Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 37

 

    "అమ్మా !" అని పెనుకేక "యువ గొంతేనా ?" అన్నాడు రాజు.
    ఇద్దరూ నడక వేగం హెచ్చించారు.
    అక్కడ ఒక నిలువెత్తు బండ బాటకి అడ్డంగా వుంది.
    అక్కడ మలుపు తిరిగింది బాట. బ్లయిండ్ టర్నింగ్ అన్నమాట.
    బండచాటున మలుపు తిరిగిన బాటకి అవతల ఏముందో కనబడడం లేదు.
    నరవానరం అక్కడే ఉందని సూచిస్తున్నట్లుగా బాణం గుర్తు స్థిరంగా నిలిచిపోయింది.
    "బీప్ బీప్ బీప్ ....." అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా శబ్దం చేస్తోంది ఆ ఇన్ స్ట్రూమెంటు.
    "సృష్టీ ! జాగ్రత్త ! నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి దాని పని పడతా!" అన్నాడు రాజు.
    "నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండను నేను. బతుకో చావో ......అన్నీ నీతోనే అంది సృష్టి స్థిరంగా.
    ఆమె వైపు ఆప్యాయంగా, అభిమానంగా చూసి , సరే ! నా వెనకే రా !" అని ముందుకు ఉరికాడు రాజు.
    అతని వెనకే వెళ్ళింది సృష్టి.
    బండ మలుపు తిరగగానే.
    వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేనట్లుగా ఒక దృశ్యం కనబడింది.
    "స్వాగతం!" అంది నరవానరం మృదువుగా.
    "రా! చెల్లెమ్మా!" అంది నరవానరం వెనకే నిలబడి ఉన్న అమ్మాయి ఎంతో అర్ద్రంగా.
    వాళ్ళు ఇద్దరూ ప్లవర్ చిల్డ్రన్ లాగా ఉన్నారు. వాళ్ళ ఒంటి మీద అచ్చాదనగా గడ్డితో చేసిన స్కర్టు లాంటివి ఉన్నాయి. ఆ అమ్మాయి గుండెలని పూల దండలు కప్పేసి ఉన్నాయి.
    నోటమాట రాకుండా చూస్తున్న రాజుతో అన్నాడు "నరవానరం "
    నా పేరు నిఖిల్ , పేరు వినే ఉండవచ్చును.
    పెదిమలు తడి చేసుకుంటూ అన్నాడు రాజు.
    "నిఖిల్?
    "కేదారాపురం కుట్రకేసు ....."
    రాజు కళ్ళు పెద్దవయ్యాయి .
    "ఓహ్! నిఖిల్! కుట్రకేసులో యావజ్జీవ శిక్ష పడితే జైల్లో నుంచి తప్పించుకు పారిపోయిన ....ఆ కేసు నాకు గుర్తు వుంది ."
    "నన్ను కుట్ర కేసులో ఇరికించడమే ఒక పెద్ద కుట్ర అయినప్పుడు తప్పించుకుపోక తప్పుతుందా తమ్ముడు ?"
    ఇంకా చాలా విషయాలు గుర్తొచ్చాయి రాజుకి.
    నిఖిల్ ప్రజల మనిషి, ప్రజల శక్తి, పేదలకు ఆప్తుడు. పెద్దలకు పక్కలో బల్లెం!
    మామూలు పద్దతుల్లో అతన్ని ఫినిష్ చేసేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంచేత అతన్ని అనేకమైన కేసుల్లో ఇరికించారు. అతను అడవులకు పారిపోయాడు.
    దేశభక్తులు, దేశభోక్తల మధ్య ఉండటం కష్టం కదా!
    "ఈ పోరి ఎవరో తెలుసునా. అడవిలో నీకు కనబడ్డాడే రైతు -- అయన కూతురు నిత్య. మేమిద్దరం కలిసి కాపురం చేస్తుంటే కోతి కాపురం అని సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేసింది మీడియా ....." అన్నాడు నిఖిల్ నవ్వుతూ.
    "నన్ను దుష్టుల చెర నుంచీ విడిపించి తన ప్రేమతో బందీ చేస్తే , చెర బట్టడనీ పుకారు పుట్టింది " అంది నిత్య.
    నిఖిల్ నవ్వుతుంటే తదేకంగా చూశాడు రాజు. గోగ్గిరిపళ్ళు, పెద్ద ముక్కు -- బండ పెదవులు, బిరుసు వెంట్రుకలు -- పొట్టిగా లావుగా వున్నాడు. కొద్దిగా గూని.
    శారీరకంగా ఎన్ని అవలక్షణాలుంటే ఏం- మనసు గొప్పది.
    అంచేత నిఖిల్ గోగ్గిరి పళ్ళతో నవ్వినా కూడా, మనోహరంగానే కనబడింది రాజుకి.
    "అన్నా! అన్నాడు ఏంతో అభిమానంగా.
    "మా రాజ్యం చూతువురా!" అన్నాడు నిఖిల్ దారితీస్తూ.
    భూలోక స్వర్గంలా ఉంది ఆ ప్రాంతమంతా.
    ఎటు చూసినా పూల పొదలు -- విరగబూసిన పూలు -- పరిమళం -- పచ్చిగడ్డి సువాసన - మట్టి సుగంధం . నిర్భయంగా సంచరిస్తున్న లేళ్ళు. వాటి క్రీడలను బద్దకంగా గమనిస్తున్న ఒక పెంపుడు చిరత!
    "పులికీ మనిశీకి తేడా ఏంటో తెలుసా తమ్ముడూ -- పులి ఆకలి వుంటేనే చంపుతుంది - మనిషి ఆకలి కోసమే కాదు -- ఆశ కోసం కూడా అందరినీ అన్ని వేళలా చంపుకు తింటూ వుంటాడు.
    అవునన్నట్లు తల వూపి అన్నాడు రాజు.
    "అన్నా! నువ్వు కనబడటంతో "రాక్షసుడు ' అనే వాడు ఒకడున్నాడన్నది పూర్తిగా అబద్దం అని తేలిపోయింది. "కోతి కాపరం" అన్న సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ చూసి నువ్వే మా చెల్లెలిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటావనుకున్నాను. అది కాదని తెలిశాక, పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది " అన్నాడు సాలోచనగా.
    "రాక్షసుడు అన్నది అభూతకల్పనే -- లేదా నన్ను చూసి జనం భ్రమపడి వుండవచ్చును. కానీ తమ్ముడు -- ఒక్క విషయం మాత్రం నిజం."
    "ఏమిటన్నా!" అన్నాడు రాజు.
    "నేను మాయలు మంత్రాలు అంటే ఆమడ దూరంలో ఉండేవాణ్ణి. అభూత కల్పనలు అసలు నమ్మని వాడిని. రాక్షసుడి గురించిన కధలు నేనూ వింటూనే వున్నాను. నాకు అంతుబట్టనిది ఏదో జరుగుతోంది రాజూ! తొందరపడి ఇట్లా మాట్లాడేరకాన్ని కాను నేను! అన్నాడు నిఖిల్.
    నిఖిల్ నాస్తికుడు . హేతువాది.
    అతనే ఇట్లా అనేసరికి అయోమయంలో పడ్డాడు రాజు. ఏమిటన్నట్లు చూశాడు.
    గొంతు సవరించుకుని అన్నాడు నిఖిల్.
    "అడవిలో ఈ ప్రాంతంలో రాముడి మడుగు అని జనం పిలిచే ఒక చెరువు వుంది ."
    వింటున్నారు రాజూ, సృష్టీ.
    నేనూ, నిత్యా ఓ రోజున అక్కడికి వెళ్ళాం. నిత్యకి మూడో నెల.
    "ఓహ్! కంగ్రాట్స్! అంది సృష్టి నవ్వుతూ చూస్తూ.
    "పులుపు మీద మనసుపోయింది నిత్యకి. రాముడి మడుగు ఒడ్డున మామిడి తోట ఒకటి ఉంది. ఒక కాయకేసి గురి చూసి రాయిని విసిరింది నిత్య. రాయి సరిగ్గా మామిడికాయకి తగిలింది. అని ఆగాడు నిఖిల్.
    "అయితే ?" అన్నాడు రాజు.
    "రాయి కాయకి తగిలింది . కానీ - రాయి గానీ, కాయ గానీ మళ్ళీ కింద పడలేదు. పక్షులు పైకి ఎగిరినట్లుగా ఎగసి ఆకాశంలోకి వెళ్లిపోయాయ్.
    "వ్వాట్?" అన్నాడు రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS