Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 35


    కాసేపు అలా ఓవర్ యాక్షన్ చేశాక, కిచెన్ లోకి గెంతి కత్తిపీట తీసుకుని దాన్ని ఖడ్గంలా ఝూళిపిస్తూ ఇంటి వెనక భాగంలో ఉన్న డాబా మీదకి పరిగెత్తాడు.
    అక్కడ అదృశ్య శత్రువు ఎవరో వున్నట్లు బీకరంగా పోరాటం సాగిస్తూ ఆ వూపులో పిట్టగోడ ఎక్కేశాడు.
    వెంటనే కాలు జారింది. అతనికి. ధభేలు మని కిందపడ్డాడు. వెంటనే ఏడుపులాంటి కేక వెలువడింది అతని గొంతులో నుంచి.
    
                          *    *    *    *
    
    చటుక్కున మెలకువ వచ్చింది ఉదయార్కర్ కి. ఎక్కడో ఒక ఊరకుక్క కుయ్యోమని ఏడుస్తోంది. ఆ ఏడుపుకి మెలకువ వచ్చింది అతనికి.
    మరి అంజనం........అభిషేకన్....?
    నవ్వుకున్నాడు ఉదయార్కర్. అంతా కల. ఒకసారి ఒక కోయదొర తన యింటికి వచ్చినప్పుడు అంజనాల గురించి చెప్పిన వివరాలన్నీ ఇప్పుడు కలలో గుర్తొచ్చాయి తనకి అంతే.
    వాచ్ చూసుకున్నాడు ఉదయార్కర్.
    సరిగ్గా పన్నెండయింది.
    బ్రహ్మచారి ఏడీ?
    అటూ ఇటూ చూసి, "ఏమండీ!" అని పిలిచాడు ఉదయార్కర్ మెల్లిగా.
    సమాధానం లేదు.
    రెండు నిమిషాలు వేచి వుండి, ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు .
    "బ్రహ్మచారీ"
    ఎక్కడా బ్రహ్మచారీ అలికిడే లేదు. అనుమానంగా లేచి నిలుచున్నాడు ఉదయార్కర్. నెమ్మదిగా గదిలో నుంచి బయటికి వచ్చాడు.
    ఆ ఇంటి సింహద్వారం మూసి వుంది. నెట్టి చూశాడు. కొద్దిగా ఎడమిచ్చింది కానీ, తెరుచుకోలేదు తలుపు.
    బయట నుంచి గొళ్ళెం పెట్టి ఉండాలి!
    లేదా........తాళం......
    తాళం అనుకోగానే అతనికి సదానంద్ ఇచ్చిన కాషన్ గుర్తొచ్చి ఒక్కసారిగా వళ్ళు గగుర్పోడిచింది.
    "నేను తోడూ లేకుండా బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళొద్దు."
    ఇంకోసారి తలుపు నెట్టి చూసి, అది తెరుచుకోదని నిశ్చయం చేసుకున్నాక, బయటకు వెళ్ళడానికి ఇంకేమన్నా దారి వుందేమోనని వెదకడం మొదలెట్టాడు.
    అదేమిటి అక్కడ? తలుపా!
    దగ్గరికి వెళ్లి చూశాడు.
    తలుపు కాదదీ. అల్మారా!
    అందులో....ఏమిటదీ?
    అతని గుండె లయ తప్పినట్లు వుంది.
    ఆ గుడ్డి దీపం వెలుగులో కనబడుతోంది ఒక ఆకారం.
    ఒక మనిషి. తపస్సు చేస్తున్నట్లు పద్మాసనం వేసుకుని కూర్చుని వున్నాడు. చేతులో ఒళ్ళో వున్నాయి. మధ్య వయస్కుడిలా ఉన్నాడతను. చర్మం ముడతలు ముడతలుగా మట్టి రంగులో వుంది. చేత్తో ఒత్తేసినట్లు చదునుగా వుంది ముక్కు. నుదురు అనేది దాదాపు లేదు. చాలా పెద్ద నోరు. ఈ చెవి నుంచి ఆ చెవి దాకా సాగి వున్నాయి సన్నటి పెదిమలు.
    ఆ మనిషి కేవలం పద్నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే వున్నాడు.
    గుండె దిటవు పరుచుకుని, మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చూశాడు ఉదయార్కర్.
    ఎప్పుడో చిరకాలం నాడు చనిపోయిన మనిషి తాలూకు శరీరంలా ఉంది అది.
    కానీ, పాడయిపోకుండా ఎలా వుంది! ఏ శక్తి వలన. అసలు ఎవరు ఈ మనిషి?
    1932 లో జరిగిన ఒక సంఘటన గుర్తువచ్చింది ఉదయార్కర్ కి. బంగారం కోసం కొండలలో అన్వేషిస్తున్న ఒక బృందం పెడ్రోపర్వతాలకు వెళితే అక్కడ కనబడింది వాళ్ళకు ఇలాంటి పొట్టి మనిషి తాలుకు మమ్మీ. అది ఒక రెడ్ ఇండియన్ శరీరమై వుండ వచ్చునని ఊహించారు శాస్త్రజ్ఞులు. దాన్ని ఇవాన్ టి. గుడ్ మాన్ అనే బిజినెస్ మాన్ కొన్నాడు. అమెరికన్ మ్యుజియమ్ ఆఫ్ నాచురల్ హిస్టరీలో పనిచేసే డాక్టర్ హారీ షార్పియో అనే అయన దానికి ఎక్స్ రేలు తీసి అది నిజమైన మనిషి తాలూకు శరీరమే అని తేల్చాడు. ఈ విషయాన్ని హర్ద్వర్డ్ యూనివర్సిటీ అంత్రోపాలజీ డిపార్టుమెంట్ వారు కూడా ద్రువికరించారు. ఆ మనిషి వయసు చనిపోయే నాటికి దాదాపు అరవై అయిదు సంవత్సరాలు వుండి వుండ వచ్చునని అంచనా వేశారు.
    పూర్వం "చిన్న మనుషులు" ఉండేవారని రెడ్ ఇండియన్ జాతులలో చెప్పుకోవడం వాడుక. ఈ కధకు ఈ మమ్మీ మరింత ఊపునిచ్చింది.
    కానీ ఈ మమ్మిని పరిశీలించిన కొంతమంది శాస్త్రజ్ఞులు ఇది ఒక పసిపిల్లవాడి శరీరమై వుండవచ్చనీ, పసిపిల్లలకు అనేస్సే ఫాలీ(ANEN SEPHALY)అనే వ్యాధి సోకితే చిన్న వయసులోనే ముసలితనం వచ్చేస్తుందనీ, ఇది అలాంటి కేసే, అయి వుండవచ్చుననీ ఊహించారు.
    ఈ మమ్మినీ కొన్న గాడ్ మాన్ మరణించిన తర్వాత మమ్మీ కియోనార్డు వాడ్ లర్ అనే ఆసామి చేతిలోకి పోయింది. ఆ ఆతర్వాత ఇంక దాని ఆచూకి తెలియదు. దాని తాలూకు ఎక్స్ రేలు మాత్రం ఒక అంత్రోపాలజీ ప్రొఫెసర్ దగ్గర వున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS