ఇలా సాగిపోయింది ఆ న్యూస్. భార్గవ దాన్ని చదవటం లేదు- కేన్సర్ పట్ల ప్రముఖుల అభిప్రాయాన్ని ప్రచురించటానికి వచ్చిన విలేఖరి ఈ అవకాశాన్ని చాలా చక్కగా వాడుకున్నాడన్నమాట. అతడికి కుంచించుకుపోతున్న ఫీలింగు కలిగింది.
ఆ గది నిశ్శబ్దంగా వుంది.
ఆ నిశ్శబ్దంలోంచి శంకర్ లాల్ కంఠం మంద్రస్థాయిలో వినిపించసాగింది.
"ఒక కార్యాలయంలో పనిచేసే ప్రతి మనిషికి కొన్ని ఎథిక్స్ వుండాలి భార్గవా! అఫీషియల్ సీక్రెట్స్ గురించయితే అసలు చెప్పనవసరం లేదు. కేన్స్- క్యూర్ ఎటువంటి మందూ అని నేను ఇక్కడ చర్చించబోవటం లేదు. మీరు చేసింది తప్పు! ఘోరమైన తప్పు!! ఈ ఇన్ స్టిట్యూట్ లో పనిచేస్తూ- ఈ ఇన్ స్టిట్యూట్ పేటెంట్ చేసిన మందు గురించి బాధ్యతా రహితంగా ఒక పత్రికా విలేఖరి సమక్షంలో మీరు మాట్లాడిన మాటల్ని అంత తేలిగ్గా తీసుకోలేదు బోర్డు. ఈ పేపర్ చదివి, బోర్డులో ప్రతీ మెంబరూ ఈ అవకాశం తమకే జరిగినట్టూ భావించారు. ఈ ఇన్ స్టిట్యూట్ కి మీ సర్వీసెస్ ఇక అనవసరం అని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అసలింత బాధ్యతా రహితంగా ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ మీద చట్టరీత్యా చర్య తీసుకోమన్నారు కూడా, నేనే అడ్డుపడి దాన్ని ఆపుచేసెను. ఐయామ్ సారీ భార్గవా! మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టూ ఆర్డరు సంతకం చేయటం నాకు విచారకరంగా వుంది. పోతే నోటీసు ఇవ్వకుండా తీసేస్తున్నందుకు గానూ సర్వీస్ కండిషన్స్ ప్రకారం మీకు రెండు నెలల జీతం ఇవ్వబడుతుంది. మీ కూతురి అనారోగ్యం విషయమై యామై సారీ, ఇన్సూరెన్స్ ఇవ్వటానికి బోర్డు వప్పుకోలేదు. ఇంకో గంటలో మీకు ఆర్డర్లు ఇవ్వబడతాయి. సాయంత్రం లోపులో డాక్టర్ చక్రవర్తికి మీ పని, యింతకాలం మీరు చేసిన రీసెర్చి తాలూకు పేపర్లూ అందజెయ్యండి. ఆ పేపర్లు మా ఇన్ స్టిట్యూట్ తాలూకు ప్రోపర్టీ. పోతే మీకు రావాల్సిన గ్రాట్యూటీ, పి.ఎఫ్.లు కాక మరో అయిదువేలు అదనంగా ఇవ్వటానికి కష్టపడి బోర్డుని వప్పించాను. మిమ్మల్ని తక్షణం తొలగించే షరతుమీద దానికి వప్పుకున్నారు వాళ్ళు. భార్గవా! భవిష్యత్ లో ఎక్కడయినా మీకన్నా అనుభవజ్ఞులు ఏదయినా సలహా ఇస్తే దాని గురించి వెంటనే నిరాకరించక కాస్త ఆలోచిస్తూ వుండండి. అదే నేనివ్వగల సలహా. ఐయామ్ సారీ, నౌ యూ కెన్ గో.... సాయంత్రానికల్లా ఛార్జీ వప్పచెప్పండి ఐ వాంట్ ఆల్ దిస్ టు బి ఫినిష్ డ్ ఈవెనింగ్".
"ఇది ... ఇది అన్యాయం" భార్గవ దాదాపు అరిచాడు.
"ఇందులో అన్యాయం ఏమీలేదు భార్గవా! బోర్డు నిర్ణయాన్ని మీకు చెపుతున్నాను అంతే" శంకర్ లాల్ తాపీగా అన్నాడు.
"తన ఇష్టం వచ్చినట్టూ నిర్ణయాలు తీసుకునే అధికారం బోర్డుకి లేదు".
"కానీ ఒక ఇన్ స్టిట్యూట్ లో పనిచేస్తూ, దాని గురించి బాధ్యతా రహితంగా మాట్లాడటం మీకు నైతికంగా ధర్మంకాదు. అందుకే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించవలసి వస్తూంది".
"నేను మాట్లాడింది పత్రికా విలేఖరితో కాదు- తోటి సైంటిస్టుతో"
"కానీ మీరు మాట్లాడినదంతా న్యూస్ లో వచ్చేసింది. ఇప్పుడిక ప్రజల్లో కలవరం మొదలవుతుంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు వూరుకోవు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ ని ఒక వూపు వూపేస్తాయి. ఈ తుఫానుని ఆ మినిష్టర్ తట్టుకోలేక మన మీద విరుచుకు పడవచ్చు. ఇదంతా కేవలం మీవల్లా, మీ బాధ్యతా రహితమైన మాటలవల్లా వచ్చింది. మీరు ఎక్కడో బయట వుండి ఈ విమర్శ చేస్తే ఫర్వాలేదు కానీ ఈ ఇన్ స్టిట్యూట్ లో వుండి మరీ కామెంట్ చేసేరు. దాంతో వచ్చింది చిక్కు".
శంకర్ లాల్ మాటల్లో మునుపటి ఆవేశం లేకపోవటం, అతడు తగ్గి మాట్లాడటం గమనించాడు భార్గవ. దాంతో మానసికంగా బలం పుంచుకొని అన్నాడు...
"మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ కి జవాబు చెప్పుకోలేనంత బలహీనమైన స్థితిలో మనం వుంటే అది నిజంగా సిగ్గుపడవలసిన విషయం. అయినా మన ఇన్ స్టిట్యూట్ కి ఆ మినిస్ట్రీకి ఎలా 'సమాధానపర్చాలో' బాగా తెలుసు. అందువల్ల మనం భయపడవలసినదేమీ లేదు"
శంకర్ లాల్ భార్గవని నమిలి మింగేసేలా చూసేడు. భార్గవ బెదరలేదు. చేతిలో కాగితాలు సర్దుకుని లేచి నిలబడి "మరి నేను వెళ్ళొచ్చా?" అని అడిగాడు.
శంకర్ లాల్ మాట్లాడలేదు.
భార్గవ కుర్చీ జరిపి, తలుపు దగ్గిరకు వచ్చి తెరచి బయటకు నడవబోతూ అక్కడే ఆగి, శంకర్ లాల్ తో అన్నాడు- "మన సెక్యూరిటీని కాస్త జాగ్రత్తగా వుండమనండి. అసలు సెక్యూరిటీ వున్నది బయట్నుంచి లోపలికి ఎవరొస్తున్నారా పరీక్షించటం కోసం. అంతేగానీ గేటు దగ్గర కునికిపాట్లు పడుతూ కూర్చోవటానికి కాదు" అని వెళ్ళిపోయాడు.
అతడి వెనుకే తలుపు మూసుకుంది.
శంకర్ లాల్ మొహం ఎర్రగా కందిపోయింది. కొద్దిసేపుపాటు కదల్లేక పోయాడు. చివరికి తేరుకుని, పెర్సనల్ ఫోన్ దగ్గరికి లాక్కుని డయల్ చేసేడు. ఆ సంభాషణ ఆపరేటర్ వినటం ఇష్టంలేక కాదు, అసలా నెంబరుకి తను ఫోన్ చేస్తున్నట్టు మూడో కంటికి తెలియటం ఇష్టంలేక!
"హల్లో" అని అట్నుంచి విన్పించింది.
"నేను శంకర్ ని మాట్లాడుతున్నాను"
"చెప్పు"
"భార్గవ విషయం..." అని ఇంకా ఏదో చెప్పబోయాడు.
"ఇంకా అతడి విషయం ఏముంది? బోర్డులో నిర్ణయం జరిగిపోయిందిగా".
"అదంత సులభంగా అమలు జరిగేటట్టూ లేదు".
శంకర్ లాల్ తనకీ- భార్గవకీ జరిగిన సంభాషణ అంతా చెప్పి "ఈ పరిస్థితుల్లో భార్గవ కోర్టుకి వెళితే కష్టమేమో. అతడు అలా మాట్లాడటం వల్ల డైరెక్టర్ ల సానుభూతి పూర్తిగా కోల్పోయిన మాట నిజమే. కానీ లీగల్ గా అతడిని ఉద్యోగం నుంచి తొలగించటానికి అంత చిన్న కారణం సరిపోదేమో".
"మరి ఆ విషయం తెలిసిన వాడివి ఎందుకు అంత తొందరపడి ప్రొద్దున్న బోర్డులో ఈ విషయం ప్రవేశపెట్టేవ్ శంకర్ లాల్".
"మీ కోసం... కేవలం మీ కోసం చేసేను. సల్ఫా-3 మందు గురించి అతడలా నిర్లక్ష్యంగా మాట్లాడినప్పటినుంచీ అతడికి ఎలా గుణపాఠం చెప్పాలా అని ఆలోచిస్తూనే వచ్చాను. ఇన్నాళ్ళకి అతడు సరైన చోట దొరికాడనుకున్నాను. ఈ న్యూస్ పేపర్ బోర్డులో పెట్టేసరికి నేననుకున్నట్టే బోర్డు మెంబర్లు వెంటనే రియాక్టయి అతడిని ఉద్యోగంలోంచి తొలగిస్తూ ఆర్డరిచ్చారు. కానీ ఇతడు ఇలా ఎదురు తిరుగుతాడనుకోలేదు".
"సల్ఫా-3 కాదన్నాడా?"
"పద్మశ్రీ ఆశ పెట్టినా కాదన్నాడు".
"అయితే గొప్పవాడే అయి వుంటాడు. అంత గొప్పవాడు మనకెందుకు శంకర్ లాల్".
"నా ఉద్దేశ్యమూ అదే".
