Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 38

 

    తల్లీ! నాగాభూముల పరిసర ప్రాంతాలలో రవంత సంచలనం ఆరంభమయింది. యుద్ద మేఘాలు క్రమ్మే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ విషయమై చర్చించేందుకు కృష్ణా తీరంలో ఈవలి గట్టిన, ఆవలి గట్టున వున్న నాగగణాలు అధినేతలను రావలసిందిగా వార్త పంపినాను. వారు నేదో రేపో రావచ్చు.
    ఈ చర్చలలో నేను పాల్గొంటున్న సమయాన నీవు నా ప్రక్కన ఉండి తీరాలి. నీకు కూడా దక్షిణాది సమస్యలు అర్ధం కావాలనీ , నాగజాతీయుల పట్ల నీ భార్యతలు నీవు సక్రమంగా నెరవేర్చాగలగాలనీ నేను కోరుకుంటున్నాను. ఆ సమయానికి మాత్రం నీవు మిత్రులతో కలిసి ఎటయిన ఉడాయించకు" అని హెచ్చరించాడు  తండ్రి.
    అలాగే అని తల ఆడించింది శ్వేతకి. తండ్రి పాదాలకు మరొక మారు నుదురు తాకించి అక్కడి నించి వెళ్ళిపోయింది.
    ఆనాటి నుంచి ఆమె తీరు తిన్నులు మారిపొయినాయి. మిత్ర బృందానికి సరికొత్త శ్వేతకిగా కన్పించటం ప్రారంభించిందామే. కోతలు కోయటం లేదు. కోడిగాలు చేయటం లేదు. కొదండాన్ని బట్టి ఆకాశంలో పల్లటీలు కొట్టే పక్షుల్నీ నేలపడగొట్టటం లేదు.
    గంభీరంగా మారిపోయిందామె. ఎప్పుడూ ఏకాంతాన్ని కోరుకోవటమూ, తల వంచుకుని ఆలోచనా నిమగ్నురాలు కావటమూ అయింది ఆమె పని!
    ఉలూచి, ఐరావతి, కుండాలక మారిపోయిన ఆమె తీరు తెన్నెలను జాగ్రత్తగా గమనించారు.
    "మా నించి దూరమవుతున్నావు . ఎవరికి దగ్గరవుతున్నావో " అని ఆటలు పట్టించడం మొదలు పెట్టినారు. అంతటితో వారు ఊరుకోలేదు. ఆమెకు ప్రాణాధికుడయిన కాలవేగుడికి ఈ వార్తలందించారు.
    కాలవేగుడు రవంత అయినా ఆలస్యం చేయక వచ్చి ఆమెను కలిసాడు.
    "శ్వేతకీ! మారిపోయినావేమి! నాగాజాతీయుల కౌగిలిలో పరవశించి ప్రహవించే కృష్ణమ్మలా ఉరుకులు పరుగులుగా వుండే]దానవు , సాగరంలా గంభీర మూర్తివి అయినావేమి?" అని అడిగాడు.
    శ్వేతకి మోదుగుల మీది నించి జారి పడుతున్న మంచు బిందువుల్లా తరళించే నవ్వు నవ్వింది. ఆ దరహాసం వెనుక దర్శనీయమయిన అర్దాలెన్నో స్పురించినాయి.
    "కారణం చెప్పవా శ్వేతకీ!" అని అడిగాడు కాలవేగుడు.
    "ప్రియతమా! చెప్పేందుకు ఏమున్నదయ్యా! నాగుల కౌగిలిలో జరుతున్న కృష్ణమ్మకు కడగండ్లు రానున్నాయి. కృష్ణాతీరం కల్లోలితం కానున్నదయ్యా!
    యువతీ యువకులకిది వేడుకలాడుకునే వేళ కాదు. కర్తవ్యానికి కదలి రావలసిన కఠినతరమయిన సమయం ఆసన్నమయినది. ఎవరికి వారు నాగజాతియుల శ్రేయః కామనతో తాము ఇచ్చుకోగాలిగినది ఏమిటో నిర్ణయించుకోవాలిప్పుడు. అందు గురించే ఆలోచిస్తున్నాను." అని బదులు చెప్పిందామె.
    "ఇప్పుడేమయింది" అన్నాడు కాలవేగుడు కంగారుగా.
    "కుంభవతిని పాలించే క్షుద్రకాళింగుడు కాదనరంగానికి కదలి రమ్మంటున్నాడు. ఆ క్షుద్రకాళింగుడు నాగుల పడగపై కాలుంచి నాట్యమాడుతున్నాడు.
    ఇది పరీక్షా సమయమే కాదు ప్రతిష్టను నిలుపుకోవలసిన సమయం" అన్నది శ్వేతకి.
    ఆ మాటలతో కాలవేగుని కన్నులు జీరవారినాయి. రవంత సేపు ఆలోచించిన తరువాత అతని ముఖ కవళికలు మారినాయి. మళ్ళీ చిరునవ్వు నవ్వినాడు.
    "శ్వేతకీ! నీవేదో ఊహించుకొంటున్నావు. అంతేకాని క్షుద్రకాళింగునికి తెలియదా నాగజాతీయుల శౌర్య పరాక్రమాలు!? మనపై ఎత్తి వచ్చేందుకు అతడేమి మంద బుద్ది కాదు కదా!
    ఇటువంటి ప్రమాదాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పటి కంటే   ఊహించు కోవటం లోనే ఎక్కువ బాధలున్నాయి. క్షుద్రకాళింగుడు రాకమునుపే కాలవేగునికి కఠినమయిన శిక్ష విధించ దలచినావా?" అని కరుణ కలిగేలా ప్రశించాడతడు.
    శ్వేతకి మనోగతమయిన ఆలోచనలను రవంత ప్రక్కకు నెట్టి అలవోకగా నవ్వింది. వ్యధా పూర్ణమయిన ఆలోచనల నించి ప్రియతముని అర్దింపులతో రవంత బయటపడిందామే.
    "ప్రియతమా! కరుణించవలసిన వాడవు నీవు. కఠినమయిన ఆలోచనలు నాకు లేనేలేవు. నీ నిర్ణయాలు ఎటువంటివి అయినప్పటికీ వాటిని నేను అనుసరించి నడుస్తాను " అన్నదామె.
    కాలవేగుడు అంతరాంతరాలలో ఆనంద తరింగితుడయినాడు .
    "వేటలో నీతో పోటీ చేయాలన్నదే నా అభిలాష! ఈ ప్రొద్దు నా ముచ్చట తీర్చగలవా?" అని అడిగాడతడు.
    విల్లు నమ్ములు చేతబట్టి విడిచిన బాణంలా లేచిందామే.
    "నీ అభిలాష వేటలో పోటీ చేయటమే కదా! ప్రియతమా నీ ముచ్చట తీర్చేందుకు నేను సంసిడ్డురాలను" అన్నది నవ్వుతూ.
    ఇరువురూ వేట పనిలో పోటీ పడినారు. అడవి అంతా తిరిగారు. ఆనంద తరంగిత మయిన హృదయాలతో తిరిగి వచ్చారు. మరునాడే కృష్ణాతీరంలోని నాగుల అతిదిపతుల సమావేశం ఆరంభమయింది. ఒక్కొక్క గణం నించి ఒక్కొక్క అధిపతి చర్చలకు వచ్చారు. ముచివిందుడు చర్చలలో పాల్గొనేందుకు వచ్చినాడు కాని అతడికి వృద్దాప్యం మోయరాని భారమయింది . ఆయాసం అధికతరమయింది. తండ్రి అభిప్రాయాలను అనుసరించి తానే సభికుల మధ్య మాట్లాడింది శ్వేతకి.
    "సోదరులారా! ఈ నాగజాతీయుల ప్రేమ కౌగిలినించి పవిత్రురాలయిన కృష్ణమ్మను అపహరించాలని కుంభపురి పాలకుడయిన క్షుద్రకాళింగుడు దురాశపడుతున్నాడు.
    కృష్ణాతీరభూములు సారవంతమయినవి. పంటలు బాగా పండుతాయి. అందునించి వీరంతా సుసంపన్నంగా వున్నారు. అది చూచి కన్ను చెదరిన క్షుద్రకాళింగుడి ప్రయత్నం ప్రారంభించినాడు.  
    ఇది నాగజాతులకు ప్రతిష్టాకరమయిన సమస్య!
    నాగుల కౌగిలినించి కృష్ణమ్మను విడిచి పెట్టేది లేదు. కృష్ణాతీరసారభూములు మరొకరి వశం కారాదు. ఇది నాగజాతి యువతీ యువకుల మనోగతం.
    తమ మనోగతాన్ని చెల్లించుకుంటానికి వారు ప్రాణాలను పరిత్యాజించెందుకయినా సంసిద్ధులయి వున్నారు. నా మట్టుకు నేను నా సర్వస్వాన్ని ఒడ్డి క్షుద్రకాళింగుని దురాగతాన్ని ఎదిరిస్తాను ." అని మహోత్సాహంతో ప్రసంగించిందామె.
    నాగజాతి యువతీ యువకులు హర్షాధ్వానాలు చేశారు. ఉత్సాహ పూరితమయిన వారి హర్షధ్వానాలు పిడుగులు పడుతున్న సంరంభాన్ని కలిగించినాయి.
    ఆ శబ్దాలకు చెవులు తూట్లు పడుతున్నట్లు అనిపించాయి.
    కలత పరిచినాయి. కలలో దృశ్యం చెదిరింది. కనులు విప్పి చూసింది జ్యోతి! తానున్న చోటు రాకాసి గుహలోని శ్వేతకి సమాధి ఆమె కంకాళం ప్రక్కనే తానుంది.
    కల కరిగినా శతాబ్దాలు వినిపిస్టోనే వున్నాయి. అలాగే నిశ్చేష్టురాలాయి పడి వుంది జ్యోతి.
    రవంత సేపు అయాక సమాధి గుడిపై కప్పుగా ఉండిన రాయి బ్రద్దలయింది. కప్పులో కొంతభాగం తెరచుకోగానే లోపలకు రవి కిరణాలు సోకినాయి.
    మిగిలివున్న కప్పుపై నిలిచి వున్న ఆదిమ జనులు విజయగర్వంతో కేరింతలు కొడుతున్నారు.
    వారి ప్రక్కన నిలిచి ఆనందంతో విప్పారిన ముఖ ముద్రతో తనవంక చూస్తూ కన్పించాడు జయకృష్ణ!      అతని ప్రక్కనే నిలబడి ఉత్సాహంతో ఊగిపోతోంది చెంచు లచ్చిమి. అక్క కన్పించగానే చప్పట్లు చరిచిందామే.
    'అక్కా! నీవిప్పుడు బాగా కన్పిస్తున్నావు. రా! త్వరగా పైకి వచ్చేయ్" అని అరిచింది చెంచులచ్చిమి. జ్యోతి లేచి నిలబడింది .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS