్పాడు రామకృష్ణ.
    "టి .వి.లో సినిమా ప్రసారానికి ముందు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి చూపించారు. దానిని రవితేజ అనే దర్శకుడు తీశాడు...." చెప్పి శివరావు మొహంలోకి చూశాడు.
    అతని మొహంలో ఎటువంటి మార్పులేదు.
    "టి.వి.లో చూపించిన డాక్యుమెంటరీ నీ మీదనే చిత్రీకరించబడింది. నీ కిడ్నీ తీసి మరో వ్యక్తికి అమర్చారు. ఇది తీసినప్పుడు నువ్వు స్పృహలో లేవు" చెప్పాడు.
    శివరావు తలదించుకున్నాడు. తను ఎంతో రహస్యంగా చేసిన పని అంత తేలిగ్గా బయటపడుతుందని అనుకోలేదు. ఆపరేషన్ పై అటువంటి డాక్యుమెంటరీ తీస్తున్నారని తెలియదు. ఆపరేషన్ టేబుల్ పైన పడుకున్నప్పుడు పెద్ద పెద్ద లైట్లు అమర్చబడ్డాయి. అవన్నీ ఆపరేషన్ లో ఒక భాగమనుకున్నాడు.
    తలెత్తి రామకృష్ణ మొహంలోకి చూసి చిన్నగా నవ్వాడు. తన రహస్యం బయటపడినందుకు అతని మొహంలో నూన్యతా భావం లేదు.
    "ఒక అరబ్ సేట్ కొడుక్కి కిడ్ని చెడిపోయింది. అతనికి "O" గ్రూపు నెగెటివ్ బ్లడ్ గల మనిషి కిడ్నీ అమర్చాలి. బొంబాయి, మద్రాసు వంటి నగరాలలో ప్రయత్నించినా దొరకలేదు. చివరగా ఆ సేట్ పేపరు ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి నేను రక్తపరీక్ష చేయించుకున్నాను. నా బ్లడ్ "O" నెగెటివ్ గ్రూపు అని తేలింది. మద్రాసు ఫోనుచేసి ఆసేట్ తో మాట్లాడాను. అతను మద్రాసు నుండి ఇక్కడకు వచ్చాడు. కిడ్నీ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు. చినవాల్తేర్ లో ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్ కి అతను ఏర్పాట్లు చేశాడు. మీకు అనుమానం రాకుండా బొంబాయి వెళుతున్నట్టు నాటకం ఆది తిరిగి వెనక్కి వచ్చాను." చెప్పాడు శివరావు.
    రామకృష్ణ అతనివైపు జాలిగా చూశాడు.
    "నా వంక జాలిగా చూడకు రామకృష్ణా! తప్పు చేశానని నేను అనుకోవడం లేదు. నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను. వందరూపాయలు అవసరమైతే అప్పుకోసం పరిగెత్తే సామాన్యుడ్ని..." అన్నాడు. కొన్ని క్షణాల తరువాత తిరిగి అన్నాడు.
    అర్చన నెల తప్పినట్టు చెప్పింది. ఆమె చెప్పిన వార్త నాకు సంతోషం కలిగించింది. అర్చనకు కూడా పిల్లలంటే ఇష్టం. భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా అర్చన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. మా ప్రేమకి గుర్తుగా పిల్లలు పుట్టబోతున్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? కొన్ని రోజులు నాకు నిద్రపట్టలేదు. అదే సమయంలో కిడ్నీ కావాలంటూ పేపరులో ప్రకటన కనిపించింది. కొన్ని నగరాలలో కిడ్నీ అమ్మకం ఓ వ్యాపారంలా సాగుతున్నదని పేపరులో చదివాను. నా రక్తం పంచుకుని పుడుతున్న బిడ్డకోసం నా శరీరంలో ఒక భాగం అమ్మితే తప్పేమిటని ప్రశ్నించుకున్నాను. అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఈ రోజు ఎనభై వేలు బ్యాంకులో దాచాను. నా ప్రాణం కూడా అంత ఖరీదు చెయ్యదు..." చెప్పాడు.
    రామకృష్ణ కన్నార్పకుండా శివరావుని కొన్ని నిముషాలపాటు చూశాడు. సినిమా హాలులో పరిచయమైన శివరావు ఇప్పుడు తన ముందున్న శివరావుకు మధ్య చాలా తేడా ఉంది. అతను జీవితాన్ని తేలిగ్గా తీసుకునే వాడయితే ఇతను జీవితానికి భాష్యం చెప్పగల వ్యక్తి.
    ఆప్యాయంగా అతని భుజంపై చెయ్యి వేశాడు రామకృష్ణ. ఇద్దరూ ఇంటివైపు నడవ సాగారు. అతను తనకి స్నేహితునిగా దొరికినందుకు రామకృష్ణ మనసు గర్వంతోనిండిపోయింది. జీవించడం ద్వారానే మనిషి అనుభవం సంపాదిస్తాడు. అనుభవం సంపాదించినవాడే జ్ఞాని.

                                             *O*

                                            ఉపసంహారం
   
      మధ్యాహ్నం పన్నెండున్నరకి రామకృష్ణ, భాగ్యలక్ష్మి కాన్వెంటు లోకి ప్రవేశించారు. వాళ్ళని అనుసరిస్తూ వచ్చిన ఒక కుక్క కాన్వెంటు గేటు దాటుతూ అలవాటుగా తలతిప్పి గేట్ మాన్ కోసం చూసింది. అప్పటికే కుక్కని గమనించిన గేటుమాన్ గోడ చాటుకి తప్పుకోవడం వల్ల దానికి కనిపించలేదు. ఆ కుక్క మొదటిసారి కాన్వెంటుకి వచ్చినప్పుడు గేట్ మాన్ దానిని తరమడానికి కర్రపట్టుకుని వచ్చాడు. వెంటనే ఆ కుక్క అతని వెంటపడి ఊరు చివర వరకూ తరుముకెళ్ళింది. అప్పటి నుంచి దూరం నుంచే కుక్క రావడం గమనించి దానికి కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడు.
    రామకృష్ణ, భాగ్యలక్ష్మి ఒక చెట్టు క్రింద ఆగారు. విశాలంగా పెరిగిన ఆ వృక్షం క్రింద దట్టమైన నీడ పరుచుకుని ఉంది. భాగ్యలక్ష్మి బ్యాగ్ నుండి ప్లాస్టిక్ మ్యాట్ తీసి పరిచింది. దానిపైన ఇద్దరూ కూర్చున్నారు. కుక్క కాస్త ఎడంగా కూర్చుని ఓ క్లాస్ రూమ్ వైపు చూడసాగింది.
    లంచ్ బెల్ మ్రోగింది.
    పిల్లలు క్లాస్ రూమ్ నుండి తూనీగల్లా బయటకు రాసాగారు. కుక్క చూస్తున్న క్లాస్ రూమ్ నుండి ముగ్గురు పిల్లలు విల్లు నుండి వదిలిన బాణాల్లా చెట్టు దగ్గరకు దూసుకొచ్చారు. వాళ్ళ ముగ్గురికీ ఐదు సంవత్సరాల లోపు ఉంటుంది వయసు. ముగ్గురూ భాగ్యలక్ష్మికి ఎదురుగా మ్యాట్ మీద కూర్చున్నారు. భాగ్యలక్ష్మి క్యారేజీ ఓపెన్ చేసి ముగ్గురికీ మూడు గిన్నెలు ఇచ్చింది. వాళ్ళు స్పూన్స్ తో గిన్నెలలోని అన్నం తినసాగారు.
    పిల్లల్ని చూసి తోక ఆడిస్తుంది కుక్క. ఆ ముగ్గురూ పిల్లలు దానికి స్నేహితులు. వాళ్ళ వయసుకన్నా దాని వయసు ఆరు నెలలు ఎక్కువ. ఇంట్లో క్యారేజీ సర్దడం పసికట్టి గుమ్మం దగ్గర కూర్చుని దానిని తీసుకెళ్ళే వాళ్ళ వెంట బయలుదేరుతుంది.
    వాళ్ళని గమనిస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు రామకృష్ణ.
    కుడివైపు కూర్చున్న పిల్లవాడు శివరావు కొడుకు. తండ్రి పోలికలు వాడి మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యలో కూర్చున్న అమ్మాయి శివరావు కూతురు. అచ్చు గుద్దినట్టు తల్లిలా ఉంది. చివర కూర్చున్న అబ్బాయి రామకృష్ణ కొడుకు. తాత పోలికలు వచహయి ఆరు నెలల తేడాలో పుట్టడం వల్ల ఒకే క్లాసులో చేర్చారు.
    పిల్లలు అన్నం తినడానికి అరగంటపైనే పట్టింది. చివరలో రామకృష్ణ వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చాడు. కొడుకు మొహం చూసి ఏదో చెప్పాలనుకుంటున్నాడని గ్రహించి తలూపాడు చెప్పమన్నట్టు.
    "ఈ రోజు నన్ను టీచర్ కొట్టారు...." చెప్పాడు.
    "దేనికి?" అడిగాడు రామకృష్ణ.
    సమాధానం చెప్పడానికి ఓ క్షణం ఆగాడు పిల్లవాడు.
    "హోంవర్క్ చెయ్యలేదని...." చప్పున చెప్పింది శివరావు కూతురు.
    "ఎందుకు చెయ్యలేదు?" ఆశ్చర్యంగా అడిగాడు రామకృష్ణ.
    "నిన్న సాయంకాలం కాన్వెంటు నుంచి వచ్చిన తరువాత తాతయ్య ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాడు....." చెప్పాడు బిక్క మొహంతో.
    రామకృష్ణ మాట్లాడలేదు. పిల్లలు క్లాసులోకి వెళ్ళిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS