"ముప్పై రాకుండానే తాతనవుతానా? అతెలా?"
"ఆడపిల్ల చెంపపెట్లకి నోట్లో పళ్లన్నీ గవ్వల్లారాలిపోయి" శాలిని తెచ్చిపెట్టుకొన్న సీరియస్ తో అంటూంటే శర్మ మనసారా నవ్వసాగాడు. నవ్వుతూంటే తెల్లని పలువరుసమీద దీపకాంతిపడి అతడి ముఖాన్ని మరింత సుందరంగా మారుస్తూంది.
"అందరాడపిల్లల వెంటంతా ఎందుకు పడతాను? పడాల్సిన పిల్లవెంట మాత్రమే పడతాను. ఆ డొంకతిరుగుడు చాలించి మనం ఇంక సూటిగా వెళ్లిపోదాం శాలినీ! ఒకరంటే ఒకరికి యిష్టమన్న సంగతి మనం మాటల్లో చెప్పుకోలేదుగాని కళ్లతో చెప్పుకొంటూనే వున్నాం అశలు ప్రేమికుల మధ్య పెదవులకంటే కళ్లే యెక్కువగా మాట్లాడటుకొంటాయేమో!చెప్పండి నామీద మీకు ఎలాంటి అభిప్రాయం వుంది?"
మానసవీణ మీటి యెవరో మోహనరాగం పాడుతున్నట్టుగా వుంది శాలినికి. ఇంత తొందరగా తను దాగుడుమూతలాట అంతమౌతుందని, అతడింత తొందరగా, సూటిగా అడుగుతాడనీ అనుకోలేదు శాలిని సంతోషమో, గాబరానో- గుండెలు మాత్రం టకటకా కొట్టుకొంటున్నాయి.
"ఉత్తముడయిన, చురుకయిన ఒక ఉపాధ్యాయుడని!" అతడి ప్రశ్నకు జవాబుగా అంది చిరున్వవుతో.
"నీనుండి ఆ సర్టిఫికెట్ కాదు నేను కోరేది! పెళ్లికావలసిన ఒకమ్మాయికి, పెళ్లికాని ఒక అబ్బాయిమీద కలిగే...."
"నాకేం కలుగలేదు."
"ఏయ్!" శర్మ శాలిని రెక్క బిగించినట్టుగా పట్టుకొన్నాడు "నా కళ్లలోకి సూటిగా చూసి చెప్పు ఏంలేదని!"
"ఉంటే?" దబాయింపుగా అంది "ఉన్నవన్నీ పెళ్లిదాకా వెడతాయా?"
"నీవేపు అభ్యంతరాలేమిటి?" ఏకవచనంలోకి దిగిపోయాడు.
"ప్రేమ కులం అడగదు పెళ్లిమాత్రం అడుగుతుందికదా?"
"ఓ! ఇంత ఆధునికురాలివి! అభ్యుదయవాదివి నువ్వుకూడా...." నమ్మలేనట్టుగా చూస్తున్నాడు శర్మ.
"నేనుకూడా కాదు! నా పెద్దలు, మీ పెద్దలు."
"నేను మధ్య బ్రాహ్మిన్! మీరు?"
"నియోగి, బ్రాహ్మకులం"
"అమ్మయ్య! బ్రాహ్మలమేకదా? కొద్దిగా శాకల్ని దాటలేమా?"
"మనం ఎప్పుడో అన్నీ దాటాం కాబట్టే యిప్పుడీ సంభాషణ మన మధ్య నడుస్తూంది. మన పెద్దలండీ!"
"చిన్న అభ్యంతరమే కాని, పెద్ద అభ్యంతరం రాదుకదా?"
"పెద్ద అభ్యంతరమే వచ్చేట్టుగా నేను ఏ హరిజన్నో, క్రిస్టియన్నో అయితే?"
"ఇంతదూరం వచ్చాక నువ్వు హరిజన్ వైనా, క్రిస్టియన్ వైనా నా భార్యవి మాత్రం తప్పకుండా అయ్యే దానివి తెలుసా? యోధుడనేకాని పిరికిని కాదు. ఎంత యుద్దమైనాసరే చేసేవాడిని నీకోసం! వచ్చే సెకెండ్ సాటర్ డే సిటీ వెడుతున్నాను. మీవాళ్ల అడ్రసిచ్చావంటే వెళ్లి అడుగుతాను."
"ఏమడుగుతారో!"
"పిల్లనిచ్చి మన్నోయింటివాడిని చేయమని!"
"కట్నమెంతో?'
"ఎంతివ్వాలేమిటి?"
"నాకు కాదండీ! తమరికి."
"నన్నో యింటివాడినిచేసి, నా యింట్లో దీపం వెలిగించి, నాకు పిల్లల్ని కని.. .ఇంతచేసే నీకే నేను కట్నం ఇవ్వడం న్యాయంకదా?"
శాలిని చిరుకోపంతో శర్మ చెంపమీద చిన్నగాకొట్టింది. "మిమ్మల్ని పెళ్లిచేసుకొన్నాక మీకు పిల్లల్ని కనక ఇంకెవరికి కంటాను?"
"ఓ!" ఒకనాడు తమ మధ్య నడిచిన సంభాషణ గుర్తొచ్చి హాయిగా నవ్వుకొన్నారు ఇద్దరూ.
"ఇహ చెప్పండి దేవిగారూ! మన పడకల సమస్య ఏమిటి?"
"గడుసుదనం కాకపోతే అతిధిదేవతగా ఆహ్వానించి దేవిని చేసుకుంటారా?"
"ఇంకా కాందే? పోనీ, గాంధర్వ వివాహం చేసుకొందామా?"
"అయ్యగారూ! ఇదిగో బెడ్ షీట్ తలగడ! నన్ను వెళ్లమంటారా?మీరు వెడతారా?"
"నేనే వెడతాను. ఇలా నువ్వు! మీ ఆడవాళ్లకి యెక్కడలేని జాగ్రత్త! ఈ రాత్రి పక్క పంచుకొంటే ఏమౌతుందేం?"
"ఆడవాళ్ల జాగ్రత్త సంగతి బాగా తెలిసినట్టుందే? ఎంతమందిని పిలిచారేమిటి పక్క పంచుకొమ్మని?"
"రామ రామ!" బెట్ షీటు, తలగడ తీసుకొని పక్కగదిలోకి వెళ్లిపోయాడు శర్మ. శాలిని నవ్వుతూ వెళ్లి తలుపుమూసి ఇవతల గడియ వేసుకొంది.
