అస్సాం రైఫిల్సులో సోల్జరు సిమ్మాచలం
కోసం నిరీక్షణ
క్షణ క్షణ ప్రతీక్షణ
ఒక కార్డుముక్క వ్రాశాడా
బంట్రోతు వెళ్ళు వెళ్ళు త్వరగా
ముసలిదానికి మంచివార్త నందించు
ముడతలు పడిన మొహంమీద ఆనందాన్ని పరికించు
దూరభారాన ఉన్న కుమారుని కోసం
వగచే తల్లికి
చేరువచేరువౌతున్న నువ్వొక ఊరట
దగ్గర దగ్గరౌతున్న మిత్రుని లేఖకోసం
నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట
వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి
ఉద్యోగ శప్తుడైన నవీన యక్షునికి
మనిషికి రాక్షసునికి
నువ్వు
దూరాల దారాల్ని విచిత్రంగా
ఒకే నిముషము
అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి-కూర్పరివి-
అదృష్టాధ్వంమీద నీ గమనం
శుభశుభాలకి నువ్వు వర్తమానం
నీ మేజిక్ సంచిలో
నిట్టూర్పులు నవ్వులు పువ్వులు
ఆనందాలు అభినందనలు ఏడుపులు
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో
ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!
కొందరికి పరిచయమైన నవ్వు
కొందరికి తలపంకించిన నవ్వు
కొన్ని వైపులకు చూడనే చూడవు
అందరికీ నువు ఆప్తబంధువువి
అందరికీ నువు వార్త నందిస్తావు
కాని నీ కథనం మాత్రం నీటిలోనే మధనం
అవుతూంటుంది
