Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 38


    సంగతీ, సందర్భం గ్రహించిన రజాక్ చెంగున రంగంలోకి దూకాడు.


    "ఇలా ఇయ్యండి సార్.. లోపల పెట్తాను" అంటూ సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా శివరావు చేతుల్లోంచి పళ్లు తీసుకుని వెనుకగదిలోకి వెళ్లాడు.

 
    అక్కడ బల్లమీద పెట్టివున్న పళ్లు చూసేసరికి కళ్లు చెదిరాయి అతనికి. అటూ ఇటూ చూశాడు రజాక్. ఎవ్వరూ లేరు. పెద్దసైజులో ఎర్రగా నిగారిస్తున్న రెండు ఆపిల్ పళ్లను తీసుకున్నాడు. ఎవరూ చూడడంలేదని నిర్దారించుకుని వదులుగా వుండే ఆప్ఘన్ పైజామా జేబులోకి వాటిని తోసేశాడు. ఆ జేబులు ఎంత లోతుగా వుంటాయంటే  చంటిపిల్లవాడిని అందులోకి కుక్కేసినా బయటకతు కనబడడు. ఏమీ ఎరగనివాడల్లే పిల్లిలా బయటకు వచ్చేసి యధాస్థానంలో నుంచున్నాడు రజాక్.


    భద్రంగారు తనని శివరావుగారు ఎప్పుడు పిలుస్తారోనన్న ఆదుర్దాతో  త్వరత్వరగా ప్రకృతిపిలుపుకి జవాబిచ్చి హడావుడిగా బయటకు వచ్చేశాడు. వస్తూ రజాక్ చేసిన ఘనకార్యాన్ని  గమనించాడు. ఆ విషయం రజాక్ ఎరుగడు. భద్రంగారు మామూలుగా  వచ్చేసి శ్రీరాముని ప్రక్కన లక్ష్మణునిలాగా యధాస్థానంలో నిలబడ్డాడు.


    చిట్టిపొట్టి ఆఫీసర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ లూ అయ్యాక - శివరావుగారి ఆఫీసులో  పనిచేసే  సిబ్బంది టర్న్ వచ్చింది. వారి తరపున ఒక సీనియర్ యు. డి. సి. అందరి తరపునా ఒక బహుమతి, అరడజన్ ఆపిల్ పళ్లూ  ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి నమస్కరించాడు.


    భద్రంగారు ఆఫీసు సిబ్బందిని పేరుపేరునా పరిచయం చేశాడు. రజాక్ ను పరిచయం చేసేటప్పుడు  మాత్రం రజాక్ వంక చూస్తూ అతని పేరును మరీ ఒత్తి పలికాడు.


    సిబ్బంది వెనకాల నిలబడివున్న రజాక్ ముందుకి వచ్చి తన పైజామా జేబులోంచి ఆ రెండు ఆపిల్స్ నూ బయటకు తీసి " సార్.... మీకు స్వయంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీ న్యూఇయర్ టు యు!"అంటూ ఆ రెండు పళ్లనూ శివరావుగారి చేతిలో వుంచాడు.


    అంత పెద్ద ఆపిల్ పళ్లను ఒక సామాన్య గుమాస్తా ఇచ్చేసరికి శివరావుగారు ఆశ్చర్యపోయారు. చిరునవ్వుతో వాటిని స్వీకరించి, కాళ్లకు నమస్కారం పెట్తున్న రజాక్ భుజం తట్టి లేవదీశాడు.


    భద్రంగారి పెదవులపై ఒక విషపునవ్వు భద్రంగా చోటుచేసుకుంది.


    మిగిలిన సిబ్బంది ఆశ్చర్యంతో మునిగిపోయారు. 'అందరితోపాటు చందా యిచ్చిన అబ్దుల్ రజాక్ ఇప్పుడు స్వయంగా మళ్లీ ఆపిల్స్ ఇయ్యడమేమిటి? కాకా వేషాలు కాకపోతే!' అనుకున్నారు.


    శ్రీకృష్ణ దేవరాయలవారి కాలంలో "అఫ్జల్ ఖాన్" అనే మహమ్మదీయ సర్దార్ వుండేవాడు. అతను ముక్కోపి. ఒకరోజున  క్షయరోగి అయిన బాటసారి ఒకడు అఫ్జల్ ఖాన్ వంటి అరుగు మీద ఆరాత్రి  పడుకుని విశ్రమిస్తున్నాడు. అతను విపరీతంగా దగ్గుతుంటే నిద్రాభంగమై అఫ్జల్ ఖాన్ కి పట్టరాని కోపం వచ్చింది. ఆ దగ్గు గోల భరించలేక బయటకు వచ్చి ఆ బాటసారి తల నరికివేశాడు.


    ఈ నేరం రాయలవారి ముందు విచారణకు వచ్చింది. ప్రభువులు అఫ్జల్ ఖాన్ కీ మరణదండన విధించారు.

 
     అయితే... మహామంత్రి తిమ్మరుసు - "ప్రభూ ..ఇతనికి తమ కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చి సత్కరించండి" అని సలహా ఇచ్చాడు.

 
    తగిన కారణం లేనిదే తిమ్మరుసు అలా చెప్పివుండడని రాయలవారు గ్రహించి అప్జల్  ఖాన్ కి  తన సైన్యంలో మంచి ఉద్యోగం  ఇచ్చాడు. తనని అంతగా సత్కరించిన రాయలవారు, తిమ్మరుసుల పట్ల అంచలంచల భక్తి విశ్వాసాలు పెంచుకున్నాడు అఫ్జల్ ఖాన్.


    కొంతకాం తర్వాత ఒకసారి రాయలవారు స్వల్ప పరివారంతో వేటకు వెళ్లారు.  అదను చూసి బహమనీ సుల్తాన్ లలో  ఒకరు తన సైన్యంతో రాయలవారి పరివారాన్ని చుట్టుముట్టాడు. ఆ సైన్యాన్ని ఎదుర్కొనే  అవకాశం లేదు. తంత్రం  ఒక్కటే  మార్గం అని నిశ్చయించాడు తిమ్మరుసు. రాయలవారికి నచ్చచెప్పి సంధి సందేశాన్ని రాయించి అఫ్జల్ ఖాన్ ద్వారా సుల్తాన్ కి పంపించాడు.


    అది చదివేసరికి సుల్తాన్ అగ్గిబుగ్గయిపోయాడు.

 
    అందులో సుల్తాన్ ను పరమనీచంగా తిడ్తూ రాసుంది. కోపం పట్టలేక ఆ సందేశ పత్రాన్ని నేలమీదికి విసిరికొట్టి దానిమీద ఉమ్మివేసి కాలితో తొక్కి నలిపాడు సుల్తాన్.


    తన ప్రభువును అవమానించడాన్ని సహించలేకపోయాడు అఫ్జల్ ఖాన్.

 
    వెంటనే ఒరలోంచి కైజార్ తీసి పులిలాగా ఎగిరి సుల్తాన్ ని పొడిచివేశాడు. అంతా లిప్తపాటులో జరిగిపోయింది. సుల్తాన్ చనిపోవడంతో అతని పరివారం, సేనలు చెల్లాచెదురైపోయాయి. ఆ విధంగా రాయలవారికి విజయనగర సామ్రాజ్యానికి పెద్ద ప్రమాదం తప్పింది.


    అప్పుడు తిమ్మరుసు అన్నాడు - "ప్రభూ.. వెర్రికోపం వుండడం కూడా ఒక అరుదైన  లక్షణం. ఒక్కోసారి అదికూడా ఉపయోగపడ్తుంది. అందుకే ఖాన్ ని గౌరవించి మనకు పరమ విధేయునిగా, భక్తునిగా మార్చాను. ఇటువంటి ఉపద్రవం రావచ్చునని ఊహించి అతడిని మన వెంట తెచ్చాను. సుల్తాన్ కి కోపం వచ్చేలాగా సందేశం రాసి,  ఖాన్ ద్వారా పంపించాను. అతన వెర్రికోపమే ఈనాడు మనల్ని ప్రమాదం నుంచి తప్పించింది" అని వివరించాడు తిమ్మరుసు.

 
    భద్రంగారికి ఈ కథ గుర్తుకి వచ్చింది.


    'నీ చేతివాటం  గమనించాను. నీ ప్రజ్ఞని గుర్తించాను. నీ చొరవకు ముగ్దుడనయ్యాను. నువ్వు పైకి వస్తావు బిడ్డా. నిన్ను అఫ్జల్ ఖాన్ అంతటివాడిని చేస్తానయ్యా అబ్దుల్ రజాకూ!' అని మనసులోనే అనుకున్నాడు. అఫ్జల్ ఖానే ఈ జన్మలో అబ్దుల్ రజాకేమోననిపించింది. అందుకే రజాక్ విషయం  బయటపెట్టి అతని పరువు తీసి అల్లరిపాలు చేయదలుచుకోలేదు. కనీసం అంతరంగికంగా కూడా తాను చూసిన విషయాన్ని శివరావుగారికి చెప్పలేదు.

 
    మర్నాటినుంచి అబ్దుల్ రజాక్ పట్ల ప్రత్యేకాభిమానం చూపించసాగారు భద్రంగారు. అతనికి అతితక్కువ పనివుండే సీటు ఇచ్చాడు. ఏ అవసరం వచ్చినా రజాక్ కి చెప్పేవాడు.


    "అదెంతపని సార్... నేను చేసుకువస్తాగా!" అంటూ చిటికె వేసి నిజంగానే చిటికెల మీద ఆ పని చేసుకువచ్చేవాడు రజాక్.


    "రజాకూ.... రేపు డైరెక్టర్ గారు క్యాంప్ కి వస్తున్నారు. స్టేషన్ కి కారు పంపితే బాగుంటుంది" అని ఓ సన్నాయి నొక్కు నొక్కేవారు భద్రంగారు.


    "నేనున్నానుగా సార్.... మీరు నిశ్చింతగా వుండండి" అని మర్నాటికల్లా కారు ఏర్పాటు చేసేవాడు.  ఊరిలో ఏ పెద్ద ఇండస్ట్రీయలిస్ట్ దగ్గరికో, బిజినెస్ మాగ్నెట్ దగ్గరికో వెళ్లేవాడు. తన వాక్ చాతుర్యంతో అందమైన అబద్దాలని కలిపి వాళ్లని ఉబ్బేసి వాళ్ల కారు సంపాదించేవాడు. ఆఫీసర్ గారిని తీసుకురావడానికీ, తీసుకువెళ్లడానికే కాకుండా, ఊరిలో  తిప్పడానికీ, దగ్గరలోవున్న దర్శనీయ స్థలాలను  చూపడానికి కూడా కారు ఏర్పాటు చేసేవాడు.


    ఎవరైనా ఆఫీసర్ బదిలీ మీద కొత్తగావస్తుంటే ఆయన వచ్చేటప్పటికి అన్ని హంగులూవున్న అందమైన ఇంటిని  అందుబాటులో వుండే 'అడ్డా' లో చూపించేవాడు. ఆయన రాగానే  సామానంతా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసు నుంచి తెప్పించి, ఆ కేసుల్ని  ఓపెన్ చేసి ఇంట్లో చక్కగా సర్దేవాడు. ఆఫీసర్ వెళ్లిపోతున్నా అంతే! అంతా తానే స్వయంగా ప్యాక్ చేసి పంపేవాడు. అయ్యగారిని కారులో స్టేషన్ దాకా స్వయంగా సాగనంపి, వాళ్లు వెంట  తీసుకువెళ్లే సామానుని  కూడా - కూలీకి మోసే అవకాశం ఇయ్యకుండా తానే మోసి కోచ్ లో పెట్టి రైలు కదిలేదాకా ఉండి మరీ వచ్చేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS