Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 39

 

    పోటీకి పాల్గోనాలనుకునేవారు మే మిచ్చే గుర్తింపు కార్డులు తీసుకుని బయల్దేరాలి! సరిగ్గా పన్నెండు గంటలకు పోటీలు ముగుస్తాయి.
    బహుమతిని ఎవరూ దక్కించుకోలేని పక్షంలో ఆ మొత్తం ఖర్చు పెట్టి సిటీలో మా యిష్టం వచ్చిన చోట ఓ బస్ షెల్టర్ కట్టిస్తాం.
    ఇక పోటీ వివరాలు వినండి" అంటూ గొంతు సవరించుకుంది ప్రియాంక.
    షీనా జయసింహ అరచేయి గిల్లింది హెచ్చరికగా!
    జనంలో అందరికన్నా వెనకగా వున్న జయసింహ మనసంతా పెట్టి ఆమె చెప్పే మాటలు వింటున్నాడు.
    "ఫ్ర్రెండ్స్! ఈ పోటీ ధైర్య సాహసాలు నిరూపించుకునెందుకు ఏర్పాటు చేయబడింది. సృష్టిలో ప్రాణులన్నింటి కన్నా మనిషి తెలివయినవాడు. ఇది నిరూపించాలి!
    వాటిని లొంగదీసుకునే జవ సత్యాలూ వేగమూ మనిషికున్నాయని మీలో ఏ ఒక్కరయినా నిరూపించాలి!
    ఈ పోటీలో బహుమరిగా యిచ్చే లక్ష రూపాయలు చెక్కు ఒక చోట భద్రంగా దాచబడింది.
    అది యెక్కడుందో తెలుసుకునేందుకు 'క్లూ' మూడు చోట్ల దాచాం. పన్నెండు గంటలు అయ్యేలాగా మూడు చోట్ల దాచిన ముక్కల్ని సంపాదించి క్లూ తెలుసుకోవాలి.
    చెక్కుని స్వాధీనం చేసుకోవాలి! ఎవరయితే చెక్కుని తెచ్చి యిస్తారో వారు పేరు వ్రాసి దాన్ని బహూకరిస్తాం.
    మీ ప్రయత్నంలో మీరు పాముల్నించి తప్పించుకోవలసి రావచ్చు. పులులతో పోరాడవలసి రావచ్చు. ప్రాణాలను తెగించి ప్రయత్నం చెయ్యాల్సి వుంటుంది. ఆ ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళే బయల్దేరాలి!
    వెళ్ళే ముందుగా షరతు! ఎవరూ ఈ గేటు నించి వెళ్ళకూడదు. భవనం పై అంతస్తుకు వెళ్ళి వెనుక ఉన్న మెట్ల దారి నించి దిగి వెళ్ళాలి" అంటూ పోటీ షరతులు చెప్పింది ప్రియాంక!
    పోటీ షరతులు వింటున్న కొందరి ముఖాలు అప్పటికే వాలిపోయి వున్నాయి. మరికొందరికి గొంతు తడి ఆరిపోయింది.
    "పులులతో పాముల్తో పోరాడెందుకు ఇవేం రాజకుమారుల కధలు కావు. ఇది స్వయవరమూ కాదు" అన్నాడో యువకుడు.
    "కాదని మీరెందుకనుకోవాలి! ఏదైనా కావచ్చు" నవ్వింది ప్రియాంక.
    "యిదంతా ఎంట్రీ ఫీజుల పేరుతొ డబ్బు దండుకొనేందుకు పన్నిన కుట్ర. పొతే పోయాయి! అయిదొందలే కదా! పదండి పోదాం" అంటూ ఆ యువకుడు వెనుదిరిగాడు. అతనితో మరికొందరు కలిశారు.
    "యెవరైనా వెనక్కి తిరిగి పోవాలనుకుంటే నిరభ్యంతరంగా పోవచ్చు"
    "క్లూ, మూడు ప్రదేశాల్లో దాచి వుందన్నారు కదా! అవి ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది ? అని అడిగాడు మరో యువకుడు.
    'అది చెబితే మీరు పరిశోదించవలసింది ఏముంటుంది?' అన్నది ప్రియాంక. అందరూ ఘోల్లుమని నవ్వారు.
    అది జోక్ లా కన్పించినా అందరి సమస్యా అదే!
    "క్లూ' లు ఎక్కడుందీ జాగాల వివరాలు తెలియకుండా ప్రయత్నించటం ఎలాగ? ఏం తెలివి కలవాళ్ళం. మేం సాహసవంతులం అని చెప్పుకునే అందర్నీ పూల్స్ ని చెయ్యటానికి పన్నిన పన్నుగడ యిది!
    తెలుసుకోవాలన్న ప్రయట్నంలోకి దిగి ఫూల్స్ కావటం కన్నా అయిదొందలు వొదిలేసి తిరిగి పోవటం మంచిది.
    అతను కూడ వెనుదిరిగాడు. అతనితో పాటు మరికొందరు.
    ప్రాణాల మీదికి ఎవరు తెచ్చుకుంటారు? పోటీ వివరాలు విన్న తరువాత జనం పలుచబడి పోతున్నారు.
    మెయిన్ గేటు నించి వెళ్ళే దారి సంఖ్య ఎక్కువగా వుంది. మేడ మీదికి వెళ్ళే వారి సంఖ్య చాల తక్కువగా వుంది.
    "ముందుగా పోటీ నించి విరమించుకునే వారికి సగం డబ్బు తిరిగి యిచ్చేయటం న్యాయం" జాలిగా అడిగాడో యువకుడు.
    "సమయం వృధా చేసుకోకండి. ఇంతటితో చర్చలు ముగిస్తున్నాను" అని ప్రకటించి వేదిక దిగి వెళ్ళిపోయింది ప్రియాంక!
    "ఇలాంటి పోటీలే కొంప ముంచుతాయి. యింతకన్నా లాటరీ టికెట్స్ కొనుక్కోవటం చాలా నయం" ఖాళీ జేబులు తడుముకుంటూ నడక దారిన యింటిముఖం పట్టాడా యువకుడు.
    ఐడెంటిటీ కార్డులు వచ్చాయి. పేరు వ్రాసి నంబర్ యిస్తున్నారు.
    ఆఖరుసారిగా జయసింహ కోసం చూసి నిట్టూర్చి నిరాశతో బెటాలియన్ తో కలిసి వెళ్ళిపోయింది ప్రియాంక.
    భయంతో అతని చేయి గట్టిగా బిగించి పట్టుకుంది షీనా! చేయిని నెమ్మదిగా వోదిలించుకున్నాడు . ముందుకు సాగాడు.
    "ఎక్కడికలా దూసుకు పోతున్నావు? అడిగింది షీనా!
    "ఐడెంటిటీ తీసుకుంటాను"
    "సారీ! యిలాంటి నిబంధనకుంటాయని తెలీక నీ పేరు మీద  డబ్బు చెల్లించాను. ఈ పోటీలో నువ్వు పాల్గొనేందుకు నేను ఒప్పుకోను."
    "ఎందుకని ----?"
    "చాలా ప్రమాదాలున్నాయి. పాములట! పులులు కూడా నట!"
    "ఏ సాహసం చేయకుండా డబ్బు ఎలా వస్తుంది "
    "లక్ష రూపాయల కోసం ప్రాణాలకు తెగించాలా?"
    "కొన్ని సందర్భాలలో డబ్బు కన్నా ప్రాణం విలువయినది. మరి కొన్ని సందర్భాలలో ప్రాణం కన్నా డబ్బే విలువయింది ఈ విషయం అందరికీ తెలుసు. కొందరు ఒప్పుకుంటారు. కొందరూ ఒప్పుకోరు.
    మరికొందరు ఒక్కోసారి ఒప్పుకుంటారు. మరొకసారి ఒప్పుకోరు. అవకాశవాదం మీద నడిచే ప్రపంచం యిది.
    అవసరాల్ని అనుసరించి పరుగెత్తే మనిషిని నేను"
    "ఏది ఏమయినా మీరు ప్రాణాలకు తెగించేందుకు నేనొప్పుకోను"
    "మరి డబ్బు ఎలా సంపాదించగలమంటారు?" ఆమె మాట్లాడలేదు. జయసింహ ఐడెంటిటి వ్రాయించుకున్నాడు.
    సాహసవంతులు కొద్దిమంది మేడ మీదికి వెళ్ళిపోతున్నారు. ఉదయం నుండి భోజనం చేయలేదనే విషయం గుర్తుకొచ్చింది. ఆకలిగా వుంది. నీరసంగా వుంది. మొక్కలకు నీళ్ళు పెట్టేందుకు ఏర్పాటు చేసిన కుళాయి దగ్గర వంగి కడుపునిండా నీళ్ళు త్రాగి బయల్దేరాడు జయసింహ!
    ఇంక అతని సంకల్పాన్ని నిరోధించ గల శక్తి లేదని గ్రహించి ఊరుకుంది షీనా! తొమ్మిది గంటలకు ఇంగ్లీషు చిత్రం ఏదైనా చూడాలి. పదకొండు గంటలకు వదిలేస్తారు.
    పదకొండున్నరకు తిరిగి సవాయ్ బార్ కి చేరుకోవచ్చు. ఆ తరువాత మరో అరగంటలో ఫలితాలు తేలిపోతాయి.
    మెదడు నరాలు బిగిసిపోతున్న టెన్షన్ నించి తప్పించుకుని బయట పడేందుకు మరో మార్గం కన్పించలేదు. తిరిగి వెళ్లిపోయిందామె.
    మేడ మీదికి వెళ్ళేందుకు నిటారుగా ఎనిమిది మెట్లున్నాయి. కుడి చేతి వైపు తిరిగితే మరో పన్నెండు మెట్లున్నాయి.
    దృష్టి పరిధిలో వున్న ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తూ మేడ మీదికి చేరుకున్నాడు జయసింహ! అప్పటికి కొందరు మేడ దిగిపోయారు.
    మరి కొందరు ఆధారం దొరికుతుందేమోనని అణువణువూ గాలిస్తున్నారు.
    "ఇక్కడంతా ఖాళీ జాగా! క్లూ దాచి పెట్టిన మూడు చోట్లు మనకెలా తెలుస్తాయి? అందర్నీ ఫూల్స్ చెయ్యటానికే ఈ పోటీ నడుపుతున్నారు.
    ఇంతకన్నా ఆ డబ్బులో లాటరీ టికెట్స్ తీసుకుంటే పోయేది?" అంటూ నేలమీద చతికిల పడి పోయాడు ఓ కుర్రాడు.
    "అవును! లాటరీ టికెట్స్ తీసుకుంటే మన డబ్బుకి గ్యారెంటీ వుండేది" మరో యువకుడు వంత పాడాడు .
    "లాటరీ టికెట్స్ తీసుకుంటే డబ్బుకి గ్యారెంటీ ఎలా?' దాని గురించి తెలియని మరొకాయన అడిగాడు విడ్డురంగా!
    "ఆ మాత్రం తెలియదా! ప్రతి మూడు టికెట్స్ లోనూ పది రూపాయలు ప్రైజులు వుండి తీరుతాయి. ప్రతి వెయ్యి టికెట్స్ లోనూ నూరు రూపాయల ప్రైజు ఒకటి ఉంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS