Previous Page Next Page 
యువత నవత పేజి 39

   
    "అయితే నా దగ్గరికి ఎందుకొచ్చావు?"

    "బుద్దిలేక!" కొంగు జాడించి భుజంమీద వేసుకొంటూ వెళ్ళిపోయింది పుల్లమ్మ.
 
    ఆ రంగిని కసాయిలాంటి ఆ మగడి దగ్గరకే కాపురానికి పంపిస్తుంది కాబోలు! ఎంత అజ్ఞానం? ఎలా వీళ్ల అజ్ఞానం తొలగించడం?

    మహిళా మండలి ప్రెసిడెంట్ తో, సుజాత మీద జరిగిన అత్యాచారం గురించి చెప్పి "దోషులను అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలారు. వాళ్లు సాక్ష్యాలను తలక్రిందులు చేయడానికి డబ్బు  సంచులు పట్టుకు తిరుగుతున్నారు వాళ్లను తిరిగి అరెస్ట్ చేయాలని, సుజాతకు న్యాయం కలుగ జేయాలని మహిళలను సమీకరిస్తున్నారు.  మీ గ్రామం నుండి ఓ పది పదిహేనుగురు మహిళలైనా రాగలరా?" అనడిగింది సుధ.

    "వచ్చి ఏంజేయాలి?" అడిగింది సత్యవతి.

    "సుజాతకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, బానర్లు పట్టుకొని ఊరేగింపు జరపాలి. కలెక్టరేట్ కు ఊరేగింపుగా వెళ్లి మహిళల సంతకాలతో ఒక మెమొరాండం సమర్పించాలి"

    "అట్ల వీధినబడి తిరిగితే ఇంక మా మగోళ్ళు ఇండ్లకే రానీయరు! మహిళామండలి పెట్టుకొన్నందుకే మేమేదో చెడిపోతున్నట్టు మాట్లాడుతున్నారు ఊళ్లో!"

    "మహిళామండలి పెట్టుకొని చెడిపోయారా? ఏం చెడిపోయారట?" ఆశ్చర్యంగా అడిగింది సుధ.

    "మగాళ్ల మాట వినడం లేదటమేం"

    "ఆ విషయం మీద నేను మరోసారి మాట్లాడతానుగాని, సుజాతకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఊరేగింపుగా వస్తే మీ మగవాళ్ళు ఎందుకు ఇళ్లకు రానియ్యరు?"

    "వీధినపడి తిరిగితే ఎవరు రానిస్తరు?"

    "వీధిన ఎందుకుపడుతున్నారు? నీ సాటి స్త్రీకి జరిగిన అన్యాయం కోసమే కదా? మళ్ళీ ఇంకో స్త్రీకి అలాంటి అన్యాయం జరగకుండా బుద్ది చెప్పడం కోసమేకదా? ఇవాళ ఎవరో సుజాత అయింది. రేపు మీ ఇంట్లోనే అవుతుంది. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడగలరా?"

    "అడిగి చూస్తాను. ఎవరైనా వస్తారో లేదో?"

    ఆ ఊళ్లో ఇద్దరు ఎస్ సి లకు కుట్టుమిషన్ లు శాంక్షన్ అయ్యాయి. ఆ సంగతి మాట్లాడడం కోసం సర్పంచ్ దగ్గరికి వెళ్లింది సుధ.

     "నమస్కారం రెడ్డిగారూ!"

    "నమస్కారం!కూర్చో. ఏంది? మా  వూళ్లో మహిళామండలి అని పెట్టి మా ఆడోళ్లకి లేనివి నేర్పిస్తున్నావంట!"

    "ఏం నేర్పించాను? " తెల్లబోయింది సుధ.

    "ఆ పుల్లి కూతుర్ని కాపురం విడిపించమని చెప్పినవంటగా? మగోళ్లందరికీ ఏదో ఓ బలహీనత వుంటది! అయితే పెళ్లాలు విడిచిపెట్టి పోవడమే? ఇంకోణ్ని కట్టుకొంటే ఆడు బుద్దిమంతుడు అవుతడంటావా? లేక ఆడోళ్లంతా సన్యాసం పుచ్చుకొంటారంటవా?"

    "సన్యాసం పుచ్చుకోకుండా, ఇంకోణ్ణి కట్టుకోకుండా ఆడది తన బ్రతుకు తను బ్రతికే అవకాశాలు ఉన్నాయండీ!"

    "ఈ ఆడవాళ్ళందరికీ నీవుగాని, నీ గవర్నమెంటుగాని ఏం చూపుతది ఆధారం? వాళ్లకోసం  ఎన్ని అనాధశరణాలయాల్ని కడతారంట?"

    "నేనైనా, ప్రభుత్వం అయినా దగా పడిన ఆడవాళ్లను తమకాళ్ల మీద తాము నిలబడేందుకు నేర్చుకొమ్మని చెబుదాం! నిరాశపడి క్రుంగిపోకుండా వాళ్లకోసం స్టేట్ హోంలు వున్నాయని చెబుతాంకాని, స్టేట్ హోంలకోసం మగళ్లనీ, కాపురాలనీ వదులుకొమ్మని చెప్పటంలేదు. మగడు యముడైనా వాడినే పట్టుకు వ్రేళాడాలని ఎందుకు చెబుతారండీ మీరు?"

    "యముడైనా వాడికీ భార్య వుంది. కాపురంచేసి చక్కగా పిల్లల్ని కంది. పురాణాలు చదువుకోలేదా? విలేజ్ వర్కర్ గా నీ పనేదో నువ్వు చూసుకో! కుట్టుమిషన్లిప్పించడం, లోన్లు ఇప్పించడం అంతవరకే నీ పని. అంతేగాని, ఆడోళ్లే ఎందుకు వంటజేయాలి?ఆడోళ్లే  పిల్లల్ని ఎందుకు కనాలి?అనిమాత్రం వెర్రెక్కించొద్దు ఆడోళ్ల తల్లోకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS