Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 37

    "అర్జంటుగా కొండపైకి వెళ్ళాలి......" చెబుతూ డోరు తెరుచుకుని కారు ఎక్కి డ్రైవర్ ప్రక్కన కూర్చుంది. డ్రైవరు, వెనుక ప్రక్క కూర్చున్న మనిషి ఆశ్చర్యపోయారు. డ్రైవరు తల వెనక్కి తిప్పి అతని వంక చూశాడు.
    అతను తలూపాడు.
    కారు బయలుదేరింది. పది నిముషాల్లో కారు కొండ ముందు ఆగింది. కారు ఆగిన మరుక్షణం భాగ్యలక్ష్మి డోరు తెరిచి క్రిందకు దూకింది. బాణంలా మండపంవైపు దూసుకుపోయింది. ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ బ్యాక్ డోరు తెరుచుకుని దిగాడు శివరావు. డ్రైవరుకి డబ్బులు చెల్లించి ఎయిర్ బ్యాగ్ తగిలించుకుని గుడివైపు నడిచాడు.
    మండపం చేరుకున్నాడు శివరావు. చుట్టూ మూగిన జనాన్ని తప్పించుకుని పెళ్ళిపీటల వైపు చూసి అప్రతిభుడయ్యాడు.
    శీతయ్య, రామకృష్ణ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు. శీతయ్య ప్రక్కన సులోచన,రామకృష్ణ ప్రక్కన టాక్సీలో వచ్చిన అమ్మాయి కూర్చుని న్నారు. శీతయ్య  తాళి కట్టడం అక్కడా ఉన్నవాళ్ళెవరూ చూడలేదు. సరిగ్గా ముహూర్తం సమయానికి వచ్చి రామకృష్ణచేత తాళి కట్టించుకున్న భాగ్యలక్ష్మిని చూడసాగేరు.
    అందరూ తన వంకే చూస్తున్నారని గ్రహించిన భాగ్యలక్ష్మికి తన తలని మరికొంచెం వాల్చింది.
    శీతయ్య వెయ్యినూట పదహార్లు చదివించాలని అనుకున్న శివరావు ఐదువందల పదహార్లుగా ఆ డబ్బుని రెండు జంటలకు చదివించాడు. ఏడుగంటలకు అన్ని పనులు పూర్తి చేసుకుని రామకృష్ణ బృందం టాక్సీ దగ్గరకు వచ్చింది.
    "ఇప్పుడెలా?" హఠాత్తుగా అన్నాడు లక్ష్మీనారాయణ.
    "ఏమయింది!" అడిగాడు రామకృష్ణ.
    "మనం ఆరుగురం టాక్సీలో వచ్చాం. ఇప్పుడు ఎనిమిదిమంది అయ్యాం. కారులో చోటు చాలదు...." చెప్పాడు.
    వాళ్ళతో కారులో వచ్చిన ముసలావిడ చెప్పింది.
    "ఇంటి దగ్గర భోజనం ఏర్పాట్లు చూడాలని అర్చన, శివరావు గంటన్నర క్రితమే బస్సులో వెళ్ళిపోయారు."

                                                                   *    *    *    *   
    రాత్రి పడుకోబోయే ముందు ఓ టాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు త్రాగాడు శివరావు. అది చూసి అడిగింది అర్చన.
    "దేనికి ఆ టాబ్లెట్?"
    "నీరసం తగ్గడం కోసం. వారంరోజులు వాడాలి." చెప్పాడు.
    "ఇదేమిటి? ఏమయిందిక్కడ?" అతన్ని సమీపించి ఆశ్చర్యంగా అడిగింది.
    చర్మం తెగినట్టు వ్రేలడంత వెడల్పుతో మందంగా ఒక గీత వీపుమీద కనిపిస్తోంది. అంతకు ముందు అది అతని వీపుమీద లేదు.
    ఆమె ఏం చూసిందో గ్రహించే సరికి అతని గొంతు తడారి పోయింది. చప్పున అర్చనవైపు తిరిగాడు, ఆమె మరింత పరీక్షగా చూసే అవకాశం లేకుండా. సమాధానం ఏం చెప్పాలో వెంటనే స్పురించలేదు. అర్చన అతని మొహం వంక అనుమానంగా చూడసాగింది.
    "బొంబాయిలో ఒక వీధి నుంచి వెళుతుండగా హఠాత్తుగా మత కలహాలు చెలరేగాయి. ఒకతను నన్ను కత్తితో పొడిచాడు. అదృష్టం బాగుండటం వల్ల కత్తి లోతుగా దిగలేదు. గాయం చిన్నదే కనుక మానిపోయింది." చెప్పి ఆమె మరిన్ని ప్రశ్నలు వెయ్యకుండా దగ్గరకు లాక్కున్నాడు.
    "ఈ విషయం నాకు ముందు చెప్పలేదేం?" అడిగింది.
    అర్చన మొహంలోకి చూసి అన్నాడు.
    "దాని గురించి కాసేపు దెబ్బలాడు కుందామా?"
    అర్చన మాట్లాడలేదు.
    "పదిహేను రోజులు దూరంగా ఉన్న భర్త ఇంటికొచ్చి తన భార్యతో మాట్లాడే మొదటిమాట ఏమిటి?" అడిగాడు.
    అర్చన తదేకంగా చూస్తోంది.
    "ఏమిటలా చూస్తున్నావ్? కొంపతీసి తల దువ్వుకోవడం మర్చిపోయానా?" అని, జుట్టు చేత్తో సర్దుకున్నాడు.
    ఫక్కున నవ్వింది అర్చన. కొన్ని క్షణాల తరువాత ఆ నవ్వు శివరావు గుండెల దగ్గర వినిపించసాగింది.  
                              *    *    *    *
    మరునాడు ఉదయం అర్చనని తీసుకుని బయలుదేరాడు శివరావు. ముందుగా లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. అర్చన్ని పరీక్షించింది డాక్టర్. మందులు రాసిచ్చి వాటిని ఎలా వాడాలో చెప్పింది. బెడ్ రూములో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చెబుతుంటే అర్చన మొహం ఎరుపెక్కింది.
    డాక్టర్ దగ్గరనుంచి వచ్చి సివరావుతో అంది అర్చన.
    "మీరు కూడా చూపించుకోకూడదూ?"
    "ఏం చూపించుకోను....." ఆశ్చర్యంగా అడిగాడు.
    "వీపు మీద గాయం!"
    "భలే దానివే.....పద!" అన్నాడు.
    అక్కడనుంచి బ్యాంక్ కి వెళ్ళారు. నెల నెలా వడ్డీ తీసుకునే పద్దతిలో ఎనభైవేల రూపాయలు ఫిక్స్ ద్ డిపాజిట్ చేశాడు. అర్చన్ని నగల దుకాణానికి తీసుకెళ్ళి ఒక గొలుసు కొని పెట్టాడు. ఆమె కోరికమీద బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ తీసుకున్నాడు.
    సాయంకాలం శేర కన్సల్టెంట్ ని కలుసుకున్నాడు. ఏజెంట్ తో మాట్లాడి  కొన్ని ఫారాలు తీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఇంటికి చేరాడు. తను తీసుకెళ్ళిన ఫారాలు టేబుల్ పైన పెట్టి చంద్రమతితో చెప్పాడు.
    "వీటిలో ఇంటూ గుర్తు పెట్టినచోట సంతకం చెయ్యి...."
    "దేనికి?" అనుమానంగా అడిగింది.
    పాప పేరు మీద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఐదువేలు, చిన్నవాడికి ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కీం కోసం రెండువేల ఏడు వందలు, పెద్దవాడి పేరు మీద పన్నెండువేల మూడు వందలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నాను. వీళ్ళకి పాతిక సంవత్సరాలు వచ్చేసరికి తలో లక్ష రూపాయలు అందుతాయి. వీటికి నువ్వే గార్డియన్ వి కాబట్టి నీ సంతకాలు కావాలి...." చెప్పాడు.
    ఆమె సివరావుని ఆశ్చర్యంగా చూసి ఫారం తీసుకుని అడిగింది.
    "నువ్వే గార్డియన్ గా ఉండొచ్చు కదా...."
    "ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు గార్డియన్ గా ఉంటే మంచిది...."
    "అదేం మాట...." అంది చంద్రమతి.
    "బాధలతో బ్రతికేవాడు, సమస్యలతో సతమతమయ్యే వాడు ఎక్కువ కాలం బ్రతకడు. ఎన్నో పనుల మీద బయటకు పోతాను. రోడ్డు మీద నేను జాగ్రత్తగానే నడవొచ్చు. ఎన్నో వాహనాలు నన్ను దాటుకుని వెళతాయి. వాటిని నడిపే వ్యక్తుల్లో ఒక్కడు కాస్త నిర్లక్ష్యంగా నడిపితే చాలు నా బ్రతుకు తెల్లారిపోవడానికి" చెప్పి బట్టలు విప్పడానికి గదిలోకి వెళ్ళాడు.
    నల్లసూట్ వ్యక్తి శివరావుని కలవడానికి మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఇరవై వేలు ఇచ్చాడు. ఆ డబ్బు కాకుండా లక్ష రూపాయలకు ఒప్పందం కుదిరింది. అతనికి ఇరవై వేలు చిన్న మొత్తం. శివరావు ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినా ఇచ్చేవాడు.
    శివరావు ఖర్చులన్నీ ఆ సూట్ వాలా భరించాడు.       
                                                                  *    *    *    *
    "రేయ్ రామకృష్ణా! బయటికి రారా.....నీ సంగతి తేలుస్తాను." ఎవరో బిగ్గరగా అరిచాడు.
    ఉదయం భాగ్యలక్ష్మి స్నానం చేస్తున్నప్పుడు జరిగిందా సంఘటన. స్నానం మధ్యలో ఆపి తడి శరీరంపైన చీర కట్టుకుని గబగబా వీధి గుమ్మం దగ్గరకు వచ్చింది.
    రామకృష్ణ అప్పటికే గుమ్మం అవతల నిలబడ్డాడు. అతని వెనుక శివరావు, శీతయ్య ఉన్నారు. వాళ్ళ వెనుక సులోచన, అర్చన నిలుచున్నారు. భాగ్యలక్ష్మి వాళ్ళని తప్పించుకుని వచ్చి రామకృష్ణ ప్రక్కన నిలబడింది.
    ఇంటి ముందు షుమారు వంద మంది కర్రలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళ ముందు భాగ్యలక్ష్మి అన్నయ్య ఉన్నాడు. రిక్షా కార్మికులను త్రాగించి గొడవకి తీసుకొచ్చాడని గ్రహించింది. అటువంటిది ఏదో జరుగుతుందని ఆమె ముందే అనుమానించింది. దానికి మానసికంగా తయారయింది కూడా!
    "ఏం కావాలి మీకు?" అడిగాడు రామకృష్ణ. అతని శరీరం మీద లుంగీ, బనియన్ మాత్రమే ఉన్నాయి.
    "అమాయకురాలైన నా చెల్లెల్ని మోసంచేసి పెళ్ళి చేసుకుంటావా! మేమంతా చచ్చామనుకున్నావా? నీ రక్తం కళ్ళ చూస్తాను...." అరిచాడు భాగ్యలక్ష్మి అన్నయ్య పేట్రేగిపోతూ.
    ఒక కార్మికుడు చేతిలోని కర్రను బలంగా విసిరాడు. అది రామకృష్ణ తలని తాకక ముందే భాగ్యలక్ష్మి అతన్ని ప్రక్కకు లాగింది. కర్ర గోడకు తగిలి సున్నం పెచ్చు రాలింది. భాగ్యలక్ష్మి చప్పున రామకృష్ణ ముందుకొచ్చి నిలబడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS