రణధీర్ కి ప్రతిఘటించే శక్తిపోయింది. పరుశురాం పరుశురాముడిలా విజృంభించి రణధీర్ ని కొట్టుకొంటూ, ఈడుస్తూ కారిడార్ దగ్గరికి లాక్కొచ్చాడు.
ఆ దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ అది నిజమా? కలా? అని దిగ్భ్రాంతిలో పడిపోయారు కాలేజీ స్టూడెంట్స్.
రణధీర్ ని ఎదుర్కోగల మగాడు కాలేజీలో లేడని అప్పటివరకూ అందరూ అనుకునేవారు.
అనూష చెప్పు తీసుకుని రణధీర్ చెంపలపైన కొట్టింది. అది చూసి ఆడపిల్లలు కేరింతలు కొడుతూ చెప్పులదండ తీసుకొచ్చి రణధీర్ మెడలో వేశారు.
"మరోసారి పిచ్చివేషాలు వేయకు. నిన్ను ఈ బస్తీలోనే వుండనివ్వను" అన్నాడు పరుశురాం.
రణధీర్ విసుగ్గా అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
అనూష ఆరాధనతో చూస్తూ అంది పరుశురామ్ తో--
"ఇప్పుడొప్పుకొంటున్నాను. మగాడివంటే నువ్వే!"
17
రణధీర్ ఆ పగతోనే తనని దెబ్బ తీశాడని పరుశురాం గ్రహించాడు.
రణధీర్ తో అతను గొడవ పడిందే అనూష కోసం, ఆమె రెచ్చగొడితేనే రణధీర్ ని, అతని స్నేహితులని కొట్టాడు.
కానీ అనూష నిజానిజాలని తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. తను చెప్పిన ఓ చిన్న అబద్ధానికే ఆమె జరిగింది నిజమని నమ్మేసింది.
ఆడవాళ్ళంతే!
ఉద్రేకం, ఆవేశం వస్తే ఎదుటి వాళ్ళ మాటని అసలు వినిపించుకోరు. దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలకి వాళ్ళే బాధ్యులైనా దాన్ని కూడా ఎదుటి వాళ్ళపైకి నెట్టేస్తారు.
వాదంతో, కామంతో కళ్ళు మూసుకుపోలేదు తనకి.
అలాంటి అవకాశమే కావాలనుకుంటే తనని ఊర్మిళ కాదంటుందా అనూష నిరాకరిస్తుందా?
ఆఖరికి సరస్వతి తన తప్పిదానికి పరిహారంగా తన చేతుల్లో నలిగి పోవడానికి సిద్ధపడింది.
అనూష విషయంలో ఎన్నోసార్లు అవకాశం వచ్చింది అయినా తను అడ్వాంటేజ్ తీసుకోలేదు.
ఆ మాత్రం ఆలోచనకూడా లేకుండా అనూష తనని తీవ్రంగా అనుమానిస్తోంది.
ఆ బాధే అతని గుండెని ముక్కచెక్కలు చేస్తోంది.
సరస్వతి అనూష దగ్గరకెళ్ళి నిజం చెప్పచ్చు. పోలీసు కేసు ఉప సంహరించవచ్చు.
కానీ తను నష్టపోయిన దానికి పరిహారం ఎవరూ చెల్లించలేరు. పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఎవ్వరూ ఇవ్వలేరు.
అందుకే నిశ్చయించుకున్నాడు.
రణధీర్ నిజరూపాన్ని బయట పెట్టాలి. వాడి మెడలు విరగ్గొట్టి నిజాన్ని దక్కించి తను నిర్దోషినని ఋజువు చేసుకోవాలి.
పరుశురాం ఉగ్రుడై, ఆవేశంతో మహారుద్రుడై అడుగులు వేస్తుంటే అతను వేసే ప్రతి అడుగు భూదేవి గుండెలపైన పడుతోంది.
అంత ఆవేశంలోనూ అతను తను నిర్దోషినని రుజువు చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నాడే తప్ప కక్ష సాధింపు ధోరణి అతనిలో లేదు.
రాత్రి ఎనిమిది దాటింది. వీధి దీపాలు అక్కడొకటి అక్కడొకటి వెలుగుతున్నాయి. చలిగాలి రివ్వున వీస్తోంది.
పరుశురాం వడివడిగా నడుస్తున్నాడు.
ఆ సందు చివర ఇంట్లో అద్దె గదుల్లోనే ఉంటున్నారు రణధీర్, అతని మిత్రులు. రణధీర్ మామ ఎమ్మెల్యేగారిల్లు ఎప్పుడూ బిజీగా ఉండడంచేత తన కార్యకలాపాలకి అడ్డంకి ఉండకూడదని స్నేహితులతో కలసి ఉంటున్నాడు.
గేటు తీసుకొని మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు పరుశురాం.
తలుపులు మూసి వున్నాయి. తలుపు నెట్టబోయిన వాడల్లా లోపల నుంచి కేరింతలు, కేకలు, నవ్వులు వినబడ్డంతో ఆగిపోయి కిటికీలోంచి తొంగిచూశాడు.
రణధీర్, అతని స్నేహితులు గోవిందు, రెడ్డి, ప్రభు, గొట్టాం సాయిలు, పాండు ఉన్నారు గదిలో.
వాళ్ళు చాప మీద కూర్చుని మందుకొడుతున్నారు. ఎదురుగా తిను బండారాలు పెట్టుకొని మధ్య మధ్యలో తింటున్నారు.
"అందరూ ఒకేచోట ఉన్నారు నా కొడుకులు" అనుకున్నాడు పరుశురాం.
"ఎంతైనా నీ గొప్పతనం మరోడికి రాదు గురూ" పొగిడాడు రెడ్డి రణధీర్ ని.
రణధీర్ పెళ్ళుమని నవ్వాడు.
"మనం కొట్టేది చావుదెబ్బ రెడ్డీ. అది తెలీక మనతో దెబ్బతింటారు తెలీని సన్నాసులు."
"నువ్వేం చెప్పు! కానీ నీ ప్లాన్ అమోఘం గురువా! లేకపోతే వాడు నిన్ను కుక్కని కొట్టినట్లు కొడతాడా?"
గొట్టాం సాయిలు తాగుతున్న మైకంలో వాగుతున్నాడు.
"అంత అవమానం చేసినందుకే ఆ నాయాలని బొక్కలోకి తోయించేశాడు మన గురుడు. అంచేత ఈ మందు మరో రౌండు మొదలుపెట్టే ముందు గురూజీకి ఓసారి 'జై' కొట్టండి" అన్నాడు పాండు.
"పరుశురాం గాడ్ని పోలీసులు కైమా కొట్టారటరా" గోవిందు కిసుక్కున నవ్వాడు
"లేకపోతే మనని అలా పిచ్చికొట్టుడు కొడితే విడిచిపెడతామా?" ప్రభు అన్నాడు.
"అసలు వాడ్ని చూసి పిచ్చివెధవ అనుకునేవాడ్ని! ఒంటరిగా కూర్చుని పేక ఆడుకుంటుంటే ఏదో మబ్బుగాడులే అనుకున్నానుర్రా! కాఫీ నా నడుం విరగ్గొట్టాడు. వాడ్ని విడిచిపెట్టకుండా రోస్ట్ చేయించండ్రా బాబూ!" గొట్టం సాయిలు ఏడుపు మొదలుపెట్టాడు.
