Previous Page Next Page 
యువత నవత పేజి 38

 

                                    6


    ఆ రోజు కంబాళాపురం వెళ్లింది సుధ. మహిళామండలి ప్రారంబోత్సవం తరువాత ఇదే వెళ్ళడం.

    "అదేదో మయిలామండలి పెట్టినవంటకద తల్లీ! నా బిడ్డనేం చేస్తరో చేయండి. "పొలం పనులకు  కూలికి వెళ్ళే ఒకామె తన పదహారేళ్ళ కూతురితో వచ్చింది, ఆమె పేరు పుల్లమ్మ.

    "అట్లా ఏడవొద్దు! మామూలుగా చెప్పు! ఏం జరిగింది?"

    "ఏడుస్తూ, చీదుతూ చెప్పింది పుల్లమ్మ.

    ఆ పదహారేళ్ళ అమ్మాయి పేరు రంగి. దానికి పన్నెండేళ్ళకే పెళ్లి చేసేశారు. పక్క ఊరే దాని అత్తవారి వూరు. కాపురానికి వెళ్లి రెండేళ్లయింది. దాని మగడు ఉత్త తాగుబోతు. పనికి దున్నపోతు, ఆలుమగలకి వాడు  క్షణం పడదు. రంగికి దేహశుద్ది జరగని రోజుండదు. రెండురోజుల క్రితం వాడు కొట్టిన దెబ్బల ప్రాణం పోవలసిందే. తల చిల్లిపడి  దోసిళ్ల కొద్దీ రక్తం కారిపోయింది. రెండు మూడు గంటల వరకు దానికి స్పృహే లేదు. ఇది చచ్చినట్టుగా పడుంటే వాడు భయపడి పారిపోయాడు. దీనికిప్పుడు కొంచెం మతి చెదిరినట్టుగా అయింది. కళ్లు కూడా సరిగా కనిపించడం లేదంటూంది.

    ఇది రంగి దయనీయగాధ.

    "ఆడు అల్లుడుకాడు! నా పిల్లపాలిటి యముడు. ఆడికెట్టనన్న బుద్ది చెప్పాలే. ఆణ్ణి తోవకు తేవాలె! అంది పుల్లమ్మ ముక్కు చీదుతూ.

     "వాడి సంగతి వదిలిపెట్టు. ముందు నీ బిడ్డను మంచి డాక్టరుకు చూపి చికిత్స చేయించు! లేకపోతే అది గుడ్డిది, పిచ్చిదీ అయిపోయే ప్రమాదం వుంది" అంది సుధ.

    "ముందు దాని  కాపురం సక్కబడే ఉపాయం జెప్పు తల్లీ"

    "అంత దుర్మార్గుణ్ణి ఎవరేం చక్కజేస్తారు? మగడుకాదు యముడైనా వాడి దగ్గరే నీ బిడ్డ బ్రతుకు తెల్లవారాలన్న పట్టుదల నీకెందుకు?"

    "మగణ్ణిడిసింది ఓ మడిసేనా అంటరుకద తల్లి జనం. ఈ మందితో చచ్చి పడింది తంట!"

    "మీ ఇళ్ళలో మారు మనువు వుందికదా?"

    "సీరకట్లదంటె సులకనైపోతది. ఈణ్ణి కాదని ఇంకోణ్ణి కట్టుకొంటే ఆడు మాత్రం మంచోడైతడని ఏం ఖరారు తల్లీ? ఈడుకాదని ఇంకోకడు, ఆడుకాదని ఇంకోడు, బతుక్కి ఓ నీతి ఏడుంటది? నీతిలేని బతుకూ ఓ బతుకేనా?"

    " ఇంక నేనిచ్చే సలహా ఏమిటి పుల్లమ్మా?"

    "నా బిడ్డకు ఏదన్నా దారి చూపించండి!"

    "నా సలహా వినేట్టయితే ముందు ఆ మగడితో తెగతెంపులు చేసుకొమ్మని చెబుతాను. ఇలాంటి వాళ్లకోసం ప్రభుత్వం అనాధ శరణాలయాన్ని  నడుపుతూంది. తీసికెళ్లి అక్కడ చేర్పించి వస్తాను. చదివినంత  వరకు  చదువు చెబుతారు. చేతి పనులు చేర్పిస్తారు. జీవితానికి ఒక ఆధారం కల్పించి బయటికి పంపిస్తారు! నేను రేపు మళ్లీ వస్తాను! ఏదో ఒకటి నిర్ణయించుకొని నాతో పంపించు!"

    మరునాడు వెళ్లింది సుధ.

    "మీరు పోయినంక మా పెద్దరెడ్డిని కల్సిన, అనాధ శరణాలయం అని పేరేగాని, ఆడ అన్ని కతలు నడుస్తయంట! పెద్దోల్లతోటి పనులు చేయించుకోను,  ఆళ్ల పక్కలకు  ఈ పిల్లలను  పంపుతారంటగా? ఈ పిల్లలతోటి యాపారం కూడా సేయిస్తరంటగా? వద్దు తల్లీ నీ సాయం. నా పిల్లను కలోగంజో పోసి సాక్కుంటగాని నీ ఎంట పంపను" అంది పుల్లమ్మ.

     "ఆ రెడ్డి  ఎవరో పేరు చెప్పు పుల్లమ్మా. అతడు ఎక్కడ చూసి ఈ మాటలు చెప్పాడో అడుగుతాను. ఎక్కడో కథల్లో బుద్దిలేని రచయితలు రాసిన రాతలను పట్టుకొని "అనాధ శరణాలయం" అంటే ఇంత భయంకరంగా ప్రచారం చేయడం సహించరాని విషయం" సుధ కోపంగా అంది.

    "కతల్ల మాతరం లేంది ఎందుకు రాస్తరు?"

    "బుద్దిలేక అని చెప్పా కదా? నాకు తెలిసినంతవరకు స్టేట్ హోం లు అలాలేవు. అక్కడ చాలా ఖచ్చితమైన నిబంధనలుంటాయి. మేడమ్ పర్మిషన్ లేకుండా కాంపౌండ్ దాటేందుకు వీలుండదు మగపురుగుకూడా  తొంగి చూసేందుకు వుండదు. అక్కడ చేర్చిన ప్రతి ఆడపిల్లా ఆత్మవిశ్వాసం పెంచుకొని,  తన కాళ్ళ మీద నిలబడేందుకు తయారు చేయబడుతుంది. అంతేగాని, ఎవడో పిచ్చిగా కూసినట్టుగా అక్కడ అలాంటి పనులు జరగవు."

    "వొయసు పిల్ల! దాని వొయసు అది మింగుకోవాలంటే కష్టమే కదా? మంచోడో, చెడ్డోడో మగడున్న ఇది ఇక ఏం జేస్తే వస్తది ఆడదానికి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS