"నేను ఖచ్చితంగా మగాడినే! ఇంతవరకూ ప్రాక్టీస్ లేకపోయినా, ప్రాక్టికల్ చేయకపోయినా 'చేయ'గలననే నమ్మకం నాకుంది"
"ఏమో! నాకైతే నమ్మకం లేదు" అంది.
అంతే!
అనూష రెండు భుజాలను గుచ్చిపట్టుకుని ఆమె పెదవుల్ని బలంగా చుంబించాడు.
"మ్ మ్ మ్ మ్ మ్ మ్చ్!"
రెండు నిముషాల తర్వాత ఆమెను విడిచిపెట్టాడు.
"అబ్బ!" ఆమె వూపిరి పీల్చుకొంది.
అది చూసి నవ్వాడు పరుశురాం "ఇంకా అడ్వాన్స్ కాగలను!"
అనూష సగం మూసిన కళ్ళతో చూసింది.
"మరి కాలేదే?" అడిగింది.
"ఒద్దులే! నేను తొందరపాటు పనులు చేయను" అన్నాడు పరుశురామ్.
అనూష అతని చేతిన తన చేతిలోకి తీసుకుని పెదవులకి తాకించుకొంది. రైలుకట్ట కిందుగా పొలం గుట్టపైన కూర్చుని వున్నారు వాళ్ళు. చీకటి పడుతోంది. మెల్లగా వెన్నెల పరచుకొంటోంది. పొలంపైనుంచి పైరుగాలి చల్లగా, మెత్తగా వాళ్ళ శరీరాన్ని తాకుతోంది.
అనూష అతని మెడచుట్టూ చేతులు వేసి అంది.
"మాటకే యింత రెచ్చిపోయి ఊపిరి ఆడకుండా చేశావు. నిన్ను హేళన చేసి వెక్కిరించి ఏడిపించేవాళ్ళను ఏమీ చేయలేవా?"
పరుశురాం ఆమె పెదవులపైన చూపుడువేలుతో కొట్టాడు.
"అలాంటి వాళ్ళ గురించి నేనసలు ఆలోచించను అనూ!"
"ఆలోచించే బుర్ర నీకు లేకపోవచ్చు రామ్! కానీ నిన్నెవరన్నా ఎగతాళి చేస్తే నేను సరిపెట్టుకోలేను. సహించలేను. అసలు నీకేం తక్కువని....? నీ అందం, నీ పర్సనాల్టీ నిన్ననే గాడిదల్లో ఒక్క గాడిదకైనా వుందా?"
"ఐతే నీకు నచ్చిన క్వాలిటీస్ అన్నీ ఈ గాడిదలోనే ఉన్నాయంటావు" పరుశురాం సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు.
"నువ్వు మామూలు గాడిదవి కాదు. కంచర గాడిదవి. లేకపోతే ఏమిటి? ఎవడేమన్నా తలొంచుకుని ఆడదానిలా పోలేవు?
నిన్ను అయినదానికీ కానిదానికీ రణధీర్ గాడు వాడి ముఠా ఆటలు పట్టిస్తున్నారు. మనం కలిసి తిరగడం మొదలుపెట్టాక వాడు మరీ విజృంభించాడు. వాడి ఆట కట్టించలేవా?" అంది అనూష.
పరుశురాం చిన్నగా నవ్వాడు.
"రణధీర్ ఎమ్మెల్యేగారికి మేనల్లుడు"
"సో వ్వాట్?"
"అతను రౌడీ"
"లెటిట్ బి. ఐతే ఏం చేస్తాడు?" అంది అనూష.
"చంపేస్తాడు" పరుశురాం తాపీగా అన్నాడు.
"ప్రాణం అంటే నీకు అంత తీపా పరుశురాం!"
అతని కళ్ళ చివరనుంచి ఆమెకేసి చూశాడు.
ఆమె కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయ్.
సిగరెట్ పొగని గుండెలోకి పీల్చి వదిలాడతను.
"చావంటే నాకు భయంలేదు అనూ! చిన్నతనంలోనే మృత్యువు కోరల్లోంచి తప్పించుకొని పారుతున్న రక్తపుటేరుల్లోంచి బతికి బట్ట కట్టాను."
"అంటే?" అనూష ఆప్యాయంగా అతని తలపైన చేత్తో నిమురుతూ అడిగింది!
"ఇప్పుడేమీ అడగొద్దు అనూ! కానీ ఒక్కమాట చెప్పనా?" అన్నాడతను.
"ఏమిటి?" అడిగింది.
"నువ్వు నాక్కావాలి! నీ ప్రేమ కావాలి!"
అతని భుజం చుట్టూ చేతులు వేసి గుండెలకి అదుముకొంది అనూష.
"నీకోసం బతకాలనే తపనతో నేను పిరికివాడ్ని అయిపోతున్నాను అనూ!"
అనూష నవ్వింది.
"నిన్ను తిరగబడి హీరోలా స్టంట్ చేయమనడం లేదు రామ్!
నువ్వు మూడీగా వుండడం మానాలి. ఎలూఫ్ గా వుండద్దు. నువ్వు స్నేహితుల్ని పెంచుకో. రణధీర్ లాంటి వాడికి మాటకి మాటగా సమాధానం ఇవ్వు. ఆ మాట తుపాకీ గుండులా వాడికి తగలాలి.
నువ్వెప్పుడైతే ఆ రణధీర్ లాంటి వాడికి అడ్డుతగలడం మొదలు పెడతావో అప్పుడు నీకు అండగా అతనంటే నచ్చని కొందరు నీ తరపున చేరతారు. ఇంతకాలం సమాన వుజ్జీ లేకపోవడంతో వాడి ఆటలకి హద్దు లేకుండా పోయింది" అంది అనూష.
పరుశురాం నవ్వాడు.
"అతనంటే నీకెందుకంత కసి?" అడిగాడు.
"నాకే కాదు అందరికీ అసహ్యం, కోపం. ఆడపిల్లలకి వాడ్ని చూస్తే ఒంటిపైన తేళ్ళూ, జెర్రెలు పాకినట్లుగా వుంటుంది."
"వాడిమీద మీకు కసి కాబట్టి కుందేలు పిల్లని పులి ముందుకు ఉసి గొలుపుతున్నావన్నమాట."
"నువ్వు కుందేలువో, చిచ్చరపిడుగువో నాకేం తెలుసు! అసలు నీ సరుకేమిటో నాకిప్పటివరకూ అర్ధం కాలేదు."
"సరుకు మంచిదే! వాడుకోవడంలో వుంటుంది. పద, ఇప్పటికే ఆలస్యం అయింది" అన్నాడు పరుశురాం. చేల గట్లవెంట నడిచి రోడ్డుమీదకి వచ్చారిద్దరూ.
ఆమెని రిక్షా ఎక్కించి ఇంటికి బయలుదేరాడు పరుశురాం.
రణధీర్ తనని అనేకసార్లు చులకన చేసి మాట్లాడ్డం పరుశురాంకి కొత్త కాదు.
అనూషతో స్నేహం పెరిగాక అతను మరింత రెచ్చిపోయిన మాట కూడా వాస్తవం.
