Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 38

                                      నేనూ - బుజ్జిపండూ......

    కిటికీలోంచి బయటికి చూసిన నా కళ్ళు గిర్రున తిరిగాయ్. గుండె బరువుగా కొట్టుకుంటూ తన స్థానంలోంచి కాస్త కిందికి జారింది. ఒళ్ళంతా జలదరించింది. కుతూహలం పట్టలేక తల ఉచల మధ్యలోంచి బయటికి పోనిచ్చి మెడ మరీ ముందుకుచాచి కళ్ళ రెప్పలు రెపరెపలాడించి చూశాను.ఉహు...కలకాదు, నిజమే.

    అలా కొన్నిక్షణాలు అవాక్కయిపోయిన నేను మళ్ళీ నా తల నేను గదిలోకి తీసుకుందామంటే కుదరలేదు. గట్టిగా లాగాను, అబ్బే... లాభం లేకపోయింది.ఊచలమధ్యన ఇరుక్కుపోయింది.

    మెడకాస్త ఇటుప్రక్కకి త్రిప్పిలాగాను. కాస్సేపు అటుప్రక్కకి త్రిప్పిలాగాను. కానీ తలమాత్రం రాలేదు.

    "హు...ఈ తలలు ఎప్పుడూ ఇంతే. ఊచల మధ్యనుండి వెళ్ళడం సులభంగా వెళ్తాయి గానీ మళ్ళీ వెనక్కురావు" అని విసుక్కున్నాను.

    నేను నా తలని లాక్కోవడం పీక్కోవడం ఆ దారినపోయే జనం చూశారు, కాస్సేపు ఆనందించారు.

    "అయ్యా... ఆనందించడం అయ్యిందా ఇంకా ఏమైనా ఉందా?" అని ఊచల మధ్య అటు ఇటూ త్రిప్పుతూ కోపంగా అడిగాను వాళ్ళని.

                                           

      వాళ్ళందరూ ఒక్కసారిగా నాలుకలు కొరుక్కుని (ఎవరివివాళ్ళే) నా తలని తంటాలుపడి గదిలోకి తోశారు.

    ఇంతకీ నా కళ్ళు తిరగడానికి. తల ఊచల మధ్య ఇరుక్కోవడానికి కారణం తెలుసా?

    ఒక అందమైన అమ్మాయి!...

    ఇన్నాళ్ళూ మా ఎదురిల్లు ఖాళీగా ఉంది. ఈరోజే ఎవరో ఆ యింట్లో దిగారు. కారులోంచి ఆ అమ్మాయి దిగుతుంటే నేను కిటికీలోంచి చూశాను. అంతే... నా కళ్ళు తిరిగాయ్... గుండె జారింది. ఊచలమధ్య నా తల ఇరుక్కుంది.

    ఆ అమ్మాయి చంకలో ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడికి నాలుగేళ్ళుంటాయి. బహుశా ఆ అమ్మాయి తమ్ముడనుకుంటాను. మరో అడ్డచారల బనీనువాడు కూడా ఉన్నాడు. అతను ఆ అమ్మాయి అన్నయ్య అనుకుంటా. ముసలి దంపతులు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కావొచ్చు. మరో ఎత్తుపళ్ళ నల్లమ్మాయికూడా ఉంది. ఆ అమ్మాయి బహుశా వాళ్ళ పనిపిల్ల కావొచ్చు.

    అందరూ కలిసి నా తలనిపట్టి గదిలోకి తోస్తుంటే ఆ హడావుడికి ఆ అమ్మాయి వరండాలోకి వచ్చి నన్ను చూసింది. కాస్త చిర్నవ్వుకూడా నవ్వింది.

    ఆ నవ్వు బెల్లాన్ని ఈగలు తినేసినట్టు నాగుండెని తినేసింది.సంతోషంతో ఉక్కిరి బిక్కిరయిన నాకు ఊపిరిసలుపలేదు.

    దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారేమో!

    నేను ప్రేమలో పడ్డాను!!...

    "యాహూ!!...."

    ఎగిరి గంతేసి మళ్ళీ కిటికీ ఊచల్లో తల దూర్చబోయాను. కానీ బయటి జనాన్ని చూసి ఆగిపోయాను.

    "పెట్టునాయనా పెట్టు. మళ్ళీ ఇలాంటిదేదో చేస్తావనే ఇలా కాచుకుని ఉన్నాం" అన్నారు వాళ్లు కోపంగా.

    నేను చెంపలు వాయించుకుని కిటికీ తలుపులు మూసేసుకున్నాను.

    ఆరోజు పగలంతా నా మనసు నా మనసులోలేదు. రాత్రంతా కళ్ళకి నిద్రలేదు. ఇలా అయితే లాభంలేదని మా చంచల్రావు గాడి దగ్గరికి వెళ్ళాను.

    వాడు నన్ను చూస్తూనే "ఏంట్రారేయ్....కళ్ళు ఎర్రగా వాచి వున్నాయ్ కళ్ళకలకా!"అన్నాడు భయంగా వెనక్కు జరుగుతూ.

    "కాదు!... గుండె జబ్బు!" అన్నాను నేను ఊపిరి భారంగా పీలుస్తూ.

    చంచల్రావు సర్రున నా దగ్గరికి వచ్చాడు.

    నేను ఆశ్చర్యపోయాను. ఎంత గట్టిగా ఊపిరి పీల్చకపోతే వాడలా జర్రున నా దగ్గరికి వస్తాడు?!...

    "అబ్బే.. అదేం కాదులేరా బుచ్చిబాబూ. నా అంతట నేనే నీ దగ్గరికి వచ్చాను" అన్నాడు నా ఆశ్చర్యాన్ని గమనించి. "ఇంతకీ ఏం జబ్బన్నావూ?"

    "గుండె జబ్బు" అన్నాను మళ్ళీ భారంగా ఊపిరి పీలుస్తూ.చంచల్రావు చొక్కా సర్రున పైకిలేచి ముక్కుకి అతుక్కుంది.నేను ఊపిరి వదిలాను. వాడి చొక్కా క్రిందికి వాలిపోయింది.

    చంచల్రావ్ బేర్ మంటూ నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు.

    "అబ్బే... బాధపడకు. గుండెజబ్బు అంటే అలాంటిది కాదు. ప్రేమ జబ్బు గుండెనిపట్టి తినేస్తోంది...."

                                        

       చంచల్రావు కళ్ళు చిట్లించి "చెప్పేది సరిగ్గా చెప్పేడువు" అన్నాడు.

    నేను చంచల్రావు కళ్ళరెప్పలు దగ్గర పట్టుకుని మెలేశాను. బుగ్గలు పట్టుకుని లాగాను. కాస్త గొంతునులిమేను. గట్టిగా కౌగిలించుకుని మెడవెనుక కొరికాను. రెండు చేతులూ చొక్కాలోంచి పోనిచ్చి కసిగా గోళ్ళతో వాడివీపు గీరాను. వాడు బాధతో గిలగిల్లాడాడు.

    "మరేమో చెంచిగా... అసలేం జరిగిందంటే..." వాడి వేలు కొరుకుతూ చెప్పబోయాను.

    చటుక్కున వాడి చెయ్యి నా నోట్లోంచి లాక్కుని "నువ్వేం చెప్పనక్కరలేదు... నాకు అర్థం అయ్యింది. ఇన్నాళ్ళూ మీ ఎదురిల్లు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో దిగారు. ఆ ఇంట్లో ఓ అందమైన అమ్మాయి ఉంది.ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావ్... అంతేనా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS