అక్కడ డ్యూటీలో వున్న ఆపరేటరు ఓపిగ్గా చెప్పింది "ఇందాక రెండుసార్లు చెప్పాను కద మేడం! మాచెర్ల లైన్ లో ట్రబుల్ వుంది. లైన్ బాగుకాగానే మీకు కనెక్షన్ ఇస్తాను."
"ప్లీజ్! అత్యవసరమైన పని వుంది. టాప్ ప్రయారిటీ . దయ చేసి సాధ్యమైనంత త్వరగా....."
"ష్యూర్ మేడమ్"
ఫోన్ పెట్టేసింది అరుణ. పది నిమిషాలు గడవక ముందే మళ్ళీ పెక్సే చెంజికి రింగ్ చేసింది. ఆమెకు మనసు నిలవడంలేదు.
ఈసారి ఒక మొగ గొంతు వినబడింది లైన్లో. క్రాస్ టాక్.
ఆ గొంతు అభిషేకన్ ది.
"హాలో " అంది అరుణ. "నేనుయ్ మాచేర్లకి లైటేనింగ్ కాల్ బుక్ చేసి త్రీ అండ్ ఆఫ్ అవర్స్ అవుతోంది! దిసీజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాటర్! మీరు దయచేసి త్వరగా కనెక్షన్ ఇవ్వగలిగితే..."
"మాచేర్లా! మాచర్ల లైన్ పాడయిపోయిందండీ! రిపెయిరు చేస్తున్నారు . అయినా వెధవ మాచెర్ల లో ఏముందండీ దండగ! మదురై లైన్ బాగుంది. మదురై అండీ గొప్ప హిస్టారికల్ ప్లేస్! టామిల్ నాడు కనెక్షన్ ఇమ్మంటారా! అన్నాడు అభిషేకన్ ఉత్సాహంగా.
"మదురై కదండీ?" మాచెర్ల కావాలి!" అంది అరుణ.
"అరె! మదురై వద్దా! పోనీ మెట్టు పాళయం ఇమ్మంటారా!" అన్నాడు అభిషేకన్.
"ఐ వాంట్ మాచర్ల: అభిషేకన్ పట్టు వదల్లేదు. "పోనీ మెద్రాసు మాట్లాడండి! మెద్రాసండీ! టామిల్ నాడు ఏమండీ! మీరెప్పుడన్నా మెడ్రాసు చూశారా? అబ్బ! ఎంత బావుంటుందో! మెడ్రాసు లాంటి సిటీ ఈ ముల్లోకాలలోనూ వుండదండీ!"
"దయచేసి మాచెర్ల కనెక్షన్ ఇస్తారా?" అంది అరుణ.
"మెడ్రాసు కూడా వద్దా? చూడపోతే మీకు టామిల్ నాడు లో కావలసిన వాళ్ళెవరూ లేనట్లుందే! అయ్యో పాపం! మా వాళ్ళంతా టామిల్ నాడులోనే వున్నారండీ. నాల్రోజులు సెలవోస్తే చాలు, నేను మా ఫామిలి ని తీసుకుని జామ్ మని మెద్రాసు వెళ్ళిపోతా! అబ్బే ఆంధ్ర ప్రదేశ్ లో ఏముందండీ! అదే అక్కడయితేనా..........ఓహ్ పెద్ద పెద్ద స్టూడియోలు, పెద్ద పెద్ద హాస్పిటల్సు, పెద్ద పెద్ద నగలషాపులు, ఓహ్! ఆహ్!" అన్నాడు అభిషేకన్ చెలరేగిపోతూ.
కుర్చీలో నిటారుగా కూర్చుని చేతిలోని రిసీవర్ వైపు ఒకసారి చూసింది అరుణ.
హో ఈజ్ దిన్ మాడ్ మాన్! పిచ్చా ఇతనికి. లేకపోతే మూర్కత్వమా! అలాంటి వాళ్ళని ఊరికే వదలదు అరుణ. అతన్ని అట పట్టించదలుచుకుంది. అందుకని అమాయకంగా గొంతు పెట్టి అంది.
"అలాగా అండీ! మరి మెద్రాసులోని అతి పెద్ద స్టూడియో వాహినీ ఎవరిదండీ! తెలుగువాళ్ళదే కదండీ! మేద్రాసులో అతి పెద్ద హాస్పిటల్ అపోలో ఎవరిదండీ! తెలుగు వాళ్ళదేకదండీ! మద్రాసులోని అతి పెద్ద జ్యుయలరీ షాపు ఎవరిదండీ తెలుగువాళ్ళదే కదండీ? మీ మధురని పాలించిన రాజులలో ముఖ్యుడేవరండీ? తెలుగు రాజులే కదండీ! మీ కంచిలోని కామకోఠీ పీఠానికి కొత్త అధిపతులేవరండీ తెలుగువారే కదండీ! అవునండీ?"
తేలు కుట్టినట్లు ఏడుపు గొంతు పెట్టాడు అభిషేకన్. "ఏం మీరు ఎందుకు మేడమ్ అట్లా జోక్ చేస్తారు?" అన్నాడు డబ్బింగ్ పిక్చరులో డైలాగు చెబుతున్నట్లు.
"జోక్స్ కావు పచ్చి నిజాలే చెబుతున్నాను." అంది అరుణ. తర్వాత ఉన్నట్లుండి సీరియస్ గా మారింది ఆమె గొంతు. "తెలుగు వాళ్ళని అంత తేలిగ్గా తీసేయకండి! నౌ విల్ యూ ప్లీజ్ కాన్ సేన్ ట్రేట్ అన్ యువర్ వర్క్ అండ్ సీ దట్ గెట్ మాచెర్ల ఎల్ వన్స్?"
ఆమె అలా అనగానే ఉక్రోషం అంతా చూపిస్తూ ఫోన్ దడాలున డిస కనెక్ట్ చేశాడు అభిషేకన్.
అసహనంగా వాచ్ వైపు చూసుకుంది అరుణ. టైం పరిగెత్తి పోతోంది. మాచెర్ల లైన్ దొరకడం లేదు.
ఏం చెయ్యాలి?
* * * *
"నిధి కోసం మనం బయలుదేరే ముందు నేను ఒక అరగంట సేపు పూజ చెయ్యాలి." అన్నాడు బ్రహ్మచారి.
మాట్లాడకుండా వింటున్నాడు ఉదయార్కర్.
బ్రహ్మచారి ఒక ముగ్గు వేశాడు. దానిమీద తను పద్మాసనం చేసుకు కూర్చుని, మంత్రాలు చదవడం మొదలెట్టాడు.
అప్పుడు జరిగింది అది
అందరూ చూస్తుండగానే నెమ్మదిగా గాల్లోకి లేచాడు బ్రహ్మచారి.
పద్మాసనం వేసుకుని వున్న భంగిమలోనే.
ముందుగా అరంగుళం.
తర్వాత అరంగుళం. ఆ తర్వాత అడుగు ఎత్తున గాల్లో పద్మాసనం వేసుకు కూర్చుని వున్నాడు బ్రహ్మచారి.
అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా శ్వాస లోపలికి తీసుకున్న శబ్దం.
గాల్లోనే నెమ్మదిగా కుడివైపు తిరిగాడు బ్రహ్మచారి.
తర్వాత మెల్లగా కిందికి దిగాడు మళ్ళీ.
కళ్ళార్పకుండా చూస్తున్న ఉదయార్కర్ కి ఇదంతా కనికట్టులాగా కనబడింది. మనిషి గాల్లోకి లేవడం ఏమిటి? ఇది సంభవమా అసలు.
ఇన్ క్రెడిబుల్! రియల్లీ! లేక ఇదంతా తన భ్రమా! తన కళ్ళే తనని మోసం చేస్తున్నాయా? మసక చీకట్లో చూపు అనకుండా పోతోందా? తనకి.
అప్పుడు గంభీరస్వరంతో అన్నాడు బ్రహ్మచారి.
