'అబద్దాల' రజాకీయం
ఆఫీసులో..
ఆ మాటకు వస్తే - ఆ రీజియన్ లో డిపార్టిమెంటల్ స్టాఫ్ అందరిలో 'అబ్దుల్ రజాక్' అంటే ఇంచుమించు ఎవరికీ ప్రత్యేకంగా తెలియదు కాని, 'అబద్దాల రజాక్' అంటే మాత్రం తెలియనివాళ్లు లేరు.
'నక్క పుట్టి నాలుగు వారాలు కాలేద' న్నట్లు... నిన్నమొన్న కొత్తగా ఉద్యోగంలో చేరిన కుర్రకారుకు కూడా అతను తెలుసు. ఎందుకంటే... ఆఫీసులో అడుగుపెట్టి అరగంటయినా కూర్చోకముందే తప్పనిసరిగా వినబడేది అబ్దుల్ రజాక్ పేరు - అదే... 'అబద్దాల రజాక్' నామం! మరి, అతగాడి 'లీల' లటువంటివి! శ్రీకృష్ణ లీలల గురించి ఆరేళ్ల పిల్లల దగ్గర్నుంచి అరవైయ్యేళ్ళకు పైబడ్డ బామ్మల వరకు చిలువలు పలవలుగా చెప్పుకుని ఆనందించినట్లు - అస్మద్ రజాక్ గారి లీలా విశేషాలు నిత్యనూతనంగా, నవ నవోన్మేషంగా వుంటూండడంతో వాటిని కథలుగా, గాధలుగా చెప్పుకొని ఆనందించడం వారి దినచర్యలో ఒక ప్రధాన భాగమయ్యింది.
టి. వి. కార్యక్రమాలను ( హైదరాబాద్ దూరదర్శన్ వారి కార్యక్రమాలు కాదులెండి.) చూడనివారి సంఖ్య భారతదేశ జనాభా పెరుగుదల రేటుకంటే ఎక్కువ వేగంగా పెరుగుతోందట. పరమచెత్తాతి చెత్త కార్యక్రమాలను ప్రసారం చేయడం లో వరల్డ్ రికార్డ్ పెరుగుతోందట. పరమచెత్తాతి చెత్తకార్యక్రమాలను ప్రసారం చేయడంలో వరల్డ్ రికార్డ్ అధిగమించడంతో ఈ కేంద్రం పేరును గిన్నీస్ బుక్ లోకి ఎక్కించడానికి ప్రతిపాదనలు పోయాయని వదంతి, నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించడం అసాధ్యమేమోగాని- నూటికి నూరుశాతం కల్తీలేని మహాచెత్త ప్రోగ్రాములను ప్రసారం చేసే లక్ష్యాన్ని సుసాధ్యం చేసే లక్ష్యంతో దూరదర్శనీయులు చిత్తశుద్దితో నిర్విరామంగా కృషి చేస్తున్నారనీ, ఈ రికార్డ్ శాశ్వతంగా గిన్నీస్ బుక్ లో చోటు చేసుకుంటుందనీ వదంతి.
ఆఖరికి యం. టివి, స్టార్ టి. వి. , జీ. టి. వి., బి. బి. సి. వంటి మహా పాప్యులర్ ప్రోగ్రాములను చూసినా కలగని ఆనందం 'రజాక్ లీలలు' వింటుంటేవారికి కలుగుతుంది.
ఎవరైనా, ఎప్పుడైనా అవసరమైన పనివుండి ఆఫీసుకి సెలవుపెట్టవలసివస్తే, ఆ రోజున వారికి ఏదో వెలితిగా అనిపిస్తుంది. మనసు వికలమైపోతుంది. అందువల్ల మరీ అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టడం మానేశారు సిబ్బంది.
దాంతో ఆఫీసులో 'అబ్సెంటిజం' అధ్బుతంగా తగ్గిపోయింది. ఆఫీసర్ లు ఆశ్చర్యంతో తమ ముక్కు మీదే కాకుండా, ఎదుటివారి, ప్రక్కవారి ముక్కులమీద కూడా వేలువేసే అగత్యం ఏర్పడింది.
అలాగని, 'ఎఫిసియెన్సీ' పెరిగిందంటే అది అడగకూడదు - చెప్పకూడదు. కారణం... ఆఫీసులో వారు కూర్చున్న కాలంలో అధికభాగం రజాక్ నామోచ్చారణలో, అతగాడి విశేష శ్రవణంతో గడిచిపోతుంది.
"ఇంతకీ...ఎవరీ అబ్దుల్ రజాక్? ఎక్కడుంటాడు?"- అని అడిగితే సమాధానం. చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు.
ఎందుకంటే.. రజాక్ విషయంలో 'ఫలానా టైముకి ఆఫీసుకి రావా' లన్న నియమమేమీ లేదు. అది ఎక్సెంప్షన్. అతగాడు రావచ్చు - రాకపోవచ్చు. ఎక్కడినుంచైనా ఫోన్ చేయవచ్చు- చేయకపోనూవచ్చు. చేస్తే అది తను రావడంలోదని చెప్పడం కోసం మాత్రం కాదు. తనతో ఎవరికీ ఏ అవసరాలున్నాయో తెలుసుకోడానికి - అంతే!
అతను వచ్చినా, రాకపోయినా అటెండెన్స్ పడితీరుతుంది. 'ఆబ్సెంట్' అని కాని, 'లేటు' అనికాని, చివరికి 'లీవ్' అనికాని మార్క్ చేసే 'గుండెధైర్యం' ఏ ఆఫీసర్ కీ వుండదు. అమావాస్యకో, పున్నమికో వచ్చినప్పుడు ఆఖాళీల్లో సరదాగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాడు.
ఆఫీసులో అబ్దుల్ రజాక్ కి ఓ సీటుంది. కాని, ఆ సీటులో అతను పనిచేయడం అంటూ వుండదు. చేయడానికి అసలు అతను సీటులో కూర్చుంటేగా! ఒకవేళ ఎప్పుడైనా, సంపూర్ణ సూర్యగ్రహణంలాగా అరుదుగా వచ్చి కూర్చున్నా, ఆ కాస్తసేపూ తాను ఆఫీసర్లకి అవసరమైన కార్యాలను, ఎంతక్లిష్టమైనవైనా, ఎంతెంత కష్టతరమైనవైనా ఏవిధంగా సులువుగా సాధించిందీ వర్ణనాత్మకంగా చెప్పడంతోనే సరిపోతుంది. ఆ తర్వాత గ్రహణం విడిచిన చంద్రుడిలాగా మళ్లీ బయటకు వెళ్లిపోతాడు మరో ఘనకార్యం కోసం. ఇంక ఆ సీట్లోని పని సంగతంటారా? బకాసురుడికి ఊరివారందరూ వంతులు వేసుకుని రోజూ ఒకడిని తమనుంచి ఆహారంగా సమర్పించుకున్నట్లు - లేదా.. వారాలకుర్రాడికి రోజుకి ఒకరు భోజనం పెట్టినట్లు - అందరూ తలాకాస్తా పంచుకునేవారు. కాదు - ఆఫీసర్ గారు తనే అందరికీ తలాకాస్తా పంచేవారు. వాళ్లని అదిరించో, బెదిరించో, లాలించో, బుజ్జగించో, కాళ్లూ - గడ్డం పట్టుకునో వాళ్లచేత రజాక్ చేయాల్సినపని చేయించేవాడు. ఏ ఆఫీసర్ వచ్చినా ఇది ఆయన డ్యూటీలో ఒక తప్పనిసరి భాగం! ఎవరైనా మొండిముండావాడు కాస్త అటూఇటూ మాట్లాడినా, రజాక్ ని సగౌరవంగా చూడకపోయినా ఇంక అతగాడు శంకరగిరి మాన్యాలు పట్టవలసిందే!
అబద్దాలు అందరూ చెప్తారు. మీరూ,నేనూ, మనందరం అబద్దాలు చెప్పేవాళ్లమే. కాకపోతే - కొందరు నిజాలు ఎక్కువ చెప్తారు ( మహానుభావులు - వారిని వ్రేళ్లమీద లెక్కపెట్టడం కూడా కష్టం), మరికొందరు అదేదో నిత్యసుమంగళీ వ్రతంలాగా కేవలం అబద్దాలనే మహా ఎక్కువగా చెప్తారు. ఏతావాతా తేలేదేమిటంటే.... ఏ వ్యక్తీ కూడా పూర్తిగా నిజాలే చెప్పడు. సంపూర్ణంగా అబద్దాలే చెప్పడు. వున్న తేడా అల్లా వాటి నిష్పత్తిలోనే...!
మరి, అలాంటప్పుడు అబ్దుల్ రజాక్ కి 'అబ్దుల్ రజాక్' అన్న అన్వర్దనామం రావడానికి కారణం ఏమిటి?
అతనిలోని విశేషమేమిటంటే... అతను చెప్పే అబద్దాలన్నీకల్తీలేని పాలలా, కడిగిన ముత్యాల్లా స్వచ్చమైన నిజాల్లా అనిపిస్తాయి. దారితప్పి నిజం చెప్పినా అది అబద్దం కంపుకొట్తుంది. 'ఏది సత్యం - ఏదిసత్యం?' అని మహాత్ముని మరణసందర్బంలో మహాకవి శ్రీశ్రీ ఆవేదనతో ఆక్రోశించినట్లు, 'ఏది నిజం - ఏదబద్దం?' అన్న విచికిత్స చేయలేక బుర్రలు బద్దలు కొట్టుకున్నా సహోద్యోగులు అబ్దుల్ రజాక్ చెప్పేవన్నీ అబద్దాలేనన్న నమ్మకానికి వచ్చేసి అతని మీద 'అబద్దాల రజాక్' అన్న చక్రాంకితం వేసేశారు.
అయితే...ఈ 'నుడి - నానుడి' కేవలం క్రింది వర్గాలలోనే - ముఖ్యంగా... అతని పరపతిని, పలుకుబడిని చూసి ఓర్వలేని అసూయాపరులలోనే! అధికారవర్గాల్లో మాత్రం - అబ్దుల్ రజాక్ అంటే అఘటనాఘటన సమర్దుడు. అసాధ్యమనేది ఎరుగనివాడు. అందుకే అతని సేవలులేని ఆఫీసర్ జీవితం పోపులేని కూరలాగా రుచిగా వుండదు. ఉప్పులేని పప్పులాగా చప్పగా వుంటుంది. అందుకే ఏ ఆఫీసర్ వచ్చినా ఛార్జి తీసుకోకముందే - ముందుగా వినే పేరు... అబ్దుల్ రజాక్ దే! అతని చాతుర్యం, సేవానిరతిని గురించి వినగానే వారికి కొండంత ధైర్యం వచ్చేది. ఆ ఆఫీసులో తన టెన్యూర్ నల్లేరు మీద బండిలా సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం కుదిరి గుండెనిబ్బరంతో వచ్చేవారు.
అబ్దుల్ రజాక్ లాగా అడ్డమైన పనులు చేసేవారు ప్రతి ఆఫీసులోనూ వుంటారు. ప్రతిచోటా ప్రత్యక్షమవుతూనే వుంటారు. మరి, అలాంటప్పుడు - 'ఇతగాడిలోని ప్రత్యేకత ఏమి' టన్న అనుమానం రావడం సహజం!
ఇటువంటి వారిని అందరూ మామూలుగా 'కాకారాయుళ్లు - చెంచాలు' అని ముద్దుముద్దుగా అంటూండడం అందరూ ఎరిగినదే! 'మరి, ఇతనిలోని కాకాసుర లక్షణాలలోని ప్రత్యేకత ఏమిటి? .. అని అబ్బురపడడంలో అసబబు ఏమీ లేదు. అదేమిటో తెలుసుకోవాలంటే నాలుగు దశాబ్దాలు వెనక్కిపోవాలి.
* * * * *
