Previous Page Next Page 
యువత నవత పేజి 36

   
    "ఏమిటే వాగుతున్నావు?"

    "వాగుడుకాదు! నిన్న మా మహిళామండలివాళ్లు తీర్మానం వినలేదా? ఇహనుంచీ అంటులతోమడం, బట్టలుతకడం, వంటచేయడం మీ మగాళ్లవంతు!బయట తిరగడం మా ఆడాళ్లవంతు!..... ఆడది కళ్లకు అద్దాలు పెట్టుకోకూడదు. కాళ్లకు చెప్పులేసుకోకూడదు. నెత్తిన గొడుగు  వేసుకోకూడదు, బజారులో తిరగకూడదు. అలాచేస్తే పరాయి మగాడితో కూలికేందుకు పోయిందని అంటారా?"

    "బ్రహ్మ ఆడదాని నొసట వంటా! వంటా అని ముమ్మారు రాసి పెట్టాడు తెలుసా?"

    "రాస్తే ఏం కాన్సిల్ చేసుకొంటాం!"

    ప్లీడరూ, అతడి భార్య సంభాషణ, భార్య డైలాగులకి అతడు టోన్ మార్చి అచ్చం ఆడగొంతుకతో మాట్లాడుతుంటే, శాలిని ఒకటే నవ్వడం మొదలుపెట్టింది.

     "బాగున్నాయా డైలాగులు?"

    "ఏ నాటకంలోంచి పట్టారు?"

    "సక్కుబాయి నాటకం! మా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామఫోన్ వుండేది. సతీసక్కుబాయి సంపూర్ణ రామాయణం,లవకుశ, తారాశశాంకం... డైలాగులన్నీ నోటికి వచ్చేవి."

    "మీకు మిమిక్రీకూడా వచ్చా? టోన్ ఎంత ఈజీగా మార్చారు."

    "చిన్నప్పుడు నేనూ, మా ఫ్రెండు ఒకతడు అన్ని తమాషాలూ చేసేవాళ్లం, పిల్లి అరుపులూ, కుక్క అరుపులూ...."

    వంట పూర్తి అయ్యేసరికి మణి గిన్నెనిండా మధ్యాహ్నం తోడుపెట్టిన పెరుగు తెచ్చింది.
 
     తొమ్మిదింటికంతా ఇద్దరూ భోజనాలు ముగించి కిచెన్ లోంచి ఇవతలికి వచ్చారు. త్రివేణి వక్క శాలినికి కాస్త ఇచ్చి తనూ నోట్లో వేసుకుని"వంట దగ్గర సమస్యట రాలేదుగాని పక్క దగ్గర సమస్య వచ్చేట్లుంది!" అన్నాడు శర్మ.

     "సమస్య ఏమిటి?"

    "ఒకే మంచం, ఒకే పరుపు!  ఇందాక భోజనం ఉన్నదే సర్దుకుందాం అన్నట్టుగా పక్కనికూడా సర్దుకొందాం అంటే తప్ప సమస్య తీరేదికాదు." మామూలుగా అంటున్నా కళ్లచివర కొంటెదనం  మెరవక పోలేదు.

     శాలిని ఉరిమి చూస్తున్నట్టుగా కళ్లు పెద్దవిచేసి, చెయ్యెత్తింది "అతిథి దేవతను గౌరవించడం అంటే ఇదేనా?" కోపంగా అడిగింది.

    "కోప్పడకండి శాలినిగారూ! నా పక్కను పూర్తిగా మీకిచ్చేసినా తిప్పలేవో నేను పడతానుగాని కాస్సేపు ఇలా కూర్చోండి! కబుర్లు చెప్పుకుందాం."

    ఇద్దరూ ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నారు.

    "మీ పేరు శాలిని అని, మీరు మిస్ అని తప్ప ఇంకేం వివరాలు తెలియవు మీ గురించి ఇప్పుడు చెప్పండి శాలినిగారూ! మీ వూరేది? మీ వాళ్లేం చేస్తుంటారు? అక్కచెల్లెళ్లూ, అన్నదమ్ములూ....."

    "నాకొక అన్నా, ఒక చెల్లీ వున్నారు. మానాన్న రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో యు. డి. సి. గా చేస్తున్నారు. మధ్యతరగతి సంసారం. మా నేటివ్ హైదరాబాదే!"

    "ఇహ నాగురించి చెప్పనా? నాకు అమ్మ,  నాన్న, ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు వున్నారు నాన్నగారు రిటైర్ అయ్యారు. సికింద్రాబాద్ లోమాకొక స్వంత చిన్న యిల్లుంది. ఎమ్.ఎ. బి. ఇడి. అయింది. తెలుగులో పి. హెచ్. డి. చేయాలనుకొంటున్నాను. ఇహ పెళ్లికి రెండు సంవత్సరాలక్రితమే మావాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఇప్పటికి నలుగురమ్మాయిల్ని చూడడం అయింది పెళ్లిచూపుల్లో! నలుగురూ నచ్చలేదు. మరో సంబంధం వుంది రమ్మని రాశారు మానాన్న. ఇవీ నా సంగతులు. "

    "నలుగురమ్మాయిలు నచ్చలేదా? ఎందుకు?"

    "ఎందుకేమిటి?" బాగుండలేదు"

     "ఎలా వుంటే బాగున్నట్టు?"

    ప్రక్కనే టేబిల్ మీదున్న అద్దంతీసి శాలిని ముఖంమీదుంచాడు. "ఈ అద్దంలో వున్న అమ్మాయిలా వుంటే!"

    "అదిగో, ఆతిథ్యమిస్తారు రమ్మని రౌడీవేషాలు వేస్తున్నారు."

    "అబ్బే! ఇవి పెళ్లికొడుకు వేషాలు"

    "కనిపించిన ఆడపిల్ వెంటల్లా ఇలా పెళ్లికొడుకు వేషాలువేస్తూ తిరిగారంటే ముప్పయి రాకుండానే తాత అవుతారు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS