అట్లా అడిగించుకోవాల్సి వచ్చినందుకు ఇబ్బందిగా ఫీలవుతూ చూశాడు నిఖిల్.
"కళ్ళారా చూశాక నిజం కాదని ఎలా చెప్పగలమా? నిజ నిర్ధారణ కోసం నేనూ ఒక రాయి విసిరాను. అదీ కింద పడలేదు రాజూ"
చెట్టు మీద నుంచి పండు కింద పడుతుంటే న్యూటన్ భూమ్యాకర్షణ శక్తి సిద్దాంతాన్ని మొదటిసారిగా కనుక్కున్నాడు. తెగిన కాయ భూమి మీద పడకుండా ఆకాశంలోకి వెళ్ళిపోవడం నేను ఈ కళ్ళతోనే చూశాను రాజూ! అది రాక్షస మాయ అని అనేటంత మౌడ్యం లేదు. కానీ అక్కడేదో జరుగుతోంది నిశ్చయంగా!"
"కుందేలు సంగతి చెప్పవేం " అంది నిత్య అందిస్తూ.
"ఏం చెప్పను ? ఎలా చెప్పనూ?" అని చిన్నగా నవ్వాడు నిఖిల్.
"సరే! నేను చెబుతా అన్నా! చెట్టు నుంచి తెగిన కాయ కింద పడలేదని మేము కళ్ళప్పగించి చూస్తూ వుంటే ఈలోగా చిరత అరుపు వినబడింది. పొదల్లోంచి ప్రాణభయంతో పరిగెడుతూ బయటికి వచ్చింది చిరుత. దాన్ని తరుముతూ వచ్చింది ఒక కుందేలు "
"ఏమిటీ చిరతని తరుముతూ కుందేలు వచ్చిందా?" అంది సృష్టి ఆశ్చర్యంగా.
"అవును -- ఆ కుందేలు సైజు చిరతపులికి రెండు రెట్లు ఉంది. అది చిరుతపులిని కిందపడేసి కత్తుల్లాంటి ముందు పళ్ళతో కొరికింది. చిరుతపులి ప్రతిఘటించింది. హోరా హోరీ పోరాటం తర్వాత పులి పడిపోయింది. కుందేలు వెళ్ళిపోయింది.
'ఆ పులి ఇదే! అప్పట్నుంచీ షాక్ లో ఉంది. జాలిపడి మేం తీసుకొచ్చి సాకుతున్నాం" అన్నాడు నిఖిల్.
నెమ్మదిగా చిరత దగ్గరికి వెళ్ళాడు రాజు.
అతన్ని చూసి అదిరిపడినట్లుగా లేచి నిలబడింది చిరుతపులి. పిల్లి మ్యావ్ అంటున్నట్లుగా బలహీనంగా అరిచింది.
"చాలా సాధువుగా మారిపోయింది అది. పాలు మాత్రమే తాగుతోంది ."
"ఇవాళ అన్నం పెట్టినా తిన్నది." అంది నిత్య.
"షాక్ వల్ల మెంటల్ గా మార్పు వస్తుంది. పులి శాఖాహారం తింటోందంటే .......రాజూ .......జెనెటిక్ గా ఏదో మార్పు వచ్చి వుండాలి " అంది సృష్టి.
"ఆ రాముడి మడుగు దగ్గరికి రోజూ వెళ్తున్నాం. రోజుకొక వింత కనబడుతోంది అక్కడ " అన్నాడు నిఖిల్. మళ్ళీ అతనే అన్నాడు.
"చిన్నప్పట్నుంచీ నేను అడవుల్లో తిరుగుతున్నవాడినే. కానీ ఈ మధ్యనే ఒక జంతువు కనబడింది. అదేం జంతువో నాకు అర్ధం కాలేదు. దానికి సింహం లాగా జూలు వుంది. పులికి వున్నట్లు చారలు వున్నాయి.
తక్షణం అంది సృష్టి.
"కొంతకాలం క్రితం ఒక ప్రయోగం కరిగింది. పులికీ , సింహానికి సంపర్కం కలగ జేశారు. రెండింటి లక్షణాలతో ఉన్న పిల్ల పుట్టింది. టైగర్ + లయన్ అన్న రెండు పదాలు కలిపి దానికి టైగాన్ అన్న పేరు పెట్టారు. ఇదీ అట్లాంటిదే అయి వుండవచ్చా?"
కొద్దిసేపు ఆగి, తర్వాత నిదానంగా అన్నాడు నిఖిల్.
"కాని దానికి మనిషి మొహం!" అతనా మాట అనగానే , వాతావరణంలో భయం అలుముకుంది.
"ఆరోజు అక్కడే బాగా పొద్దుపోయింది. అప్పుడు .." అని నిఖిల్ మాట పూర్తి చేయకముందే -- హటాత్తుగా అతనికి మాట పడిపోయింది. పెదాలు వంకర తిరిగిపోయాయి!
మొహం వివర్ణమయింది!
అది చూసి వణికిపోతూ అంది నిత్య.
"నిఖిల్ ఒప్పుకోడు గానీ అది నిశ్చయంగా రాక్షసమాయే! ఆ మాట వచ్చినప్పుడల్లా ఈయనకి మాట పడిపోవడం మళ్ళీ రావడం అనేది ఇప్పటికీ ఇది మూడోసారి ! అక్కడ ఇంకో విశేషం కూడా ఉంది రాజూ!"
"ఏమిటది ?" అన్నాడు రాజు.
"ఆరోజున రాముడి మడుగు దగ్గరికి వెళ్ళాం. మనిషి మొహం జంతువూ కనబడింది. ఆరోజున అక్కడే బాగా పొద్దుపోయింది.
"పొద్దుపోయింది గానీ చీకటి పడలేదు" అంది నిత్య.
"ఏమిటి ?" అన్నాడు రాజు నిర్ఘాంతపోతూ.
"అవునన్నా! రాత్రి పది అయింది. పదకొండు అయింది. కానీ అక్కడంతా పట్టపగలులాగా కాంతి !"
'అది పౌర్ణమి రోజేమో!"
"కాదు -- అమావాస్య"
నెమ్మదిగా సృష్టి వైపు తిరిగాడు రాజు.
"అయితే నేను వెళ్ళి చూసి రావాల్సిందే - నువ్వు ఇక్కడే నిత్యకి తోడుగా ఉండు సృష్టీ"
"ఎవరూ ఎక్కడికీ వేళ్ళనక్కర్లేదు. ఈ ఇన్ స్ట్రుమెంట్ మన దగ్గర ఉన్నంత వరకూ" అని సెల్ ఫోన్ ని అన్ చేసింది సృష్టి.
"రాముడి మడుగు రహస్యం ఈ ఇన్ స్ట్రూమెంటుతో క్షణంలో బయటపడుతుంది చూడు !" అని గబగబ బటన్లు నొక్కింది.
వెంటనే ఏదో దెయ్యప్పిల్ల ఏడుస్తున్నట్లుగా కీచుకీచుమని కర్ణకఠోరంగా శబ్దాలు .
స్క్రీన్ మీద అడ్డంగా, నిలువుగా , గళ్ళు గళ్ళుగా గీతలు-- తర్వాత వృత్తాలు చదరాలు -- దీర్ఘచతురస్త్రాలు.
ఆ తర్వాత వంకర టింకర రేఖలు -- వాటికి అపశ్రుతులతో బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ లాగా శబ్దాలు !
దయ్యం పట్టినట్లుగా వణకడం మొదలెట్టింది సృష్టి చేతిలోని ఇన్ స్ట్రూమెంటు.
కళ్ళార్పకుండా చూస్తోంది సృష్టి.
ఉన్నట్లుండి శబ్దాలు ఆగిపోయాయి.
చిన్న స్క్రీన్ మీద అస్పష్టంగా ఏవేవో రూపాలు కనబడటం మొదలయింది.
క్రమక్రమంగా -
ఆ రూపాలకి స్పష్టత వచ్చింది.
ఒక పెద్ద బంగళా-
దానికి కాపలాగా చాలామంది సెక్యూరిటీ పర్సన్స్ వున్నారు.
గేటుకి పక్కన ఉన్న చిన్న బోర్డు కనబడింది.
"పశుపతి, మినిష్టర్ ఫర్ డిఫెన్స్ " అని రాసి వుంది దాని మీద.
తర్వాత బంగాళా లోపలి దృశ్యం కనబడింది.
డ్రాయింగు రూంలో సోఫా సెట్టు -- టీపాయి మీద నాలుగైదు రకాల మద్యాలు.
"ఇంక మనం మాట్లాడుకోవచ్చా?" అన్నాడు మినిష్టరు ఎదురుగా కూర్చున్న మనిషి.
పగలబడి నవ్వాడు మినిష్టరు.
"నిరంభ్యంతరంగా! మీ దగ్గర కొంపదీసి మినియేచర్ విడియో కెమెరాలు వున్న కూడా దాన్ని జామ్ చేసి దృశ్యాలు కనబడకుండా చేసే పద్దతి ఈ రూంలో వుంది. నో బ్లడి కెన్ బ్లాక్ మెయిల్ మీ. చెప్పండి -- ఎంత మీ ఆఫరు?"
