Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 38

 "మీరు ఆయన్ని కాదు కొట్టాల్సింది, నన్ను! ఎందుకంటే నేనె ఇష్టపడి ఆయన్ని చేసుకున్నాను "గట్టిగా చెప్పింది. రామకృష్ణ మీదకు కర్ర విసరడంతో ఆమెకు ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. కళ్ళు చింత నిప్పుల్లా మారాయి.
    "నువ్వు అడ్డు తప్పుకో. నాన్నగారు వచ్చేసరికి వాడి సంగతి తేల్చేస్తాను" అరుస్తూ ముందుకొచ్చాడు భాగ్యలక్ష్మి అన్నయ్య.
    భాగ్యలక్ష్మి మెట్లు దిగి క్రిందకు వెళ్ళింది. అన్నయ్య చేతిలోని కర్రలాక్కుని నిర్దాక్షిణ్యంగా చాతీమీద చెయ్యేసి వెనక్కి నెట్టింది. అంతా విస్మయంగా చూస్తుండి పోయారు.
    "మీరు ఏం చెయ్యడానికొచ్చారో అర్ధమవుతోందా? నా భర్తని కొట్టడానికి వచ్చారు..." అందర్నీ ఉద్దేసించి అని గుంపులో ఇద్దర్ని చూసి "అప్పలనాయుడు, ఆది నారాయణ.... మీరు కూడా వచ్చారా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
    వాళ్ళిద్దరే కాకుండా మరి కొంతమంది తలలు వంచుకున్నారు. గౌన్లు తొడుక్కునే వయసు నుంచి భాగ్యలక్ష్మి వాళ్ళకి తెలుసు. అంతే కాదు, ఆమె కాలేజీకి బయలుదేరితే ఆమెను తీసుకెళ్ళడానికి పోటీపడతారు. రిక్షాలో తీసుకెళుతూ తమ కష్టాలు చెప్పుకుంటే ఆమె ఆదుకునేది.
    అంతవరకూ కర్రల్ని బలంగా పట్టుకున్న పిడికిళ్ళు తమ పట్టు సడలించాయి. వివేకం మేలుకుని కొంతమంది, మైకం విడిపోయి మరి కొంతమంది వెనక్కి తిరిగారు. వాళ్ళని చూసి కొందఱు అనుసరించారు. చివరగా భాగ్యలక్ష్మి అన్నయ్య వెనుక పదిమంది ఉన్నారు.
    అతను దిక్కు తోచనట్టు అలాగే నిలబడిపోయాడు. రామకృష్ణ మెట్టు దిగి అతన్ని సాదరంగా లోపలకు తీసుకొచ్చాడు.
    అంతవరకూ మేడ మీద నుంచి చూస్తున్న భాగ్యలక్ష్మి తల్లి వెనక్కి తిరిగింది. ఆమె మొహం సంతోషంతో వికసించింది.
                                                                             15    

    రాజకీయాలలో ఉచ్ఛదశ అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. క్షీణ దశ మొదలవడానికి మాత్రం అంత సమయం అక్కర్లేదు. తనని పాతాళానికి త్రొక్కే నిర్ణయం రాజకీయ నాయకుడు సులువుగా తీసుకుంటాడు. మాజీ ఎమ్మెల్యే అయినా భాగ్యలక్ష్మి తండ్రి అటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నాడు.
    అతనికి పార్టీ టిక్కెట్ దొరకలేదు.
    వేరే కులానికి చెందిన వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా నిర్ణయించారు. ప్రతిపక్షం వాళ్ళు అదే కులానికి చెందిన అభ్యర్ధిని నిలబెట్టారనే కారణం చెప్పారు మాజీ ఎమ్మెల్యేకి. నిజానికి కేంద్ర మంత్రి ఒకాయన గట్టిగా ప్రయత్నించడం వల్ల భాగ్యలక్ష్మి తండ్రికి పార్టీ టిక్కెట్ దొరకలేదు.
    పార్టీలోని ఓ వర్గం తనకి వ్యతిరేకంగా పని చెయ్యడం వల్ల గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఒడి పోయానని, ఇప్పుడా వర్గంతో తనకి ఎటువంటి గొడవలు లేవని అధిష్టాన వర్గానికి నచ్చ చెప్పాడు. అంతేకాదు ఈ ఐదు సంవత్సరాలు నియోజక వర్గమంతా తిరిగి ప్రజలకు సన్నిహిత మయ్యామని, ప్రధానమంత్రి బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించారని, పార్టీ నాయకుడు ఒకతను మరణించినప్పుడు తన మనుషులతో నగరంలోని షాపులు మొత్తం మూయించానని కూడా చెప్పాడు. అయినా కూడా ఫలితం లేకపోయింది.
    మాజీ ఎమ్మెల్యే నియోజక వర్గం అభివృద్దికి ఎంతో కృషి చేసాడని, ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే అసెంబ్లీ ఎదుట ఆత్మాహుతి చేసుకుంటామని టెలిగ్రాములు వెళ్ళాయి. మాజీ ఎమ్మెల్యే కొంతమంది నాయకుల్ని తీసుకెళ్ళి పార్టీ అధ్యక్షుని మీద ఒత్తిడి తెచ్చాడు.
    అయినా ఉపయోగం లేకపోయింది.
    తనకి ఎంతో ఉపయోగపడతాయని అమ్ముల పొదిలో దాచిన అస్త్రాలన్నీ ఉపయోగించి, ఏం చెయ్యాలో తెలియక ఇంటికి తిరిగొచ్చాడు మాజీ ఎమ్మెల్యే. గోరు చుట్టూ మీద రోకటి పోటులా కుమార్తె పెళ్ళిగురించి తెలిసింది. పోలీసు రిపోర్టు ఇవ్వాలని అనుకున్నాడు. కుమార్తె మైనర్ కాదని గుర్తొచ్చింది. ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యమని, అల్లుడు కూలీ అనే అంశం గెలవడానికి ఉపయోగపడుతుందని సన్నిహితుల సలహా ఇచ్చారు.
    ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యడం వల్ల కలిగే ఇబ్బందులు అతనికి తెలుసు. పార్టీ టిక్కెట్ మీద పోటీ చేస్తే ఓటర్లు అభ్యర్ధి గుణగణాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా పార్టీకి ఓటు వేస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ అభ్యర్ధి తరపున ప్రచార, చేస్తారు. అధిష్టాన వర్గం పార్టీ అభ్యర్ధులు ప్రచారం చేసుకోవడానికి నిధులు అందిస్తుంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈ లాభాలు ఉండవు. పూర్తిగా స్వశక్తి మీద ఆధారపడాలి.
    నిజానికి తను ఇండిపెండెంట్ గా గెలవటం చాలా కష్టం.
    ఇదంతా ఆలోచించి కూడా ఆయన పెద్ద ఊరేగింపులో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసొచ్చాడు. నాలుగు రోజుల పాటు ఇంట్లో మౌనంగా కూర్చున్నాడు. నామినేషన్ వెయ్యడానికి తీసుకెళ్ళిన మనుషులు, కాల్చిన బాణాసంచా గెలవడానికి ఏ మాత్రం ఉపయోగపడవని తెలుసు. పార్టీ అభ్యర్ధి రాజీకోసం వస్తాడని అలా చేశాడు కాని అతను రాలేదు.
    నగరంలోని కొంతమంది ప్రముఖులు మాజీ ఎమ్మెల్యేని కలిశారు. మరో కులం వాడికి టిక్కెట్ ఇవ్వడంతో కినుక వహించిన పార్టీ శ్రేయోభిలాషులు వాళ్ళు. అందరూ కూర్చుని సుదీర్ఘంగా చర్చించి, మాజీ ఎమ్మెల్యేతో పని చేస్తున్నామని పేపరులో ప్రకటన ఇచ్చారు.
    మాజీ ఎమ్మెల్యే తన జీవితాన్ని పేద ప్రజల అభ్యున్నతికి అంకితం చేశాడని, ఒక కూలీని అల్లుడుగా చేసుకున్న గొప్ప వ్యక్తని ప్రచారం చేశాడు. ప్రచారం జరుగుతుండగా ఒక అబ్యర్దిని హతమారిస్తే ఎన్నిక ఆగిపోతుందని, అప్పటికే లక్షలు ఖర్చు పెట్టిన అభ్యర్ధులు ఖంగుతింటారని, ఎప్పుడో జరిగే ఉప ఎన్నికలలో పార్టీ టిక్కెట్ సంపాదించుకో వచ్చునని మాజీ ఎమ్మెల్యే ఇంటిలో జరిగిన సమావేశంలో ప్రజాస్వామ్య వాదులంతా సలహా ఇచ్చారు.
    భారతదేశం చేసుకున్న అదృష్టమో లేక అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకునే వ్యక్తి పోటీలో లేకపోవడమో తెలియదు కాని, దేశంలో అభ్యర్ధి మరణంవల్ల ఎన్నిక వాయిదా పడిన నియోజకవర్గాల జాబితా నుండి ఆ నియోజక వర్గం మినహాయించబడింది.
    ఒకరోజు దినపత్రికలో మాజీ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా పోటీ నుంచి విరమించుకున్నట్టు ఒక ప్రకటన వెలువడింది. అదే రోజు ప్రజలు మాజీ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్ధి నుండి సొమ్ము తీసుకున్నాడని అనుకున్నారు.
    "డబ్బు తీసుకుని పోటీనుంచి తప్పుకునేంత నీచ రాజకీయాలకు పాల్పడతానని ఎలా అనుకున్నారు ప్రజలు? మచ్చలేని నా రాజకీయ జీవితాన్ని కాలరాయాలని దుష్టశక్తులు కొన్ని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా ప్రజాసేవ చెయ్యడంలో వెనుకంజ వేసేది లేదు. నా జీవితం పేద ప్రజలకే అంకితం, ప్రజాసేవకి పునరంకితం అవుతున్నా...." స్నేహితుల ముందు గర్జించాడు.
    పతనం మొదలయితే ఇటువంటి ఘర్జనలు ఆధుకోవు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS