Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 37


    "ఈ నంజిముచ్చుగాడు తప్పితే దానికెవడూ దొరకలేదురా!" అన్నాడోసారి రణధీర్.

    తను విననట్టే వూరుకొన్నాడు పరుశురాం.

    "నీలాంటి దొరబాబువి కాదని ఈ నంజిముచ్చుగాడి ప్రేమలో పడిన దాన్ని చూస్తేనే జాలిగా వుంది గురూ!" వాడి స్నేహితుడి ప్రేలాపన.

    "ఇట్లాంటోడైతే 'పని' గుట్టుగా సాగిపోతుందని. నాలుగు రోజులు కాలక్షేపం. తర్వాత దాని దారి అదే చూసుకుంటుంది" ఇంకొకడి వాగుడు.

    అనూషకీ తెలుసు.

    ఆమె వెళుతుంటే వెనకనించి కాగితం రాకెట్లతో కొట్టడం.... సైకిళ్ళపైన ఆమెను రాసుకొంటూ పోవడంలాంటి వెకిలిచేష్టలు ఎన్నో చేస్తారు వాళ్ళను.

    "మీ నాన్నగారికి చెప్పొచ్చుగా!" అన్నాడు పరుశురాం.

    "ఈ చిన్న విషయాలు నాన్నగారి నోటీసుకెందుకు? నువ్వున్నావుగా చూసుకోడానికి" అంటోంది అనూష.

    కాలేజీ గోడలపైన పరుశురాం, అనూషల పేర్లు రాశారు, బూతు బొమ్మలు గీశారు.

    పరుశురాం దానికి కూడా మౌనం వహించడంతో రణధీర్ వర్గం మరింత రెచ్చిపోయింది.

    అనూషని చూసి కొందరు జాలిపడ్డారు. కొందరు ఆడపిల్లలు ప్రిన్స్ పాల్ కి రిపోర్టు చేయమని, వాడ్ని నలుగురిలో పట్టుకుని చెప్పుతో కొట్టమన్నారు.

    అనూష చిన్న దరహాసంతో ఒకటే మాట అంది.

    "దేనికైనా సమయం రావాలి" ఆమె అంతరంగంలో ఏమున్నదీ తెలీని తోటి ఆడపిల్లలు.

    "ఇవాళ నీకు జరిగింది. రేపు మాకు జరుగుతుంది. చూస్తూ వూరుకోవడం మంచిది కాదు" అన్నారు.

    "అవును మంచిది కాదని నాకూ తెలుసు. ఏదో చెయ్యాలి" అంది సాలోచనగా అనూష.
   
                                      16

    కాలేజీ వెనక గేటు దగ్గర రిక్షా దిగింది అనూష.

    ఆమె కోసమే ఎదురు చూస్తున్న పరుశురాం ఆమెకెదురు వెళ్ళి చేతిలో వున్న గులాబీని ఆమెకి అందించబోతూ--

    "నీకోసం ఎంత సేపట్నుంచో ఎదురు చూస్తున్నాను" అన్నాడు.

    "దేనికి?"

    "ఈ పువ్వు నీకివ్వాలని"

    "ప్రియురాలికి పువ్వుని చేతికి అందించరెవరూ? తల్లో పెట్టు" అంది అనూష. కాస్త దూరంలో సైకిళ్ళపైన కూర్చుని చూస్తున్న రణధీర్ ని చూస్తూ.

    పరుశురాం చేతిలో గులాబీని ఆమె జడలో పెట్టాడు.

    "ఎంతో బాగుంది" అన్నాడు.

    ఇద్దరూ కలిసి నాలుగు అడుగులు వేశారో లేదో వెనకనుంచి సైకిల్ పైన దూసుకొచ్చాడు రణధీర్. అనూషగానీ, పరుశురాంగానీ ఊహించిన రీతిలో ఆమె జడలోని గులాబీని లాగి నలిపి కిందపడేస్తూ వెకిలిగా నవ్వి అన్నాడు.

    "నా కళ్ళముందే వాడితో పెట్టించుకోడం చూడలేనే బుల్ బుల్. చూశావా వాడు పెట్టిందాన్ని ఎలా లాగిపారేశానో!"

    పరుశురాం అతనికేసి కన్నార్పకుండా చూస్తూ నిల్చుండిపోయాడు.

    అనూష తీవ్రంగా చూసింది.

    "రామ్ నువ్వు మగాడివేనా?" అంది.

    పరుశురాం మాట్లాడలేదు.

    "వాడు మగాడు కాదనే చెప్పేది బుల్ బుల్ పిట్ట. వాడికి చిడత లిచ్చెయ్. గుళ్ళో కూచుని భజన చేసుకొంటాడు. నన్ను నమ్ముకో. రంజుగా వుంటుంది" అన్నాడు రణధీర్.

    "ఛీ.... మాట పేలితే నాలిక తెగిపోతుంది" అంది అనూష ఉక్రోషంతో.

    "ఈజిట్?" అంటూ ఆమె గెడ్డాన్ని పట్టుకుని ముఖాన్ని అటూ ఇటూ ఊపాడు రణధీర్.

    "రామ్!" పులిపిల్లలా గర్జించింది అనూష.

    "వాడి మాటలు వింటున్నా నీకు పౌరుషం రావడం లేదా? నన్ను రాకెట్లతో కొడుతుంటే చూస్తూ వూరుకొన్నావు. సైకిళ్ల పైన రాసుకొంటూ వెళుతుంటే తలదించుకొన్నావు. గోడలపైన బూతుబొమ్మలు గీస్తే నిమ్మకు నీరెత్తినట్టు వూరుకొన్నావు. ఇప్పుడు నువ్వు నా తలలో తురిమిన పువ్వుని లాగి నలిపి విసిరికొడితే చేష్టలుడిగి చూస్తున్నావు. వాడు నీ కళ్ళముందే నన్ను ముట్టుకొంటుంటే రోషం రావడం లేదా నీకు! నీలో మగతనం లేదా? నువ్వు మగాడివి కాదా?"

    పరుశురాం మొహంలోకి రక్తం పొంగింది. పళ్ళు పటపట కొరికాడు. పిడికిళ్ళు ఇనుప గుళ్ళులా తయారైనాయి. అడుగు ముందుకేసి--

    "రణధీర్.... మర్యాదగా ఇక్కడ్నించి వెళ్ళిపో" అన్నాడు.

    "ఏడిశావ్!" అంటూ ఈడ్చి అతని మొహంపైన కొట్టాడు రణధీర్. ఆ దెబ్బకి పరుశురాంని రెచ్చగొట్టానేమో అని దిగులు పడుతోంది.

    పరుశురాం పెదిమ చిట్లి రక్తం కారుతోంది. చేత్తో రక్తాన్ని తుడుచుకొని ఒక్కసారి వాళ్ళకేసి చూశాడు. మెల్లగా లేచి నించున్నాడు. అక్కడున్న ఎవరూ వూహించని రీతిలో పరుశురాం--

    "బస్తీమే సవాల్" అంటూ గాలిలోకి ఎగిరాడు.

    ఒక ముష్టిఘాతం రణధీర్ ముఖంపైన, మరో ముష్టి ఘాతం ఇంకొకడి మెడపైనా, రెండు కాళ్ళతో మరో ఇద్దర్నీ ఒకేసారి కొట్టాడు.

    ఆ దెబ్బలకి కళ్ళు బైర్లు కమ్మాయి వాళ్ళకి.

    రణధీర్ ని జుట్టు పట్టుకొని పైకి లేపి గెడ్డం కింద కొట్టాడు. ఆ దెబ్బకు ఐదు గజాల దూరంలో పడ్డాడు రణధీర్. మిగిలిన ముగ్గురు అతని ధాటికి తట్టుకోలేక అక్కడ్నించి పరుగు తీశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS