Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 40

వెలుగును వెనక్కి నెట్టుతూ రేపటిరోజుకి
పదివేల సంవత్సరాలనాటి పాతముఖాన్ని అతికించేందుకు
ఒక హాహా హుహూవు ప్రయత్నిస్తోన్న ప్రాతఃకాలాన
కాలాన్ని సాగదీసి సాగరాన్ని మధించి ఖగోళాల నావర్తించి
అధునాతన భావుకులు స్వప్న భుక్కులు

వర్తమాన శిరస్సున వధించిబోయి సమయాన
గత భూతకాల ప్రసక్తిలేక గగన పాతాళాలమధ్య
ఏటవాలుగా జారే విలాసులు తత్ క్షణ ప్రయోజన సాధకులు
చిరునవ్వులు చిందే విషమ సంధ్యవేళ
అతగాడు మూడవ పరిమాణంలోని ఊహలకి
ఆకారం కల్పించలేక తికమక పడుతున్నాడు.

నెత్తుటిలో దోగుతూన్న చరిత్ర శిశువుకు
బొడ్డుకు బదులు పొట్టనుకోసిన అవివేకపు మంత్రసానులవలె
దేశాధినేతలు తెల్లబోయి నిల్చిన సమయాన
కోరికలకీ, సంతృప్తికీ మాటకీ ఆచరణకీ మనిషికీ మనసుకీ
మధ్య అగాధాలు నిలిచి ఆవులించే క్షణాన
అందాన్ని హత్యచేసి వికృత ఆనందాన్ని చంపి అశ్రువు
జీవితపు మైదానం మీద ఒడంబడిక చేసుకున్న రోజున
అతగాడు పరీక్షనాళికలో ఎండిన నాగరికత గుండెని పరీక్షించి
కొంచెం కొంచెం తన నెత్తురుతో తడుపుతున్నాడు.

చీలిన జీవితాల నెరదలలోంచి వచ్చే అస్పష్టపు ఆక్రందన ధ్వానాలు
భయంకర రహస్యాలపైన నల్లని విస్మృతీ వస్త్రం కప్పే వేళ
తూలిన తాగుబోతు కూలిన యింటి నడికుప్ప
బ్రతుకు రైలుదారిలో వాలిన మృత్యువు రెక్క
ఒకే ఒక్క కాన్వాసుమీద ఆర్టిస్టులు చిత్రిస్తోన్న నిమిషాన
కష్టాల బాధల ఙయాల పర్వత శిఖరాలపైన నిలచిన
కాంక్షా నీహారాల ఆశాసూర్యుడు ప్రతిఫలింప
   
ఏడురంగుల ఇంద్రధనస్సు లెక్కపెట్టి కోట్లకొలది జనులు
ఎండమావుల పండగలు చేసుకునే సమయాన
అతగాడు తెగిన ఫిడేల్ తీగల్నీ
కదలని గడియారపు గుండెల్ని చినిగిన స్వప్నపు సంచుల్నీ
రిపెయిర్ చేసే ప్రయత్నంలో నిమగ్నుడయ్యాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS