ఏం జరుగుతోందిక్కడ?" ఏమీ ఎరుగని వాడిలా తల ఎత్తి చుట్టూ పరికించాడు. లాన్ లో ఉన్న చెట్ల మీద కూడ కరెంటు దీపాలున్నాయి. ఇంకా వెలగట ల్లేదు.
"ఏదో పోటీ జరుగుతొందట! స్కిల్ గేమ్స్ మాములుగా జరుగుతుంటాయి కదా! ఇవాళ బహుమానం లక్షరూపాయలు. అదీ విశేషం?" అందామె విసుగ్గా!
అతనితో కలిసి గడపాలనుకున్న అందమయిన సాయంత్రం ప్రశాంతంగా, ఏకాంతంగా లేదు. జన సంకీర్ణమయిపోయింది.
"అంత పెద్ద బహుమానం ఇస్తున్నారంటే పోటీ చాలా కష్టమయినది అయి వుండాలి! ఎంట్రీ ఫీజులు దండుకుని అసలు ప్రయిజు ఎవరికి రాకుండా చేస్తారేమో!" అన్నాడు జయసింహ.
అలా జరగటం అసంభవం కాదు. కాని ఈ రోజు పోటీలు నిర్వహించే కమిటీని అనుమానించెందుకు వీలు కాదు. ఈ నగరంలో అందరి కన్నా ధనవంతుడు ధర్మాజీరావు.
"అయన కూతురు ఒక్కగానొక్క గారాలబిడ్డ యివాళ స్కిల్ గేమ్ నదుపుతున్న కమిటీలో ప్రధాన వ్యక్తీ! అలాంటి వాళ్ళే మరికొందరు ధనవంతుల బిడ్డలున్నారు.
వాళ్ళకి ఈ మొత్తం గొప్పదేమీ కాదు. అయినా వాళ్ళ చేతి డబ్బు ఒక్క పైసా ఖర్చు కాదు. ఎంట్రీ ఫీజు అయిదు వందలు. రెండు వందల మంది కి పైగా పాల్గొంటున్నారు.
లాభాలోస్తాయి. కాని ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చెయ్యాలి. ఆ శక్తి వాళ్లకుంది.
ఇవాళ ఆ బహుమానం అందుకునే అదృష్టవంతులు ఎవరో?" అందామె కలల మధ్య తేలిపోతూ!
నేరుగా పోటీల దగ్గరకు పోకుండా షీనా మధ్యలో అడ్డు తగిలినందుకు ముందు బాధ పడ్డాడు జయసింహ.
ఇప్పుడు ఆమె నించి పోటీల తాలుకూ వివరాలు అందుతూంటే వినేందుకు సరదాగానే ఉంది. ఆనందంగా ఉంది.
ముందుగా తెలుసుకోవటం మంచిది కదా!
పోటీలు ప్రారంభం కావటానికి యింకా సమయం కూడ ఉంది. కొద్ది గంటల్లో ఫలితం తేలిపోయే లాటరీ లాంటిదే ఇది కూడ!
జనం ఇంకా ఇంకా వస్తున్నారు.
టెన్షన్ తట్టుకోలేని వాళ్ళు సవాయి బార్ లోపలికి వెళ్ళి అంతో యింతో పుచ్చుకుని వస్తున్నారు కూడ! వెయిటర్స్ పరుగులు తీస్తున్నారు. కౌంటర్స్ కళకళ లాడుతున్నాయి.
"బహుశా యిది అందాల పోటీ అయి వుండవచ్చు! ఆ బహుమానం మీకే ఎందుకు రాకూడదు?" అంటూ ఎంతో ప్రశంసా పూర్వకంగా షీనా వంక చూశాడు జయసింహ.
ఆమె ముఖం మతాబులా వెలిగిపోయింది. మనసు తారాజువ్వలా జివ్వుమని గగనతలానికి లేచిపోయింది.
ఆమెకు రోజులో కొన్ని వందల సార్లు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవటం అలవాటు! అందాన్ని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మరీను!
ఇహ తన అందాన్ని ఎవరైనా పోగిదినప్పుడు అది మరింత తప్పనిసరి అవుతుంది. కాని అది సవాయ్ బార్! ఇల్లు కాదు.
అద్దాలు సిద్దంగా ఉండవు కదా!
జయసింహ కనుపాపల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంది షీనా! అది అందాల పోటీ కానందుకు చాలా బాధ పడిపోయింది.
"ఈ ప్రయిజ్ నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటె ఇది అందాల పోటీ కాదు. టాలెంట్స్ కి సంబంధించింది.
బహుశా ప్రమాదకరమయినది కూడా కావచ్చు.
పోటీ, ప్రమాదకరం అయితే పర్మిషన్ ఎలా యిస్తారు?"
"మరి లక్ష రూపాయల బహుమానం అంటే మాటలా ? కమీషనర్ కి చెప్పి పర్మిషన్ తెచ్చుకోవటం వాళ్ళకి కష్టమయిన పనేమీ కాదు. డబ్బు గలవాళ్ళు ఆదుకునేది అట అయినా ప్రాణాలతో చెలగాటమయినా ఎవరూ కల్పించుకోరు" అందామె.
జయసింహ ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"ఏం పోటీలో పాల్గొనాలనుకుంటున్నారా? నేనొప్పుకొను"
"మీకు అంత బాధ లేదు. ఎంట్రీ ఫీజు అయిదు వందలు అంటున్నారు కదా! ప్రస్తుతం నా వాలెట్ లో అంత లేదనుకుంటాను ."
"డబ్బు గురించి కాదు, ప్రమాదం గురించి"
"ఏ ప్రమాదం లేని చోట ధ్రిల్ ఏముంటుంది "
"గెలుస్తాననే నమ్మకం మీకుందా? పాల్గొంటారా?"
"చెప్పాను కదా! ప్రస్తుతం నా వాలెట్ లో అంత డబ్బు లేదు"
"డబ్బు గురించి ఆలోచించకండి. నా దగ్గరుంది."
"అలా తీసుకోవటం నాకు యిష్టం ఉండదండీ!"
"మీరలా అంటే నేను బాధ పడతాను. నట్వర్ లాల్ షాపులో నగ తీసుకుంటున్నప్పుడు డబ్బు తక్కువయితే మీ పలుకుబడి నా మర్యాదను కాపాడింది."
"అవును, మీ మెడలో మెరుస్తున్న నెక్లెస్ అదేనా! చాలా బాగుంది. మీరు పెట్టుకున్నారు కాబట్టి. నగకే అందం పెరిగింది" మరో హిట్ కొట్టాడు జయసింహ!
"ఆలోచించకండి. డబ్బు నా దగ్గరుంది. అంటూ ముందుకు నడిచింది షీనా! టయిమయింది . గంట కొట్టారు.
16
చాలసేపు ఎదురు చూసిన ప్రియాంక నిరాశతో కృంగిపోయింది. జయసింహ కన్పించలేదు. అతడు రాలేదనే అనుకుందామె. తనతో పాటు కమిటీ సభ్యులు సమయం పూర్తి అయిందని తొందర పెడుతున్నారు. ఇంక పోటీలు ప్రారంభించాలి.
ఎంట్రీ ఫీజులు కట్టి పోటీకి వచ్చినవాళ్ళు టెన్షన్ భరించలేక కేకలు పెడుతున్నారు. ఊరుకునేలా లేరు.
లాన్ లో ఒక చిన్న వేదిక నిర్మించారు. దీపాలు వెలిగాయి. సవాయి బార్ దేదీప్యమానంగా మెరిసిపోతుంది. వేదిక మీద కట్టిన జిలుగు దారాలు ధగధగ లాడుతున్నాయి.
చివరిసారిగా వేదిక మీదికి రాబోయే ముందుగా జయసింహ కోసం చుట్టూ చేరిన వారిలో వెదికిందామె. చూపులు పరుగెత్తాయి. మనసు ఉరుకులు పెడుతోంది. ఎందుకు రాలేదు.
రాకపోవటం ఏమిటి? వచ్చాడు! అడుగో! అ ప్రక్కనున్నది ఎవరు? ఎవరా అమ్మాయి. ఎక్కడో చూచిన దాన్లా అనిపిస్తోంది. ఆమెతో అతని పరిచయం ఏమిటి?
ప్రియాంక ముఖం వాడిపోయింది. దిగులుగా అయిపోయిందామె. ప్రక్క బ్వాళ్ళు ఎవరో తొందరించి ముందుకు తోశారు.
"అనౌన్స్ మెంట్ ఇచ్చెయ్యవోయ్ త్వరగా! ఎంట్రీ ఫీజు కట్టిన వాళ్ళు తొందర చేస్తున్నారు" తన ఆలోచనలతో నిమిత్తం లేకుండా వేదిక మీదికి వచ్చింది ప్రియాంక!
"జెంటిల్మన్! మేము నిర్వహించాలానుకుంటున్న పోటీల పట్ల ఎంతో ఆసక్తిని ఉత్సాహాన్ని ప్రదర్శించిన మీ కందరికీ కృతజ్ఞతలు!"
"పోటీలలో స్వయంగా పాల్కొనేందుకు మేము ఊహించిన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో ఎంట్రీ ఫీజులు కట్టిన వారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు!
మీలో విజయలక్ష్మి యెవరిని వరిస్తుందో చూద్దాం!
మీరు కావచ్చు, మీరు కావచ్చు, మీలో ఏ ఒక్కరయినా కావచ్చు" అంటూ ఎంట్రీ ఫీజులు కట్టిన వారిని ఉద్దేశించి చెప్పిందామె!
పోటీకి దిగదలచి వచ్చిన వారి ముఖాలు ఆనందంతో వెలిగాయి. పోటీ వివరాల కోసం చెవులు రిక్కించారు.
"ఈ పోటీలో నిబంధనలు కఠినంగా వుంటాయి. బహుమతి లక్ష రూపాయలు. మీరంతా షరతులన్నీ అంగీకరిస్తూ సంతకాలు చేశారు.
పోటీ వివరాలు బయట పెట్టిన తరువాత ఎవరయినా విరమించుకోవాలనుకుంటే యిరవై నిముషాలు టైమిస్తున్నాం. విత్ డ్రా కావాలనుకున్నవారు వెళ్ళిపోవచ్చు.
