Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 39

ఇన్ని యిళ్ళు తిరిగినా
నీ గుండెబరువు దింపుకోడానికి ఒక్క గడపలేదు
ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు

    *     *     *   
                    ---1959

*తంగిరాల వెంకటసుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలాశాఖ జరుపుకొనే వార్షికోత్సవానికి పోస్టుమాన్

మీద వ్రాయమని కోరినప్పుడు వ్రాసి యిచ్చిన గేయం.

కఠినోపనిషత్

నీడల కొండచిలువలువెలుతురు కుందేళ్ళను మింగి
సంఘపు మర్రిచెట్టును చుట్టుకొని మత్తుగా నిద్రపోయే సమయాన
మానవారణ్యంలోని పెద్దపులులు
జరీ కండువాలు, బిరుదాంకితమైన సువర్ణపతకాలు ధరించి
సిటిలో సభావేదిక మీద కథాకేళి నృత్యం చేస్తున్న కాలాన
సాయం విహారార్ధమరిగే

చక్కని చుక్కల మినుకు మినుకు వెలుగుల్లో
చలిగాచుకునే పడుచువాళ్ళ
చప్పెట్ల తప్పెట్లు మ్రోగే ముహుర్తాన
అతగాడు ఒక్కడూ ఊపిరాడని గదిలో
జిడ్డుతేరిన ముఖాన్ని కన్నీళ్ళతో టాయిలెట్ చేసుకుంటున్నాడు.

అర్ధరాత్రి థియేటర్లలో అర్ధనగ్న లాస్యానికి సెక్సీ హాస్యానికి
అమెరికన్ జాకెట్లు తొడిగిన బంగారప్పిచికలు కిచకిచలాడినపుడు
ఊరవతల సందులలో అంగళ్ళలో
విక్రయార్ధం రంగేసిన రకరకాల మొగాల్ని పేరుస్తోన్నప్పుడు
యుద్ధాల్ని సృష్టించే మహానాయకులు
దేశాల సరిహద్దులలో నిలబడి
ద్వేషాల శతఘ్నులు పేలుస్తూన్నప్పుడు
అకాల మరణం పొందిన అనాధ బాలుణ్ణి
ఒడిలో పెట్టుకుని అతగాడు ఎర్రని కళ్ళతో
ఏమీ ఎరగని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS