Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 37

       
    భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టులో వచ్చింది.


    ఆంగ్లేయులు చెలాయిస్తుండిన అధికారం భారతీయులకి బదిలీ అయింది. అధికారం చేతులు మారిందేకాని, ఆనవాయితీలు, సాంప్రదాయాలు మారలేదు. భారతీయులది రాచరికానికి అలవాటుపడ్డ ప్రాణాలు. శ్రీరాముడు, ఆయనకు ముందు, ఆయనకు తర్వాత ఎందరో చక్రవర్తులు, మహరాజులు,  రాజులు ప్రజారంజకంగా పరిపాలించడం ఇందుకు కారణం కావచ్చు. అందుకే -' నా విష్ణుః పృధివీపతిః'అన్న నానుడి వచ్చింది.


    అంటే... రాజు సాక్షాత్తూ విష్ణు స్వరూపుడని అర్దం. విష్ణుమూర్తి దైవం కాబట్టి ప్రభువును కూడా దైవంగా కొలవడం వారికి అలవాటు అయింది. అందుకే మనం ప్రజాస్వామ్యంలో కూడా రాచరికాన్నే చూస్తాం.  ప్రధానమంత్రిని సాక్షాత్తూ చక్రవర్తిగానే పరిగణిస్తాం; గౌరవిస్తాం. అందుకనే పాలకులు పరాయిదేశస్తులైన బ్రిటిష్ వారైనా కూడా వారిని చల్లని ప్రభువులుగా కీర్తించాం;విక్టోరియా పరిపాలనని 'రాణీపాలన' అని చెప్పుకుని మురిసిపోయాం. వారికి సేవలు చేయడంలోనే ఆనందం అనుభవిస్తూ, ఎంత ఎక్కువగా సేవలు చేయగలిగితే అంతగా తమ జన్మ ధన్యాతిధన్యం అయిందని అనుభూతి చెందేవారు ఆనాటి వుద్యోగులు.


    ఇందులో తరతమ భేదం వుండేదికాదు. ఆఫీసు ప్యూన్ నుంచి ఆఫీసర్ వరకూ తమ సేవలతో ఆంగ్ల అధికారుల కటాక్షవిక్షణాల కోసం పోటీలుపడి ఎగబడేవారు. 'ఇది నీచం, ఇది ఉచ్చం....' అన్న విచక్షణే వుండేది కాదు. అడక్కుండానే ఒళ్లుపట్టి మాలిష్ చేస్తానంటే వద్దనేవాడు ఎవడుంటాడు? అందువల్ల ఆంగ్లేయాధికారులు అయాచితంగానే ఎన్నో సేవలు పొందుతుండేవారు. అయితే... వారు క్రిందివారికి ఒక పట్టాన దర్శనం ఇచ్చేవారు కాదు. క్రిందివారికి వారిని కలుసుకోవలసిన అవసరమూ ఇంచుమించు వుండేది కాదు. అవన్నీ హెడ్ క్లర్కే చూసుకునేవాడు.


     అటువంటప్పుడు - 'తమ విధేయతను అధికారుల ముందు ప్రదర్శించడం ఎలా?'  ఇందుకోసం  ఉభయతారకంగా  ఒక ఒరవడిని సృష్టించారు నల్లదొరలు.

 
    ఆరోజుల్లో ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన 'న్యూఇయర్ డే' కాబట్టి ఆఫీసులకి, స్కూల్స్ కి సెలవు  ఉండేది.


    ఆ రోజున ప్రొద్దున్నే సెక్షన్ ఆఫీసర్లూ, గుమాస్తాలూ అందరూ పోలోమంటూ దొరగారి దర్శనానికి వారింటికి వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేవారు. 'దేవుడిని, రాజుని,  పిల్లల్ని చూడడానికి వెళ్లినప్పుడు వట్టి చేతులతో  వెళ్లకూడదు' అనేది భారతీయ సాంప్రదాయం కనుక ఒక గ్రీటింగ్ కార్డునూ, కొన్ని పళ్లనూ తీసుకువెళ్లేవారు. వాటిని దొరగారి చేతిలో పెట్టి నమస్కారం చేస్తూ  శఠగోపం ముందు తలవంచిన భంగిమలో నిలబడి, స్వస్తివాచకం పలికినట్లు శుభాకాంక్షలు వల్లించేవారు.


    అయ్యవారు చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూ  ప్రతిశుభాకాంక్షలు చెప్తూ చేయి కలిపేవారు.

 
    'అదే మహాభాగ్యం!' అనుకునేవారు. ఆ అదను చూసుకొని వచ్చినవారు తమపేరూ, హోదాలను తెలుపుతూ సుక్ష్మపరిచయం చేసుకునేవారు. దొరవారు కొందర్ని మరికొన్ని వివరాలు అడిగేవారు. అంతటి గౌరవం పొందినవారు అందలం ఎక్కినట్లుగా ఊహించుకొని, 'పద్మవిభూషణ' బిరుదు వచ్చినంతగా మురిసిపోయేవారు. ఆ యోగం పట్టినివారు బాధతో కుమిలిపోయేవారు.


      ఆ రోజుల్లో 'ఆపిల్స్' చాలా అరుదైన ఫలాలు. గొప్పవారు మాత్రమే కొనగలిగేవారు. అందువల్ల సెక్షన్ ఆఫీసర్ ల వంటి  పైవర్గీయులు ఆపిల్స్ సమర్పించుకుంటే, గుమాస్తాలవంటి క్రిందివర్గీయులు బత్తాయిలతో  సరిపెట్టుకునేవారు.


    మూలవిరాట్ వాటిని చిరునవ్వుతో స్వీకరించి - అంటే.... ఒకసారి వాటిమీద చేయివేసి తాకి, ప్రక్కనే పూజారిలా  నిలబడివున్న అధికారిని ఇచ్చేవారు. ఆయన వాటిని  అక్కడే పబ్లిక్ గా ప్రదర్శిస్తే దిష్టి తగులుతుందనుకొని ఎటాచ్ డ్ రూం లోకి తీసుకువెళ్లి బల్లమీద వుంచేవారు. అంతటితో దేవుడికి నైవేద్యం పెట్టడం అయ్యేది.

 
    అయితే.... గుళ్ళో దేవుడికి నైవేద్యం పెట్తే పూజారి  సగం తీసుకున్నా మిగిలిన సగం  ఇచ్చేస్తారు. (కొన్నిచోట్ల పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు.) కాని, ఇక్కడంతా వన్ వే ట్రాఫిక్! ఇచ్చిన ఫలపుష్పాదులు లోనికిపోవడమే కాని, తిరిగి బయటకు రావడం అంటూ వుండదు.

 
    'మారాజులు స్వీకరించిదే మహాభాగ్యం!' అని భావించి మురిసిపోతూ తిరిగి వచ్చేవారు. ఎవరి శక్తికొద్దీ,  స్థాయికొద్దీ వారిచ్చే కానుకల పరిమాణం, విలువ వుండేవి.


    1930 ల తర్వాత ఉన్నత ఉద్యోగాలలో ఆంగ్లేయులతోపాటు భారతీయులు కూడా నియమితులవుతూ  వచ్చారు. తెల్లదొరలకులాగే నల్లదొరల విషయంలోనూ క్రింది ఉద్యోగులు ఈ సాంప్రదాయాన్ని  పాటిస్తూ వచ్చారు. దేశం స్వతంత్రమై అధికారులందరూ భారతీయులే అయినా కూడా ఈ సాంప్రదాయం మారలేదు. సుమారు 1960 వరకు  ఈ నూతనసంవత్సర భాగోతం జరుగుతూనే  వుండేది. అటుతర్వాత క్రమంగా ఈ ఒరవడి  తగ్గుతూ వచ్చి, చివరికి ప్రభుత్వం 'న్యూఇయర్ డే' సెలవును  రద్దు చేసిన తర్వాత పూర్తిగా ఆగిపోయింది. ఈనాటి బుద్దిమంతులు ఒక న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు పంపి చేతులు దులుపుకుంటున్నారు.

 
    అది 1960 దశకం తొలి సంవత్సరాల కాలం.


    అబ్దుల్ రజాక్ కొత్తగా గుమాస్తాగా చేరాడు. అప్పుడు నల్లదొర శివరావుగారు ఆఫీసర్ గా వుండేవాడు. ఆయన కూడా తెల్లదొరల డాబూ - దర్పాన్ని పుణికిపుచ్చుకున్నవాడు. మామూలు గుమాస్తాలకి ఆయన ఛాంబర్ లోనికి వెళ్ళవలసిన అవసరం అతి అరుదుగా వచ్చేది. సిబ్బందికీ, దొరవారికీ మధ్య  ఏ ఇబ్బందీ లేకుండా వారధిలాగా భద్రంగారు  భద్రంగా వుండేవారు. ఆయన తన కుర్చీలో భద్రంగా కూర్చుని రెండుకళ్లతో నలువైపులా చూస్తూ అజమాయిషీ చేస్తుండేవాడు.

 
    ఆరోజు జనవరి ఒకటి. నూతన సంవత్సరానికిగాను సెలవు దినం.

 
    శివరావు క్వార్టర్స్  ఆ ప్రాంగణంలోనే వుండేది.


    ఆఫీసు సిబ్బంది ఆరోజు ప్రొద్దుటే దొరగారిని కలిసి శుభాకాంక్షలు చెప్పి యధాశక్తి ఫలంకోసం'ఫల సమర్పణ' చేయాలని అనుకున్నారు.


    శివరావుగారు డ్రాయింగ్ రూం లోని నగిషీకుర్చీలో కూర్చున్నారు. భద్రంగారు ప్రక్కనే శివుని ప్రక్కన వీరభద్రుడిలాగా నిలబడి వున్నారు. ఒక్కొక్కరే వచ్చి కానుకలు, గ్రీటింగ్ కార్డ్ లు వంటివి సమర్పిస్తుంటే "వారు ఫలానా..." అని భద్రంగారు పరిచయం చేస్తున్నారు. శివరావుగారు "ఓహో ..అలాగా!" అనీ, "బాగున్నారా?" అని చిరునవ్వుతో పలకరించి కానుకలను స్వీకరించి  భద్రంగారి చేతికి అందిస్తున్నారు.  భద్రంగారు వాటిని యమభద్రంగా అందుకుని వెనుక గదిలోకి వెళ్ళి బల్లమీద పెట్టి వస్తున్నారు.


    చిన్న అధికారుల స్థాయిలో వున్నవారు శివరావుగారి ముందు వేసివున్న అరడజను కుర్చీల్లో కాసేపు కూర్చుని వెళ్తున్నారు. అబ్దుల్ రజాక్ కూడా తన సహ ఉద్యోగులతో అక్కడికి వచ్చి జరుగుతున్న తతంగాన్ని చూసి ఆనందిస్తున్నాడు.

 
    ఇంతలో... భద్రంగారికి 'ప్రకృతి పిలుపు' జోరుగా వచ్చినట్లుంది. బయటికి చెప్పడానికి మొహమాటపడి, వెనుకగదిలోకి పళ్లు పెట్టడానికి వెళ్ళినవాడు అటునుంచి అటే టాయిలెట్ వైపు జారుకున్నాడు.


    ఇంతలో... ఇంకెవరో వచ్చి శివరావుగారికి పళ్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి, ప్రక్కన భద్రంగారు లేకపోవడంతో తనను తానే పరిచయం చేసుకున్నాడు. పళ్లు అందియ్యడానికి ప్రక్కకి చూస్తే భద్రంగారు అక్కడ లేరు. "ఎటుపోయాడా?..." అని అటూ ఇటూ చూడసాగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS