Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 36

    ఎప్పుడూ గురువుగారి దగ్గిర వీలైనంత మౌనం పాటించే తను ఎక్కువగా మాట్లాడానేమో అనిపించి హఠాత్తుగా మాట్లాడటం ఆపింది వెంగమాంబ.
    "ఇది నిర్థారణ చేసుకోవటానికే అడిగాను. చాలామంది ఎంతో కష్టపడి సాధించిన యోగశక్తిని అల్పవిషయాలకోసం దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నీకా సంయమనం ఉన్నదా? అని తెలుసుకోవాలనుకున్నాను. ఈనాటితో నీ సాధన పూర్తి అయింది. నీ గ్రామానికి తిరిగి వెళ్ళవచ్చు. నీ జీవిత లక్ష్యసాధన ప్రారంభించవచ్చు."
    వెంగమాంబ గురువుగారి పాదాలకి నుదురు సోకించి నమస్కరించింది. ఆయన తలపై చేయివేసి,
    "శుభం భూయాత్"! అన్నారు.
    పన్నెండు సంవత్సరాల సాధన పరిపక్వ స్థితికి చేరుకుంది.
                                   * * *
    తమ కుమార్తెకు కొత్త జీవితం ప్రసాదించినందుకు కృష్ణయార్యుడు మంగమాంబ సుబ్రహ్మణ్యయోగికి ఎన్నో కృతజ్ఞతలు, వందనాలు అర్పించుకుని, వారి అనుమతితో, ఆశీస్సులతో తరిగొండకు తిరిగి బయలుదేరారు. గ్రామంలో ప్రవేశించగానే ముందు ఇంటికి వెళ్ళకుండా నృసింహస్వామి ఆలయంలో ప్రవేశించింది వెంగమాంబ. పాదప్రక్షాళనం చేసి, పద్మాసనంలో కూర్చుని మానసపూజచేసి, హారతి ఇచ్చింది.

    దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న ఈ వ్యక్తి దేవతా స్త్రీయా అని అనుకున్న వాళ్ళు దగ్గరగా చూసి వెంకమాంబగా గుర్తించారు. సంతోషించిన వాళ్ళు కొద్దిమంది అయితే, ఇరుకున పడ్డవాళ్ళే ఎక్కువమంది. ముఖవర్చస్సు చూసి ఏమీ అనే ధైర్యం చేయలేకపోయినా పళ్ళు మాత్రం పటపటలాడాయి.
    "ఆ దెయ్యం ఊళ్లోకి వచ్చిందట మళ్ళీ"? సోమయాజి అరుగుమీద కూర్చుని తన చుట్టూ చేరినవాళ్ళతో అన్నాడు.
    "అవునవును. అచ్చంగా రాక్షసిలా ఉందిట!"
    "జుట్టు విరబోసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని అపరచండికలా ఉందిట!"  
    "చేతుల్లో వేపమండలు, మెడలో నిమ్మదండలూ లేవా?" రామశాస్త్రి వెక్కిరింతగా అన్నాడు. అతడు కృష్ణశర్మ బంధువు. సుబ్రహ్మణ్యయోగి దగ్గిర కొంతకాలం శిష్యరికం చేశాడు. గురువుగారి సద్బుద్ధి కొంత అంటినవాడు.
    "అదే! మీ మదనపల్లె వారికి మా మాటలంటే వేళాకోళం". కామావధాన్లు కాస్త కినుకగా అన్నాడు.
    "లేకపోతే ఏమిటండీ! ఒక స్త్రీని పట్టుకుని రాక్షసి, చండిక, కాళిక అనటం! చండిక, కాళిక కూడ ఆ ఆదిశక్తి అవతారాలేకదా! మన బుద్ధి బాగుంటే లలితగా, మన బుద్ధి చెడిపోతే చండికగా కనపడుతుంది. అంతే!" రామశాస్త్రి విశదీకరించాడు.
    "అవున్లెండి! మీ ఊళ్ళో కొంతకాలంగా ఉంటున్నారుగా వాళ్ళు. అందుకని వాళ్ళని వెనకేసుకుని వస్తున్నారు" సోమయాజి దెప్పి పొడుపుగా అన్నాడు.
    "మా ఊళ్ళో ఉండటమేకాదు. మీ తరిగొండవాసి వెంగమాంబగారు మా గురువు గారి దగ్గరే శిష్యరికం చేసి వారి మెప్పుకూడా పొందారు తెలుసా?" రామశాస్త్రి కాస్త గర్వంగా చెప్పాడు.
    "ఆడదానికి చదువుచెప్పి, మెచ్చుకునే మీ గురువు......"
    సోమయాజి మాటపూర్తి కానీయలేదు రామశాస్త్రి.
    "సోమయాజిగారూ! మర్యాద నిలబెట్టుకోండి. మా గురువుగారి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు మీకు. మీరింకా అజ్ఞానకూపంలో కొట్టుమిట్టాడుతున్నారు. జ్ఞానానికి ఆడ మగ తేడా లేదు. మీ ఊరి కథలన్నీ చుట్టుపక్కల అన్ని ఊళ్ళవాళ్ళకీ తెలుసు. కొద్దిమందికి తప్ప అందరికీ వెంగమాంబగారంటే గౌరవమూ భక్తే ఉన్నాయి. మాట మీరితే...జాగ్రత్త!" తర్జనితో బెదిరించి, లేచి, ఉత్తరీయం దులిపి భుజాన వేసుకుని విసవిసా నడిచి వెళ్ళిపోయాడు రామశాస్త్రి.
    ఎవరూ కూడ మరొక్క మాట మాట్లాడకుండా, లేచి ఇళ్ళముఖం పట్టారు. సోమయాజికి మనసు కుతకుతలాడటం మొదలుపెట్టింది.
    అవమానభారంతో ఇళ్ళకి చేరితే, అందరి ఇళ్ళలోనూ మాట్లాడుకుంటున్న అంశం వెంకమాంబ తరిగొండకి రావటం, గుడిలో హారతి ఇవ్వటం.
                                   * * *
    "ఎంతసిగ్గులేదో? ఊర్లోంచి తరిమేసినా మళ్ళీ వచ్చింది."
    "ఏదో ధైర్యంతోనే వచ్చి ఉండాలి."
    "ముఖంలో ఆ కళచూడండి. అచ్చంగా మంగళగౌరిలాగా!"
    "వెధవరాలిని మంగళగౌరి అంటావేమిటి? అమంగళం"
    "ఏమో నాకట్లా కనిపించింది"
    "నాకైతే మహంకాళిలాగా కనిపించింది"
    "మహమ్మారిలాగా అనిపించింది"
    "మంచో, చెడో ఏదోశక్తిలాగా కనపడుతోంది"
    "ఏశక్తీలేనప్పుడే అన్ని కథలు నడిపింది. ఇప్పుడేం చేస్తుందో?"
    "అదిగో! నాంచారమ్మత్త వస్తోంది"
    ఎవరికివారు ఏమీ ఎరగనట్టు నీళ్ళబిందెలు చంకనపెట్టి బయల్దేరారు. నాంచారమ్మ నవ్వుకుంది వాళ్ళమౌనం చూసి. ఎన్నాళ్ళయినా వీళ్ళలో మార్పు రానందుకు, ఎంతసాధించినా వెంగమాంబకి అవమానాలు, అపనిందలు తగ్గనందుకు మాత్రం మనసులో బాధపడింది.
                                                            * * *
    ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న తరిగొండ ప్రజలకి ఏనుగు ఘీంకారం, గుర్రపు డెక్కల చప్పుడు, సకిలింపులు వింత గొలిపాయి. అందరూ తమతమ పనులు ఆపి వీధిలోకి వచ్చిచూడటం మొదలు పెట్టారు. చిత్తూరుని పరిపాలిస్తున్న మహారాజు ఏనుగు అంబారీమీద ఉన్నారు. ఏనుగు ముందు రెండు గుర్రాలు, వెనుక నాలుగు గుర్రాలు నడుస్తున్నాయి. ఆ వెనక బండిమీద ధనధాన్యరాసులు, చీనిచీనాంబరాలు, మరెన్నో కానుకలు తరలి వస్తున్నాయి. రాజుగారు ఎందుకు వస్తున్నారు? ఎవరింటికి వస్తున్నారు? అని అందరికీ కుతూహలం. చాలామందికి వస్తున్న దెవరో కూడా తెలియదు - పెద్ద రాజోద్యోగి అని కొందరు, సామంత రాజని కొందరు, మహారాజని కొందరు వాదించుకున్నాక మహారాజేనని నిశ్చయానికి వచ్చారు.    
    ఊరేగింపుగా మందీమార్బలంతో వచ్చినరాజుగారి ఏనుగు కృష్ణయార్యుడి ఇంటిముందు ఆగింది. రాజు అంబారీ దిగి కిందనిలబడి కృష్ణయార్యుని అనుమతి అడుగుతున్నాడు ఇంటిలో ప్రవేశించటానికి. చూస్తున్న ప్రజల నోళ్ళు తెరిచినవి తెరిచినట్లే ఉండిపోయాయి. కృష్ణయ్య ఇంటికి రాజు రావటమా? అని ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న వాళ్ళు తమ ఊహలకి పదునుపెట్టటం మొదలుపెట్టారు.
    "మంచిపని అయ్యింది. రాజు వెంకమాంబ అరాచకాలు విని శిక్షించటానికి వచ్చాడు"
    "శిక్షించటానికి అయితే రాజెందుకు వస్తాడు. భటుల్ని పంపిస్తాడు"
    "అయినా కానుకలెందుకు తెస్తాడు?"
    "దండించటానికి కయితే గుమ్మంముందు ఇంతసేపు వేచి ఉండడు"
    "అయినా, ఇప్పుడు తెలుస్తుందిగా ఎవరి రంగేమిటో?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS