కోడలు అలిగినవేళ
పండుగ ముందురోజు వస్తారనుకున్న కూతురు, అల్లుడు పండుగ నాలుగైదు రోజులుండగానే కూతురోక్కతి రావడం ఒకింత అనందం కంటే ఆశ్చర్యాన్నే ఎక్కువివ్చింది. ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్నిచ్చింది శేషగిరిరావుకి, ప్రభావతికి. 'అదేమిటి ఇవాళ వస్తారనుకోలేదు, మీ ఆయనేడి , నీ ఒక్కర్తివే వచ్చావేంటి?" గుమ్మంలో అడుగు పెట్ట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లీ, తండ్రి, తమ్ముడు సూట్ కేస్ అందుకొని లోపల పెట్టాడు.
"ఏం ఒక్కర్తీనీ రాకూడదా నేను" నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా -" అబ్బ, రాకూడదని కాదె బాబూ, యిద్దరూ కల్సి వస్తారనుకున్నాం, యింతకీ అతను పండగవేళకి వస్తానన్నాడా' తల్లి ఆరాటం.
"వస్తాడు, మహారాజులా వస్తాడు. ఎందుకు రాడు. అల్లుడుగారికి కొత్త కలరు టీ.వీ కొని వుంచండి పండుగ బహుమతిగా' వ్యంగ్యంగా అంది. శేషగిరి, ప్రభావతి తెల్లపోయారు.
"టి.వీ. నా పండక్కి టీ.వి కావాలన్నారా.....నాల్గునెలలు క్రితం లక్షా పాతిక ఖర్చు పెట్టి చేసిన పెళ్ళి ఖర్చు నించి యింకా తేరుకొనేలేదు. మళ్ళీ పదివేలు ఎక్కడ నించి తెచ్చి టి.వి. కొనాలి."
"ఏమిటి టి.వి. కావాలని అతనడిగాడా?"
'అడగకపోతే , నేనంటున్నానా....మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి నాలుగు రోజులు ముందు పంపించాడు, తెల్సిందా' నందిని కోపంగా అంది. ఇద్దరి మొహాలు కళ తప్పాయి. "నీవు చెప్పలేదా, మేం అంత టి.వి. ఇచ్చేటంతటి డబ్బున్నవాళ్ళం కాదని, మన దగ్గర అంత ఏం లేదని" ప్రభావతి అంది.
'చెప్పడం ఎందుకు అతనికి తెలీదా , నాన్న ఉద్యోగం?" మన తాహతు పెళ్ళి చేసుకున్నప్పుడు తెలీదా?" చురచురా చూసింది నళిని.
"ఏదో పండక్కి పిలిచి కొత్త బట్టలు పెట్టడం, అంతా కల్సి నాలుగు రోజులు సరదాగా గడపడం అనుకుంటాం గాని, ఇలా ఖరీదు బహుమతులు యివ్వడానికి మన దగ్గిరేం వుంది. ఇలా అడిగితే ఎక్కడ నుంచి తెస్తాం?" దిగులుగా అంది ప్రభావతి.
"మీరెక్కడ నుంచి తెస్తే అతనికేం, తలే తాకట్టు పెడతారో ఇల్లే తాకట్టు పెడతారో మీ సమస్య. అతనికి మీ గొడవతో ఏం సంబంధం? నందిని వరస చూస్తె అతనితో ఏదో తగువు పెట్టుకుని వచ్చిందనిపిస్తోంది. దీని కసలే నోటి దురుసుతనం జాస్తి. అతను టి.వి కావాలని అడిగేసరికి యిది నాలుగు దులిపి వచ్చేసినట్టుంది.
"నీవు అతనన్నప్పుడు కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పాల్సింది. నీవు ఆవేశపడి ఎగిరివుంటావు. కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదన్నది చెప్పాలి గాని....' ప్రభావతి మాట పూర్తీ కాక ముందే విరుచుకు పడింది నందిని.
'చెప్పానమ్మా, అన్నీ చెప్పా. ముందే నేనేం దెబ్బలాట పెట్టుకోలేదు. 'నీవే అన్నీచేపుతావెం. మీ వాళ్లీస్తామన్న నీవు పడనీయవు గాబోలు - వాళ్ళతో చెప్పు అల్లుడికి పండుగకి బహుమతీయడం ఏదో వింత అన్నట్లు మాట్లాడుతున్నావు. మా ఆడపిల్లకి మేం యివ్వలేదూ, నేను అన్నట్టు చెప్పు నీ స్వంత కవిత్వం వద్దు' అని తెగేసి చెప్పాడు."
"ఇంట్లో టి.వి. వుంది కదమ్మా' శేషగిరి మెల్లిగా అన్నాడు.
"అది పాత మోడల్, అన్ని చానల్స్ రావు నాన్నా అందుకని మార్చాలట.'
"బాగుంది ,ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి. ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారు కనిపిస్తున్నారు. ప్రతివాళ్ళకి మోజులు, కోరికలు అకాశాన్నంటుతున్నాయి. యితనికిస్తే నళిని, బావ కూడా వస్తున్నారు. వాళ్ళు బాధ పడరూ.' "వూరుకోండి , ఎక్కడనించి తెస్తారు. ప్రావిడెంట్ ఫండ్ లోనుకి జీతం కట్ అయిపోయి. కిందా మీద పడుతున్నాం. మళ్ళీ ఈ పదివేలేక్కడ నించి తెస్తాం. అతనోచ్చాక నేను నెమ్మదిగా నచ్చచెపుతాలెండి. వెళ్ళవే , ముందెళ్ళి స్నానం అది చెయ్యి. దీని సంగతి ఆలోచిద్దాం లే' అంది కూతురు వాడిన మొహం చూసి.
***
పండుగ ముందు రోజు వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే వుంది నందిని. ఆలోచన మధ్య ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. అతనా సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు. అక్కా, బావ అప్పటికే వచ్చారు. నందిని తండ్రి వంటరిగా వుండగా చూసి నెమ్మదిగా "నాన్నా మీరు ఆ టి.వి. ఒకటి ఎలాగైనా కొనండి. అయన ఈ రాత్రికి వస్తున్నారు గదా.' శేషగిరిరావు తెల్లపోయి చూశాడు కూతురి వైపు.
అన్నీ తెలిసిన కూతురు యిలా అనడం, మొగుడికి కోపం వస్తుందని భయపడ్తోందేమో పిచ్చి పిల్ల. నిస్సహాయంగా చూసి "ఎలా కొననమ్మా డబ్బేది?'
"నాన్నా....ఇన్ స్టాల్మెంట్స్ మీద కొన్ని అమ్ముతున్నారు గదా - ఎలాగో అలాగ మొదటి యిన్ స్టాల్ మెంట్ కట్టి టి.వి తీసుకోండి. మిగతా వాయిదాలు ప్రతి నెలా నేను పంపిస్తాను. నాన్నా యీ టి.వి కొనడం చాలా అవసరం 'ఏదో నిశ్చయం ఆమె కళ్ళలో కనిపించింది.
"నీవెలా కడతావమ్మా ఇన్ స్టాల్ మెంట్స్ ' ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు.
'నాన్నా అదంతా నేను చూసుకుంటాను. నాకు ఓ స్కూల్లో టీచరు ఉద్యోగం యిస్తానన్నారు. మా సందు మొదట్లో వుంది. యింట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను. వూరికి వచ్చే ముందే హెడ్ మిస్ట్రెస్ కబురు పెట్టింది. ఎనిమిది వందలిస్తానంది. వెళ్ళగానే 'జాయిన్ అవుతాను'
"మీ అయన వూరుకుంటాడా, నీ జీతం యిక్కడికి పంపిస్తే, ఆలోచించు, మళ్ళీ అదో గొడవ అవుతుందేమో. అతనికి భయపడి యిలా నీవు, మనం కోర్కెలు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అడగొచ్చు. బాగా ఆలోచించు, కొనడానికేం , ఎవరి దగ్గరో అప్పు చేసి తెస్తా.'
'లేదు నాన్నా, ఆయనకి కోపం వస్తుందని నేను భయపడడం లేదు. ఆయనకి బుద్ది చెప్పడానికి యీ టి.వి కొనాలి నాన్నా" స్థిర నిశ్చయంగా అంది.
'అంటే ఏం చేస్తావు?' ఎలా బుద్ది చెబుతావు నందు..... అనవసరంగా లేనిపోని గొడవలు పడి సంసారం పాడుచేసుకోకమ్మా , ఎప్పుడూ అంత్య నిష్టూరం కంటే అది నిష్టూరం మేలు' కూతురి వంక సందేహంగా చూస్తూ అన్నాడు.
"నాన్నా మీరు నిశ్చింతగా వుండండి. నాకేం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలుసు. ఎలాగో అలా టి.వి. కొనితెండి అంతేచాలు.'
శేషగిరిరావు యిబ్బందిగా 'మీ ఆయనకి టి.వి తెస్తే బావ ఏమన్నా అనుకుంటారేమోనమ్మా.'
'నేను అక్కతో మాట్లాడి చెపుతా అవసరం అయితే బావగారితో కూడా మాట్లాడతా. మీరు వెళ్ళండి నాన్నా....' తొందర పెట్టింది నందిని.
***
చూశావా, నీవనవసరంగా వాదించావు నాతొ. మా వాళ్ళ దగ్గిరేం డబ్బు లేదు యివ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు. చూశావా ఎలా సాధించుకున్నానో ' రవీంద్ర పండుగ బహుమతి పుచ్చుకుని గర్వంగా అన్నాడు.
అతని మోహంలో టి.వి. దొరికిందన్న సంతోషం, తన మాట నెగ్గిందన్న గర్వం చూసే సరికి నందినికి నిలువెల్లా అసహ్యం వేసింది. మాట తూలకుండా పండుగ పూట గొడవ పెట్టుకోకుండా అందరిముందూ తేలిపోయి ఓ సిను సృష్టించడం యిష్టం లేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని ' అల్లుడు గారు గదా, యివ్వక ఏం చేస్తారు లేండి లేకపోతే కూతుర్ని ఎలుకోడని పాపం వాళ్ళ భయం వాళ్ళది" వ్యంగ్యంగా అంది.
