"అతడిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టూ టైప్ చేసిన ఆర్డర్ చేతికి ఇచ్చేశావా?"
"ఇంకా లేదు".
"కొంతకాలం దాన్ని అట్టేపెట్టు".
"పెట్టి -"
"తరువాత ఆలోచిద్దాం".
"కానీ బోర్డు వూరుకోదు, ఏం చేసేవని అడుగుతుంది".
"ఇంకో నెలకి కదా బోర్డు సభ్యులు మళ్ళీ కలిసేది".
"ఈ లోపులో ఏం చెయ్యగలం?"
"తొందరపడకు. అయినా ఈ ఉద్యోగాలు వెయ్యటం, తీసెయ్యటం వీటిదేముందిలే చాలా చిన్న విషయాలు. అంతకన్నా ముఖ్యమైన నీతివాక్యాలు రెండు చెప్తాను. చిన్న స్లిప్స్ రెండింటిమీద వ్రాసుకుని బల్ల అద్దం క్రింద చెరోవైపునా పెట్టుకో, ముందు రెండు కాగితం ముక్కలు తీసుకో శంకర్ లాల్. అనుభవం మీద నేను చెప్పే మాటలు అనుక్షణం నీకు పనికివస్తాయి, కాదనకు".
"తీసుకున్నాను".
"గుడ్. వ్రాసుకో... తెలివైనవాడు ఎప్పుడూ తొందరపడడు, అవకాశం కోసం ఎదురు చూస్తాడు".
"బావుంది. రెండోది?"
"తెలివైనవాడు ఎప్పుడూ అవకాశం కోసం ఎదురు చూడడు. తనే అవకాశాల్ని సృష్టించుకుంటాడు.... ఇది అద్దానికి రెండోవైపు పెట్టుకో".
"ఇదేమిటి? రెండూ పరస్పరం విరుద్ధంగా వున్నాయి?"
"ఆ రెంటినీ చెరోవైపునా పెట్టుకుని మధ్యలో కూర్చొని ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకోగలిగేవాడే అసలు తెలివైనవాడు. ఇది మూడోది. దీన్ని వ్రాసుకోనక్కరలేదు శంకర్ లాల్. దీన్ని మెదడులో వుంచుకో".
* * *
శంకర్ లాల్ ఛాంబర్ నుంచి బయటకొచ్చేసేక భార్గవ తన లాబ్ వైపు నడవసాగాడు. అతడి మనసంతా చికాకుగా వుంది. పేపరులో వచ్చిన వార్త అతడిని బాధపెడుతూంది. అవి అతడి భావాలే అయి వుండవచ్చు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయాయి. తనని ఉద్యోగం నుంచి తొలగించలేరు. అది వేరే సంగతి. కానీ డైరెక్టర్లందరూ తనకి వ్యతిరేకమయ్యారన్నది నిస్సందేహం. ఈ అపోహ పోగొట్టాలంటే ఏదో చెయ్యాలి.
"ఐయామ్ సారీ" అన్న మాటలకి నడుస్తున్నవాడల్లా ఆగి, ఆలోచనల నుంచి తేరుకుని తలెత్తి చూసేడు. అకౌంట్స్ డిపార్ట్ మెంట్ గుమ్మం దగ్గిర శేఖరం నిలబడి వున్నాడు. అతడి మొహం వాడిపోయి వుంది.
భార్గవ మొహం మీదకు నువ్వు తెచ్చుకుని, "ఏమిటి? అప్పుడే నాకు రావల్సిన జీతం అరియర్సూ, గ్రాట్యూయిటీ లెక్కకట్టి వుంచారా?" అని అడిగాడు. శేఖరం మాట్లాడలేదు. అతడు అకౌంట్స్ విభాగానికి అధికారి కాబట్టి రెండు గంటల క్రితమే ఈ విషయం తెలిసి, అప్పట్నుంచీ ఏం చెయ్యాలో, భార్గవకి ఎలా సానుభూతి చెప్పాలో, తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు.
"అదృష్టవశాత్తు నన్ను ఉద్యోగంలోంచి ప్రస్తుతం తీసెయ్యటం లేదులే" అన్నాడు. ఆ మాటలకి శేఖరం మొహం విప్పారింది. "ఏం జరిగింది? ఏదయినా సంధికి వచ్చారా?" అని అడిగాడు ఉత్సాహంగా.
ఇద్దరూ కాంటీన్ వైపు నడిచి, అక్కడ కూర్చున్నాక భార్గవ జరిగినదంతా చెప్పాడు. చెప్పి అన్నాడు - "ఈ పరిస్థితుల్లో ఇక్కడ పనిచెయ్యటం కష్టమే! కానీ తప్పదు. ప్రార్థన ఆరోగ్య దృష్ట్యా డబ్బు అవసరం చాలా వుంటుంది. పట్టుదలా, ఆత్మాభిమానం ఇలాటివేవీ ఇప్పుడు పనిచెయ్యవు. ఈ ఇన్ స్టిట్యూట్ ఇస్తూన్న హెల్తు ఇన్సూరెన్సే ఆస్పత్రి ఖర్చులకు ఆదుకుంటూంది. ఇప్పుడిక జీతం కూడా లేకపోతే మరీ కష్టం- ఎవరు నమ్మినా నమ్మకపోయినా కనీసం నువ్వయినా నమ్ము శేఖరం. ప్రార్థన ట్రీట్ మెంట్ వద్దంటున్నది డబ్బు ఖర్చుకి భయపడి మాత్రం కాదు, ప్రార్థన జబ్బు నయం చేయటానికి డబ్బే అడ్డంకి అయితే నా శరీరపు చివరి రక్తపు చుక్క అమ్మి అయినా సరే తనని రక్షించుకుంటాను".
శేఖరం కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. "ఛా, అంతమాట అనకండి. నేనూ అనవసరంగా అపోహ పడ్డాను" అన్నాడు.
"ఇప్పుడు నా వాదనలో నీకూ నమ్మకం కుదిరింది. కాబట్టి నాకో సాయం చెయ్యగలవా శేఖరం?"
"తప్పకుండా చేస్తాను. ఏమిటి చెప్పండి".
భార్గవ వెంటనే సమాధానం చెప్పకుండా కొంచెంసేపు తనలో తనే ఆలోచించుకుంటూ చివరికి అన్నాడు.
"కొంతకాలం క్రితం నీకో అనుమానం వచ్చిందన్నావ్ జ్ఞాపకం వుందా? కాన్స్- క్యూర్ ఖరీదు మిల్లీగ్రాము రెండొందల రూపాయలు ఎందుకు పెట్టారూ అని".
"అవును. సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీ బాలెన్స్ షీటు ఓ రాత్రి చదువుతూ వుంటే ఆ అనుమానం వచ్చింది" అన్నాడు శేఖరం.
"ప్రతి మందుల కంపెనీ, తన మందు సీసామీదా, టాబ్లెట్ కవర్ మీదా ఆ మందు ఎలా తయారు చేయబడిందీ ప్రింటు చెయ్యాలి. దాన్నే కంపోజిషన్ అంటారు. కానీ అందులో వాడే 'బేసిక్ డ్రగ్' తాలూకు వివరణ ఇవ్వక్కరలేదు. ఈ బేసిక్ డ్రగ్గే మందుకుగానీ, మాత్రకిగానీ వెన్నెముక. దీన్ని రహస్యంగా పెట్టుకోవచ్చు. కాన్స్- క్యూర్ విషయంలో ఆ బేసిక్ డ్రగ్ ఏమిటో తెలుసా శేఖరం?"
"సల్ఫా-2"
"కరెక్టు. ఇది కనుక్కున్నందుకే చంపాలాల్ కి పద్మశ్రీ ఇవ్వబడింది" అన్నాడు భార్గవ. ప్రస్తుతం మనదేశంలో ఈ మందుల తయారీ ఒక విషవలయంగా తయారయింది. బియ్యం కిలో రెండ్రూపాయలకి ఇవ్వాలని నిర్ణయాలు చేసే ప్రభుత్వం, ప్రజలకి మరో ముఖ్యావసరమైన ఈ మందుల ధర విషయంలో చూసీ చూడనట్టుగా వుంటుంది. దేశంలోకెల్లా పెద్దవయిన మూడు నాలుగు మల్టీ నేషనల్ కంపెనీలు మొత్తం ఈ వ్యాపారాన్నంతా గుత్తకు తీసుకున్నాయి. నీట్ గా, అందముగా వుండే మెడికల్ రిప్రజెంటేటివ్ లు తమ వాక్ చాతుర్యంతో డాక్టర్లకి ఈ మందుల గురించి ఉద్బోదిస్తారు. ఆకర్షణీయమైన కమీషన్ లు ఇవ్వబడతాయి. చాలా మంది డాక్టర్లకి స్వంతంగా మెడికల్ షాపులున్న విషయం కూడా సర్వజనితమైన విషయమే. ఇదంతా ఒక పెద్ద రాకెట్! మందు తయారీ గురించి ప్రజలకి తెలీదు. కాబట్టి మోసపోవటం సాధారణ విషయమే అయినా, డాక్టర్లు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టూ ఇవే కాస్ ట్లీ మందులూ, టానిక్కులూ వ్రాయటం ఆశ్చర్యకరమైన విషయం. ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ఒక డాక్టరు నాతో అన్నాడు. 'పది రూపాయల టానిక్ వ్రాస్తేనే రోగి సంతృప్తి పడతాడు. దాని బదులు ప్రశస్తమైన గంజితాగు అంటే వేరే డాక్టర్ ని వెతుక్కుంటాడు' అని. అది నిజమే అయివుండొచ్చు. ఇప్పుడు మన సబ్జెక్టు అదికాదు, కాన్స్- క్యూర్ గురించి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మందు కాటగిరీ-4లో పెట్టబడింది.
"కాటగిరీ-4 అంటే".
