Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 37

ఎండలో వానలో
ఎండిన చివికిన
ఒక చిన్నసైజు జీతగాడు
చెవిలో పెన్సిల్
చేతిలో సంచీ
కాకీ దుస్తులు
అరిగిన చెప్పులు
ఒక సాదా పేదవాడు
ఇంటింటికీ
వీధివీధికీ
ప్రతిరోజూ తిరిగేవాడు - ప్రైమినిస్టరా ఏం

అయితే చూడు
ఆ కిటికీలో రెండు విచ్ఛిన కలువల్లాంటి కళ్ళు
ఆ వీధి మొగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు
ఆ కళ్ళల్లో ఆతృత
ఆ గుండెల్లో గడిచిన
దేశాంతర గతుడైన ప్రియుడి వార్తకోసం

అమ్మాయీ!
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి
పళ్ళెరంలో పెట్టి ప్రాణనాధుడి కందించాలనే
నీ ఆశ నాకు అర్ధమయింది
అందుకే
నీ చూపులు తుమ్మెద బారులు కట్టి
నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి
వీధి వీధినంతా కలయచూస్తున్నాయి
అడుగో పోస్టుమాన్!
ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు
అతని మొహంమీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు
వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక
విచ్చిన రెండు కల్హార సరస్సులు

గుడిసెముందు కూర్చున్న పండుముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడిగట్టిన ప్రాణపు దీపంలో
తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS