Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 37

    ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, గుమ్మంముందు జరుగుతున్న కలకలం విని ఏం జరుగుతోందో చూద్దామని కృష్ణయార్యుడు, వెనకగా మంగమాంబ తలుపు తెరిచి చూసి నివ్వెరపోయి, ఆ రాజుగారికి చేతులు జోడించి నమస్కరించారు. రాజు వాళ్ళని నమస్కరించ వద్దని వారించాడు. తానే కృష్ణయార్యుని దంపతికి నమస్కరించాడు.
    "రాజావారు వెంగమాంబగారిని చూడటానికి వచ్చారు. పిలిపించండి" మంత్రివర్యులు కాబోలు సెలవిచ్చారు.
    కృష్ణయార్యుడు భయపడుతూ "రాజా! క్షమించండి. నా కూతురు చేసిన తప్పును మన్నించండి. దానికేమీ తెలియదు. ఏదైనా తప్పుచేసి ఉంటే నేను మందలిస్తాను. దండిస్తాను" అంటూ ప్రాధేయ పడ్డాడు.
    మంగమాంబ అంతకంటే దీనంగా "మా అమ్మాయి, అమాయకురాలు, వెర్రిది, లోకజ్ఞానం లేదు. తెలిసోతెలియకో తప్పుచేసి ఉంటే క్షమించండి. దానికోసం మీ అంతటివారు రావాలా? కాకితో కబురంపితే మేమే వచ్చేవారం కదా!" అంటూ ఏమేమో మాట్లాడటం ప్రారంభించింది, మహారాజుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. వాళ్ళు మాట్లాడటం పూర్తి అయినాక రాజు కృష్ణయార్యుని చేతులు రెండూ తన చేతులలోకి తీసుకుని కన్నులకద్దుకుని మృదుగంభీర స్వరంతో ఇలా చెప్పాడు.
    "బ్రాహ్మణోత్తమా! మీ దంపతులు ఎంతో ధన్యులు. మహాభక్తురాలు వెంగమాంబకి జన్మనిచ్చి, పెంచి, పోషించే అదృష్టం లభించింది మీకు. ఆమె శ్రీనివాసుని వరప్రసాదం. ఆ సంగతి మాకు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే సెలవిచ్చాడు. ఏకాదశీ వ్రతం పూర్తిచేసి నిదురించిన రాత్రి తెల్లవారుజామున కలలో ఆ వేంకటనాథుడు దర్శనం అనుగ్రహించాడు. నన్ను చూసి 'వత్సా! నీవు ధన్యుడవు. నీ ఏలుబడిలోని తరిగొండ గ్రామంలో మహాభక్తురాలు, పరమ యోగినీమణి, కారణజన్మురాలు అయిన వెంగమాంబ జన్మించి ఆ గ్రామాన్ని పునీతం చేసింది. ఇప్పుడామె, ఆమె కుటుంబం కష్టాల నెదుర్కొంటున్నారు. భగవద్భక్తులు బాధపడటం రాజుకి రాజ్యానికీ క్షేమం కాదు. సద్బ్రాహ్మణుడైన కానాల కృష్ణయార్యుని ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి రావలసింది' అని శ్రీనివాసుడు ఆదేశించాడు. తెల్లవారుజామున వచ్చిన కల నిజము కదా అనుకుని విచారిస్తే స్వామి చెప్పినట్లే తరిగొండలో కృష్ణయార్యుడు, కుమార్తె వెంగమాంబ ఉన్నట్లు తెలిసింది. మా ఆరాధ్యదైవం శ్రీనివాసుని దర్శనం కలగటానికి కారణమైన భక్తాగ్రగణ్యురాలు వెంగమాంబాదేవిగారి దర్శనం చేసుకోవటానికి మేమే స్వయంగా వచ్చాము. ఆమె వయసులో చిన్నదైనా, మేము రాజుపదవిలో ఉన్నా, ఆమెభక్తి, ఆమెపై శ్రీనివాసుని అనుగ్రహం అన్నింటిని మించినవి కనుక, ఆమెను పిలిపించటం సంస్కారం కాదని ఆ భక్తచూడామణి దర్శనం కోసం స్వయంగా మేమే వచ్చాం. అమ్మగారి దర్శన భాగ్యం ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం."
    కృష్ణయార్యుడు, మంగమాంబ తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు. పిడుగు పడుతుందని భయపడుతుంటే, చిరుజల్లు పడినట్లయింది. అంతా కలగా అనిపిస్తోంది. వింతచూడటానికి వచ్చిన గ్రామవాసులకిది వింతల్లోవింత. ఎటువంటి ప్రతిస్పందనా లేకపోవటంతో మహారాజే మళ్ళీ మాట్లాడాడు.
    "కృష్ణయార్యా! ఇకపై మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులూ రావు. మీ కుటుంబ పోషణ భారం మాది. బరువు బాధ్యతల సంగతి వదిలి సత్కర్మాచరణలోను, భగవత్సేవలోను మీకాలాన్ని యథేచ్చగా గడపవచ్చు. మీ జీవితాలను సుఖంగా కొనసాగించ వచ్చు. మీకీ విధమైన సేవచేసుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఈ ధనధాన్యాదులు ఇప్పటికి మా కానుకలుగా స్వీకరించి మమ్ము అనుగ్రహించండి."  
    ధ్యానం పూర్తి అయి, పూజా గృహంలో నుండి బయటకు వచ్చిన వెంగమాంబ అక్కడి దృశ్యాన్నంతా తిలకించింది. ఆమెను చూస్తూనే మహారాజు వెంగమాంబ పాదాలపై తల నుంచి నమస్కరించాడు. వెంగమాంబ ఆయనతో,
    "మహారాజా! లెండి! అందరూ నమస్కరించ వలసింది, అనుగ్రహించమని ప్రార్థించవలసినంది ఆ జగన్నాథుని మాత్రమే. భగవదాజ్ఞను నిర్వర్తించి మీ కర్తవ్యాన్ని మీరు పాలిస్తున్నారు. ధన్యులు. ఇంక మీదట కూడా ఈ విధంగానే కొనసాగించగలరు" అంది.
    ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే అంతా తెలిసినట్టుగా మాట్లాడటం చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది.
    "అమ్మా! వెంగమాంబా! సర్వజ్ఞురాలివి. భగవదంశ సంభూతురాలివైన నీపై ఆయన అనుగ్రహం ఉండటంలో వింతలేదు. కాని నీ కారణంగా నాకు దర్శనాన్ని అనుగ్రహించటం శ్రీనివాసుని అవ్యాజ కరుణకు నిదర్శనం. నీవంటి వరపుత్రిని దర్శించుకోవటం నా భాగ్యం.
    తల్లీ నీవంటి పుణ్యాత్మురాలు జన్మించిన ఈ గడ్డ ధాన్యం. ఈ గ్రామం ఘనం. గ్రామదైవం మహిమాన్వితుడు. అందుకే మహామహిమాన్వితుడై ఈ గ్రామంలో వెలసి, కొలువుతీరి, పరిపాలిస్తున్న తరిగొండ నృసింహునికి మాకైమోడ్పులు. శ్రీవారు వేంచేసి ఉన్న ఆలయానికి సకల సౌకర్యాలను మా కైంకర్యంగా అర్పించాలనే సంకల్పం మనసులో ఇప్పుడే తళుక్కుమన్నది. అది ఏ మహాసంకల్పానికి ప్రతిధ్వనో, ఆలయంలో ధూపదీప నైవేద్యాది భోగాలన్నీ కలకాలం అవిచ్చిన్నంగా కొనసాగటానికి కావలసిన ఏర్పాట్లు చేయించగలం. దానికి తగిన దాన పత్రాలన్నీ వెంటనే పంపిస్తాం. ఆలయంలో మీ సాధన, మీ వ్యాసంగం నిరాఘాటంగా కొనసాగగలవు. తల్లీ! సంతోషమా? ఈ భక్తదాసుడు చేయగల దింకేమైనా ఉన్నదా? సెలవీయండి. ఇకపై ఎటువంటి ఇక్కట్లు సంభవించినా, ఏ అవసరాలు కలిగినా, ఒక్క మాట చెపితేచాలు. అమ్మా! మరిసెలవా?" మహారాజు నమస్కరించాడు.
    "మహారాజా! శ్రీనివాసుని దర్శనభాగ్యం కలలోనైనా పొందిన ధన్యాత్ములు మీరు. మీకు, మీ ప్రజలకు సర్వశుభాలని శ్రీవేంకటాచలపతి ప్రసాదించుగాక!" అంది వెంగమాంబ.
    మహారాజు తాను తెచ్చిన సంబారాలన్నింటిని వేరువేరుగా దింపించి కృష్ణయార్యునికి అప్పచెప్పి, తాను అంబారీ ఎక్కి వెళ్ళిపోయాడు. రాజుగారి పరివారంతోపాటు గ్రామస్థులు కూడా మహారాజుగారికి జయజయ ధ్వానాలు పలికారు. మధ్యమధ్యలో వెంగమాంబకి కూడా జయజయలు చెప్పబడ్డాయి.
    పీఠాధిపతులనేకాదు, సింహాసనాధిపతుపను కూడా తమ గ్రామానికి రావించి, వారినుండి సన్మానాలను పొంది, గ్రామ గౌరవ ప్రతిష్ఠలను పెంచిందని చాలామంది అనుకోటం మొదలు పెట్టారు. పూర్వం కృష్ణయార్యుని, మంగమాంబని చూచి పలకరించాల్సి ఉంటుందని ముఖం పక్కకి తిప్పుకునేవారు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా కలిపించుకుని మరీ పలకరించటం, ఇంటికి రావటం మొదలు పెట్టారు. కుమార్తె గురించిన దిగులు, ఆమె భవిష్యత్తు గురించిన భయం, ఆవేదన, ఏ తప్పుచేయకపోయినా, నీలాపనిందలకి అవకాశం ఇచ్చి వంశప్రతిష్ఠకి భంగం కలిగిస్తోందేమో ననే చిరుకోపం అన్నీ మనసునుండి తొలగిపోయి అంతులేని ప్రేమతోను, ఆనందంతోను నిండిపోయాయి మంగమాంబ కృష్ణయార్యుల హృదయాలు.
                                   * * *
    "రామక్కా! నిజంగా దేవుడు కలలో కనిపిస్తాడంటావా?" - పారిజాత నాంది పలికింది.
    "ఏమోమరి? రాజుగారికి కనిపించారుగా!"
    "నిజమేనంటావా?"
    "రాజుగారు అబద్ధం చెప్పారుగా!"
    "అంతేలే!... ... ఏమైనా మంగమ్మ అదృష్టవంతురాలు సుమా!"  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS