Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 36

 

    "ప్రచండ భైరవుడి కోటా?" అన్నాడు ఉదయార్కర్ ఆతృతగా.
    నిజమో కాదో గానీ, వినడానికి ఎంత థ్రిల్లింగ్ గా ఉంది.
    ప్రచండ భైరవుడి కోట.
    ఏ జానపద గాధలోనో తను ఒక పాత్రగా మారిపోయినట్లు భావన!
    "అవును శ్రీశైలం అడవుల్లో ఉంది" అన్నాడు బ్రహ్మచారి. "అక్కడ ప్రచండ భైరవుడు అనే రాజు కట్టిన చిన్న కోట వుంది. "
    "నేనెప్పుడూ వినలేదే?"
    "విని ఉండవు. దాన్ని చూసినవాళ్ళు తక్కువ. చూసి తిరిగి వచ్చిన వాళ్ళు అసలు లేరు నేను తప్ప!"
    "ఎందుకని?"
    "ప్రచందభైరవుడి కోట గుమ్మానికి బ్రహ్మాండమైన రాతి తాళం కప్పు వేళ్ళాడుతూ వుంటుంది. దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయ్యత్నించి ఘోరమరణం పాలయ్యారు."
    నుదురు చిట్లించి వింటున్నాడు ఉదయార్కర్.
    "రాతి తాళం కప్పని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ దాని మీద దెబ్బ వెయ్యగానే వాళ్ళ కాళ్ళ కింద వున్న ఒక రాతి పలక పైకి లేచిపోతుంది. వాళ్ళు ఆ పక్కనే వున్న బావిలోకి విరుచుకు పడిపోతారు.
    ఆ విషయం తెలిసి ముందు జాగ్రత్తపడి ప్రాణాలు దక్కించుకు వచ్చింది నేనే!"
    "మరి తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారా?"
    "లేదు. వెళ్ళినా నిధి ఎక్కడుందో కనుక్కోవడానికి స్మెల్లర్ కావాలి."
    "స్మెల్లర్ ఎవరు?"
    "స్మెల్లర్ అని ఒకతను. అతనికి నిధి నిక్షేపాలను వాసన చూసి పసికట్టే శక్తి వుంది. మందు బాగా తాగించాలి అతనికి. అప్పుడు మొహం వికృతంగా అయిపోయుంది. వాతావరణంలోని గాలినంతా పీల్చేస్తున్నట్లు ఎగశ్వాస పీలుస్తూ ముందు కెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలో ఎక్కడన్నా నిధి ఉంటె అక్కడ ఆగిపోయి, చేతిలో వున్న బాకుని అక్కడ దిగేస్తాడు. అక్కడ తవ్వాలి. తవ్వి తీరాలన్న మాట! లేకపోతె మళ్ళీ మాములు మనిషి కాలేదు స్మెల్లర్"
    ఒక్క క్షణం ఆగి అన్నాడు ఉదయార్కర్.
    "నాకు ఇవన్నీ చూపే ముందుగా ఆ గుహలు అవీ చూపించి గుండె ధైర్యం ఉందొ లేదో తేల్చుకుంటానన్నారూ?"
    కాసేపు తదేకంగా ఉదయార్కర్ మొహంలోకి చూసి, తర్వాత చూపులు మరల్చుకుంటూ అన్నాడు బ్రహ్మచారి.
    "ఇప్పుడింక ఆ అవసరం లేదనుకుంటాను."
    "ఎందుకని? నా ధైర్యం మీద మీకు నమ్మకం కుదిరిందా!" అన్నాడు ఉదయార్కర్.
    దానికి సూటిగా జవాబు చెప్పలేదు బ్రహ్మచారి. తర్వాత స్వగతంలా అన్నాడు. "ఈ దుర్గయ్య ఇంకా రాలేదే"
    "దుర్గయ్య ఎవరు?"
    "ఈ ప్రాంతంలో బలులు ఇవ్వడానికి అతన్నే పిలుస్తారు. పళ్ళతో కొరికి చంపగలడు గొర్రేని. "అని ప్రశంసిస్తున్నట్లు అన్నాడు బ్రహ్మచారి. "పళ్ళతో గొర్రె కింది పెదిమని పట్టుకుంటాడు దుర్గయ్య. తన రెండు బొటనవేళ్ళు దాని చిగుళ్ళకు అదిమిపట్టి గట్టిగా తల విదిలిస్తాడు. దాని చర్మం సర్రుమని మెడదాకా చీలిపోతుంది గోర్రెకి. ఆ తర్వాత నోటిలోని రక్తాన్ని ఊసి, దాని నాలుకని పెరికేస్తాడు."
    వింటున్న ఉదయార్కర్ కి వళ్ళు గగుర్పొడిచింది.
    "అడిగో వచ్చాడు దుర్గయ్య" అన్నాడు బ్రహ్మచారి.
    చటుక్కున తిరిగి చూశాడు ఉదయార్కర్.
    అక్కడ నిలబడి వున్నాడు దుర్గయ్య. నుడురంతా కుంకుమ బొట్టే వుంది అతనికి.
    అతని చేతిలో జాంబియా అనబడే వెడల్పాటి కట్టి ఉంది.


                                     14

    "మే ఐ కమిన్ సర్" అంది హరిణి చిరునవ్వుతో.
    చటుక్కున తలఎత్తి చూశాడు ఎడిటరు. వెంటనే అతని మొహంలో రిలీఫ్ కనబడింది. "ఓహ్! హారిణీ! నువ్వా! కమ్ కమ్  నీకోసం చాలా ఆదుర్దా పడిపోయాను. అరుణాచలం అపీసుకి ఫోన్ చేసి నిన్ను వెనక్కి రమ్మని చెప్పేద్దామనుకున్నాను. కానీ ఫోన్ అవుటాఫ్ ఆర్డర్. రియల్లీ హెల్ ఆఫ్ ఏ టెన్షన్. ఇంతకీ ఏమన్నాడు అరుణాచలం. ఇంటర్యు చేశావా?" అన్నాడు త్వరత్వరగా.
    "ఊహు లేదు" అంది హరిణి.
    "లేదా! ఏం? ఎందుకని? ఇంటర్యు ఇవ్వనన్నాడా?"
    "అసలు అరుణాచలం ఊళ్ళో లేడు. నేను వాళ్ళ ఆఫీసుకి వెళ్ళడానికి పది నిమిషాల క్రితమే అర్జెంటు పనిమీద జీపులో గుంటూరు వెళ్ళాడుట" అంది హరిణి.
    "గుంటూరా?"
    "అవును" అంది హరిణి.
    ఎడిటరు కనుబొమలు ముడిపడ్డాయి. అరుణాచలం గుంటూరు వెళ్ళాడా?
    గుంటూరుకి జీపులో వెళ్ళితే వయా నాగార్జునసాగర్ వెళ్ళవచ్చు. నాగార్జునసాగర్ దాటగానే మాచెర్ల వస్తుంది.
    మాచెర్ల అంటే.....?
    సందేహం ఆవరించింది ఎడిటరు మనసుని.

                          *    *    *    *
    "మాచెర్లకి లైటేనింగ్ కాల్ బుక్ చేసి మూడు గంటలు దాటింది. ఇంకా కనెక్షన్ రాలేదు. వాటీజ్ ద మేటర్?" అంది మిస్టరీ గర్ల్ అరుణ, టెలిఫోన్ ఎక్స్ చెంజికి ఫోన్ చేసి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS