Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 38

    "అదేమిటి? ఇచ్చిందంతా వెంకమ్మకి కదా!"
    "అయ్యోరామా! నువ్వింత వెర్రిదానివేమిటి రామక్కా! వెంకమ్మది వట్టి సన్యాసి బతుకు. నగలు పెట్టుకుంటుందా? చీని చీనాంబరాలు కట్టుకుంటుందా? పేరొకరిది నోరొకరిది అన్నట్టు పేరువెంకమ్మది, అనుభవం మంగమ్మది."
    "ఔనుసుమా! పాపం! అనుభవించాల్సిన వయసులో ఈ దురదృష్టం?"
    "అయినా బొట్టూజుట్టూ తియ్యలేదుగా! ఏం సన్యాసం? వట్టి సన్నాసి."
    "పోదూ! అదేదో పంతానికి పోయింది. అయినా అది తరవాత తరవాత ఆడాళ్ళందరికీ మంచిదేగా!"
    "ఏం మంచో కామంచి. అది పంతం కాదు. అహంకారం."
    "పొగరు. కండకావరం అంటారు మా ఇంట్లో." సోమిదమ్మ అందుకుంది ఎప్పుడు వచ్చిందో.
    "అదేదో విప్లవంట. విప్లవకారిణి అని కూడా అంటారుటగదా!" లక్షిందేవి అందించింది.
    "ఏమోనమ్మా! ఏమన్నా అననీండి. బోలెడు సొమ్ములు, ఇంటెడు సామాను" భ్రమరాంబకి నగల తళతళలు కళ్ళల్లో మెరుస్తున్నాయి.
    సోమిదమ్మ మనస్సులో కలుక్కుమంటూనే ఉంది. అనవసరంగా తన భర్త వెంకమ్మని అవాకులూ, చెవాకులూ పేలి అల్లరి చేశాడు. ఆగడాలు చేశాడు. తనూ అల్లరిపాలు, అవమానాల పాలూ అయ్యాడు. లేకపోతే గ్రామపెద్దగా, బ్రాహ్మణసంఘంలో పెద్దగా ఇంతోఅంతో గౌరవం వెంగమాంబతోపాటు తనభర్తకీ దక్కేది. తనూ అనవసరంగా వాళ్ళని తూలనాడింది. ఈసడించింది. లేకపోతే ఆ నగలు ఎరువుతెచ్చిపెట్టుకునైనా మోజు తీర్చుకునేది. తరవాత తిరిగి ఇవ్వకపోయినా మంగమ్మ అడగదు కూడా. కనీసం వాళ్ళింటికి వెళ్ళి రాజుగారు కానుకగా ఇచ్చిన వస్తువుల్లో ఏదో ఒకటి నచ్చింది తెచ్చుకోవటమో, అపురూపమైన ఆ తినుబండారాలు కడుపారా తినటమో చేసేది. నిట్టూర్చింది.
    మంగమాంబ, నాంచారమ్మ కలిసి వస్తూ కనిపించారు. మంగమాంబ బిందెలోనుండి చిన్నచిన్న మూటలు బయటికి తీసి కాశ్మీరం నుండి వచ్చిన కాశ్మీరఫలాలు, మాదీఫలాలు ఆలుబుఖరాలు మొదలైన పళ్ళు, కుంకుమపువ్వు, కాబూలు దానిమ్మలు, బాదంపప్పులు, ఎండుద్రాక్షలు, అక్రోటులు, అంజీరలు ... ఇలా ఎన్నో, మహారాజు తమ ఇంటికి పంపినవన్నీ అందరికీ పంచింది.
    తమకిచ్చిన వాటిని పక్కవాళ్ళకిచ్చిన వాటితో పోల్చుకుంటూ, సంతోషమో, విచారమో పడుతూ ఉండిపోయారేకానీ ఒక్కళ్ళూ ఒక్కమాట మాట్లాడలేదు. చాలామందికి మనసులోనైనా కృతజ్ఞతా భావం కలగలేదు. మంగమాంబే మాట్లాడింది.
    "అత్తా! మీ కోడలు కడుపుతో ఉందిటకదూ! కుంకుమపువ్వు పాలలో వేసి ఇవ్వురోజూ! పాపాయి బంగారురంగులో ఉంటుంది...
    "రామక్కా! మీ అమ్మాయికి వేవిళ్ళు కదూ! ఈమాదీఫలాలు చప్పరించమను...
    "లక్షిందేవి! బాదంపప్పు నానబెట్టి బాగా నూరి నీ కోడలిచేత నాకించు బాలింతరాలుకదా! కావలసినన్ని పాలు పడతాయి..."
    బుచ్చిలక్ష్మి, ఆ ఊరికి కొత్తగా వచ్చిన కోడళ్లు మాత్రం "ఎంతమంచిదానివత్తా?" అంటూ మెచ్చుకున్నారు.
    "ఏమర్రా! మీ మాటలన్నీ మేము రావటానికి ముందే తిట్టుకోటంలో అయిపోయినట్టున్నాయే. ఒక్కమంచిమాట నోట్లోంచి రావటంలేదు" నాంచారమ్మ గట్టిగానే అడిగింది.
    "అదేమిటత్తా. అట్లా అంటావు. నా కోడలు పిల్ల బంగారం. దానిది బహుదొడ్డబుద్ధి. వయసులో చిన్నది, మెచ్చుకుంటే ఆయుక్షీణంకదా అని...దాని మంచితనానికి అదృష్టం తోడయ్యింది.
    "ఏమే మంగా! నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పవే!" సోమిదమ్మ మనస్ఫూర్తిగానే మెచ్చుకుంది.
    ఇదొక్కటే మంగమాంబతో చనువు పెంచుకునే అవకాశం మరి!
    భవిష్యత్తులో ఇటువంటి అవకాశాలు ఎక్కడ కోల్పోతామో అనే భయం మనస్సులోమెదిలి అందరూ తమకి తోచినట్టుగా వెంకమ్మని, మంగమ్మని వాళ్ళ అదృష్టాన్ని గొప్పతనాలని పొగడటం మొదలు పెట్టారు. మంగమాంబకి వాళ్ళ ప్రవర్తన విరక్తితో కూడిన నవ్వు తెప్పించింది.
                                                           * * *
    ఊహ తెలిసినప్పటినుండి ఎక్కువ కాలం నరసింహాస్వామి మందిరంలోనే గడిపినా, అదే తనకి ఇష్టమైనా, తన సాధనకి అనువైన స్థలంగా నిర్ణయించుకున్నది మాత్రం రాజుగారు ఆలయంలో కైంకర్యాల నిమిత్తం సొమ్మునిస్తానని అక్కడ యథేచ్చగా సాధన చేసుకోవచ్చని చెప్పిన తర్వాతనే. అది దైవాజ్ఞగా భావించింది. రాజుగారు మాట్లాడుతుంటే తన మిత్రుడు సంభాషించినట్లే ఉంది. అందుకే వారి మాట ఏదీ తను కాదనలేకపోయింది. మదనపల్లెలో ఉన్నప్పుడు పగలంతా సోమేశ్వరాలయంలో గడిపినట్లే, తరిగొండలో నృసింహాలయంలో గడపసాగింది. నృసింహాలయంలో ఒక పక్కగా ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది. అక్కడికి సాధారణంగా ఎవరూ రారు. ఏకాంతంగా ఉంటుంది. మందిరంలో ఉంటే తన స్వస్థలంలో ఉన్నట్టు ఎంతో సురక్షితంగా, భద్రంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ భద్రతా భావం వల్ల మనస్సులో ఎటువంటి ఉద్రేకాలు, ఉద్వేగాలు ఉండక శాంతంగా ఉంటుంది. అది ధ్యానానికి, యోగసాధనకి అనువైనస్థితి.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS