Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 36

    చాలామంది పెళ్ళి చెయ్యడం ఎంతో కష్టమంటారు పెళ్ళికోసం అప్పులు చెయ్యటం, ఆస్తులు అమ్మడం చేస్తారు. సాంప్రదాయమని, ఆచారమని రకరకాల పద్దతుల్లో పెళ్ళిళ్ళు జరుపుతారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న తతంగాన్ని గమనిస్తే, పెళ్ళి అంత నిరాడంబరంగాను, తేలిగ్గాను చెయ్యచ్చునని అర్ధమవుతుంది.
    అర్చన మనసు మాత్రం శివరావు రాకకోసం ఆరాటపడుతోంది.
    చినవాల్తేర్ లోని ఒక అధునాతన బిల్డింగ్ కి చెందిన గదిలో మంచం మీద నిద్రపోతున్న శివరావు చప్పున మేలుకున్నాడు. అప్రయత్నంగా అతని చెయ్యి గడ్డాన్ని తడిమింది. గత పదిహేను రోజులుగా పెరిగిన వెంట్రుకలు చేతికి వత్తుగా తగిలాయి. లేచి వెళ్ళి తన ఎయిర్ బ్యాగ్ తెరిచి అద్దం తీశాడు. గెడ్డంవల్ల మొహం అతనికే క్రొత్తగా ఉంది. ఆ గెడ్డంలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలున్నాయి. తనకి ముసలి తనం వస్తోందా? ప్రశ్నించుకున్నాడు. రెండు క్షణాల తరువాత చిరునవ్వు ఒకటి అతని పెదవుల మీద కదిలింది.
    రేజర్ సెట్ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. ప్లాస్టిక్ గిన్నెతో వాష్ బేసిన్ నుండి నీళ్ళు తెచ్చాడు. టీపాయ్ దగ్గరకు కుర్చీలాక్కుని రేజర్ కి కొత్త బ్లేడ్ ఎక్కించాడు. వెంట్రుకలకు నీళ్ళు రాసి గెడ్డం గీసుకోసాగేడు. గెడ్డం చేసుకోవడం పూర్తయిన తరువాత ఓసారి చంపలు చూసుకున్నాడు. పదిహేను రోజులకి గియ్యడంవల్ల చర్మం మెరుస్తోంది. కత్తెరతో మీసాలు కత్తిరించుకున్నాడు. అద్దం ఎత్తిపట్టుకుని మొహాన్ని పరిశీలనగా చూశాడు. మొహంలో నీర్సం కనిపిస్తోంది.
    ప్రస్తుతం శివరావు మనసు ప్రశాంతంగా ఉంది. గతంలో మనసుని ఆవరించుకున్న దిగులు ఇప్పుడు లేదు, పదిహేను రోజులపాటు ప్రపంచాన్ని చూడకుండా ఒక గదిలో గడపడంవల్ల తన గురించి ఆలోచించే అవకాశం చిక్కింది. తన సమయాన్ని బ్రతకడంకోసం వెచ్చించే మనిషి కొంత సమయాన్ని తన గురించి ఆలోచించటానికి కేటాయిస్తే జీవితం గురించి వివరంగా తెలుసుకుంటాడు.
    పెళ్ళికి ముందు తన మీద తనకి అపారమైన నమ్మకం ఉండేది. తన భార్యని గాఢంగా ప్రేమించాలని, అన్యోన్యంగా జీవించాలని అనుకునేవాడు. అటువంటి సాధారణమైన కోరికలు కూడా తీరలేదు. భార్య మనస్తత్వం అర్ధం చేసుకోలేకపోయాడు. అసలు ఆమె పరుషంగా ఎందుకు మాట్లాడుతుందో అర్ధం కాలేదు. తన భావాలు ఒక్కొక్కటి దెబ్బ తింటుంటే క్రమేపి యాంత్రికంగా జీవించడానికి అలవాటు పడ్డాడు.
    యాంత్రిక జీవనం నుండి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అటువంటి యాంత్రికతను తప్పించుకోవడానికి స్నేహితునితో తిరగటం మొదలెట్టాడు. తనకు నష్టం కలిగినప్పుడు మాత్రమే తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని మనిషి తెలుసుకుంటాడు. శివరావు మనసు మాత్రం తప్పు చేసినప్పుడల్లా హెచ్చరించేది. అలాంటప్పుడు తన జీవితంలోని విషాదం గుర్తొచ్చి దిగులు పడేవాడు.
    పెళ్ళి చేసుకోవడంవల్ల కొన్ని సుఖాలు కలుగుతాయి. అయితే జీవితాన్ని సమీక్షిస్తే పెళ్ళి చేసుకోవడం అనేది క్లిష్టమైన వ్యవహారం. జీవిత భాగస్వామి తోడ్పాటు లేకపోతే సుఖంగా జీవించడం సాధ్యంకాదు. భిన్నమైన ఆలోచనలు గలవాళ్ళు సర్దుకుపోవడం ద్వారా కలిసి జీవిస్తారు. దాంపత్యం సుఖం పొందటం ద్వారా ఈ సర్దుకుపోవడం సాధ్యమవుతుంది. సర్దుకుపోకపోతే జీవితం నరకప్రాయమవుతుంది. ఇలాంటి స్థితి ఏర్పడితే మగవాడు తన సంసారిక జీవితానికి ఎడంగా ఓ ప్రత్యేకమైన జీవితాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. ఈ దశలో వివేకవంతమైన నిర్ణయం తీసుకోకపోతే వ్యసనాలకు బానిసవుతాడు.
    ఆలోచనల నుండి తేరుకుని టైమ్ చూశాడు. మూడు కావస్తోంది. లేచి బాత్ రూం కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. బ్యాగ్ నుండి ఇస్త్రీ బట్టలు తీసుకుని తొడుక్కున్నాడు. విడిచిన బట్టలు మడతపెట్టి కుర్చీలో కూర్చుని ఎవరికోసమో ఎదురు చూడసాగాడు. సరిగ్గా మూడున్నరకి కాలింగ్ బెల్ మ్రోగింది.
    శివరావు లేచి వెళ్ళి తలుపు తీశాడు.
    గుమ్మం అవతల సూట్ వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతని చేతిలో హాండ్ బాగ్ ఉంది. అతను శివరావుని చూసి నవ్వి లోపలకు వచ్చి కూర్చున్నాడు. శివరావు తలుపు మూసి వచ్చి అతని కెదురుగా కూర్చున్నాడు. ఆ వ్యక్తి బ్యాగ్ జిప్ తీసి లోపలనుండి యాభై రూపాయల కట్టలు టీపాయ్ మీద వరుసగా పేర్చాడు.
    మొత్తం ఇరవై కట్టలు.
    "థాంక్యూ సార్!" శివరావు కృతజ్ఞత నిండిన గొంతుతో చెప్పాడు.
    అతను నవ్వి లేచాడు. వెళ్ళడానికి రెండడుగులు వేసి ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి శివరావు వైపు తన కుడి చేతిని చాపాడు. శివరావు ఆప్యాయంగా ఆ చేతిని తన రెండు చేతులతో అందుకున్నాడు. ఇద్దరి చూపులు క్షణం సేపు కలుసుకుని విడిపోయాయి.
    అతని కళ్ళల్లో కూడా కృతజ్ఞత భావం తొంగిచూస్తోంది.
    అతను వెళ్ళిన తరువాతా శివరావు తలుపు మూసి టీపాయ్ దగ్గరకు వచ్చాడు. అలాగే నిలబడి నోట్లకట్టలను తనివి తీరా చూశాడు. తను లక్షరూపాయలు సంపాదించాడు. అలా అనుకున్న మరుక్షణం అతని మొహం సంతోషంతో వికసించింది. ఎయిర్ బ్యాగ్ అడుగున నోట్ల కట్టలు పేర్చి పైన సామాన్లు సర్ధాడు. ఏదో గుర్తొచ్చినట్టు సామాను బయటకు తీసి ఒక నోట్ల కట్ట అందుకుని ఓపెన్ చేశాడు. ఇరవై నాలుగు నోట్లు లెక్కపెట్టి జేబులో పెట్టుకుని మిగిలిన వాటిని బ్యాగ్ లో ఉంచాడు. యధా ప్రకారం బ్యాగ్ సర్దేశాడు.
    గదిని ఓ మారు పరీక్షగా చూసి బయటకొచ్చి తలుపు మూశాడు. అక్కడా నుంచి కదిలి గదులు దాటుకుని బయటకు వచ్చాడు. పదిహేను రోజులు కదలకుండా మంచంపైన పడుకుని ఉండిపోవటం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి తేరుకున్న తరువాత గేటుదాటి బయటకు వచ్చాడు.
    అతను బయటకొచ్చిన భవనం సముద్రపు ఒడ్డున ఉండటంవల్ల చల్లటిగాలి శివరావు శరీరాన్ని తాకుతూ వెళుతోంది. ఒక హోటల్ నుంచి బయటకొచ్చిన ఖాళీ టాక్సీ ఆపి ఎక్కాడు.

                  *            *              *                *  
    శీతయ్య పీటల మీద కూర్చున్నాడు.
    రామకృష్ణ పురోహితునికి సహాయ పడుతున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంవల్ల లేడీస్ హాస్టల్ ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్ధినులను తీసుకుని వచ్చింది. శీతయ్య దుకాణం పెట్టిన కాలనీకి చెందిన వాళ్ళు కొంతమంది వచ్చారు. వినాయకరావు పదిమంది కూలీలను తీసుకుని వచ్చాడు. ఒకప్రక్క నిలబడి అలవాటుగా తన మీసాలు దువ్వుకోసాగేడు వినాయకరావు.
    నిముషానికి ఒకసారి బయటకు చూస్తున్నాడు రామకృష్ణ.
    వధువుని తీసుకొచ్చి  పీటల మీద కూర్చోబెట్టారు. పురోహితుడు గుక్క తిప్పుకోకుండా ప్రవాహంలా మంత్రాలు చదువుతున్నాడు. ఒక్కొక్క అంశం పూర్తవుతోంది. క్రమంగా ముహూర్త సమయం సమీపిస్తోంది.
    రామకృష్ణ మొహంలో కత్తి వేటుకి నెత్తురు చుక్కలేదు. పురోహితుని ప్రక్కనుంచి లేచి జనాన్ని తప్పించుకుని ఇవతలకు వచ్చాడు. వాళ్ళల్లో ఓపిక లేనట్టు ఓ స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాడు.
    ఇవేమీ పట్టని కాలం కదుల్తోంది.
    ఇక ముహూర్తానికి సరిగ్గా ముప్పై నిముషాలు మాత్రమే మిగిలింది.

                           *              *             *              *
    పదినిముషాల తక్కువ నాలుగుకి స్నేహితురాలి ఇంటి నుంచి బయటకు వచ్చింది భాగ్యలక్ష్మి. తన దుస్తులు స్నేహితురాలివద్ద వదిలేసి రామకృష్ణ ఇచ్చిన పట్టుచీర కట్టుకుంది. పది నిముషాల్లో ఆర్. టి. సి. కాంప్లెక్స్ చేరుకుంది.
    కదులుతున్న సింహాచలం సబర్బర్ బస్సులో ఎక్కింది. తను తెచ్చిన ఐదురూపాయల నోటుతో టిక్కెట్ తీసుకుంది. ఆమె దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. రామకృష్ణ మాట అక్షరాలా పాటించాలనే ఉద్దేశ్యంతో డబ్బు తీసుకు రాలేదు.
    భాగ్యలక్ష్మి తన సీటులో ముళ్ళమీద కూర్చున్నట్టుగా కూర్చుంది. బస్సు ఒక్కొక్క స్టేజ్ లో ఆగుతూ వెళుతోంది. ప్రయాణీకులు ఎక్కి దిగుతున్నారు. వాళ్ళంతా ఎంతో నెమ్మదిగా తమ పనులు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆరోజు ఆదివారమని, అందుకే ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని, ఈ కారణాలచేత బస్సు తన గమ్యంవైపు మరింత తొందరగా వెళుతున్నదని గ్రహించలేదు. ప్రయాణీకులు ఎక్కువైతే వాళ్ళకి టిక్కెట్స్ ఇవ్వడం కోసం బస్సు కొంతసేపు ఆపుతారన్న విషయం అక్కడ పుట్టి పెరిగిన ఆమెకు తెలుసు. ఆ సమయంలో తార్కిక జ్ఞానం లోపించింది.
    బస్సు గోపాలపట్నందాటి సింహాచలం వెళ్ళే దారిలోకి తిరిగింది. అప్పుడు సరిగ్గా నాలుగున్నర అయింది సమయం. ఒక కిలో మీటరు వెళ్ళిన తరువాత పెద్ద చప్పుడుతో ఆగిపోయింది బస్సు. డ్రైవర్ క్రిందకు దిగి చూశాడు. భాగ్యలక్ష్మి కంగారుగా క్రిందకు దిగింది. అక్కడనుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరముంటుంది కొండ దిగువ భాగం. అక్కడనుంచి దేవస్థానం బస్సులో కొండపైకి వెళ్ళాలి.
    ఎట్టి పరిస్థితిలోనూ తను కొండపైకి ఐదుగంటలకు వెళ్ళలేనని అర్ధమయింది. ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. ఆ నీళ్ళు బుగ్గలపైకి జారాయి.
    నీళ్ళు నిండిన భాగ్యలక్ష్మి కళ్ళకి మసగ్గా ఓ కారు రావడం కనిపించింది. ఆమెలో ఆశ మొలకెత్తింది. చీర చెంగుతో నీళ్ళు తుడుచుకుని కారుకి అడ్డం నిలబడింది. కారు ఆమె ముందుకొచ్చి ఆగింది. డ్రైవర్ తల బైటపెట్టి కోపంగా చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS