Previous Page
నన్ను ప్రేమించవు పేజి 40

    "చదువుకునే సమయంలో పిల్లవాడ్ని బయటకు తీసుకెళ్ళవద్దని నీ తండ్రికి చెప్పు. మిగతా ఇద్దరు పిల్లల్ని వదిలి తన మనవడిని మాత్రమే తీసుకెళ్ళొద్దని కూడా చెప్పు. పిల్లల మీద ప్రేమ చూపించడమంటే వాళ్ళ చదువు చెడగొట్టడం కాదని గుర్తుచెయ్యి...." చెప్పాడు రామకృష్ణ కాన్వెంటు గేటు దాటుతూ.
    గేటు ప్రక్కన కూర్చుని అడుక్కుంటున్న గుడ్డి బిక్షగాడు అడుగుల చప్పుడుకి తలెత్తి అడిగాడు.
    "ధర్మం చెయ్యండి బాబూ!"
    ఓ రూపాయి నాణేన్ని అతని పాత్రలో వేశాడు రామకృష్ణ.
    "వెయ్యేళ్ళు వర్ధిల్లండి బాబూ!" చెప్పాడు బిక్షగాడు.
    ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తరువాత ఆగి వెనక్కితిరిగి బిక్షగాడిని భాగ్యలక్ష్మికి చూపించాడు రామకృష్ణ.
    "అతనెవరో తెలుసా?" అడిగాడు.
    "తెలియదు." చెప్పింది.
    "అతని పేరు జనార్దనం. అర్చన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి అతనే....."
    ఆ బిక్షగాడు ఎముకల గూడులా ఉన్నాడు. అతని జుట్టు తెల్లబడి పశువులు తొక్కిన గడ్డిలా కనిపిస్తోంది. దంతాలు లేనట్టు దవడలు లోపలికి పోయాయి. చెవిలో సగం కాల్చిన బీడీ ముక్క వుంది. శరీరం మీద ఈగలు ముసిరాయి.
    "చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు...." చెప్పింది భాగ్యలక్ష్మి.
   
                                *    *    *
    ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి వాకింగ్ కి బయలుదేరాడు వినాయకరావు. చీకటిని తరిమికొట్టడానికి ఆయత్తమైన వెలుగు రేఖలు తూర్పు దిక్కు నుండి బయలుదేరడం వల్ల చీకటి పల్చబడింది. అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు.
    షుగర్ రావడం వల్ల ఆహారాన్ని కంట్రోలు చేశాడు. ఇదివరకులా తిరగడానికి శరీరం సహకరించడం లేదు. సమావేశాల్లో ఎక్కువసేపు మాట్లాదలేకపోతున్నారు. శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టకూడదని అతనికి స్పష్టంగా బోధపడింది. అందుచేత యూనియన్ కార్యక్రమాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
    ట్రేడ్ యూనియన్లలో ఎన్నికలు జరగడం అరుదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై క్రొత్త కమిటీని నిర్ణయించి, జనరల్ బాడీ మీటింగ్ లో తెలియజేస్తుంది. రాత్రి జరిగిన సమావేశంలో స్వచ్చందంగా యూనియన్ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పుకున్నాడు వినాయకరావు. అతని స్థానంలో యూనియన్ ప్రెసిడెంట్ గా రామకృష్ణ ఎన్నుకోబడ్డాడు.
    వారానికి ఒక రోజు భార్యని తీసుకుని రామకృష్ణ ఇంటికి వెళ్ళి గడుపుతున్నాడు వినాయకరావు. కూతురు, కొడుకు దూరంగా ఉండడం వల్ల రామకృష్ణనే తమ కొడుకుగా చూసుకుంటున్నారు. యూనియన్ కార్యకలాపాల్లో తనకున్న అనుభవంతో రామకృష్ణని కొద్దికాలంలోనే తీర్చిదిద్దాడు.
                                  *    *    *
    జైలు నుండి విడుదలయ్యాడు వెంకటేశం.
    ఇంటికొచ్చిన తరువాత కూడా అతను తల్లితో మాట్లాడలేదు. ఉదయాన్నే నిద్రలేచి రోడ్డుమీదకు వచ్చి బస స్టాప్ దగ్గరున్న చెట్టు క్రింద కూర్చుంటాడు. బస్ స్టాప్ ఇంటికి సమీపంలోనే ఉండటంవల్ల అతను తల్లికి కనపడుతూనే ఉంటాడు. మొదటి రోజు కొడుకు భోజనం కోసం వస్తాడని ఎదురు చూసింది. చాలాసేపు చూసి తనే వెళ్ళి పిలిచింది.
    అతను పలకలేదు.
    ఏం చెయ్యాలో తోచలేదు. చివరికి ఓ ప్లేటులో అన్నం తీసుకెళ్ళి కొడుకు దగ్గరపెట్టి తిరిగొచ్చింది. కొద్దిగా తిని మిగతాది ఒక కుక్కకి వేశాడు. రాత్రిపూట మాత్రం నిద్రపోయే ముందు ఓ గ్లాస్ మంచినీళ్ళు త్రాగుతాడు. క్రమంగా అతని తల్లికి జ్ఞానోదయమయింది. కట్నం కోసం వేధించి కోడలు చావుకి కారణమైన తను కొడుకు అభిమానం పోగుట్టుకున్నానని తెలుసుకుంది. ఆ విషయం వినిపించనట్టే వెళ్ళిపోయాడు చెట్టు క్రింద కూర్చోవడానికి.
    వెంకటేశం రూపం ఓ సాధువు రూపంలా తయారయింది. తల, గెడ్డం పెరిగిపోయాయి. ఉదయం నుంచి చీకటి పడేవరకూ కూర్చోవడం వల్ల దుమ్ము పట్టింది. ఒక రోజు మిలిటరీలో పనిచేస్తున్న అతని స్నేహితుడు శెలవులో ఇంటికొచ్చిన విషయం తెలుసుకుని వెంకటేశం తల్లి వెళ్ళి తన గోడు చెప్పుకుంది. అతనొచ్చి వెంకటేశాన్ని చూసి షాక్ తిన్నాడు. గబగబా వచ్చి అతన్ని పలకరించాడు. భుజాలు పట్టుకుని కుదిపేశాడు. దేనికీ సమాధానం లేదు. విసుగు చెందకుండా మాట్లాడించడానికి ప్రయత్నించాడు. విసుగెత్తి చివరకి వెళ్ళబోతూ,
    "ఎవరి కోసంరా చూస్తున్నావ్?" అన్నాడు.
    ఆ ప్రశ్న అర్ధమైనట్టు కొద్దిగా కదిలాడు. అతని పెదాలు సన్నగా గొణిగాయి.
    మరోసారి అదే ప్రశ్న అడిగి చెవులు రిక్కించాడు.
    "నా భార్య కోసం చూస్తున్నాను."
    వెంకటేశం పెదాల నుండి వచ్చిన జవాబు అది.
    "ఎక్కడ నుంచి వస్తుంది?"
    "పుట్టింటి నుంచి కట్నం తీసుకుని వస్తుంది...."
    స్నేహితుని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అతను అక్కడా నుంచి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సమాధానం చెప్పని వెంకటేశం, "ఎవరి కోసం చూస్తున్నావ్?" అవి ప్రశ్నిస్తే మాత్రం "నా భార్య కోసం." అని చెబుతాడు.
    ఇప్పటికి కూడా అతను అక్కడే కూర్చుంటాడు. అదే సమాధానం చెబుతాడు!
                                                                        (శుభం)


 Previous Page

WRITERS
PUBLICATIONS