Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 38


    "చూశారుగా గాల్లోకి లేచాక కుడివైపుకి తిరిగాను నేను. అంటే కుడి దిక్కుగా వెళితే విజయం వరిస్తుంది మనని. ప్రచండ భైరవుడి కోట ఇక్కడకు కుడి దిశలోనే వుంది. మనకి దిగ్విజయం తప్పదు."
    ఆ మాటలు వినగానే స్మెల్లర్ , దుర్గయ్యల మొహాలు సంతోషంతో వికసించాయి.
    "పదండి! మనం త్వరగా బయలుదేరాలి! లేకపోతే మహుర్తం మించిపోతుంది." అని హెచ్చరించాడు బ్రహ్మచారి.
    అందరూ ఆ చీకట్లోనే బయలుదేరారు.
    స్మెల్లర్ , దుర్గయ్యా చకచక అడుగేస్తూ ముందు నడుస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిధి దగ్గర వాలిపోయి దాన్ని తవ్వేసుకుందామా అన్నంత హుషారుగా వున్నారు వాళ్ళు.
    కాస్త వెనకబడ్డారు బ్రహ్మచారి, ఉదయార్కర్.
    ఏదో అడగడానికి నోరు తెరవబోయాడు ఉదయర్కర్.
    అతను ఏమీ అనకముందే చెప్పడం మొదలుపెట్టారు బ్రహ్మచారి.
    "నేను గాల్లోకి లేవడం నిజమా లేక మాయా అనేనా నువ్వు అడగబోయేది?"
    అవునన్నట్లు తల వూపాడు ఉదయార్కర్.
    "అది కనికట్టు కాదు. మంత్రమూ, తంత్రమూ కూడా కాదు. నాకు ఇంద్రజాలం కనికట్టూ తెలుసు. కానీ ఈ గాల్లోకి లేచే పక్రియ వుందే ఇది అలాంటిది కాదు. నిజంగానే గాల్లోకి లేచే శక్తి నాకు వుంది. (....) చెట్టు ఆకులూ తింటే (ఈ చెట్టు అతి సాధారణమైనది. చాలా మంది చూసే వుంటారు దీన్ని. దాని పేరు వెల్లడిస్తే అందరూ దానితో ప్రయోగాలు చేసి ప్రమాదంలో పడవచ్చుననే శంకతో ఇక్కడ చెప్పడం లేదు) వారం రోజుల్లో వంట్లో విపరీతమైన వేడిమి పుడుతుంది. భయపడి అక్కడితో అపెయ్యక తినడం సాగిస్తే నవరంధ్రాలలో నుంచి నెత్తురు పడుతుంది. అయినా వెనక్కి తగ్గక ఆకులు తింటూనే వుంటే మనిషి పూర్తిగా కృశించి శల్యావశిష్టమై పోతాడు.
    అలా ఆ ఆకులని తింటూ ఆరేడు నెలలపాటు ఏ ప్రమాదం లేకుండా నెగ్గుకురాగలిగితే అప్పుడు మనిషికి గాల్లో ఎగిరే శక్తి వస్తుంది!
    దాన్నే మీ సైన్సు పరిభాషలో చెప్పుకోవాలంటే మనవశరీరంలో భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకమైన శక్తి తయారవుతుందన్న మాట.యాంటీ గ్రావిటేషనల్ ఫోర్సు ఒకటి ఉద్భవిస్తుంది.
    అప్పుడు మానవశరీరం భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని పైకి లేవగాలుగుతుంది." అని ఆగి చిన్నగా నవ్వాడు బ్రహ్మచారి. "నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చేసిన పూజకూ నేను గాల్లోకి లేవడానికి ఏ మాత్రం సంబంధం లేదు."
    "మరి!" అన్నాడు ఉదయార్కర్ తెల్లబోతూ.
    "ఈ దుర్గయ్యా, స్మెల్లర్ ఉన్నారు చూశావూ వాళ్ళు కాలాంతకులు. ఎంతకయినా తెగించే రకం మనుషులు. వాళ్ళని అదుపులో ఉంచుకోవడానికి అప్పుడప్పుడూ ఇలాంటి ప్రదర్శనలూ చేస్తూ వుంటాను నేను." అన్నాడు బ్రహ్మచారి నవ్వుతూ.
    అది విన్న ఉదయార్కర్ కి కాసేపటిదాకా నోటివెంబడి మాట రాలేదు. తేరుకున్న తర్వాత ప్రశంసాపూర్వకంగా బ్రహ్మచారి వైపు చూశాడు అతను.
    చాలా తార్కికంగా బాలెన్స్ డ్ గా ఆలోచిస్తాడు ఈ బ్రహ్మచారి. దానికి తోడూ సైంటిఫిక్ అవుట్ లుక్ కూడా వుంది ఇతనికి.
ఇతనికే గనక నిజంగానే నిధి దొరికితే దానిని ఉపయోగించి ప్రపంచానికి ఎంతో మేలు చెయ్యగలడు! నిజం!
    కానీ దొరుకుతుందా ఆ నిధి!
    అతని ఆలోచనలు చదివేసినట్లు అన్నాడు బ్రహ్మచారి.
    "నిధి దొరకడం అనగానే బంగారం, నగలూ, మాత్రమే ఉహించుకుంటాము మనం. కానీ ఒక్కొక్కసారి అతి చిత్రమైన వస్తువులు కళ్ళారా చూసినా నమ్మశక్యం కానివి దొరుకుతూ వుంటాయి.
    మచ్చుకి ఇది చూడు" అని తన భుజానికి వున్న సంచిలో నుంచి ఒక వస్తువు తీశాడు బ్రహ్మచారి.
    అది ఒక చిన్న మట్టి కూజాలా వుంది చూడడానికి. నిలువునా మధ్యకు పగిలి వుంది అది. దాని లోపల ఒక ఐరన్ రాడ్ వుంది. ఆ ఐరన్ రాడ్ చుట్టుతా ఒక రాగి సిలిండర్ లాంటిది వుంది.
    "ఇది ఒక డ్రైవెల్ బ్యాటరీ. క్రీస్తు పూర్వం రెండువందల సంవత్సరాల క్రితం తయారుచేసింది. అమరావతి దగ్గర నేనొక నిధి కోసం తవ్వుతుంటే దొరికింది" అన్నాడు బ్రహ్మచారి. "ఆ కాలంలో డ్రైవెల్ బ్యాటరీనా?" అన్నాడు ఉదయార్కర్ నమ్మలేనట్లు చూస్తూ.
    "అవును. రెండువేల సంవత్సరాల క్రితంది! అంటే అప్పట్లోనే మనవాళ్ళు బ్యాటరీలతో విధ్యుత్ చెయ్యడం తెలుసుకున్నారన్నమాట. యాసిడ్ లాగా పనిచెయ్యడానికి ద్రాక్షరసాన్ని, చింతపండు పులుసు గానీ పోసేవారు. చూడు! యాసిడ్ తినేసినట్లు ఎలా అయిపోయిందో ఈ రాడ్! అవునా?"
    కళ్ళు చిట్లించి చూశాడు ఉదయార్కర్.
    నిజమే! యాసిడ్ కోరికేసినట్లే వుంది ఆ రాడ్.
    క్రీస్తుపూర్వమే డ్రైవెల్ బ్యాటరీ ఎలక్ట్రిసిటీ ! నిజమా?
    ఏది సత్యం?
    ఏది అసత్యం?
    అతనికి తల తిరిగిపోతున్నట్లయింది.
    చీకట్లోనే నడుస్తూ రోడ్డు ఎక్కారు అందరూ.
    అప్పుడు వినబడింది వాళ్ళకు ఒక ఇంజను రొద.
    చటుక్కున తిరిగి చూశాడు.
    చిమ్మచీకటిని చీల్చుకుంటూ రాక్షసిలా వాళ్ళవైపు దూసుకోస్తోంది ---------
    ఒక జీపు!
    
                            *     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS