దాన్లో పోలిదిన్ పేపర్ లో చాల అందంగా పాక్ చేసిన డ్రస్ ఉంది. విదేశీ మద్యం బాటిల్ కూడా వుంది.
"ఏం కావాలో తీసుకోండి" ట్రే అతని ముందుంచింది. పదివేల రూపాయలు లెక్కించి వుంచిన పాకెట్ అందుకున్నాడు.
"ఇది చాలు!' అన్నాడు ముక్తసరిగా. ట్రే తీసుకుని తిరిగి వెళ్ళిపోయింది సెక్రటరీ! మరు నిమిషంలో కుక్కపిల్ల చెవుల్ని ముని పళ్ళతో సుతారంగా నొక్కుతూ ఆ గదిలోకి వచ్చింది ఏక్ సితారా!
"ఈ డబ్బు ఏం చెయ్యాలనుకుంటున్నావు"
"చాలా అనవసరమైన ప్రశ్న"
"అంతగా చెప్పకూడని రహస్యమన్నమాట!"
"నాకేమిటి? ఎవరికయినా డబ్బు కావాలి. ఎందుకు అనే ప్రశ్నకి ఎవరి సమాధానాలు వారి కుంటాయి."
"అవసరం ఏమిటో తెలిస్తే సాయం చేద్దామని"
"జాలి సానుభూతి, సహాయం ఇలాంటివి నేను భరించలేను"
"మళ్ళీ డబ్బు కావాలంటే ఏం చేస్తావు!"
"నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఏ పూట ప్రయత్నం ఆపూటే! మరి కొద్ది సేపటి తరువాత ఏ పని చేయాల్సి వస్తుందో నాకే తెలియదు" అన్నాడు జయసింహ!
"దట్స్ గుడ్! నీలాంటి వాళ్ళే నాకు కావాలి. మళ్ళీ ఎప్పుడు కన్పిస్తావు. నీ అడ్రస్ యిచ్చి వెళ్ళు"
"అడ్రస్ ఉండే మనుషులు మీ దగ్గరకు రారు. ఆ విషయం మీకూ తెలుసు! నా అవసరం ఉన్నప్పుడు నోబుల్ పార్కు కి వస్తే నేను కన్పించే అవకాశాలుంటాయి."
"నువ్వూ ఎప్పుడూ అక్కడే ఉంటావా?"
"ఎప్పుడయినా ఉంటాను. ఎన్నో పనుల మీద తిరుగుతుంటాను. ఐనా నా చోటు అని చెప్పుకునేందుకు మరేచోటు లేదు. నేనే కావాలనేమిటి? ఈ పనులు చేసేందుకు మీకు చాలా మంది ఉన్నారు "
"ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రాణాల మీద తీపి పెరుగుపోయింది. డబ్బు లేనప్పుడే మనిషి తెగిస్తాడు. కాని కొంత డబ్బు వచ్చాక జీవితానికి ఒక హామీ దొరికాక మునుపటిలా తెగించలనుకోడు.
ప్రమాదాలకి దూరంగా ఉండాలని సురక్షితమయిన మార్గంలో నడవాలని అనుకుంటాడు.
తాను చిక్కి పోతాననుకున్న చోట మాల్ వొదిలేసి తప్పుకు పోతాడు . ప్రస్తుతం మావాళ్ళు ఆ దశలో ఉన్నారు"
"క్రొత్త మొఖాలు కావాలాని మీరు అనుకుంటారు. క్రొత్త ముఖాలు వస్తే మా సంపాదన పడిపోతుందని పాతవాళ్ళు అనుకుంటుంటారు. ఇదీ ఎంత ప్రమాదకరమయిన చోటు అయిందీ నాకు తెలుసు"
"ఇక్కడ నీకు పూర్తి రక్షణ కల్పిస్తాను. కాంట్రాక్టు పద్దతి మీద పనిచేస్తావా? నెలకు యాభై వేలిస్తాను"
"అయిదు లక్షలు ముందుగా యివ్వాలి"
"పది నెలలు అడ్వాన్సా? అసలు పది రోజుల తరువాత నువ్వు నేను క్షేమంగా ఉంటామని గ్యారెంటీ ఏమిటి? అదేం కుదర్దు. ఏ నెల జీతం ఆ నెల యిస్తాను "
"యిరవై తొమ్మిది రోజుల డ్యూటీ పూర్తయ్యాక ముప్పయ్యో రోజు మీరు , నేను క్షేమంగా ఉంటామని గ్యారెంటీ ఏమిటీ ఈ పద్దతికి నేనొప్పుకోను.
ఇలా నన్ను మభ్య పెట్టాలని మోసగించాలని మరోసారి ప్రయత్నం చేస్తే ఇంకోసారి మీరు పిలిచినా రాను"
"అలా అనను! ఎప్పటికప్పుడు కాంట్రాక్టు కుదుర్చుకుందాం వెళ్లిరా!' కుక్కపిల్లకి బిస్కెట్ అందిస్తూ లేచింది ఏక్ సితారా!
"థాంక్యూ! అదే నాకూ యిష్టం" జయసింహ ఆ గది నించి బయట పడ్డాడు. సమయం దగ్గర అవుతోంది.
సవాయ్ బార్ కి వెళ్ళాలి. చురుగ్గా నడుస్తున్నాడు. కొద్ది రోజులు ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం దొరికింది.
గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాక నడక వేగం ఆగిపోయింది. బాంబే నించి వచ్చిన డాక్టర్ యిచ్చిన అడ్రస్ మనసులోకి వచ్చింది. గుర్తుల ప్రకారం ఆ యింటికి చేరుకున్నాడు.
ప్లయిట్ కి వెళ్ళే సమయం అయింది. తన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ఉన్నాడు. దూరం నించి తాను కన్పించగానే ప్రక్కనున్న వారితో ఏదో చెప్పాడు.
వారి లేచి వెళ్ళిపోయారు.
"మరో పది నిముషాలు ముందుగా వస్తే బాగుండేది. దట్స్ రైట్ ఇప్పటికయినా వచ్చావు కదా! డబ్బు తెచ్చావా?"
"తెచ్చాను. పదివేలు" పాకెట్ అందించాడు.
"అయిదు లక్షలు యిస్తానన్నావు . గుర్తుందా?"
"గుర్తుండి ప్రయోజనం ఏమిటి? డబ్బు రావాలి కదా! లాటరీ టికెట్ పోయింది. దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం సఫలమైతే వెంటనే బాంబే వస్తాను"
"పిటీ! నిన్ను చూస్తే నాకు చాలా జాలిగా ఉంటుందయ్యా!"
"జాలి, సానుభూతి ఇలాంటివి నేను భరించలేను"
"ఒక్కొక్కసారి నిన్ను చూస్తే గర్వంగా కూడ వుంటుంది "
"మీరు చేస్తున్న సహాయానికి థాంక్స్! నేను మరోచోటుకి వెళ్ళాలి. వస్తాను" బయల్దేరాడు.
"నీ చురుకుతనం మంచితనం నన్ను ఆకర్షించాయి. ఆరోజు బాంబేలో ఉడ్ లాండ్స్ గార్డెన్ లో జరిగిన సంఘటన ఈ జీవితంలో ఎన్నటికీ మరుపురాదు.
ఎప్పుడయినా నువ్వు బాంబే రావటమంటూ జరిగితే ముందుగా టెలిగ్రాం యివ్వు! విక్టోరియా టెర్మినెస్ లో నీ కోసం సిద్దంగా ఉంటాను" బై అంటూ లేచి నిలబడి చేయి అందించాడు సర్జన్!
క్షణకాలం పాటు జయసింహ మనసు ద్రవించి పోయింది. ఏవో జ్ఞాపకాలు హరి కేక్ లో అతని గుండె గోడల్ని తాకాయి. మనసు ఉద్విగ్నమయింది. ఊగిపోయాడు.
కన్నులు చేమరించాయి.
"డాక్టర్ సాబ్! నేను తిరిగి బాంబే రాలేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? త్వరగా వస్తాను. చాలా సంతోషంగా తల ఎత్తుకుని మరీ వస్తాను.
అందాకా నా పట్ల మీకున్న గౌరవాభిమానాలు ఇలాగే ఉంటె చాలు" అన్నాడు విచలిత మయిపోతున్న కంఠస్వరంతో!
"నేను వెళ్ళగానే దాదర్ లో అతన్ని కలుసుకుంటాను. భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలి" డాక్టర్ కళ్ళు తళుక్కున మెరిశాయి.
తలదించుకుని అక్కడ నించి కదిలాడు జయసింహ!
సవాయ్ బార్ చేరుకునే వరకు బొంబాయి లో జరిగిన సంఘటనలు ఆ జ్ఞాపకాలే మనసుని వెన్నంటాయి.
కొంకణం నుంచి బొంబాయి కి వచ్చి స్థిరపడిన డాక్టర్ శశికుమార్ కాకోడ్కర్ తో పరిచయం కలిగి ఉండకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో తలుచుకుంటే ఒళ్ళు గగుర్పోడుతుంది.
పరధ్యానంగా నడుస్తున్నాడు.
"హలో జయసింహ! గుడ్ ఈవినింగ్! ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. థాంక్స్!" తీయని కంఠ స్వరం వినిపించింది.
తల ఎత్తి చూశాడు. పంజాబీ డ్రస్ లో అందమయిన అమ్మాయి నవ్వుతోంది. అప్పుడప్పుడే కొమ్మ నించి త్రుంచిన నైటో మేరీలా ఉంది.
కళ్ళు నిర్మలంగా తాజాగా ఉన్నాయి. నీటిలో ఈదులాడుతున్న చేప పిల్లల్లా తరాళీస్తున్నాయి.
మనోలోకంలో మెదలుతున్న అందమయిన ఆలోచనలు నిలువెల్లా ప్రతిఫలిస్తున్నాయి . దగ్గరగా వచ్చి చేయి అందించింది.
రోజా పువ్వుల రేకుల్లా ఉన్న అందమయిన చేయి నొక్కి వొదిలాడు.
"ఈ అందమయిన సాయంత్రాన్ని మీతో కలిసి సరదాగా గడపాలనే వచ్చాను" అన్నాడు నవ్వుతూ!
"మీరు వస్తారని నేను ఊహించాను. కాని మనం తీరుబడిగా కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా లేదు.
"ఇక్కడంతా హడావుడిగా ఉంది. వందల సంఖ్యలో వస్తున్నారు జనం" ఆమె యిలా అంటుండగానే ఒకరిద్దరూ వారిని విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయారు. తప్పుకునేందుకు చాలినంత జాగా లేదు. జనం నిండి పోతున్నారు.
